భక్తి కథలు

కాశీఖండం 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీర్థోపవాసులకి వస్త్రాలు, కనకం, చందనం, కర్పూరం, కస్తూరి, కంకుమ, కండచక్కెర, పిండివంటలు (అపూపాలు), పప్పు, నెయ్యి, పెరుగు, పాలు, పండ్లు ఆదిగాల తర్పణ ద్రవ్యాల్ని, చర్మ నిర్మిత పాదరక్షలు, దారుకృత పాదుకలు, గొడుగులు, కమండలువులు, దండాలు, కంబళ్లు, వీవనలు, చామరాలు, కౌపీనాలు, శాటులు, బరిణలు, తైలం, లవణం, వంటకట్టెలు, ప్రముఖ పదార్థాలతో పరితుష్టి ఒదవించి, విశుద్ధ హృదయులు, ప్రసన్నాత్ములు శ్రుతి, స్మృత్మాదుల చేత ప్రతిపాదితాలైన స్వాధ్యాయ, యజ్ఞ, దాన, తపో వ్రతాదుల చేత క్షీణ పాపులు, భస్మం అలదుకొన్న శరీరులు, రుద్రాక్షమాలాధరులు అయి, ఆముష్మిక సుఖప్రదాత అయిన శంకరుడు, ఐహిక సుఖప్రదాత అయిన మయస్కరుడు, చంద్రశేఖరుడు, సచ్చిదానంద రసాద్వితీయ స్వరూపుడు, విరూపాక్షుడు, విశాలాక్షీ హృదయేశ్వరుడు అయిన విశే్వశ్వర శ్రీమన్మహాదేవుడిని సందర్శించి ప్రణామాలు ఒనర్చి, సృష్టి స్థితిలయాది శక్తియుక్తుడైన ఆ దేవదేవుడిని సద్యోజాతాది పంచ బ్రహ్మమంత్రముల చేతా, పంచాక్షరీ మంత్రం చేతా, ప్రణవ మంత్రము చేత ఆవాహనస్థాపనాది దశవిధ సంస్క్రియా కలాపాల చేత ఉపచరించారు. అంతేకాక ఆ దివిజులున్ను మునీంద్రులున్ను సంతోషాతిశయం పట్టజాలక నృత్తం ఆడారు.
మంద్రకాది గేయ ప్రబంధాలు పాడారు. తైర్థికులకి మోమోటపడ్డారు. వారి సుకృత విశేషాలకి ముగ్ధులు అయారు. మోక్షలక్ష్మిని కొల్లలాడారు. ఆ దేవతలు, రుషీశ్వరులు విశే్వశ్వరస్వామి ఆలయానికి ధన్యాత్ములయి మాటిమాటికి ప్రదక్షిణలు తిరిగారు. యోగపీఠం అధిరోహించిన విశాలాక్షికి కాంచన పద్మాలతో పూజలిచ్చారు. డుంగి వినాయకుణ్ణి అరిసెలు, ఉండ్రాళ్ళు నైవేద్యాలతో సంతృప్తిని పొందజేశారు. మహాపురాణ కథల ద్వారా మిక్కిలి గొప్పదైన మహాశివ స్థానం అయిన కాశీక్షేత్ర మాహాత్మ్యాన్ని శ్రద్ధాళువులై ఆలకించారు. కాశీ పట్టణపు పెద్దతల వీరి దిస్సమొలవేల్పు, పార్వతీ దేవి ముద్దుపట్టి కుక్కల గుంపుతో కూడి వున్న కాలభైరవస్వామిని అనుసరించి వర్తించారు.
ఏ మహర్షి మనస్సు శివ పంచాక్షరీ మంత్ర జపానికి ఏడుగడో, ఏ సంయమి కుక్షి గర్వోద్ధతులైన వాతాపి, ఇల్వల రాక్షసులకి వధ్యశిలాస్థానమో, తొల్లి ఏ రుషి దివ్యావతారానికి పూర్ణజల కలశం పుట్టిల్లో, ఏ తపస్వి భవ్య రూపం లోపాముద్రాదేవి వక్షస్స్థలాన పవ్వలించిందో, ఏ వౌని కంఠహుంకార రవం ఇంద్ర పదస్థుడైన నహుషుడిని అజగర కులంలో పడవేసిందో- అటువంటి పరమ మహేశ్వరుడు, మహాతేజస్స్వరూపుడు అయిన మహానుభావుడి కోసం దేవతలున్ను మునులున్ను ఆ ఆనందకాననంలో అనే్వషించారు.
కాశీలో వారు తొలుత డుంగి విఘ్నేశ్వరుడు వసించు ప్రదేశంలో వెదకారు. లోలార్క దేవుడి మందిర ముఖశాలలో నెమకారు. కాశీక్షేత్ర పాలకుల్లో ఒకడైన దండపాణి, సురాభాండేశ్వరస్వామి వుండే తావుల్లో వెదకారు. కుక్కుటస్థానంలో మూలమూలాలు గాలించారు. కేశవస్వామి లోగిలి పరామర్శించారు. కాలభైరవస్వామి నగరి ద్వారంలో అనే్వషించారు. విశాలాక్షీదేవి గోష్ఠీవాటిక, ముక్తి మంటపోపాంత ప్రదేశం శోధించారు. దేవగంగా తరంగిణీ మధ్య ప్రాంతాల్లోని ఎతె్తైన సైకత వేదికల్లోను, గంగానదీ తీరంలో గుబురుగా పెరిగిన పొదరిళ్లలోను తమ దృష్టులు ఆవిష్కరించారు.
ఆ విధంగా కుంభాసంభవుణ్ణి అనే్వషించే ఆ దేవతలూ మునులూ లోకహిత కార్య వ్యవసాయులు, జంభారి అయిన దేవేంద్రుడు అగ్రగామిగా కలవారు అయిన నిర్జరులు గీష్పతి లేక బృహస్పతి ప్రముఖులైన మునులు ఆనంద కాననం అనీ అనుకున్నారు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి