డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడు తనని ఆట పట్టించడానికే అలా మాట్లాడుతున్నాడన్న సంగతి అర్థమైన అంజలి అతడివైపు కోపంగా చూసి అక్కడనుంచి లేచి వెళ్లిపోయింది.
అతడి మాటలకి రవీంద్ర చిన్నగా నవ్వాడు. ‘‘నిన్న సాయంత్రం హోటల్లో సేకరించిన హరిత వేలి ముద్రలని మా ఫోరెన్సిక్ నిపుణులు విశే్లషించారు. ఆశ్చర్యం.. ఆ వేలి ముద్రలు గెస్ట్‌హౌస్‌లో వాష్ బేసిన్‌మీదా, మరికొద్దిచోట్లా దొరికిన వేలి ముద్రలతో సరిపోయాయి! అంతేకాదు భరణి కార్లో దొరికిన వెంట్రుకలు కూడా హరితవే అని ఫోరెన్సిక్ పరిశీలనలో తేలింది’’.
ఒక్క క్షణం ఊపిరి బిగపడ్డాడు పాణి.
‘‘హరిత మీతో అబద్ధం చెప్పింది. ఆమె భరణితో రిలేషన్ కట్ చేసుకోలేదు’’ అన్నాడు రవీంద్ర.
‘‘హరిత అబద్ధం చెప్పిందని నేను అనలేదు కానీ, ఆమె భరణితో రిలేషన్ కట్ చేసుకోలేదన్న విషయం మాత్రం నాకు ముందే తెలుసు. భరణి మొబైల్‌కీ, హరిత మొబైల్‌కీ మధ్యన తరచుగా కాల్స్ వెడుతూనే వున్నాయి. అది హరిత ఇష్టంవల్ల జరుగుతోందో లేక భరణి బలవంతంమీద జరుగుతోందో తెలియదు కానీ కాలేజీలో నేను చేసిన ఎంక్వయిరీలని బట్టి కూడా వాళ్ళిద్దరిమధ్యనా స్నేహం కొనసాగుతోందని తెలిసింది. భరణితోపాటు ఆ రోజు గెస్ట్‌హౌస్‌కి వెళ్లిన అమ్మాయి హరితేమోనన్న అనుమానం నాకు ముందునుంచీ ఉంది. ఆందుకే ఆమె వేలిముద్రలు సేకరించమని చెప్పాను’’ చెప్పాడు పాణి.
‘‘నాకు ఒక విషయం అర్థం కావడంలేదు. తనని మోసం చేసే ఉద్దేశ్యంతో ఉన్నాడని తెలిసి కూడా భరణితో కలిసి ఆమె ఒంటరిగా గెస్ట్‌హౌస్‌కి ఎందుకువెళ్లినట్లు? ఒకవేళ ఆమె గెస్ట్ హౌస్‌కి భరణిని హత్య చేయడానికి తీసుకెళ్లినట్టైతే పోస్టుమార్టమ్ రిపోర్టులో ఏమాత్రం అనుమానం లేకుండా అంత క్లియర్‌గా సహజ మరణం అని ఎలా వచ్చింది?’’ అన్నాడు రవీంద్ర.
పాణి చిన్నగా నవ్వి అన్నాడు ‘‘మన పరిశోధన దాని గురించే కదా? అదే తెలిస్తే నా భార్యతో తిట్లు తింటూ ఇక్కడ ఎందుకుంటానూ? ఈపాటికి హాయిగా అరకులోయలో విహరిస్తూ ఉందును. ఎందుకైనా మంచిది, ఇద్దరు కానిస్టేబుళ్ళని మఫ్టీలో ఉండి హరిత కదలికలని గమనిస్తూ ఉండమనండి’’.
కొద్దిసేపాగి, ఏదో గుర్తుకువచ్చినవాడిలా మళ్లీ అన్నాడు పాణి ‘‘వాళ్ళది చాలా సంప్రదాయకమైన కుటుంబం. పోలీసులు ఆమెని గమనిస్తున్నారన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఆమెని బతకనివ్వరు. మీ వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండమనండి’’.
అతడి మాటలకి ఎస్సై రవీంద్రకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ‘‘ఈ కేసులో అనుమానితుల లిస్టులో మొదటి వరసలో ఉందామె. ఆమెమీద సాఫ్ట్‌కార్నరా?’’ అన్నాడు వ్యంగ్యంగా.
