డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడితో కలిసి ఆ రాత్రి ఆ గదిలో ఉండవలసి రావడం ఆమెకిష్టం లేకపోయినా అతడి మాటలు హేతుబద్ధంగా ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోయింది సామ్రాజ్ఞి.
‘తన భర్త ఎవరో పరాయి స్ర్తితో పగటి సమయాన పదిమందీ తిరిగే దేవాలయం వంటి చోట మాట్లాడుతూ కనిపించారని ఎవరో చెప్పినందుకే తను అతణ్ణి నిలదీసిందే!
ఇలా రాత్రి సమయాన ఒక అపరిచిత వ్యక్తితో తను హోటల్ గదిలో ఉందని ఎవరికైనా తెలిస్తే తనేం చెప్పినా నమ్ముతారా?!’’
ఆ ఆలోచనే ఆమె గుండె ఝల్లుమని ఒళ్లంతా సన్నటి వణుకు ప్రారంభమైంది. ఆమె పరిస్థితిని గమనించిన అతడన్నాడు, ‘‘మరేం భయం లేదు. మీరా మంచంమీద ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకుండా హాయిగా పడుకోండి.
నేనిలా సోఫాలో నడుం వాలుస్తాను. నాకు లైటుంటే నిద్రపట్టదు. కానీ లైటు లేకపోతే మీ మనసు మనసులో ఉండదు కాబట్టి లైటలానే ఉంచి నిద్రపోండి’’ అని జంట మంచాలకు కొంచెం దూరంగా వున్న సోఫాలో కాళ్ళు ముడుచుకుని నడుం వాల్చాడతడు.
అతడినే చూస్తూ సోఫాకు వీలైనంత దూరంగా, పాదాల్ని చీరలోకి లాక్కుని మంచంమీద పడుకుంది సామ్రాజ్ఞి.
భౌతికంగా అయితే మంచంమీద పడుకుంది గానీ, ఆమె ఆలోచనలన్నీ అతడి చుట్టూ తిరగసాగాయి.
‘బస్‌లో అతడు తన పక్కన కూర్చోవడమే తన ఈ ప్రస్తుత పరిస్థితికి నాంది’ అని గుర్తొచ్చి అతడిమీద ఉవ్వెత్తున కోపం వచ్చిందామెకు.
‘అతడు కాకుండా బస్‌లో ఏ స్ర్తియో తన పక్కన కూర్చుని ఉండుంటే తనీ సంకట స్థితిలో ఉండి ఉండేది కాదు కదా!’ అనిపించిందామెకు.
‘ఏమో ఎవరు చెప్పొచ్చారు? సాటి ఆడది తన పక్కన కూర్చున్నంత మాత్రాన మంచి మనిషే అయ్యుండాలని ఏముంది?
నిజానికి ఈ రోజుల్లో ఆడవాళ్లే మాయమాటలు చెప్పి సాటి ఆడవాళ్లను మోసం చేస్తున్నారు. అటువంటి సంఘటనలు తను ఎన్ని వినలేదూ?
ఇతడు మంచివాడేనేమో! తన పట్ల ఇంతవరకూ అసభ్యకరంగా మాట్లాడడంగానీ, అనుచితంగా ప్రవర్తించడంగానీ చేయలేదు.
నిజంగా అతడు మంచివాడేనా? లేకపోతే ముందు మంచివాడిగా నటించి తర్వాత తన అసలు రూపం చూపించే కోవకు చెందినవాడా?
అతడు తనమీద అఘాయిత్యం చేస్తే తను ఎదుర్కోగలదా? తన మాట ఎవరైనా నమ్ముతారా?
అతడే చెప్పినట్టు.. తెల్లారేవరకూ లోకం దృష్టిలో.. కనీసం ఈ హోటల్‌వాళ్ల దృష్టిలో భార్యాభర్తల క్రిందే లెక్క!
ఒక రాత్రివేళ అతడు తనమీద అఘాయిత్యం చేశాడని తాను అరిచి అల్లరి చేసినా తన మాట ఎవరు నమ్ముతారు? తామిద్దరిమధ్య ఏ సంబంధమూ లేకుండా అతనితో తను గదిలో ఉండడానికి వచ్చినపుడే అతడిమీద నిందలేసే హక్కును కోల్పోయింది కదా!
ఇప్పుడు ఎంత వగచి ఏం లాభం? ఆ బుద్ధేదో అతడితో బస్ దిగి రావడానికి ముందు ఉండి ఉంటే ఎంత బావుండేది?
