భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా!.. 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మహారాజా! ఈ రాత్రివేళ బాణం పడ్డ స్థలాన్ని కనుగొనడం కష్టం! రాత్రికి ఇక్కడ విశ్రమించి, రేపు ప్రొద్దునే్న బయలుదేరడం మంచిది! అని మంత్రి చెప్పిన సలహా సబబుగానే తోచడంతో సరేనన్నాడు రాజు! సైనికులు వేసిన శిబిరంలో పడుకుని కళ్ల మూసుకున్నాడు రాజు! ఆయన మనోఫలకంమీద తాను వేటకు వెళ్లగా పంబా నదీ తీరాన బాలుడు దొరకడం, మణికంఠుడని నామకరణం చేసి ఎంతో వాత్సల్యంతో పెంచుకోవడం, అతని బాల్య చేష్టలు చూస్తూ మురిసిపోవడం మొదలైన దృశ్యాలు కనిపిస్తుంటే వాటితో తాదాత్మ్యం చెంది అలౌకికానందాన్ని పొందుతున్న రాజశేఖరుడు ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు. ఎవరో తనను పిలుస్తున్న అలికిడికి! తన సమీపంగా నిలిచి వున్న ఆజానుబాహువైన దృఢకాయుడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఎవరిని నీవు? నా శిబిరంలోకి ఎలా ప్రవేశించావు?’’ అని అడిగాడు! ఆ పలుకులలో అనుమానం కూడా వ్యక్తమవడం గమనించి చిన్నగా మందహాసం చేశాడు దృఢకాయుడు!
‘‘మహారాజా! నన్ను చూసి మీకు హాని కలిగించడానికి వచ్చిన శత్రువుగా భావించకండి! నేను భూతనాథుడు, ధర్మశాస్తా అయిన మణికంఠుని ఆంతరంగిక సేవకుడిని! భూతగణాలలో ముఖ్యుడిని, నా పేరు వపర! తమరిని తన సన్నిధికి తీసుకురావలసిందగా ఆదేశించి నన్ను పంపారు మా నాయకుడు! మీరు నా వెంట బయలుదేరి రావలసిందిగా మనవి చేస్తున్నాను!’’ అంటూ అతను చెప్పింది వినగానే ఆనందంతో ముఖం వికసించగా దిగ్గున శయ్యపైనుండి దిగాడు రాజశేఖరుడు!
‘‘ఏమిటి? నన్ను తీసుకురమ్మని నా తండ్రి, నా వరాల పాపడు, నా మణికంఠుడు మిమ్మల్ని పంపాడా? పదండి! వెంటనే వెళదాం!’’ అంటూ సిద్ధమైనాడు.
పుత్రవాత్సల్యం తిరిగి ఆయనను మాయలో పడవేయడం గమనించిన వపర పెదవులమీద వ్యాపించింది చిరునవ్వు! గంభీరంగా వుండటానికి ప్రయత్నిస్తూ ‘‘పదండి!’’ అన్నాడు.
ఇద్దరూ శిబిరం బయటకు వచ్చారు! పరివారం, ప్రజలు అందరూ గాడనిద్రలో వుండటం గమనించి నిశ్శబ్దంగా ముందుకు కదిలారు!
***
చాలా దూరం నడిచివచ్చాక ఒక చోట ఆగాడు వపర!
రాజు ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు! అక్కడంతా పట్టపగలులాగా వెలుగుతో నిండి వుంది! ఒక గిరిమీద బంగారంతో చేయబడిన ఆలయంలో సింహాసనం ఒకటి జాజ్వలమానంగా వెలుగుతూ స్పష్టాస్పష్టంగా కనిపించింది! ఆ సింహాసనం వరకు కొన్ని మెట్లు కూడా అమరి వుండటం గమనించాడు రాజు!
‘‘ఇవన్నీ ఏమిటి? మణికంఠుడెక్కడ?’’ అని అడిగాడు వపర వైపు కుతూహలం నిండిన కళ్లతో చూస్తూ!
‘‘చెబుతాను! జాగ్రత్తగా విను రాజా! ఈ ప్రదేశంలోనే పులి పాలకోసం అన్న నెపంతో మణికంఠస్వామి బయలుదేరి వచ్చి మొదటగా విశ్రమించారు! వారి సేవ కోసం పరమేశ్వరుని ఆజ్ఞతో నేను మరికొందరు భూతగణాలతో వచ్చి వారిని కలుసుకున్నాను! దేవతలు, ఋషిగణాలు కూడా ఇక్కడు వచ్చి మహిషిని సంహరించమని ప్రార్థించారు! వారి మొరలాలకించి వెంటనే ఆ ప్రాంతంలో నివశిస్తున్న ఆ రాక్షసిని ఎదుర్కొని, భీకరంగా రణం కావించి స్వామి దాని శరీరాన్ని మర్థించి వధించివేశారు. ఇంద్రాది దేవతలు ఆనందంతో హర్షధ్వానాలు కావిస్తూ స్వామి మీద పుష్పవృష్టి కురిపించారు! తమ కృతజ్ఞత తెలుపుకోవడానికి అప్పటికప్పుడే ఈ గిరిమీద స్వర్ణమందిరం ఒకటి నిర్మింపజేశాడు ఇంద్రుడు దేవశిల్పి విశ్వకర్మతో! వారందరి ప్రార్థన మన్నించి స్వామి ఆ ఆలయంలో దేవతల ఆరాధనలను, సేవలను స్వీకరించారు! రాజా! మానవుల కళ్లకు కనిపించని ఈ ఆలయాన్ని నీకు దర్శింపజేయాలనే స్వామి నిన్ను ఇక్కడకు రప్పించటం జరిగింది! పద! వెళ్లి! అప్పటి ఆ దృశ్యాన్ని చూసి ఆనందించుదువుగాని!’’ అంటూ వపర చెప్పింది విని ఆనందబాష్పాలతో నిండిపోయాయి రాజు కళ్లు!
‘‘నామీద ఎంతటి దయ నీకు నా తండ్రీ!’’ అంటూ వణుకుతున్న కంఠంతో అనుకుంటూ వపర వెంట ఆలయానికి వెళ్లే సోపాన మార్గాన్ని చేరుకున్నాడు రాజు!
‘‘ఈ మెట్ల మర్గాం కూడా దేవతలు స్వయంగా ఏర్పరచినది! రాజా! ఆలయం మధ్యగా దేవతలు రత్నఖచిత సింహాసనం వంటి పీఠాన్ని అమర్చారు! ఆ పీఠం బాలుని రూపంలో వున్న స్వామికి ఎక్కి కూర్చోవడానికి ఎత్తు ఎక్కువగా వున్నట్లు తోచడంతో ఇంద్రుడు కొందరు దేవతలను మెట్లలాగా అమరి స్వామికి ఎక్కడానికి వీలు కల్పించమని ఆదేశించాడు! అప్పుడు పద్ధెనిమిది మంది దేవతలు మెట్లలాగా పడుకుని స్వామిని తమపై పాదాలు మోపి ఎక్కి రావలసిందిగా ప్రార్థించారు!

-ఇంకాఉంది
.......................................................................................
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-డా, టి.కళ్యాణీసచ్చిదానందం