భక్తి కథలు

హరివంశం -34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంత కటిక గుండెదానివైనావే తల్లీ! నీ చేతులెట్లా వచ్చాయే! బంగారం లాంటి కొడుకును పెయ్యతాడుతో కట్టి రోలుకు బంధిస్తారా ఎవరైనా?
నీవంటి తల్లి వేయి యుగాలు వెదికినా ఎక్కడా కనపడదు కదే! ఎంత ప్రమాదం చేతులారా కొని తెచ్చుకున్నావే గోపెమ్మా! కృష్ణుడు కనపడటంలేదు. ఆ కూలిపోయిన పెను వృక్షాలమధ్య బిక్కు బిక్కుమంటూ ఉన్నాడో ఏమో! అని గుక్క తిప్పుకోకుండా హాహాకారాలతో యశోదకు చెప్పారు. ‘నీ తెలివి తెల్లారినట్లే వుంది. నీ వివేకం ఏట గలసిపోయింది. కోపం వస్తే మటుకు ఇంత అఘాయిత్యం చేస్తావా?’ అని గోడు గోడున వాపోతూ యశోదను తప్పు పట్టారు.
‘నీకింత అహంకారమా? ఇంత మిడిమేలమా?’ అని బావురుమన్నారు. యశోదకు పైప్రాణాలు పైనే పోయినాయి. ‘అయ్యో! నా తండ్రీ! అని పెద్దగా మొర (కూయి) పెట్టింది. ఆమె కాళ్లాడటంలేదు. తూలిపోతూ కొప్పు వీడిపోయి, ఒంటిమీద బట్టలు చిందర వందరైనా చూసుకోకుండా పరుగు పెట్టి మద్దుల దగ్గరకు చేరింది యశోద. ఆమె వెనుకనే ఆర్తనాదాలు చేస్తూ గోప స్ర్తిలు ఆమె వెన్నంటారు. ఊరి మొగదల మద్దులు కూలిపోవటం, ఆకాశం బద్దలయ్యేట్లు పెద్ద చప్పుడు వినపడటం విని నంద గోపుడూ ఇంకా ఊరి పెద్దలు అక్కడ రయవేగంగా చేరారు. అపుడు రెండు పెద్ద నల్ల మేఘాల మధ్య ప్రకాశిస్తున్న చందమామలాగా చకిత ముగ్ధనేత్రాలతో అటూ ఇటూ పరికిస్తూ అందమైన చిరునవ్వు చిందిస్తూ, ముంగురులు ముడిచి అలంకరించిన తళ తళలాడే నెమిలి ఈకతో ఒప్పుల కుప్పలా అమృత హసిత దరస్మిత వదనుడైన కృష్ణుణ్ణి చూశారు కూలిపోయిన ఆ చెట్లమధ్య వాళ్ళు. ఒక్క ఉదుటున నందుడు కృష్ణుడు దగ్గరకు చేరాడు. కడుపుకు కట్టిన పలుపుతాడు తొలగించాడు. ఎత్తుకొని గుండెలకదుముకున్నాడు కృష్ణుణ్ణి. భయ సంభ్రమాశ్చర్యాలతో వేదనతో ‘ఇదంతా ఏమిటి? వీడికి ఈ పలుపుతాడు ఎందుకు, ఎవరు కట్టారు? ఈ రోలేమిటి? వీడు దీనిని ఎంత దూరం ఎట్లా ఈడ్చుకొనివచ్చాడు? ఈ చెట్లు ఇట్లా ఎందుకు పెల్లగించుకొని కూలిపోయినాయి? అని యశోద నడిగాడు నందుడు.
ఆమె దుఃఖాతిరేకంతో అసలు జరిగిన సంగతి ఏమిటో చెప్పింది. పట్టలేని ఆశ్చర్యమూ, అంతకన్నా పట్టరాని సంతోషమూ కలిగింది నందుడికి. అప్పుడాయన చుట్టూ వున్న వృద్ధ గోపకులు ‘ఇటువంటి అద్భుతం కని వినీ ఎరిగింది కాదు. ప్రళయ ప్రభంజనమో, పిడుగుపాటో, ఏనుగులు చెలరేగి కూల్చటమో, మహా నదీ ప్రవాహాలు ఒడ్డు ముంచి కోత పెట్టి కూల్చివేయటమో తప్ప మహావృక్షాలు కూలిపోవటం జరగదు కదా! ఇపుడీ పాల చెక్కిళ్ళవాడు ఈ మహా వృక్షాలు కూల్చాడంటే ఇంకా ఎటువంటి ఉత్పాతాలు సంభవించబోతున్నాయో అని కళవళపడ్డారు.
ఇంతకుపూర్వం పూతన వచ్చి చచ్చింది. శకటాసురుడు వికటంగా మట్టిలో కలిశాడు. ఇప్పుడీ పరమాద్భుతం సంభవించింది. ఇక ఇక్కడ ఎంత మాత్రం మనం ఉండకూడదు. ఇంకా ఎటువంటి ప్రమాదాలు, అశుభాలు చూడాల్సి వస్తుందో అని ఆందోళన చెందారు. కాని ఉన్న ఊరు వదిలిపెట్టటానికి వాళ్ళకు మనస్కరించలేదు. వదలి వెళ్ళలేకపోయినారు. ఇట్లా వ్రేపల్లెలోనే ఆటపాటల వేడుకలతో, ఊరి వారి ముద్దు మురిపాలతో పెరుగుతూ బలరాముడు, కృష్ణుడు ఏడేళ్ళ వయసువారైనారు. ఇక ఊరి చెలికాండ్రతో కూడి ఆలమందలను బయలు ప్రదేశాలలో మేపి ఇళ్ళకు తోలుకొని రావటం అనే వినోదాలతో పొద్దులు పుచ్చసాగారు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు