డైలీ సీరియల్

పూలకుండీలు 45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే, వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనితకు రెండుసార్లు నెల తప్పింది. ఆ రెండుసార్లూ అబార్షన్ చేయించారు. ఆ అబార్షన్‌న్లవల్ల అనిత ఆరోగ్యం దెబ్బతిని మనిషి మునుపటంత చలాకీగా ఉండలేకపోతుంది.
ట్రాన్స్‌ఫర్ మూలంగా దూరమైన కిషోర్ వీకెండ్స్‌లో కూడా అనిత దగ్గరికి రావడం క్రమంగా తగ్గించాడు.
అసలే ఆరోగ్యం అంతంత మాత్రంగా తయారైందని బాధపడుతున్న అనితకు వీకెండ్స్‌లో భర్త రాకపోవడంతో మరింత నిస్పృహకు లోనవ్వసాగింది.
ఓసారి రెండు, మూడు నెలలైనా కిషోర్ ఇంటికి రాకపోవడంతో ‘‘ఇలా లాభం లేదు’’ అనుకున్న అనిత ఓ వీకెండ్‌న తనే కిషోర్ దగ్గరికి బయలుదేరి వెళ్లింది.
ఆవిడ వెళ్ళేటప్పటికి అతను రూమ్‌లో లేడు. ఎటుపోయాడన్న విషయాన్ని తెలుసుకోవడం కిషోర్ టీమ్‌లోనే అసిస్టెంట్ టీమ్ లీడర్‌గా చేస్తున్న తమ ఇద్దరి కామన్ ఫ్రెండ్ కార్తీకకు ఫోన్ చేసింది.
ఫోన్ ఎత్తిన కార్తీక ‘‘ఈమధ్య కిషోర్ తన ఆఫీసులో పనిచేస్తున్న ఓ తాయ్ అమ్మాయితో చాలా చనువుగా తిరుగుతున్నాడు. వీకెండ్స్‌కి ఆ అమ్మాయితో కలిసి డేటింగ్ చేస్తున్నాడు’’ అంటూ అనిత దిమ్మతిరిగిపోయే విషయాన్ని బయటపెట్టింది.
అయితే ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోనట్టు నటిస్తూ కార్తీకతో మాట్లాడి ఫోన్ కట్ చేసింది అనిత.
‘‘ఆ తాయ్ అమ్మాయి వ్యవహారాన్ని మొగ్గలోనే తుంచెయ్యకపోతే ముందు ముందు నా సంసారానికే ప్రమాదం రావచ్చు’’ అనుకున్న అనిత అసలు ఆ విషయమే తనకు తెలియనట్టు భర్త దగ్గర నటించింది.
అలా నటిస్తూనే-
తమ వీకెండ్స్ వ్యవహారం కిషోర్ భార్యకు తెలిస్తే ఆ తదుపరి జరగబోయే పరిణామాలు ఎలా వుంటాయో కరెంట్ షాక్ కొట్టినట్టు ఆ తాయ్ అమ్మాయికి తెలిసేలా చాలా తెలివిగా ప్లాన్ చేసి అమల్లో పెట్టింది అనిత.
ఈ భూగోళం మీద ఎవరైనా ఎక్కడైనా భార్యాభర్తలమధ్య జొరబడి అక్రమ సంబంధాలకు పాల్పడితే ఆ ఇద్దరు భార్యాభర్తల్లో బాధితులు సకాలంలో కళ్ళు తెరిచి మేలుకుంటే జరగబోయే సత్కారం ఏ తీరుగా వుంటుందో తెలిసిన ఆ తాయ్ అమ్మాయి ‘ఎవరితో పెట్టుకున్నా పెళ్ళైన మగవాళ్ళతో మరీ ముఖ్యంగా ఇండియన్స్‌తో పెట్టుకోకూడదు’’ అన్న ఎరుకతో బెదిరిపోయి కిషోర్‌తో వీకెండ్స్ కట్ చేసింది.
ఇనుము కాకమీద వున్నపుడే సుత్తి దెబ్బ డాలన్న సూత్రాన్ని అమలులో పెట్టిన అనిత ఆ తరువాత కిషోర్ మగ మనస్తత్వానికి చేయాల్సిన కాయకల్ప చికిత్స కాస్త గట్టిగానే చేసింది.
