భక్తి కథలు

హరివంశం 207

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవతలకెవరికీ ఇటువంటి సుగుణ సంపద, ఉదాత్త సౌందర్య గాంభీర్య గరిమ ఎవరికీ లేదని అప్సరాగ్రగణ్యయైన ఊర్వశి పురూరవుణ్ణి మోహించి వచ్చి ఆయనను వరించింది. ఆయన కూడా కాదనకుండా ఊర్వశిని ఆదరించాడు. వాళ్ళు చాలా కాలం శృంగార రసాధిదేవతలై అన్యోన్యపు వలపు భోగాలు అనుభవించారు.
మందాకినీ తీరపు అందమైన వనాలలో, నందనవనంలో, మేరు నగ విహార భూములలో, హేమకూట శిఖర సుందర ప్రదేశాలలో, గంధమాదన శైల కందరాలలో చైత్ర రథోద్యానవనంలో, అలకాపురిలో, ఇంకా దేవతలు విహరించే రమ్య ప్రదేశాలలో ఒక్కొక్క చోట ఐదేళ్ళు, ఏడేళ్ళు, ఎనిమిది, ఆరు, పది, పదిహేనేళ్ళు పద్దెనిమిదేళ్ళు ఈ భోగ భూములలో ప్రణయ పారవశ్యం పొందారు. కాలగమనమే తెలియరాకుండా వాళ్ళు ప్రణయకేళీ లోలురైనారు.
ఆయన రాజధాని ప్రతిష్ఠానపురం. అది భాగీరధి ఉత్తర తీరంలో ఉంది. స్వర్గలోకంలో కూడా సిరిసంపదలతో ఈ పట్టణంతో తులతూగే నగరం ఇంకొకటి లేదు అని అది ప్రసిద్ధి పొందింది.
ఊర్వశివల్ల ఆయనకు ఆయువు, అమావసువు, దృఢాయువు, అనాయువు, శతాయువు అనే కొడుకులు పుట్టారు. వాళ్ళంతా గొప్ప తేజశ్శాలురు. వీరిలో పెద్దవాడైన ఆయువనే మహారాజుకు నహుషుడు, వృద్ధశర్మ, రంభుడు, రజి, అనేనుడు అనే ఐదుగురు పుత్రులు జన్మించారు. రజికి అధిక సంతానం పుట్టి వాళ్ళంతా రాజేయులని ఖ్యాతి పొందారు. ఆ సమయంలో సురులకు, అసురులకూ గొప్ప రణరంగం ఉప్పతిల్లింది.
వీళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి ఈ ఘోర రణంలో ఎవరికి విజయం సిద్ధిస్తుందో చెప్పవలసిందిగా ప్రార్థించారు. అపుడు బ్రహ్మదేవుడు దివ్యాయుధధారి అయి రజి ఎవరు పక్షంలో చేరుతాడో వాళ్ళకు విజయం తథ్యం అని చెప్పాడు. మూడు లోకాలు ఆ పక్షం వారికి దక్కుతాయి అని కూడా తెలిపాడు. రజి ఎక్కడ ఉంటాడో అక్కడ ధైర్యశౌర్య సాహసాలు, రాజ్యసంపద, విజయం తప్పక ఉంటాయి అని బ్రహ్మదేవుడు నిర్ణయించాడు. ఈ మహారాజు రాహువు దౌహిత్రుడు. కాబట్టి తమ పక్షంలో తప్పక చేరతాడని అసుర గణాలు ఉత్సాహ సంభరితులైనారు. మేము ఈయనకు మాతృ వంశం వాళ్ళమని దానవులు పొంగిపోయినారు. ఉత్కంఠననుభవించారు. వీళ్ళంతా కూడగట్టుకొని రజి దగ్గరకు వెళ్లి తమ పక్షాన ఉండవలసిందిగా ప్రార్థించారు.
అప్పుడాయన ఏమన్నాడంటే దివిజులను తప్పక ఓటమి పాలు చేస్తాను. అది తథ్యం, అయితే ఆ తరువాత నేనే మిమ్మలనూ, దివిజులను కూడా పరిశీలిస్తాను. ఇట్లా నా ఏలుబడిలో మీరు ఉండటానికి అంగీకరిస్తేనే నేను మీ వైపు ఉండి దేవతలతో పోరాడుతాను. ఈ షరతు మీకు ఇష్టమేనా అని దైతేయులను ఆయన అడిగాడు. అందుకు అసురులు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు.
ఇదెట్లా వీలవుతుంది. మాకు అధీశ్వరుడు ప్రహ్లాదుడు. ఆయననే మా ప్రభువును చేసుకోవాలన్నది మా అభిమతం. ఈ ప్రయత్నమంతా అందుకే కదా మేము చేస్తున్నది అని నిర్మొహమాటంగా రజికి చెప్పారు రాక్షసులు. దేవతలు మాత్రం రజి తమకు అధీశ్వరుడు కావటానికి అంగీకరించారు. ఈ యుద్ధంలో మనకు విజయం లభిస్తే నీకే ఇంద్ర పదవి కట్టబెడతామని రజితో ఒప్పందం కుదుర్చుకున్నారు.
రజి మహాబల పరాక్రమ సంరంభంతో అసురులను ఓడించి పారద్రోలాడు. దేవతల రాజ్యాన్ని నిష్కంటకం చేశాడు. ఇంద్ర పదవి నధిష్ఠించాడు.

- ఇంకా ఉంది

- అక్కిరాజు రమాపతిరావు