విశాఖపట్నం

జీవితంలో వసంతం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేషగిరి, నేను మంచి స్నేహితులం. రిటైర్ అయిన తర్వాత నేను విజయనగరంలో స్థిరపడితే వాడు విజయవాడలో సెటిలయ్యాడు. వాడి కూతురి పెళ్లికి వెళ్లిన నేను తిరుగు ప్రయాణమయ్యాను.
రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కాస్త అలసటగా ఉంది. నేను మా వూరికి చేరుకునే సరికి సాయంత్రం అయిపోయింది. శీతాకాలం కావడం వల్ల అయిదు గంటలకే చీకట్లు ముసురుకోవడం ప్రారంభం అయింది.
ఇంటికి వెళ్లి స్నానం చేసి పడుకుంటే బాగా నిద్ర పట్టేసింది.
‘‘్భజనానికి లేవండి ఎప్పుడు తిన్నారో ఏమిటో? భోజనం చేసి పడుకోండి’’ నా భార్య సుమతి నన్ను కుదిపి లేపుతోంది.
లేచి చన్నీళ్లతో ముఖం కడుక్కుని వచ్చి వేడివేడిగా భోజనం చేశాను.
‘‘ ఏమిటి పెళ్లి విషయాలు?’’ అడిగింది సుమతి.
‘‘పెళ్లి బాగానే జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ పెళ్లికే ప్రశాంతి భర్త, పిల్లలతో వచ్చింది. పెళ్లికొడుకు వాళ్లాయనకి పిన్ని కొడుకట’’ అన్నాను.
‘‘ప్రశాంతా? ఆఁ గుర్తుకొచ్చిందండి. మీ దగ్గర చదువుకున్న అమ్మాయి కదూ. పాపం పెళ్లయి కొడుకు పుట్టగానే భర్త చనిపోయాడు. ఆ అమ్మాయి మొదటి పెళ్లికి నేను వచ్చాను’’ అంది సుమతి.
చాలా సేపు నిద్రపోవడం వల్ల నాకు మరిక నిద్ర రావడంలేదు. బాల్కనీలోకి వెళ్లి ఆకాశంలోకి చూశాను. పున్నమి చంద్రుడు, తారకలు మెరుస్తూ కనిపించాయి.
నాకు పెళ్లిలో జరిగిన సంఘటనలు ఒకటొకటిగా గుర్తుకు వచ్చాయి.
‘‘అంకుల్’’ అంటూ వినిపించగానే అటు తిరిగి చూశాను.
‘‘అమ్మా ప్రశాంతి నీవు పెళ్లికి...’’ నా మాట పూర్తవకుండానే ‘‘పెళ్లికొడుకు మా వారికి పిన్ని కొడుకు మాస్టారు’’ అంది ప్రశాంతి. ‘‘అలాగా’’ అన్నాను నేను.
ప్రశాంతి తండ్రి సూర్యనారాయణ శేషగిరిలాగే నాకు మంచి స్నేహితుడు. సూర్యనారాయణ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో సెటిలయితే నేను ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాను. ప్రశాంతి నా స్టూడెంట్. అందుకే ఓసారి నన్ను అంకుల్ అని పిలుస్తుంది. స్కూల్లో మాత్రం మాస్టారు అంటుంది.
‘‘వారు మా మాస్టారు. మా నాన్నగారికి మంచి స్నేహితులు కూడా’’ భర్తకి నన్ను పరిచయం చేసింది. పెళ్లిలో ఒకే ఒక్కసారి చూడ్డం వల్ల అతన్ని వెంటనే గుర్తు పట్టలేకపోయాను.
‘‘నమస్కారం మాస్టారూ! మీ గురించే తరచూ ప్రశాంతి చెబుతుంటుంది’’ అన్నాడు ప్రశాంతి భర్త. పిల్లల్ని నాకు చూపించింది ప్రశాంతి.
నాకు ప్రశాంతి తొలి కొడుకు లీలగా గుర్తుకు వచ్చాడు.
అలాగే సూర్యం మాటలు కూడా గుర్తుకొచ్చాయి.
‘‘మూర్తీ మా అల్లుడు మధుకి ఓ కూతురు. ఈ మధ్యనే భార్య పోయింది. ప్రశాంతిని పెళ్లి చేసుకుంటానన్నాడు’’ అని సూర్యం నాతో అన్నాడు. అంతే కాదు అతను మంచివాడని అందుకే తాము ఈ సంబంధానికి ఒప్పుకుంటున్నట్లు కూడా చెప్పాడు సూర్యం.
