భక్తి కథలు

కాశీఖండం 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాశ్మశానం అనీ, రుద్రావాసం అనీ, కాశీ అనీ, వారణాసి అనీ, అవిముక్తక్షేత్రం అనీ, లోలార్క కేశవులు, వింటికొనల జంటయూ, గంగానది అల్లెత్రాడున్ను, శాశ్వత ధర్మం శరమున్ను, కలి లక్ష్యమున్ను, విరూపాక్షుడు (త్రినేత్రుడు) విలుకాడుగా, మోక్షపురంధ్రీ భూలతని అనుకరించేదిన్నీ, చంద్ర రేఖాచ్ఛాయా ప్రకారం కలదిన్నీ, అయి కాశీనగరం కోదండాన్ని పోలి విశే్వశ్వర మహాదేవుడికి అఖిల దేవతా సార్వభౌముడికి త్రైలోక్యసామ్రాజ్య పట్ట్భాషేకార్హం అయిన సింహాసనం వంటి ఆ మహాస్థానం అంతటా క్రుమ్మరి, అక్కడి ఆర్యులవల్ల అగస్త్య మహర్షి వున్న స్థానం తెలిసికొని, ఏగి ఆ పుణ్యాశ్రమ వాటి ప్రవేశించాడు. అక్కడ-
అగస్తి మహర్షి తపోవనవాటిలో సింహకిశోరము ఏనుగు తొండాన్ని గోకుతుంది. తన వాలారునఖాలతో పెద్దపులి సుకుమారమైన లేడి ముఖముని కొంచెము పైకెత్తి ముద్దాడుతుంది. తోడేలు కొదమప్రాయపు చింబోతుని నిండు కౌగిట చేర్చి ప్రేమతో ఊరడిస్తుంది. పొదరింటి నడిమి భాగంలో అడవి పిల్లి ఎలుకతో చెర్లాటం ఆడుతోంది. పట్టపగటి వేళ ఎండ సోకకుండా పాము తన పడగను గొడుగులాగు ముంగిసకి ఎత్తిపట్టుతుంది. ఆ మహామునివతంసుడి స్వగుణ ప్రభావం అంతట ప్రసరించి నైసర్గిక జాతి విరోధాన్ని మరపించి విరోధి జంతువులు సైతం కలసి మెలసి తిరుగుతుంటాయి.
అపుడే వండి వార్చిన నులి వెచ్చని నివ్వరి అన్నపు గంజిని క్రొత్త ప్రసవించిన ఆడు లేడిచే మగ లేడి నెమ్మదిగా త్రాగించుతోంది. బదరీ ఫలాల గుజ్జుతో కలిపి ఆవు నేతితో తాలింపులు పెడుతున్న కూరల కమ్మనివాసనలతో ఆశ్రమ ప్రాంతం ఘుమఘుమ సువాసనలతో నిండిపోతోంది. చెరువు గట్టున తన కంఠాన్ని ప్రియురాలి కంఠానికి సోకించి అరమూత కన్నులతో సారసపక్షి శివధ్యాన సమాధిలోని పారవశ్యంవల్ల అర్ధనిమీలితాక్షులతో వుంది. శ్రుతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలలోని భావాలు మనస్సుకి పట్టుకోవడంవల్ల చెరువులోని పెను చేప చిరుచేపని పట్టుకోవడం లేదు. వసంత ఋతువులో మన్మథుడు తన ఇక్షుధనువు ఎక్కుపెట్ట వెరపు చెందుతాడు. అందువల్ల తిర్యక్కుల జంటలుకూడా రతికేళిలో సంకోచిస్తూ ప్రవర్తిస్తాయి.
కంఠములందే ప్రాణాలు నిల్పుకొన్న ప్రాణి సమూహానికి సదాశివుడు ఏకాంతంగా ఉపదేశించే ప్రణవమంత్రాన్ని పొంచి వుండి ఆలకిస్తున్న తేటులు తేనె మత్తువల్ల పరవశించి, ఆ మంత్రరాజాన్ని జపిస్తున్నట్లు జుమ్మనే నా దాన్ని చేస్తున్నాయి. నక్త్భోజనవ్రతుల సహవాసంవల్లనో చకోర పక్షులు వెనె్నల అనే పెరుగుతో కలిపిన పేలపిండితో పొట్టలు నింపుకొంటాయి. అటువంటి ఆశ్రమ భూమిని డాసి చనే తరిని మునులు, బృందారకులు తమలో తాము ఎన్నటికిన్ని హానిలేని మహాశ్మశానం అనే పేరున్న కాశీక్షేత్రంలో నివసించే ప్రాణులకి స్వర్గలోకంతో ఏమి పని? పుణ్యం సడలిపోయినపుడు కీలు వూడి పోయినట్లు బొమ్మ మాదిరి పల్లానికి కూలిపోవ వలసిందే కదా!
ఈ కాశీలోని జీవులకి పునరావృత్తిరహితం అయిన శంభులోక నివాస సౌఖ్యం ఒనగూడుతుంది. కనుక మనకంటె కాశీక్షేత్రంలో నివసించే క్రిమికీటక సరీసృప పక్షి కులం గొప్పది.
కాశీ క్షేత్రపు తల పొలంలో వున్న చండాలుణ్ణి ఇందుడయినా పోలడు. ఈ ఆనంద వనంలో తిన తిండి లేక పస్తుండు స్థితి కూడా సమస్త భువన సామ్రాజ్య వైభవాన్ని పోలి వుంటుంది. ఎంతటి పతితుడు అయినా అవిముక్త దేశవాసి అశ్వమేథ యాగం ఒనర్చిన పుణ్యుడితో సాటి అవుతాడు. వారణాసిలో జన్మించిన మశకం కూడా ఐరావతంతో సరి సమానం అవుతుంది.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి