భక్తి కథలు

హరివంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వెలగ చెట్టు మొదలు ముప్ఫై బారల చుట్టుకొలతలో వుంది. దాని కొమ్మలు పైన విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. ఆ వెలగ మ్రానుకు అల్లంత సమీపంలో శ్రీకృష్ణ, బలరాములు గోప బృందంతో, వారి వెనుక విప్ర సమూహంతో చేరేప్పటికి మాయా రూపంలో ఉన్న ఆ రాక్షసుడి అనుచరగణమూ, ఆ నిశాచరుడి భార్యలూ, సంతానమూ కోలాహలంగా వాళ్ళ చుట్టుముట్టి తమ ఉద్ధతి చూపారు. ఆగ్రహంతో ఎదుర్కొన్నారు. ఈ విషపు వెలగమాను అసంఖ్యాకంగా తన కాయలు, పండ్లు ఈ రాక్షస గణానికంతా ఆహార సమృద్ధి కల్పించటంతో వాళ్ళు చాలా మదోద్ధతి చూపుతూ శత్రువుపై దాడికి పూనుకున్నారు. ఆ చెట్టు నిండా ఆకు ఆకు సందునా పిందెలు, పసరుకాయలు, దోరగాయలు, బాగా పండిన పండ్లూ గెలలు గెలలుగా చెట్టు నిండా వేలాడుతున్నాయి.
అవి తప్ప కొమ్మలు కాని, ఆకులు కాని అసలు ఉన్నాయా లేవా అనేట్లు ఆ చెట్టు నిండా పూర్తిగా అవే కనపడుతున్నాయి. బాగా పండిన వెలగపండ్లు చిన్న చిన్న కుండలులాగా వేలాడుతున్నాయి. వీటివల్ల వెలువడే దుర్గంధమే గొల్లపల్లెల ప్రబల వ్యాధులు సృష్టిస్తున్నదని శ్రీకృష్ణుడు గ్రహించాడు. అందువల్ల వీటిలో ఒక్కటి కూడా చెట్టుమీద ఒక్కటి కూడా లేకుండా రాలకొట్టి తరువాత చెట్టును పూర్తిగా నిర్మూలించాలని ఆయన నిశ్చయించుకున్నాడు. బలరాముడి తోడ్పాటుతో ముందుగా అందినమేర వాటిని చెట్టునుంచి రాల్చివేశాడు. ఆ తరువాత పరమోత్సాహంతో విజృంభించి గోపాలురందించే రాళ్ళతో, నేలరాలిన పెద్ద వెలగకాయలు మళ్లీ గురి చూసి చెట్టుమీద వున్న వాటిని రాలగొడుతూ బలరామకృష్ణులు ఆ చెట్టుపైన ఉన్న ఒక్క పిందే, ఒక్క కాయా, ఒక్క పండూ లేకుండా డుల్చివేశారు. ఆ తరువాత కొమ్మలన్నీ విరిచివేశారు. అపుడా చెట్టు కేవలం కాండం మాత్రం మిగిలి విరూపమై మొండిచెట్టులాగా మిగిలిపోయింది.
గోపాలుర అరుపులు కేకలు, కొమ్మలు విరిగి పడుతున్న ఫెళఫెళలు, నేల రాలుతున్న దాని కాయల చప్పుళ్ళు సమ్మిశ్రణమై అక్కడొక పెద్ద ధ్వనిని సృష్టించాయి. ఇక గోపత్య రూపధారులైన ఆ రాక్షస సంతానం పొగరు కోడెలై పెల్లు రేగి తోకలెత్తుకొని కాళ్ళు దువ్వుతూ కొమ్ములు వంచి వాళ్ళను పొడవటానికి మీది మీదికి వచ్చాయి. దీనితో గోప బృందం చెల్లాచెదరుగా పరుగులు తీసింది. కృష్ణుడు, బలరాముడు మాత్రమే వాటిని ఎదుర్కొని ఒక్కొక్కదానిని కొమ్ములు, కాళ్ళు, తోకలు తమ చేతులకు చిక్కించుకొని వాటిని చంపివేశారు. అప్పుడా రాక్షసులు నిజరూపాలతో నిహతులై అక్కడ శవాల గుట్టలను తలపింపజేశారు. ఇది భరించలేక ఆ రాక్షస మూక తల్లులు గోరూపధారిణులు బలరామకృష్ణులను పొడవటానికి దూసుకొని వచ్చారు.
కాని వాళ్ళు గోవుల రూపంలో ఉండటంవల్ల వాటిని పీడించి, మర్దించి తోకల మెలి తిప్పి కింద పడవేసి ఈడ్చి, కొమ్ములు ఊడబెరికి ప్రాణావశిష్టలను చేశారు. అపుడా రాక్షసుడి భార్యల రూపంలో ఉన్న ఆ గోరూపధారిణులు దుర్గమారణ్యంలోకి పరుగులు తీశాయి. గోరూపంలో ఉన్నందువల్ల వాటిని చంపటానికి ఇష్టపడలేదు వాళ్లు. కోడెల రూపంలో తమను పొడవటానికి వచ్చిన ఆ గోవుల సంతానాన్ని మాత్రం మట్టుపెట్టారు. అపుడు ఆ చుట్టుపక్కల ఉన్న తుప్పలను నరికి, చెట్లను కొట్టి వేసి, అసంఖ్యాకంగా పడి ఉన్న ఆ వెలగమాను కొమ్మలను కూడా వాటితో చేర్చి అక్కడ పడి ఉన్న ఆ రాక్షసుల శవాలను దహనం చేశారు బలరామకృష్ణులు.
ఇట్లా రాక్షసులను దహనం చేసి, వెలగ మానును నేలమట్టం చేసి గోరూప పరివారంతో పోరాడి వాళ్ళంతా అలసిపోయినారు.

ఇంకాఉంది