‘‘మాస్టారు ఈమె నా కూతురు సింధు’’ అంటూ పరిచయం చేశాడు మధు.
వెంటనే ‘‘మాస్టారు వీడు నా కొడుకు సిద్ధు మీకు తెలుసనుకుంటాను’’ అంది ప్రశాంతి.
‘‘వీళ్లిద్దరూ మా పిల్లలు మాస్టారు’’ అన్నారు ప్రశాంతి, మధు.
వాళ్లు అలా చెబుతుంటే నాకు ముచ్చటేసింది.
తల్లి ప్రేమను సింధుకి ప్రశాంతి అందిస్తే, తండ్రి ప్రేమని మధు సిద్ధూకి అందిస్తాను’’ అనుకున్నాను.
‘‘మీరింకా పడుకోలేదా? అసలే రాత్రంతా మీకు నిద్ర లేదు’’ అంది సుమతి.
‘‘నిద్ర రావడంలేదు. ఇప్పటి వరకు పడుకునే ఉన్నాను కదా’’ అన్నాను సుమతితో.
ప్రశాంతి చాలా మంచి పిల్ల. చక్కగా చదివి మార్కులు తెచ్చుకునేది. అబ్బాయిలు అల్లరి చేస్తే వారికి సమాధానం కూడా చెప్పేది కాదు. తల వంచుకుని వెళ్లిపోయేది.
‘‘మూర్తీ ప్రశాంతి నా కూతురని చూడకు. బాగా చదవకపోతే దండించు. నువ్వు ఇక్కడ ఉన్నావనే ఈ స్కూల్లో తనని చదివిస్తున్నాను’’ అనేవాడు సూర్యం.
‘‘నీ కూతురికేంరా కడిగిన ముత్యం’’ అనేవాడు తను.
కాలేజీలో చదువుతున్న ప్రశాంతి ప్రవర్తనలో అప్పుడూ ఎలాంటి మార్పు రాలేదు. డిగ్రీలోకి వచ్చిన తర్వాత ఒకసారి నా దగ్గరకి వచ్చింది.
‘‘మాస్టారు నేను డిగ్రీకి వచ్చాను. ఇదంతా మీ చలవే’’ అంది.
‘‘నా గొప్పతనం ఏముందమ్మా? ఇదంతా నీ పట్టుదల, కృషి ఫలితం’’ అన్నాను నేను.
‘‘మూర్తీ ప్రశాంతి పెళ్లిరా. నేనే స్వయంగా వచ్చి శుభలేఖ ఇచ్చి పెళ్లికి పిలుద్దామనుకున్నాను. కానీ నా కూతురు తనే మీ దంపతుల్ని స్వయంగా వచ్చి తన పెళ్లికి పిలుస్తానంది. ఇప్పుడే బయలుదేరింది’’ ఫోన్లో సూర్యం చెప్పిన మాటలివి.
‘‘పోనీ అలాగే కానీరా. తన సంతృప్తి తనది. పెళ్లికి తప్పకుండా మేమిద్దరం వస్తాం’’ అన్నాను నేను.
‘‘మాస్టారు నా పెళ్లికి ఆంటీ, మీరూ తప్పకుండా రావాలి’’ కాస్సేపటికి వచ్చిన ప్రశాంతి కార్డు ఇస్తూ చెప్పింది.
‘‘తప్పకుండా వస్తాం’’ అన్నాను నేను.
పెళ్లిలో వధూవరులను చూసి ఈడూజోడూ అనుకున్నాను. మా దంపతుల కాళ్లకి పెళ్లికొడుకు, పెళ్లికూతరు నమస్కరిస్తుంటే ‘‘మీ ఇద్దరి జీవితాలు కలకాలం సుఖంగా ఉండాలి’’ అని ఆశీర్వదించాము మేము.
అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. అనుకోని సంఘటనలు జరిగి జీవితాలను అల్లకల్లోలం చేస్తాయి. ప్రశాంతికి కొడుకు పుట్టిన తర్వాత ఆమె భర్త మరణించాడు.
‘‘మూర్తీ మా అల్లుడికి విపరీతమైన కడుపునొప్పి వచ్చిందిరా చనిపోయాడు’’ దు:ఖం ఆపుకోలేక బోరున ఏడుస్తూ చెప్పాడు సూర్యం. ఆది వినగానే ఒక్కసారిగా మెదడు మొద్దుబారిపోయింది నాకు. గుండెల్లో బాధను దాచుకుంటూ ‘‘సూర్యం ఈ సమయంలో నీవు భావోద్వేగానికి లోనవడం కాదు. ప్రశాంతికి ధైర్యం చెప్పు’’ అన్నాను.
అయితే అతన్ని ఆపడం తరం కావడంలేదు.
‘‘అసలే చిన్నపిల్ల. మనకి కొన్ని ఆచారాలు ఏడ్చి చచ్చాయి కదా. పదవ రోజు విధవరాలిని చేసే తంతు జరిపించకుండా చూడు. ప్రశాంతికి శాంతి లేకుండా చేయకు’’ అన్నాను.