‘‘ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రవీంద్రగారూ, పరిశోధనలో భాగంగా ఎంతోమందిని ప్రశ్నిస్తాం. ఎన్నో విషయాలని గమనిస్తాం. మనం విన్న ప్రతిదీ నిజం కాదు, అభిప్రాయంమాత్రమే. చూసిన ప్రతిదీ నిజం కాదు. అది ఒక కోణం మాత్రమే. ఎన్నో అభిప్రాయాలు, కోణాలని పరిశీలించిన తరువాత సాగరమథనంలో పుట్టే అమృతంలా నిజం బయటికి వస్తుంది. అప్పటిదాకా అనుమానితులు అనుమానితులు మాత్రమే నేరస్థులు కారు!’’
‘‘సాగర మథనం జరిగి నిజం బయటికి రావడమ్మాట ఎలా వున్నా, ఈలోగా హలాహలం పుట్టడం మాత్రం ఖాయమనిపిస్తోంది’’.
‘‘హలాహలమా?’’ ఆశ్చర్యంగా అన్నాడు పాణి.
‘‘అవును. కేసులో ప్రోగ్రెస్ లేదని ఇప్పటికే భుజంగరావుగారు మండిపడుతున్నారు. హరిత వేలిముద్రలు గెస్ట్‌హౌస్‌లో ఉన్నాయన్న విషయం ఆయనకింకా తెలియదు. తెలిస్తే ఆమెని అదుపులోకి తీసుకుని విచారించమని ప్రెషర్ వస్తుంది. విషయం ఆయనకి తెలియకుండా రహస్యంగా ఉంచుదామా అంటే, హరిత తప్పించుకుని దొరక్కుండా పారిపోతే మొదటికే మోసం వస్తుంది. అందుకే సాధ్యమైనంత తొందరగా మరోసారి హరితని ఇంటరాగేట్ చేసి నిజా నిజాలు తేల్చుకోవడం మంచిదనిపిస్తోంది’’.
‘‘నిజమే, కానీ అంతకన్నా ముందు మనం మరో వ్యక్తితో మాట్లాడాలి.
‘‘ఎవరతను?’’
‘‘సూర్య’’
‘‘సూర్య ఎవరు?’’
‘‘్భరణి మిత్ర బృందంలో మరొక సభ్యుడు’’.
‘‘్భరణి స్నేహితులు ఇద్దరితో మాట్లాడారు. ఎవ్వరూ ఉన్నదున్నట్లు చెప్పడం లేదు. ఏదో దాస్తున్నారు. ఇపుడు ఈ సూర్య మాత్రం నిజం చెబుతాడని నమ్మకం ఏమిటి?’’ నిరుత్సాహంగా అన్నాడు రవీంద్ర.
‘‘నిజం ఎప్పుడూ నేరుగా మన దగ్గరికి వచ్చి తనని తాను పరిచయం చేసుకోదు రవీంద్రగారూ. మనమే దాన్ని గుర్తించి పలకరించాలి. అప్పటిదాకా అది మనకి అపరిచితంగానే ఉంటుంది. సూర్య మనకి నిజం చెబుతాడో లేదో చెప్పలేను కానీ, అతడు చెప్పబోయేది మాత్రం వీళ్ళు చెప్పినదానికన్నా భిన్నంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే, అతడు భరణి మిగిలిన స్నేహితులకన్నా భిన్నమైనవాడు!’’
సూర్యతో సంభాషణ
‘‘్భరణిని చంపిందెవరో నాకు తెలుసు. పోస్టుమార్టమ్ రిపోర్టులో సహజ మరణం అని ఎందుకు వచ్చిందో, శ్రీను, రాజులు మీకు నిజాన్ని చెప్పడానికి ఎందుకు భయపడ్డారో, ఈ కేసుని వదిలేయమని వాళ్ళు మిమ్మల్ని ఎందుకు హెచ్చరించారో కూడా నాకు తెలుసు!’’ అన్నాడు సూర్య. అతడి మాటలు వింటూ ఆశ్చర్యంగా చూశాడు పాణి. భరణి గురించి చెబుతాడని అనుకుంటే అతడు మొత్తం కేసు గురించే చెబుతున్నాడు. అన్ని విషయాలూ తనకి తెలుసు అంటున్నాడు. ఇంత సులువుగా కేసు తేలిపోతోందా?! అతడికి ఆశ్చర్యంతోపాటు ఆనందం కూడా కలిగింది.
‘‘ఏమిటి నీకు తెలిసిన నిజం? భరణిని ఎవరు చంపారు? చెప్పు?’’ ఉత్సాహంగా అడిగాడు. ‘‘్భరణిని చంపినవాళ్ళని మీరు పట్టుకోలేరు. వాళ్ళకే శిక్షా విధించలేరు! అందుకే శ్రీనూ, రాజులు మీతో అలా అన్నారు. వాళ్ళన్నది అక్షరాలా నిజం. ఈ కేసుని పరిశోధించి మీరు సాధించగలిగదేమీ లేదు’’ అన్నాడు సూర్య.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