అనిత తన చుట్టూ బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటుచేసిందన్న విషయాన్ని కొంచెం ఆలస్యంగా గ్రహించిన కిషోర్ ఓ రోజు ‘‘సారీ రా! అనీ, నా వైపునుండి ఇకముందు ఎప్పుడూ అలాంటి పొరపాటు జరగదని హామీ ఇస్తున్నాను’’ అంటూ తన తప్పును నిజాయితీగా ఒప్పుకుంటూ ఆవిడ ముందు మోకరిల్లాడు.
అంతే!
ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా అతణ్ణి నాగినిలా చుట్టేసింది అనిత.
****
కొద్దిరోజుల తరువాత ఓ వీకెండ్‌లో ఇంటికొచ్చిన భర్తతో ‘‘చూడు కిషోర్! ఈ డ్యూటీలతో ఈ టెన్షన్స్‌తో జీవితం అంటేనే బోర్ కొడుతుంది. మనం ఇప్పటిదాకా గొప్పది అనుకున్న జీవితం నిజంగా గొప్ప జీవితం కాదు. గొప్ప జీవితం కావాలనుకుంటే మనకంటూ ఇంకేదో కావాలన్పిస్తుంది’’ బీడు భూమి లాంటి తన మనసులో ఈమధ్య తరచుగా కురుస్తున్న ఆలోచనల చిరుజల్లులకు ఎక్కడో మనసు పొరల్లో నిక్షిప్తమై వున్న సంతానపు కాంక్షాబీజం మెల మెల్లగా అంకురం తొడగడాన్ని వ్యక్తంచేసింది.
‘‘ఏంటది!?’’ ఆశ్చర్యంతో అడిగాడు కిషోర్.
తన హృదయపు పలవరింతను భర్త ముందర పరచిన అనిత ‘‘నాకు పిల్లలు కావాలి. డబ్బు సంపాదనా వ్యామోహంలో పడి పచ్చగా చిగురించాల్సిన మన సంసారపు వృక్షాన్ని మనమే మోడుగా మార్చుకున్నాం. తిరిగి మనమే ఆ మోడును వృక్షంగా మార్చుకుందాం’’ అంటూ తన మనసులోని కోరికను చెప్పుకొచ్చింది.
ఆ క్షణంతో తన కళ్ళకు అనిత అప్పుడే విరిసిన గుమ్మడి పువ్వులా కన్పిస్తుంటే సున్నితంగా కౌగిలిలోకి తీసుకున్న కిషోర్ ‘‘నిజంగా ఓ మంచి పని చెయ్యాలనుకున్నపుడు ఆలస్యం చెయ్యకూడదు. దానే్న మన పెద్దవాళ్ళు ఆలస్యం అమృతం విషం అన్నారు. మనం రేపే వెళ్లి గైనకాలజిస్ట్‌ను కలుద్దాం’’ అంటూ చొరవగా ఆమెను పరుపుమీదకు తోశాడు.
అనుకున్న ప్రకారం అనిత, కిషోర్‌లిద్దరూ ఆ మరునాడు ఉదయమే వెళ్లి డాక్టర్ విశ్వామిత్రాను కలిశారు.
వాళ్ళు చెప్పిందంతా విని అనితను పరీక్ష చేసిన డాక్టర్ విశ్వామిత్ర ‘‘ఇప్పుడు పిల్లలు కావాలనుకున్న మీ నిర్ణయం మంచిదే అయినప్పటికీ ఎక్కవలసిన రైలు ఓ జీవితకాలం లేటు అన్నట్టు అది చాలా లేటయ్యింది’’ అన్నాడు.
‘‘అదేంటి డాక్టర్!’’ ఒకేసారి అన్నారు అనితా కిషోర్‌లు ఆందోళనగా.
‘‘ఔను మరి. ముప్ఫై ఆరేళ్ళ వయసులో ఈవిడ పిల్లలను కనాలనుకోవడం అంత తెలివైన పని కాదు. పైగా రెండుసార్లు అబార్షన్ చేయించుకోవడంతో మరోసారి గర్భం ధరించడానికి గర్భాశయం అనుకూలంగా లేదు. అయామ్ సో సారీ, ఇక ఈవిడకు పిల్లలు పుట్టే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లేదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏ వయసు ముచ్చట ఆ వయసునే్న జరగాలి అంటారు. అందులో ఎంతో నిజం వుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

- ఇంకా ఉంది