‘‘మనం అనుకున్నట్లుగా కొన్ని జరగవు మూర్తీ. అందరూ నడిచిన దారిలోనే నడవాలి కదా. లేకపోతే ఏమిటీ కొత్త పోకడలు అని మనలోని కొందరు విమర్శిస్తారు. అయినా ప్రశాంతికి బాధ కలిగించేవేవీ చేయనీయను’’ అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ.
చాలా రోజుల వరకు సూర్యాన్ని కలవడం సాధ్యపడలేదు నాకు. ఒకసారి బజారులో కనిపించాడు.
‘‘ ఎలా ఉంది ప్రశాంతి?’’ అడిగాను. ఇప్పుడు ఫరవాలేదు. పిల్లవాడితో ఆడుకుంటోంది. మొదట్లో అయితే చాలా భయమేసేది. నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ ఉండేది. అలా అయితే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుందేమో అని భయం వేసేది. అయితే కాలమే అన్ని సమస్యలకీ పరిష్కారం చూపిస్తుందంటారు. రోజులు గడిచిన కొద్దీ ప్రశాంతిలో మార్పు వచ్చింది. ఇది సంతోషించదగ్గ విషయమే’’ అన్నాడు సూర్యం.
‘‘అవును’’ అన్నాను నేను.
‘‘మూర్తీ ప్రశాంతికి తిరిగి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. మంచి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి చాలా మంచివాడు. మంచి ఉద్యోగం ఉంది. అయితే...’’
‘‘అయితే అతనికి ఇదివరకే పెళ్లయింది. భార్య చనిపోయింది. ఒక కూతురు కూడా ఉంది’’
‘‘ప్రశాంతి ఒప్పుకుందా?’’
‘‘ఒప్పుకుంది. ప్రశాంతి ఏమందో తెలుసా? ‘నాన్నగారూ నా కొడుక్కి తండ్రి ప్రేమ కావాలి. తండ్రి ప్రేమకి, వాత్సల్యానికి దూరమయ్యాడు. నా కొడుక్కి ప్రేమ లభిస్తుంది. పాపం ఆ చిన్నపిల్లకి తల్లిప్రేమ లభిస్తుంది. ఆ ప్రేమ నేను అందిస్తాను’ అందిరా’’ అంటూ చెప్పాడు సూర్యం.
‘‘ప్రశాంతి ఉత్తమురాలురా’’ అన్నాను నేను సూర్యంతో.
‘‘అది సరేకానీ పెళ్లికి నీవు తప్పకుండా రావాలి’’ అన్నాడు సూర్యం.
‘‘సారీ నేను రాలేనురా’’
‘‘అదేమిటిరా?’’
‘‘మొదటి పెళ్లికి వచ్చి నిండు మనసుతో ప్రశాంతిని ఆశీర్వదించాను. ఎలా జరిగిందో చూశావు కదా’’
‘‘మూర్తీ నీవే కదా నాతో అన్నావు విధి రాతను ఎవరూ తప్పించలేరని. జాతకాలు చూసి, మంచి ముహూర్తానికి పెళ్లి జరిపిస్తాం. అయితే అన్ని పెళ్లిళ్లు సక్రమంగా ఉన్నాయా? లేవే... అందుకే నీవు చెప్పినట్లు అంతా విధి ఆడించిన వింత నాటకం. అదంతా ఎందుకు కానీ నీవు తప్పకుండా పెళ్లికి రావాలి. లేకపోతే ప్రశాంతి బాధపడుతుంది’’ అన్నాడు సూర్యం.
అతనికి ఏమని సమాధానం చెప్పాలో నాకు అర్ధం కాలేదు.
సూర్యానికి ఇచ్చిన మాట ప్రకారం నేను ప్రశాంతి పెళ్లికి వెళ్లాను. ఈసారైనా ప్రశాంతి జీవితం శాంతిమయం చేయాలి దేవుడా. ఆమె జీవితంలో తిరిగి వసంతం తీసుకురావాలి దేవుడా’’ అనుకున్నాను మనసులో.
‘‘ ఇంకా పడుకోరా? ఇలా అయితే మీ ఆరోగ్యం పాడవుతుంది’’ సుమతి అంది.
ఆలోచనా స్రవంతి నుండి బయటపడ్డాను.
‘ఇన్నాళ్లకి ప్రశాంతి కనిపించింది చాలా సంతోషంగా. ఇకపై ఆమె జీవితంపై నీలినీడలు పడకూడదు. ఆమె జీవితం వసంతమయం కావాలి’ అనుకుంటూ లేచాను.