ఎంత తెలివి తక్కువగా ఆలోచించింది తను? అసలు ఉన్నారో లేదో తననే నిర్థారణగా తెలియని అల్లరి మూకేదో వచ్చి బస్‌లో ఒంటరిగా వున్న తనమీద అఘాయిత్యం చేస్తుందనే అతితెలివి ఆలోచనతో తనంతట తానే పులిబోనులోకి నడిచి వచ్చినట్టవలేదూ ఇప్పుడు?
అతి తెలివి ఎప్పుడూ అనర్థహేతువే! తన పరిస్థితి ఏం కానుందిప్పుడు! కలగాపులగంగా వస్తోన్న ఆలోచనలతో మెదడు వేడెక్కిపోయి పొడి కళ్లు పడిపోయాయి ఆమెకు.
వాతావరణం చల్లగా ఉన్నా, ఆమె ఒళ్లంతా వేడెక్కిపోయింది. భయం ఆందోళనా ఆమె నరనరానా నిండిపోయి ఎంతో నిస్సత్తువగా అనిపించిందామెకు.
గోడవైపు మొహం పెట్టి పడుకున్నదల్లా అతడు పడుకున్నవైపు తిరిగి కనురెప్పలు పూర్తిగా తెరవకుండా అతడివైపు చూసింది.
అతడి కళ్లు మూసుకునే ఉన్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలకనుగుణంగా అతడి ఛాతీ పైకీ క్రిందికీ కదులుతోంది. అతడు నిజంగా నిద్రపోతున్నాడా? లేక దొంగ నిద్ర నటిస్తున్నాడా?
తన సంగతి సరే! వయసులో వున్న ఆడదానితో ఒంటరిగా గదిలో పడుకున్న అతడిలో తనపట్ల ఏ వికారమూ కలగడంలేదా?
ఉగ్గుపాలతో నీతి నియమాల్ని కూడా త్రాగి పెరిగాడా ఇతను? పరాయి స్ర్తిని తల్లిగా చూడాలనే సూక్తిని మనసా వాచా నమ్మిన సత్పురుషుడా ఇతను? అరిషడ్వర్గాల్ని జయించిన మునీశ్వరులకి ఇతడు దగ్గర చుట్టమా?
మగతనం ఉన్న మగాడెవరైనా ఇలా నిర్వికారంగా ఉండగలడా? లేక తనసలు ఆడదానిలా కనిపించడం లేదా అతడికి?
తనలోని ఏ లక్షణమూ అతడిని ఆకట్టుకోలేదా? మగాళ్లను ఆకర్షింపజేసే ఎటువంటి లక్షణాలూ తనలో లేవా?
తన మాట తీరు ఎవరికీ సాధారణంగా నచ్చదని తనకు తెలుసు. కనీసం మగాణ్ణి ఆకట్టుకునే అవయవ పొంకం కూడా తనకు లేదా?
మరైతే సామ్రాట్ తనలో ఏం చూసి తనతో కాపురం చేస్తున్నాడు? పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తప్పక తాను పెళ్లాంలా భరిస్తున్నాడా? అంతకుమించి తనలో సామ్రాట్‌కు నచ్చినవేమీ లేవా?!
ఒక పురుషుడు చూపించే ఆప్యాయతకూ, అనురాగాన్నీ పొందడానికి తాను నిజంగా అనర్హురాలా? మొగుడు పెళ్లాంతో కాపురం చేయాలి కాబట్టి తప్పక తనతో కాపురం చేస్తున్నాడా సామ్రాట్!
తనసలు ఆడది కాదా?! అందగత్తె అయిన భార్య పట్ల అనాసక్తి చూపించే మగాడైనా సర్వ సాధారణంగా కనిపించే పరాయి ఆడదాని పట్ల ఎంతో వ్యామోహం చూపిస్తాడే!
తన స్థాయి సాధారణమైన ఆడవాళ్ల స్థాయి కంటే తక్కువా? ఎంతోమంది పగలు చూస్తే రాత్రి కలలో కొచ్చే అనాకారులైన వివిధ వయసుల్లో వున్న ఆడవాళ్లు, వాళ్లు కేవలం ఆడవాళ్లైన కారణాన నిత్యమూ వేధింపులకూ, అఘాయిత్యాలకూ గురౌతున్నారే!

-ఇంకాఉంది

సీతాసత్య