భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా!.. 39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పటినుంచే ఆమెలో పరమాత్మ గురించి తెలుసుకోవాలన్న కోరిక బలవత్తరం కాసాగింది! సుగుణవతి, శాంత స్వభావురాలు, మృదువుగా మాట్లాడేది అయిన శబరికి తపస్సు చేయడంవల్ల జ్ఞానం లభిస్తుందని, ఆమె కోరుకుంటున్న భూతనాథుని దర్శనం, సేవాభాగ్యం లభిస్తాయని ఒకసారి అటువచ్చిన నారద మహర్షి చెప్పడంతో సహ్య పర్వతం మీద తపస్సు చేస్తూ గడిపింది చాలాకాలం వరకు!
శబరికి గురుమూర్తిగా మణికంఠుని ఉపదేశం
ఒక రోజు..
తపోమగ్నురాలై వున్న శబరి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది!
‘ఏమైంది తనకు? ఎవరో పలకరించినట్లు ఎందుకనిపించింది? ధ్యానం ఆపి వెంటనే లేచిందెందుకు?’ తనలో తనే ప్రశ్నించుకుంటూ లేచి చుట్టుప్రక్కలంతా చూసింది ఎవరైనా కనిపిస్తారేమోనని!
ఎవరూ కనిపించకపోవడంతో కూర్చుని ఓంకారాన్ని ధ్యానిస్తూ కన్నులరమూయగానే దూరం నండి ఎవరో తనవైపు వస్తున్నట్లుగా తోచి గబగబా ఆ వైపుగా రెండడుగులు వేసింది!
ఎవరో వృద్ధ సన్యాసి తనవైపే వస్తుండటం గమనించి ఎదురువెళ్లి ‘‘ప్రణామాలు మహాత్మా’’ అంటూ నమస్కరించింది భక్తిపూర్వకంగా!

ఆమె వైపు ప్రసన్నంగా చూస్తూ ‘‘ఎవరివి నీవు బాలికా! ఈ పర్వతంమీద ఒంటరిగా ఏం చేస్తున్నావు?’’ అని అడిగాడు వృద్ధుడు!
‘‘స్వామీ! నా పేరు శబరి! నేను చిన్ననాటినుండి హరిహర పుత్రుడైన మణికంఠుని దర్శించాలన్న కోరికతో జీవిస్తున్నాను! ఆ స్వామి దర్శనభాగ్యం కోసం ఎదురుచూస్తూ తపం కావిస్తున్నాను! అయినా మహానుభావులైన పరమయోగి పుంగవులు కావించే కఠిన తపస్సులు ఫలించడానికే ఎన్నో పరీక్షలకు గురి కావలసి వుంటుంది కదా! ఇక నావంటి సామాన్యురాలు కావించే తపం ఆ స్వామికి వినిపించే అవకాశం వుంటుందంటారా? అయినా ఎప్పటికైనా ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోనైనా ఆ స్వామి కరుణార్ద్ర దృష్టి నాపై ప్రసరించకపోతుందా అనుకుంటూ ఎదురుచూస్తున్నాను!’’ అంటూ తన విషయాలు చెప్పింది దాపరికం లేకుండా!
చిన్నగా నవ్వాడు వృద్ధుడు!
‘‘నీ భక్తిశ్రద్ధలు, నీ మృధుభాషణం నన్ను ప్రసన్నుడిని కావించాయి! బాలికా! భగవత్స్వరూపుడైన మణికంఠుడు సర్వవ్యాపకుడు! బాహ్య ప్రపంచమంతటా, ఆ ప్రపంచంలో నివసించే ప్రాణులందరిలో ఆత్మజ్యోతిగా వెలుగుతూ నిలిచి వుండే ఆ భగవంతుడిని జ్ఞాన నేత్రంలో దర్శించడానికి ప్రయత్నించాలి! అందుకు నిర్మలమైన హృదయం, దృఢమైన విశ్వాసం అనే రెండు సాధనాలు అవసరం! వాటి సహాయంతో ప్రయత్నిస్తే నీ కోరిక తప్పక తీరుతుంది! మరొక విషయం చెబుతాను, విను!
కామ, క్రోథ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే
ఆరు దుర్గుణాలు మనస్సును నిర్మలంగా వుండనివ్వకుండా తమ మాయాజాలంతో వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే వుంటాయి! ముందుగా ఈ ఆరు దుర్గుణాలు మనస్సుమీద ప్రభావం చూపకుండా సంయమనం పాటించడం అలవాటు చేసుకోవాలి! ఆ సంయమనం అలవడటానికి తపస్సు, ధ్యానం సహాయపడతాయి!
పద్మాసనం వేసుకుని కూర్చుని, ప్రాణాయామం ఆచరించి ఓంకారాన్ని నిశ్చలమైన హృదయంతో ధ్యానిస్తూ వుంటే క్రమంగా మనస్సు నిలకడ పొంది పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది! నీ కోరిక మరికొంతకాలం తర్వాత తప్పక తీరుతుంది! మణికంఠుడు నిన్ను చూడటానికి తప్పక వస్తాడు! అప్పటివరకు నేను చెప్పిన విధంగా ఏ విధమైన భావాలకు లోనుకాకుండా ఆత్మసంయమనం పాటించటం అలవాటు చేసుకో!’’ అంటూ ఉపదేశించాడు! ఆయన చెప్పింది శ్రద్ధగా విన్నది శబరి!
‘‘నాకు మార్గోపదేశం చేయడానికివచ్చిన గురుదేవులుగా భావించి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తున్నాను!’’ అంటూ నమస్కరించింది!
‘‘ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు!’’ అని ఆశీర్వదించి గంభీరంగా సాగిపోయాడు వృద్ధుడు!
ఆ విధంగా గురుమూర్తి రూపంలో వచ్చిన మణికంఠుడు తత్వోపదేశం చేయడంతో శబరిలో జ్ఞాన నేత్రం వికసించింది! తనలోనే జ్యోతిరూపంలో వెలుగొందుతున్న జీవాత్మ అరిషడ్వర్గాలను జయించడంతో పరమాత్మ ప్రతిరూపంగా వెలుగుతూ ఆ పరమాత్మలోనే విలీనం చెందుతాడని గ్రహించింది! ఆ సత్యం బోధపడటంతో ఆమె మనస్సు సంయమన స్థితిని పొందింది!
సగుణ రూపంతో తనను చూడటానికి వచ్చే మణికంఠుని చూడాలన్న ఒకే కోరికతో కాలం గడుపుతూ వృద్ధాప్యంలో ప్రవేశించింది!

-ఇంకాఉంది

-డా. టి.కళ్యాణీ సచ్చిదానందం 39