- గూడూరు గోపాలకృష్ణమూర్తి,
పాల్‌నగర్, 4వ లైను,
విజయనగరం-3.
సెల్ : 7382445284.

వ్రతమ్
‘హమ్మయ్య! చిటికెలేసినా వినబడటంలేదు’ అనుకుని తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు అమితానందం. చెవుల్లో దూది కుక్కుకోవడమే కాకుండా రెండు చెవులనూ కలుపుతూ బుర్ర చుట్టూ గుడ్డకట్టు కట్టుకొని ఓసారి పరీక్షించుకోవటానికి అన్నట్లు చిటికెలేసుకు చూసుకున్నాడు.
‘ఈరోజు ఆదివారం. చెప్పుకోదగ్గ పనులేం లేవు. ఇంటిపట్టునే ఉండొచ్చు. మహా అయితే సాయంత్రం చల్లగాలికి పార్కు కెళ్లిరావచ్చు. పైగా ఈ రోజు ఆవిడ నస వినే బాధ తప్పుతుంది. ఎవరిసోది వినక్కర్లేదు. భేషుగ్గా టీవీ ప్రోగ్రాంలు మ్యూట్‌లో పెట్టేసుకు మరీ చూడొచ్చు. అబ్బ ఎన్ని లాభాలో ఈ వ్రతమ్ వల్ల’ అనుకుంటూ మురిసిపోయాడు.
ఈయన గారి వాలకం చూసిందేమో గయ్‌మంది ప్రశాంతమ్మ. ‘‘ఏం రోగమొచ్చిందటా? ఆ కట్టూమీరూనూ...?’’ అంటూ ఉరిమింది. శబ్దాలు వినే అవకాశం లేదు కాబట్టి ఆమె హావభావాలను పసిగట్టి ముసిముసి నవ్వులతోనే సరిపెట్టాడు అమితానందం. ఈలోగా రెండు మూడు ఫోన్లొచ్చాయి. అబ్బే! మాట్లాడడే! టిక్కుటిక్కుమంటూ మెసేజీలు. ‘‘సరే! మీ ఏడుపేదో మీరేడండి’’ అంటూ వంట గదిలోకి చరాచరా వెళ్లిపోయింది ప్రశాంతమ్మ.
అదిగో అప్పుడే దిగారు అవతారం బాబాయ్ పక్కింటి పెద్దాయన. ఆయనో రకం లోక సంచారి. సెలవు రోజెస్తే చాలు అపార్ట్‌మెంట్లన్నీ కలియతిరిగి బాతాఖానీలు వేస్తూ ఉచిత సలహాలు పారేస్తుంటాడు తనకి తెలియని విషయమంటూ లేదనుకుంటూ.
‘‘ఆనందం ఇంట్లోనే ఉన్నాడా అమ్మా’’ అంటూ సరాసరి లోపలికొచ్చేసాడు. పిలుస్తానని చెప్పి ప్రశాంతమ్మ అటు వెళ్లగానే ఆనందం ఇటొచ్చాడు. ఆ కట్టుచూసి నోరెళ్లబెట్టి ‘‘ఏంటోయ్? ఆనందం... ఏంటి సంగతి?’’ అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. అవతారం గారి ప్రశ్న అర్థం చేసుకొని ఓ నవ్వు నవ్వేసి మాట్లాడటానికి వ్రత భంగంలేదు కాబట్టి ఆమోఘ ఫలితానిచ్చే వ్రతకథ ప్రారంభించాడు. ‘‘ఆయుష్షు పెంచుకోవటానికి వౌనవ్రతం చేసే ఎందర్నో చూశాంకదా! మూతికి గుడ్డ లేదా మాస్కో, చేతిని అడ్డంగా పెట్టుకొనో మన మాటలన్నీ వినేస్తుంటారు. కాలుష్యాలకు అడ్డుకట్టగా, కొన్ని అంటురోగాలు నుంచి తప్పించుకోవటానికి కట్టు కట్టుకోవడం గమనిస్తాం కదా! అలాగే శ్రవణ వ్రతం గురించి ఎక్కడో చదివాను బాబాయ్. చెవులకు, గుండెకు మంచిదని, వారానికొకరోజైనా ఏ శబ్దాలు వినకుండా గడపాలని. అలా కొన్ని నెలలు ఆచరిస్తే ఫలితం అద్భుతం అని వ్రాశారు’’ అని చెప్పి ఇంకేటి సంగతులన్నట్టు అవతారంకేసి చూసాడు ఆనందంగా అమితానందం.
ఇక ఇతనితో బాతాఖానీ ఏమిటి, బధిర శంఖారావం అనుకుని ‘‘మరొస్తానోయ్’’ అంటూ వడివడిగా జారుకున్నాడు అవతారం.
‘ఇంకా నయం శ్వాస వ్రతం చేసాడు కాదు’ అని మనసులోనే అనుకున్నాడు అవతారం.

