భక్తి కథలు

హరివంశం 172

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ఇట్లా ఉండగా ఏకలవ్యుడు, బలరామదేవుల మధ్య పోరు మహాభీకరంగా కొనసాగింది. ఒకరి విల్లులు ఒకరు విరుచుకున్నారు. ఒకరి రథాశ్వాలను ఒకరు నేలకూల్చారు. శక్తిమంతమైన శస్త్రప్రయోగాలను ఒకరుఒకరు కాచుకున్నారు. గదాయుద్ధం చేసి గదలను శకల శకలాలుగా చేసుకున్నారు. ఇంతలో ఏకలవ్యుడి సేనలు వేల సంఖ్యలో బలరాముణ్ణి చుట్టుముట్టాయి. కాని బలదేవుడు తన ముసలాయుధంతో, లాంగలాయుధంతో తనమీద విజృంభించటానికి వస్తున్న ఆరణ్యకులైన ఏకలవ్యుడి సేననంతను పరిమార్చాడు.
ఈ విధంగా సాత్యకి, పౌండ్రులు ఒకవైపు, బలదేవుడు ఏకలవ్యుడు మరొకవైపు ఘోర యుద్ధం చేస్తుండగా ఇంతలో తెల్లవారింది. అప్పటికే అపరిమిత జన సంక్షయం సంభవించింది. ఆకాశంలో తారకలు అదృశ్యమైనాయి. యుద్ధ రంగంలో దీప సహస్రాలు వెలవెలబోయినాయి.
అరుణగిరి మీద సూర్యుడు కొలువుదీరి తన రథాశ్వాలను తోలవలసిందిగా అనూరుణ్ణి ఆయత్తం చేశాడు. అపుడు పౌండ్రుడు ఇరుపక్షాలలో లెక్కపెట్టలేనంత మంది సైనికులు హతం కావటం, గుర్రాలు, ఏనుగులు ప్రాణాలు వదలటం, రథాలు ధ్వంసం కావటం చూసి ఇందువల్ల మనకు ప్రయోజనం ఏముంది? లోకనింద చుట్టుకోవటమే మిగులుతుంది. ఇంతకూ ఆ కృష్ణుడు యుద్ధరంగానికి రానే లేదు.
అతడు రాకుండా మనం అశేష సంఖ్యలో యాదవ సైన్యాన్ని హతమార్చటం ఎందుకు? ఇప్పటికి యుద్ధం ఆపుదాం. మనం ఇంకొక ఉపాయం కూడా ఆలోచించవచ్చు. మనం యుద్ధం చాలించి వెళ్లిపోయినామని తెలియగానే కృష్ణుడు నిర్భయంగా ద్వారకలో ప్రవేశిస్తాడు. ఇంతలో మనం నా ప్రాణమిత్రుడైన కాశిరాజు దగ్గరకు వెళ్లి అక్కడ పొంచి ఉందాం కృష్ణుడి రాక తెలిసిందిగా! అంతేకాక మనం చాలా సైన్యాన్ని కోల్పోయాం. కాశీరాజు సేనాసహయం, ఇంకా ఆయన మిత్రుల సేనా సహాయం, నా మిత్రుల ఇతోధికమైన తోడ్పాటు మళ్లీ సమకూర్చుకొని ప్రచండమైన సేనతో మళ్లీ ద్వారకపై దండయాత్ర చేసి ఈసారి ద్వారకను నేలమట్టం చేసి కృష్ణుణ్ణి పరాభవించి హతుణ్ణి చేయటం అసంభవం కాకపోదు అని తన సేనా పరివారానికి, సామంత రాజులకు ధైర్య వచనాలు చెప్పి ససైన్యుడై పౌండ్రుడు కాశీరాజు సహాయం కోరి తరలిపోయినాడు.
ఎప్పుడైతే పౌండ్రక వాసుదేవుడు తన సైన్యాలను తరలించుకొని పారిపోయినాడో అప్పుడిక యాదవులు సమథిక కోలాహలంతో యుద్ధ విజయాలు నిర్వహించుకుంటూ, ద్వారకా నగరంలో ప్రవేశించి మంగళవాద్యాలు భోరుకొలిపారు. నగరాన్నంతా సమధిక వైభవంతో అలంకరించారు.
ఇంటింటా పండుగ చేసుకున్నారు. మన ప్రభువు, మనదైవం వచ్చినపుడు మీరు మాకు అప్పగించిన పనిని మేము నెరవేర్చగలిగాము అని చెప్పగలగటం కన్నా మనకు ధన్యత, అదృష్టమూ ఏముంటాయి? ద్వారకా నగరాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోగలిగాము మనం అని యాదవులు ఎంతో మురిసిపోయినారు.
ఇట్లా వాళ్ళు ఆనందోత్సాహాలు జరుపుకుంటూ ఉండగానే ఆకాశంలో చారణుల జయజయధ్వానాలు విన్పించాయి ద్వారకా నగరిలో. ‘ఇడుగో! శ్రీకృష్ణస్వామి వచ్చేస్తున్నాడు. ఆయనకు జేజేలు చెప్పండి. సభక్తికంగా, సప్రేమపూర్వకంగా స్వాగత సన్నాహాలు చేయండి’ అనే పలుకులు విన్పించాయి. ఆయన కోట వెలుపల గరుత్మంతుడి నుంచి దిగగానే దారుకుడు ‘స్వామీ! రథం అధిరోహించండి’ అని ఆయనకు స్వాగతం చెప్పాడు. ఆయన ఆ రథం ఎక్కి తన అంతఃపురం చేరాడు. స్వామిని దర్శించటానికి బంధువులు, పురవాసులైన పెద్దలు వచ్చారు.

ఇంకాఉంది

అక్కిరాజు రమాపతిరావు