వినమరుగైన

దీపావళి -వేదుల సత్యనారాయణ శాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవులపల్లి వారి తరువాత ఆ స్థానం వేదులవారినే వరించింది. ఆయనకంటె ఈయన మూడేళ్లు చిన్న. కృష్ణశాస్ర్తీ ప్రభావం వేదులమీద ప్రసరించినా- ఎవరి కలం వారిదే- ఎవరి గళం వారిదే. పద్యం చదివినా- పాటపాడినా-వేదుల స్వరముద్రకు నీరాజనం పట్టవలసిందే. కవితాగానం చేయటంలో కృష్ణశాస్ర్తీలా వేదుల కూడా మనోజ్ఞమైన శైలిని సొంతం చేసికొన్నారు. ఉపన్యసించినా అంతే! అది చమత్కారభరితమై ఉర్రూతలూగించేది. ఈ నేర్పు ఆయన స్వీకరించిన ఉపాధ్యాయ వృత్తిలో కూడా వ్యక్తమయ్యేది. ఆయన పాఠం చెబుతున్నారంటే విద్యార్థులు రెక్కలు కట్టుకొని వాలేవారట. తోటి ఉపాధ్యాయులు సైతం కిటికీల దగ్గర నిలబడి చెవులు రిక్కించి మరీ వినేవారట. అంతటి ప్రతిభాశాలి వేదుల. కవితామార్గంలో కృష్ణశాస్ర్తీని ఆంధ్రా షెల్లీ అని, వేదులను ఆంధ్రా కీట్స్ అనీ ఆనాటి సాహిత్యోపాసకులు అభివర్ణించేవారు.
***
సుద్దను నల్లబల్లపైనే వ్రాయాలి. మల్లెలు నల్లటి కురులలోనే తురమాలి. దీపాన్ని చీకటిలోనే వెలిగించాలి. అప్పుడే వాటిలో ఎక్కడలేని వైభవం ఊరేగుతుంది. అందుకే వేదుల కూడా దాస్యాంధకారంలో, నిరాశా నిస్పృహల నేపథ్యంలో, విశ్వాసాన్ని తైలంగా పోసి కందుకూరి రామభద్రరావు గారి ప్రోత్సాహంతో ప్రథమ ప్రయత్నంగా సాహిత్య దీపావళిని వెలిగించారు. 1937లో గౌతమీ కోకిల అంటూ తనను ఆత్మీయంగా పిలిచే నూతక్కి రామశేషయ్యగారికి అంకితం చేశారు. గౌతమీ కోకిల పద సృష్టికర్త నూతక్కివారే. అది ఆ తరువాత బిరుదుగా ప్రాచుర్యమయింది.
దీపావళి ఖండకావ్యమే అయినా- కండగల కావ్యంగా ప్రసిద్ధి పొందింది. 48 ప్రమిదలతో తెలుగు నేల నాలుగు చెరగులా కాంతి బావుటా లెగురవేసింది. ఏ ప్రమిదలో ఏ వెలుగు ఎలా ప్రసరించిందో మనం కూడా అవలోకిద్దాం...
వ్యాపారతంత్య్రం- భారతభూమిపై శాపంగా పరిణమించిన కాలమది. దొరతనంలో దోపిడీతనం విశృంఖలంగా వీర విహారం చేస్తున్న సమయమది. ఉక్కుపాదాల క్రింద ఊపిరులకు ఉరులు బిగుసుకొంటున్న రోజులవి. అయినా దేశం దేశమంతా ధీరోదాత్తమై నిలబడింది. నిస్వార్థనేతలు నిగ్రహం కోల్పోవకుండా- నిప్పుకలై చెలరేగటానికి సంసిద్ధులయ్యారు. మరి కొందరు రథసారథులు సత్యాగ్రహ సమరంతో ముందుకు దూసుకుపోయారు. ఈ రెండింటికీ భిన్నంగా కవి కుమారులు కలాలతో కదనుత్రొక్కటానికి కంకణాలు కట్టుకున్నారు. ఆ పట్టికలో మన వేదుల కూడా ప్రముఖంగా కనిపిస్తారు. చూడండి!...
ముందుగా- ఆయన వెలిగించిన స్వరాజ్యదీపాల దగ్గర నిలబడదాం..
వీర సందేశం ప్రసాదించే కాగడా కూడా దీపావళిలో భాగమే. దీపంలో లేని జ్వలన తీవ్రత, కాంతి కాగడాలో కనిపిస్తుంది. ఆ దీప్త చైతన్యం జాతిలో రావాలి. అదే అభిప్రాయంతో ఆయన కాగడా ఎన్నుకొన్నారు.
‘‘ప్రళయరుద్రుని ఫాల భాగమ్ము నందు
అతని నిశాత శూలాగ్రమ్మునందు
అతని నేత్ర గోళాంతమ్ములందు
జ్వలియించు శిఖి శిఖా జాలమ్ముతోడ
వేడిగా వాడిగా వెఱపు గొల్పేదిగా
వెలిగించు కాగడా వెలిగించవోయి..’’
అంటూ బానిసత్వంలో బందీ అయిన భారతీయుణ్ణి, పరాయి పాలనపై ఎదురుతిరగమని కవిగా ఆదేశించారు వేదుల.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-రసరాజు