- డాక్టర్ యిమ్మిడిశెట్టి చక్రపాణి,
అనకాపల్లి-531 001. సెల్: 9849331554.

ఆదర్శం

రచయతలకు దిక్సూచి.. శ్రీలేఖ సాహితి
కాలనాళిక
వెల : రూ. 100
ప్రతులకు : శ్రీలేఖ సాహితి,
27-14-53,
హసన్‌పర్తి,
వరంగల్ - 506371.

సాహితీ సంస్థల్లో మేటి శ్రీలేఖ. అతిశయోక్తి ఇసుమంతయు లేదు. సాహితీ సంస్థల్లో ఎక్కువ సంస్థలు కేవలం ఉగాది కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కణ లాంటి కార్యక్రమాలకే పరిమితం. కానీ శ్రీలేఖ సాహితీ తనదైన ముద్రతో యువ సాహితీపరులకు వికాస వేదికగా నిలబడింది. 1977లో స్థాపించిన సంస్థ నాలుగు దశాబ్దాల పాటు వరంగల్ జిల్లా కవులు, రచయితలకు మాత్రమేగాక తెలుగు సాహితీవేత్తలకు, పండితులకు ఆదర్శప్రాయంగా, అద్భుతమైన వేదికగా నిలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంస్థ వ్యవస్థాపకులు, సంస్థ అధ్యక్షులు డాక్టర్ టి శ్రీరంగస్వామి కృషి అనితర సాధ్యం. సంస్థను స్థాపించిన నాటి నుండి అలుపెరగని ఈ కలం యోధుడు 40 వసంతాలు ఎనె్నన్నో మైలురాళ్లను సొంతం చేసుకునేలా చేసి, ఎందరో సాహితీ రంగంలోని అనామకుల్ని చేరదీసి అవకాశాలు కల్పించి, ఆణిముత్యాలుగా తీర్చిదిద్దిన ఘనుడు.
‘స్నేహం నీడనిచ్చే చెట్టులాంటిది’ అన్న నినాదంతో తెలుగు సాహిత్యానికి విశిష్ఠ సేవలు అందిస్తున్న సంస్థ శ్రీలేఖ సాహితి. ఈ నలభై సంవత్సరాల్లో 116 పుస్తకాలు ప్రచురించడం మామూలు విషయం కాదు. ప్రచురణ కర్త కాదు, వ్యాపారం కాదు. కేవలం పరస్పర సహకార పద్ధతి ద్వారా శతాధిక పుస్తకాలు ప్రచురించి ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ సంస్థ ద్వారా వెలువరించిన పుస్తకాల ద్వారా సుమారు 1500 మంది కవులు, 400 మంది కథకులు సాహితీలోకానికి పరిచయ మయ్యారు. ఇలాంటి విశేషాలన్నింటికీ అక్షరరూపం ఇచ్చిన 116వ పుస్తకమే ‘శ్రీలేఖ కాలనాళిక’. ఈ సంస్థ నుండి వెలువడిన వరంగల్ జిల్లా కథా సర్వస్వం గురించి వివరిస్తూ డాక్టర్ మహమ్మద్ తహసీన్ అలీ.. ‘108 కథలతో వచ్చిన ఈ గ్రంథం వైవిద్యభరిత కథా సమాహారం. ఈ సంకలనంలో కథలతో పాటు కథకుల జీవిత వివరాలు, ఫొటోలు ఇవ్వడం వల్ల కథా సంకలనం తేవడంలో సంపాదకుని శ్రద్ధ, అభిరుచి, ఆసక్తి అభివ్యక్తమయ్యాయి’ అంటూ సంపాదకులు డాక్టర్ శ్రీరంగస్వామిని అభినందించారు.
