భక్తి కథలు

కాశీఖండం 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు స్నేహ పురస్సరంగాను, గౌరవ పూర్వకంగాను, అనురాగ సహితంగాను, అభిప్రాయ గర్భితంగాను, విలాస సహితంగాను, ఉపాలంభంతోను, కలశసూనుడు లోపాముద్రతో ఈ గతి వాక్క్రుచ్చాడు.
‘‘ఓ పద్మదళాక్షీ! చిత్తంలో సందేహించి, నిగూఢార్థం ఇతమిత్థంగా నిశ్చయించలేక, ఆ విషయాన్ని తేటతెల్లం అయేచందాన అడుగదలచి సిగ్గు, వెరపులు రెండూ సందడించగా, వినయ వినమిత ముఖ పద్మనై వున్నావు. ప్రోడతనపుసరణి స్పష్టమవుతుందేమోనని తలుస్తూ మాటాడ ఎరుగని రహస్య హృదయవు.
నువ్వు అన్ని సమయాల్లోనూ ఏకాంత వేళల్లో పతియెదుట నవ్వుతూ, తెగడుతూ, ప్రవర్తించడం తగవు సుమా! అవసరం లేని లజ్జ పెంపుతో వెరపుతో కలసి బెరసి వుండకుండడం మముబోంట్లు సైపగలరా?’’ అని వాకొన్న పతివాక్కులు ఆలించి లోపాముద్రా సాధ్వి వౌనం వీడి అగస్త్యమునితో ఈ వడువున వచించింది.
‘‘ఎనభై నాల్గు యోజనాల ఆయామం లేక కైవారం కలిగి ఒక యోజనం ఎత్తు, ముప్ఫయి ఆమడల వెడల్పు కలిగి, మూడున్నర కోట్ల తరాలలోనూ ఎనభై ఎనిమిది వేల రుషీంద్రులతోనూ క్రిక్కిరిసి, సప్త కోట్ల మహామంత్రాలకి నిలయమై వున్న ఈ శ్రీశైలం గిరియందు శిఖర దర్శన మాత్రం చేతనే జీవులకి మోక్షం లభించడం ఆశ్చర్యకరం!
మరణించినపుడుగాని మోక్షం ఒసగని కాశికి ఏగుట దేనికి? కాళ్లకి శ్రమ తెచ్చుకోవడం తప్ప! మరికొందరు కేవలం విజ్ఞానాన్ని కొనియాడుతారు. కొందరు విజ్ఞాన సహిత కర్మని ప్రశంసిస్తారు. మరికొందరు దానాలను ప్రస్తుతిస్తారు. ఇంకా కొందరు వ్రతాలను పేర్కొంటారు. మరి కొందరు యజ్ఞాలను మెచ్చుకొంటారు. వేరొక కొందరు తపాలు కోరుతారు. కొందరు బ్రహ్మచర్య వ్రతాన్ని అభినందిస్తారు. కొందరు గృహస్థాశ్రమాన్ని కొండాడుతారు. మరికొందరు వానప్రస్థాశ్రమాన్ని మన్నిస్తారు. కొందరు సన్న్యాసాశ్రమం ప్రశస్తం అని ప్రసంగిస్తారు. వేరొక కొందరు తీర్థ సేవ పుణ్యప్రదం అని ఆవిష్కరిస్తారు. కొందరు వేదాధ్యయనం సర్వోత్కృష్టం అని ప్రశంసిస్తారు. కొందరు కాశీక్షేత్ర శ్రీశైల సంసేవనాన్ని అభ్యర్థిస్తారు. ఇవి అన్నీ మోక్షసాధనాలే!
అందునా సులభం అయిన మోక్ష సాధనాన్ని వినగోరుతాను. ఆనతి ఈయవలసింది. సందేహ బీజాలైన, పరస్పర విరుద్ధాలైన వాక్య హస్రాలు ఆలకించాలని నా హృదయం ఊయల పగిది మును వెనుకలకి ఊగిసలాడుతున్నది’’ అని అడిగింది. లోపాముద్ర అడిగిన విషయానికి అగస్త్య ముని అంగీకారానురాగాలచేత ఆర్ద్ర హృదయుడై ఆ లోపాముద్రతో ఈ విధంగా పలికాడు. ‘‘పద్మముఖీ! అడుగవలసిన అర్థమే వాగ్వైభవంతో అడిగావు!’’ అని ఈ చందంగా చెప్పడం మొదలుపెట్టాడు.
బాహ్యాభ్యంతర తీర్థ మహాత్మ్యము
శ్రీశైలాదులు ముక్తిప్రదాలు అయిన తీర్థాలు అని పురాణాలు వచిస్తున్నాయి. ఆ రీతిగా మోక్ష కారణాలుగా వచించపబడిన సమస్త తీర్థాల ప్రఖ్యాతి విషయంలో రెండవ వూహ లేనే లేదు.
ఆ తీర్థాలని సేవించిన కారణంగాని- సేవించిన పుణ్యఫలంవల్లనే కాశీప్రాప్తి సిద్ధిస్తుంది. అవి అన్నీ కాశీ ప్రాప్తికి కారణాలు కావడంవల్లనే ఆ తీర్థాలని పురాణాలన్నీ కైవల్య ప్రదాలని వర్ణించాయి. కాశీక్షేత్రం సాక్షాత్తు ముక్తికారణము, అన్యతీర్థాల ముక్తిప్రదత్వానికీ కాశీ మోక్ష ప్రదత్వానికిన్నీ కల భేదం యిది అని తెలుసుకోవలసింది.
త్రివేణి సంగమ స్థానం అయిన ప్రయాగ, నైమిశారణ్యం, సరస్వతీ నది ప్రవహించిన కురుక్షేత్రం, హిమాలయ శైలం నుంచి గంగ భువికి దిగిన గంగాద్వారం అది.
-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి