భక్తి కథలు

హరివంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక ఎటువంటి కలత మీకు కలగకుండా చూస్తాను అన్నది యశోద. సరే! చూద్దాం కదా! అని వాళ్ళు రుసరుసలాడుతూనే తమ ఇళ్ళకు వెళ్ళారు.
ఇక అపుడు యశోదకు ఏమీ ఎరగని ముచ్చులాగా అమాయకంగా కళ్ళు విప్పార్చుకొని తల్లి వైపు చూస్తున్న కృష్ణుణ్ణి చూసి ప్రేమ, వాత్సల్యం పెల్లుబికాయి. ఏమిరా! నాన్నా! ఏమిటి అందరూ మన ఇంటిమీద పడి యాగీ చేయటం! నన్ను నిన్నూ నానా మాటలనటం, నీకు ఇంట్లో పాలు పెరుగూ మీగడా వెన్నా ఏమి తక్కువైనవిరా! ఇంటినిండా కొల్లలుగా వున్నవి కదరా! నీ చిన్ని బొజ్జకు ఇవి చాలవా? అడగకుండానే కడుపు నిండా అమ్మ దగ్గర పాలు కూడా తాగుతూనే ఉంటివి? ఇంకా ఎక్కడ సందురా నీ బొజ్జలో! అని గారాబంగా తన ఒళ్ళో చేర్చుకొని పాలు ఇచ్చింది తల్లి.
పుక్కిటి నిండా తల్లి పాలు ఉబుకుతుండగా చిరునవ్వు మోమంతా అందించగా పెదవి చివరల కారిపోతుండగా గుటుకు గుటుకున తల్లి దగ్గర పాలు తాగాడు కృష్ణుడు. వెర్రి తల్లి యశోదమ్మ లోకాలన్నీ రక్షించే సకల భువనాశ్రయుడు తన ఇంట శిశువై జన్మించాడని తనకేం తెలుసు పాపం యశోదకు! తన ముద్దుల పట్టీ, తన గారాల శిశువే అనుకుంటున్నది మాతృ హృదయంలో సందడించే మమకారంతో. ‘నిన్ను ఎట్లా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఉండు నీ అల్లరీ, ఆగడమూ కుదురుస్తాను’ అని అక్కూ చెక్కూ ముద్దులాడింది. మూర్థాఘ్రాణం చేసింది కృష్ణుణ్ణి.
‘తెల్లవారితే భయం, నీవు తెచ్చే తగవులు తీర్చలేక! అందరూ ఇంటిమీద పడి నీ మీద నేరాలు మోపే వారే అయితే ఎట్లారా? లంకంత ఇల్లు నేను సంబాళించుకోవాలా వద్దా చెప్పు! ఎక్కడి పనులు అక్కడే ఉండిపోతున్నాయి. నిన్ను నేను పొద్దు గూకులూ కనిపెట్టి ఉండలేను. ఇవాల్టితో నీ అల్లరీ గిల్లరీ కట్టడి చేస్తాను. రారా! ఇటు అని తెచ్చి పెట్టుకున్న కోపంతో కొడుకు చేయి పట్టుకొని తీసుకొనిపోయి తమ ఇంటి ముందు ఉన్న పెద్ద శకటం సమీపంలో ఉన్న రోలు దగ్గర నిలిపింది. ఒక సన్నని పలుపు తాడు తీసుకొని శ్రీకృష్ణుడి బొజ్జ చుట్టూ దాన్ని కట్టింది. చేతిలోకి సన్నటి బెత్తం పట్టుకుంది. ఇక కదులు చూద్దాం! కదిలేవంటే నీకు దెబ్బలు తప్పవు అని తర్జిస్తూ అక్కడి పెద్ద రోలుకు కట్టేసింది కృష్ణుణ్ణి. ఇక నిబ్బరంగా ఇంట్లోకి వెళ్లి తన నిత్య కృత్యాలలో మునిగిపోయింది.
కృష్ణుడు అటూ ఇటూ కాసేపు దిక్కులు చూశాడు. ఆ తరువాత ఒక్క ఉదుటన ఆ రోలును కదిల్చి దానిని లాగుకుంటూ ముందుకు కదిలాడు. అక్కడికి కొంచెం దూరంలోనే ఆవుల బయలుదాకా ఆ రోలును ఈడ్చుకుంటూ వెళ్లాడు. అక్కడ రెండు పెద్ద మద్ది చెట్లున్నాయి. అవి బ్రహ్మాండంగా ఆకాశం దాకా వ్యాపించినట్లున్నాయి. అవి రెండూ ఒకదాని పక్క ఒకటి మధ్యలో కొంచెం మాత్రమే ఎడముండేట్లుగా ఉన్నాయి. కృష్ణుడు తనకు కట్టిన తాడుతో ఆ మద్ది చెట్ల మధ్య దూరాడు. తాను వాటి సందులోంచి అవతల వైపుకు వెళ్లగలిగాడు గాని రోలు ముందుకు పోలేక ఆగిపోయింది. అపుడు బాలకృష్ణుడు ఆ రోలును ఆ చెట్లమధ్య నుంచి బలంగా లాగాడు. ఒక్కసారిగా పెద్ద భూకంపం సంభవించిందా, ఆకాశం ఫెళఫెళార్భటులతో ఉరిమిందా అన్నట్లు ఆ జంట మద్ది చెట్లు వేళ్ళతో సహా పెకలించుకొని కూలిపోయాయి. ఊళ్ళో వాళ్ళంతా ఏమిటీ ఉత్పాతమని భయగ్రస్తులై ఆ చెట్లు కూలిన చోటికి పరుగు పరుగున వచ్చి గుమికూడారు. గోప వనితలు కూడా కొందరు అక్కడకు చేరారు. వాళ్ళ గుండెలు గుభేలుమన్నాయి. అమ్మో! అమ్మో! యశోదమ్మో! అంటూ పెద్ద పెట్టున రోదిస్తూ గోప వనితలు యశోద దగ్గరకు పరుగులు తీశారు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు