భక్తి కథలు

హరివంశం 174

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటనే కాశీరాజు చతురంగ బలాలను తన దివ్యయుధాలతో నిష్క్రియాపరులను చేశాడు శౌరి. ఆయన సైన్యాలు ఒదిగి వొదిగి వెనుదరిగాయి. అప్పుడు పౌండ్రుడు స్వయంగా శ్రీకృష్ణుడితో పోరాటానికి సిద్ధమైనాడు. శ్రీకృష్ణుడు ఆ అహంకారిని గేలి చేస్తూ ‘ఓరీ! క్షత్రియాధమా! నా ఆయుధాలు ధరించాలని అవివేకంగా నీవు మోజుపడితే నన్నాశ్రయించి, పాదాక్రాంతుడివై, నీ చిహ్నాలు నాకు ఇవ్వాల్సిందని వేడుకుంటే నేను ఇచ్చేవాణ్ణి కదా! ఇప్పుడైనా నన్ను శరణు కోరితే నిన్ను కరుణిస్తాను. శరణాగతత్రాణం నా వ్రతం. అట్లాకాక నాతో వైరం సాధించాలనుకుంటే నరకుడికి పట్టిన గతి నీవెరుగవా?’ అని కమలాక్షుడు పౌండ్రుణ్ణి రూక్షంగా ఆక్షేపించాడు. ‘నీవేమో నీ దూత ద్వారా నీ వారికి నన్ను రమ్మనవలసిందని వర్తమానం పంపావు. నీ దురహంకారాన్ని మన్నించే నేనిపుడు వచ్చాను. నా ఆయుధాలను విడిచిపెట్టవలసిందని కూడా నీవు నన్ను హెచ్చరించావు. నీ కోరిక ఎందుకు కాదనాలి? అని నా ఆయుధాలు ఇప్పుడే నీ మీద విడిచిపెడుతున్నాను’ అన్నాడు. అప్పటికీ మాన మద మత్సరుడైన పౌండ్రుడు బుద్ధి తెచ్చుకోలేదు. ‘ఈ నీ బీరాలను నేను లక్ష్యం చేస్తాననుకున్నావా? నేను దండెత్తి వస్తానని భయపడేకదా! నీవు తపస్సనే నెపం పెట్టుకొని కైలాసానికి పరుగులు తీశావు? బహుశా ఆ దేవుణ్ణి నా నుంచి కాపాడవలసిందని మొరపెట్టుకొనటానికే వెళ్లి ఉంటావని తెలుస్తూనే ఉన్నది కదా! మీ వాళ్ళేమో నిన్ను వంది మాగధుల్లా ప్రస్తుతిస్తున్నారు అని కృష్ణుణ్ణి దెప్పిపొడిచాడు. ‘ఇప్పుడు నా చిరకాల వైరం తీరబోతున్నది అని ప్రగల్భించాడు. తన శార, చక్ర, అసి, గదాయుధాలు శ్రీకృష్ణుడిపై తెగువ చూపి ప్రయోగించాడు పౌండ్ర వాసుదేవుడు. తానూ ఒక మాయా వాహనాన్ని గరుడిడిలా పోలినదాన్ని సృష్టించుకొని తన యంత్ర గరుడిడితో స్వామి సుపర్ణుడితో మచ్చరించి, భీకర యుద్ధానికి పూనుకున్నాడు. వైనతేయుణ్ణి తీవ్ర శరాఘాతంతో నొప్పించాడు. తన శస్త్రాలతో శ్రీకృష్ణుణ్ణి ఢీకొన్నాడు. అపుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ పౌండ్రుడి దంభాయుధాలన్నిటినీ శకల శకలాలు చేసి ధూళిపాలు చేశాడు. ఈ విధంగా పగతుడిని అస్త్ర శస్త్ర రహితుణ్ణి చేసి, అతడి వాహనం కూల్చివేసి సుదర్శన చక్రం ప్రయోగించి పౌండ్రుణ్ణి సంహరించాడు శ్రీకృష్ణుడు.
తన మిత్రుడి ఘోర మరణం చూసి సహించలేక కాశీరాజు తన సేనాపరివారంతో శ్రీకృష్ణుడిపై సమరానికి సిద్ధమైనాడు.
సరే! నీ మిత్రుడితో నీవు కూడా యమపురికి బాసటగా పోతే అతడు సంతోషిస్తాడు అని కాశీరాజును కడతేర్చాడు సుదర్శనాయుధుడు ఏమీ విలంబం లేకుండా. ఆ కాశీరాజు తలను దివ్య శర ప్రయోగం చేసి నగర మధ్యలో ప్రజలందరూ విస్మితులై చూసేట్లు పడవేయించాడు కమలనాభుడు. ఆ తరువాత పౌండ్రుడి సహాయం కోసం వచ్చినవారు చచ్చినవారు చావగా, తక్కిన వారు పలాయతులైనారు. ఈ విధంగా పౌండ్రుణ్ణి వధించి శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరగా నగరం విజయోత్సవం జరుపుకుంది.
ఇట్లా అతి దారుణంగా తన తండ్రి ఖండిత శిరస్సు రాజమార్గంలో నగరిమధ్య పతనం కావటం చూసి రాజకుమారుడు అత్యంత దుఃఖాక్రాంతుడై, క్రోధోద్రిక్తుడై, పగ సాధించాలనే ప్రచండమైన ప్రతీకార ఘార్ణమానసుడై మంత్రవేత్తలను పిలిపించి దీక్షగా అభిచార హోమం నిర్వహించాడు. అప్పుడు ఆ అగ్నికుండం నుంచి ఘోర రూప రాక్షసి పిశాచ రూపం దాల్చి ఉద్భవించి యజమానిని ‘ఏమిటి ఆజ్ఞ! ఏ కోరికను మీకోసం నేను సిద్ధింపచేయాలి?’ అని అర్థించింది. అప్పుడా మంత్రవేత్తలు, ఆకృత్యను (అభిచార హోమం నుంచి పుట్టిన పిశాచి) వెళ్లి శ్రీకృష్ణుణ్ణి, అతడి పరివారాన్ని పరిమార్చవలసిందని దానిని నియోగించారు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు