భక్తి కథలు

హరివంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసుధ వగపు తొలగిపోతుంది. ఇందుకు ప్రేరణగా కలి అంశతో ధృతరాష్ట్రుడి కొడుకు పుడతాడు. సర్వ సంహారుడైన యమ ధర్మరాజు అంశంతో పాండు రాజు పెద్దకుమారుడు జన్మిస్తాడు. గాంధారి గర్భంలో పుట్టిన వాడికీ, కుంతీ తనయుడై జన్మించిన వాడికీ రాజ్య సంబంధమైన కలహం కలుగుతుంది. ధృతరాష్ట్రుడి నూరుగురు కొడుకులు, పాండు రాజు ఐదుగురు కొడుకులు రాజ్యం కోసం కలహిస్తారు. తక్కిన దేవతలందరూ తమకు తమకు ఉచితమైన స్థానాలలో జన్మిస్తారు. ఈ విధంగా బ్రహ్మదేవుడు చెప్పటంతో అక్కడ చేరిన దేవతలంతా సంతోషించారు. చతుర్ముఖుణ్ణి ఉల్లాసపరిచారు.
ఇంతలో నారద మహర్షి అక్కడకు వచ్చాడు. ఆయనకు బుద్ధి పుట్టిందే తడవుగా మూడు లోకాలలోనూ అతిథిగా సంచరిస్తాడు. ఆయన నిత్య సంతోషి. లోకాలన్నీ తిరగడం అక్కడక్కడి సమాచారాలన్నీ సేకరించడం ఆయనకొక వినోదం. యోగ సిద్ధుడు నారద మహర్షి. లోకక్షేమంకరంగా ప్రవర్తించడమే ఆయన మహాప్రజ్ఞ. శరత్కాల మేఘవర్ణుడై ఆయన ప్రకాశిస్తూ వుంటాడు. ఆయనది అమోఘమైన వాక్కు.
పద్మభవుడి కుమారుడాయన. మేరునగరంపైన దేవతలంతా కొలువుతీరి వుండగా ఆకాశవీధిన అక్కడకు వచ్చిన నారద మహర్షిని చూసి సకల దేవతలు ప్రీతి హర్షం చెందారు. సముల్లసితంగా అభివాదాలందజేశారు. అపుడు నారద మహర్షి శ్రీమహావిష్ణువు సమీపాసనంలో ఆసీనుడైనాడు. దేవదేవుడిపట్ల తన భక్తి ప్రపత్తులు చూపాడు. ఆయన వీణ శీర్షభాగం కల్పవృక్ష ప్రసూనమాలంకృతంగా వుంది.
దానిని పలికించటానికి అనువుగా సిద్ధపరచుకొని తీగలు మీటి మంద్ర మధ్యమ తారాస్థాయులకు అనుగుణంగా సప్త స్వరాలు మనోహరంగా పలికించాడు. కొలువుకూటమంతా మ్రాన్పడిపోయేట్లు, ఆనంద తరంగితం కాగా, మధుర దివ్య ధ్వని ప్రసారితం చేశాడు. రాగం తానం పల్లవులతో చిత్ర ప్రబంధోజ్జ్వల సంగీత కృతులు వెలయించాడు. పూర్వకల్పాలలో జరిగిన అద్భుతగాథలు, హరిచరితము, ఆయన అద్భుత అవతార లీలలుగా గానం చేశాడు.
అఖిల లోక శరణ్యుడైన శ్రీ మహావిష్ణువు నారదుడి గానం చేత అత్యంత సంప్రీతుడైనాడు. అక్కడ ఉన్న సభ్యుల హృదయాలు ఉల్లసిల్లాయి. ఇట్లా శ్రీమన్నారాయుణ్ణి పాడి మెప్పించి భక్తి ప్రేమ పూర్వకంగా సాంజలియై ఇట్లా విన్నవించాడు నారాయణుడికి. అచ్యుతా! మతిమంతులందరిలోనూ నీవు ఆద్యుడవు. శక్తిసంపన్నులలో నీ కన్న శ్రేష్ఠుడెవరూ లేరు. ధైర్యసాహసాలలో అందరినీ మించినవాడవు. ఈ సకల సృష్టి నీది. నీవు యోగీశ్వరుడవు.
ఈ దివిజులందరి కర్తవ్య నిర్వహణం నీ అనుగ్రహం లేనిదే సఫలం కాదు. కాబట్టి నీవు నీ నిజాంశతో భూలోకంలో అవతరించాలి. ఇపుడు దేవతలంతా తమ తమ అంశాలతో భూలోకంలో జన్మించబోతున్నారు. ఆ లోకంలో కూడా వీళ్ళను రక్షించవలసిన వాడవు నీవే. నీ అండ చూసుకొని వాళ్ళ పరమోత్సాహం పొందుతారు. నిన్ను చూసుకొని తమ కర్తవ్యాలు చక్కగా నిర్వహించుకోగలుగుతారు.
వీళ్ళను రక్షించడం, వీళ్ళచే శత్రువులను నిర్మూలింపచేయటం ఇతరులవల్ల జరిగే పని కాదు. సామర్థ్యంకానీ, శక్తిగానీ మరి ఎవ్వరికీ లేవు. కాబట్టి నా మనవి విను. నీవు భూమిపై అవతరించవలసిన సమయం మళ్లీ ఆసన్నమైంది. దేవతలు కూడా తమ తమ అంశాలతో భూమి మీద జన్మిస్తారు. నిన్ను చూసుకుని వాళ్ళు ధరలో పరమోత్సాహం పొందుతారు. తమ తమ కర్తవ్యాలు సమర్థంగా నిర్వహించుకోగలుగుతారు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు 13