ఆచార్య మహాసముద్రం కోదండరెడ్డి దేవకి శ్రీలేఖ కథా సంకలనాల గురించి వివరిస్తూ.. ‘సంపాదకులు ఈ సంకలనాల్లో 99 మంది కథకులకు చోటు కల్పించారు. ఇందులో కొత్తవారు ఉన్నారు. పాతవారూ ఉన్నారు. ఈ సంకలనాలు ఇచ్చిన ప్రోత్సాహంతో చాలామంది కథా రచయిత (త్రు)లుగా తమ వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంకలనాల శీర్షికలు, కవర్ పేజీలు కూడా విలక్షణమే’నని కథావస్తు తీరుతెన్నుల గురించి చర్చించారు. డాక్టర్ యల్లంభట్ల నాగయ్య తన వ్యాసంలో ఓరుగల్లు సాహిత్యం గురించి శ్రీలేఖ చేసిన సాహిత్య సేవను ఉటంకించారు. ‘1987లో శ్రీలేఖ సాహితీ ప్రచురించిన వరంగల్ జిల్లా రచయితల వాఙ్మయ జీవిత సూచిక వరంగల్ జిల్లాకు సంబంధించిన 400 మంది వాంజ్మయకారుల సమగ్ర పరిచయం స్థూలంగా పొందుపరిచింద’ని కొనియాడారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రయోక్త సి జయపాల్ రెడ్డి వారి సందేశాత్మక వ్యాసంలో కథల్ని గురించి వివరణాత్మకంగా పరిశీలించారు. ‘ఒక్కో కథ ఓ జీవితం. కథా కథనం, శైలి, వస్తు పరిశీలన బాగా సాగింద’ని మెచ్చుకుంటూ, ‘ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించేందుకు ఇలాంటి సంకలనాలు తీసుకొస్తున్న శ్రీలేఖ సాహితీని, ముఖ్యంగా ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ శ్రీరంగస్వామిని ప్రతిఒక్కరూ అభినందించాల్సిన అవసరం ఉంద’ని అన్నారు. డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు శ్రీలేఖ సాహితీ కవితా సంకలనాలు గురించి చేసిన సమగ్ర పరిశీలనలో శ్రీలేఖ వెలువరించిన 20 కవితా సంకలనాల్లో సుమారుగా 1500 కవితలను పరచయం చేశారు. ఇందులో ప్రధానంగా ప్రమోదూత నుండి తారణ వరకు ప్రతి ఉగాదికి తీసుకొచ్చిన కవితా సంకలనాలు సంస్థ పట్టుదలను వ్యక్తీకరిస్తున్నాయి’ అని కొనియాడారు. ఉద్యమాలతో ఉద్భవించిన అనేకానేక సాహితీ సంస్థలు ఆ ఉద్యమం ఊపులో ఉన్న రోజుల్లో ఓ వెలుగు వెలిగి, ఆనక చల్లారిపోయిన దృశ్యాలు ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి ఆసక్తితో ఉద్భవించి అనేక మంది హితులు, స్నేహితులతో అన్ని ఉద్యమాలనూ తనలో కలుపుకుని లేదా సమాంతరంగా నాలుగు దశాబ్దాల పాటు సాగిపోవడం శ్రీలేఖ సాహితి ప్రత్యేకత. 116 పుస్తకాల్లో భక్తి ఉంది. దేశభక్తి ఉంది. అభ్యుదయం ఉంది. ప్రగతిశీల భావాలున్నాయి.
ఆస్తికం, నాస్తికం, విప్లవం, స్ర్తివాదం, దళితవాదం అన్నిరకాల పుస్తకాలు ఈ సంస్థ ప్రచురించింది. ఆచార్య కె సర్వోత్తమరావు తిరుపతి నుండి కాలనాళికకు సంస్థ వెలువరించిన బమ్మెర పోతనామాత్యుల భాగవతానికి సంబంధించిన వ్యాస సంకలనాల గురించి చక్కని మాటలు రాశారు. 34 వ్యాసాలతో, 272 పుటలతో వెలువడిన ఈ పుస్తకం భాగవత దర్శనంగా భావించారు ఆచార్యుల వారు. ఇంకా ఈ కాలనాళికలో అనేక మంది అనుబంధాలు, సంబంధాలు వివరించే అంశాలున్నాయి. ఈ సంస్థ గత 40 వసంతాలుగా చేసిన, చేస్తున్న కార్యకలాపాలు మున్ముందు అనేక సాహితీ సంస్థలకు దిక్సూచిగా ఉపకరిస్తాయి.

