వినమరుగైన

శివభారత దర్శనము (సర్దేశాయ తిరుమల రావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివభారతానికి, మహాభారతానికిగల పోలికలను చర్చించి బహునాయక మగుటచేత మహాభారతము పురాకల్పమనే ఇతిహాసమని, ఏకనాయకమగుటచేత శివభారతము పరిక్రియ అనే ఇతిహాసమని ప్రకటించారు.
మూడవ అధ్యాయము పేరు కవిత - చరిత. ఇందులో ప్రాచీనాంధ్రకవులు తమ కావ్యాలకు ఇతివృత్తాలను ఎన్నుకొనుటలో ప్రదర్శించిన దృక్పథాలను చర్చించి శివభారత రచనకు ప్రేరణలను పరిశీలించటం జరిగింది. పూర్వగాథలను, కల్పితగాథలను, ఖండగీతులను నిరసించినకవి తన మిత్రునితో-
అన్నిటిలోన మేలిమి రహించెడు దేశచరిత్ర నేడు; సం
పన్నుఁడుదాత్తుడున్ జగదుపస్కృతి కాశ్రయమైన నాయకుం
డున్నతుఁడబ్బెనేని కృతియున్ జనరంజకమైతనర్చు; నా
యెన్నిక నట్టి గాథ లభియింపమి నింతట నూరకుండితిన్
అని చెప్పగానే ఆ మిత్రుడు ‘దాత్తవర్తనుడగు శ్రీ శివాజి చరిత్రమ్మును’ గైకొనుమని చెప్పగా అంగీకరించి శివభారతమును రచించారు. ఈ విషయాన్ని ప్రస్తావించి తిరుమలరావుగారు ఇలా వ్రాశారు. ‘‘గ్రంథమును నాయకప్రధానముగా భావించిన ప్రబంధమగును. లేదా దృశ్యకావ్యమగును. భారత జాతీయతా ప్రధానముగా పరిగణించిన భారతము అగును. చరిత్రాంశ ప్రధానమని ఎంచిన చరిత్ర అగును. ఏదిఅనుకొనినను శివభారతము కవిత్వము మాత్రమే అగును’’.
ఇంతటితో ఆగక కవిత చరితల పరస్పర సంబంధాన్ని విపులంగా చర్చించారు. దేశీయ, పాశ్చాత్య లాక్షణికుల అభిప్రాయాలను వివరించి చరిత్రకు, చారిత్రక కావ్యానికి గల భేదాన్ని స్పష్టంగా నిర్వచించారు.
చారిత్రకంగా సత్యమైన పాత్రలను అప్రముఖం చేసి కల్పిత పాత్రలను ప్రముఖంగా చిత్రించటం ద్వారాగాని, చారిత్రక పాత్రలను ప్రధానంగా చేసి తక్కిన పాత్రలను కల్పించటం ద్వారాగాని, అజ్ఞాత చారిత్రక గాథల్ని సేకరించి కవి నిజ మనోరథాన్ని అనుసరించి కథా కాల సన్నివేశాలను చిత్రించడం ద్వారాగాని, చరిత్ర ఉదంతాలను ఇతివృత్తంగా గ్రహించి దేశ కాల పాత్రానుగుణంగా రచించటం ద్వారాగాని, చారిత్రక ఇతివృత్తాన్ని కావ్యంగా తీర్చిదిద్దవచ్చునని చెపుతూ అందుకు దృష్టాంతాలుగా అనేక సంస్కృతాంధ్ర ఆంగ్ల రచనలను ఉదాహరించారు. గ్రంథము చారిత్రకంగా, ప్రామాణికంగా ఉండటానికి శివభారత కవి చరిత్ర భాగాన్ని ఎలా తీర్చిదిద్దారో ఉదాహరణలు చూపించారు. చరిత్ర - భూత భవిష్యత్కాలాలనే గట్ల మధ్య ప్రవహించే నది అయితే కవిత్వం ఆ గట్లను కలుపుతూ కట్టే వంతె అని, దీనికి శివభారతమే దృష్టాంతము అని తీర్పునిచ్చారు.
నుడికారపు సొంపు అన్న నాల్గవ అధ్యాయములో ‘శివభారత కవిత్వము జాతీయములకు నుడికారములకు నెలవు. హృదయమునకు హత్తుకొనిపోవు వాక్య విన్యాసము, సమాసముల సౌందర్యము, తిక్కన కవిత్వ విశిష్ట గుణములయిన సమకాలిక సహజ వ్యావహారిక భాషా మర్యాద, ప్రజాసామాన్య సంభాషణాంతర్గత కాకువు, ఉక్తి గాంభీర్యము, తెలుగు క్రియా ప్రయోగ చాతురి ఇందలి ప్రత్యేక గుణములు. శివభారతములోని అనేక వాక్యములు చదువుచున్నపుడు లోకోక్తులే పద్యములందు కవివాక్యములుగా అమరినవో, కవివాక్యములే సామెతలవలె ధ్వనించుచున్నదో గుర్తుపట్టుట కష్టమగును. ఈ శక్తియందు శివభారత కవి ఇంగ్లీషుకవి అలెగ్జాండర్ పోప్‌ను పోలును’’ అని వ్రాశారు. అంతటితో ఆగక మహత్కార్య సాధన వర్ణించునపుడు ఈ కవి వ్యవసాయ సాదృశ్యమునే తీసికొనుట పరిపాటి అని కావ్యము నుండి అటువంటి 39 సాదృశ్యములను ఉద్ధరించి ప్రకటించారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి.. - సశేషం

సూర్యదేవర రవికుమార్