- మండవ సుబ్బారావు, చరవాణి : 9493335150

మనోగీతికలు

ప్రేమదేవత

గులాబీల కాంతులు
సంపంగుల సౌరభాలు
మల్లెల చిరునవ్వులు
బంతిపూల మేనిఛాయ
కనకాంబరాల కన్యత్వం
మాలతీలత లావణ్యం
కలువల మనస్తత్వం
సన్నజాజుల సౌకుమార్యం
సొంతం చేసుకున్న ఓ ప్రేయసీ
పరిచయమనే నగరంలో
స్వప్నమనే కోట కట్టుకుని
నీ హృదయమనే ఇంట్లో
ప్రేమనే విశాలమైన వీధిలో
నీకై ఎదురు చూస్తుంటా
ఇప్పటికైనా నను కరుణిస్తావా ప్రియా!

- జి.ఎస్.కె. సాయిబాబా,
అనకాపల్లి. సెల్ : 9248173116.

చెట్టులా పడుండు
ఓమనిషీ
ఎప్పుడూ మనీ, షీల వైపే నీ చూపు
నీలో గూడు కట్టుకున్న
అసూయ ద్వేషాలతో నిండిన
భావాల ధూళి దులిపి
నీ ఇంటి ముందు
నీ కోసమే ఎప్పుడూ ఆలోచించే
ఆ చెట్టును ఓసారి అలా చూడు
రోజూ రాలిపోతున్న ఆకుల గురించి
నువ్వు ప్రతిరోజూ కోసుకుపోతున్న
పూల గురించి
అనుక్షణం కాయల కోసం నువ్వు
విసురుతున్న రాళ్ల గురించి
మరి నువ్వు పళ్లు కోసేటప్పుడు
విరిగే కొమ్మల గురించి
ఎప్పుడైనా ఆలోచించిందా ఆ చెట్టు?
గతాన్ని తలస్తూ
అనవసరపు తలపులతో వగస్తూ
ఉసూరుమంటూ పడి ఉంటుందా చెట్టు
లేదే.. మళ్లీ చిగిర్చి
పూల పరిమళం నీపై కురిపించి
నువ్వు కనిపించినప్పుడల్లా
నీ మనసుకు మాత్రమే వినబడేలా
తన చిరుగాలి తరకలతో
నీ హృదయాన్ని తాకిన
ఆ చెట్టులా పడుండు
అప్పుడు చరిత్రలో నిలుస్తావు
లేకపోతే చరిత్రలో కలిసిపోతావు

- కె. శారదా ప్రసాద్, సెల్ : 7386962464

నేను ఓ సామాన్యుడిని!
అణ్వాయుధపు కిరీటం ధరించి
అహంకారాన్ని హాలాహలంగా నింపుకుని
విశ్వశాంతి జపం చేస్తూ
పావురాలను వేపుకు తింటున్నావు
నేలమ్మ ఒడిలో సేద దీరుతున్న చెట్లు
భూమాత గొంతు తడుపుతూ సాగే సెలయేళ్లను
పేటెంటు భూతమై మింగేసావు
రక్తపిపాసిలా యుద్ధాన్ని స్వప్నిస్తూ
ఉన్మాద క్రీడలో విశ్వవిజేతనని
విర్రవీగుతున్నావు
దేశభక్తిని నీ మోకాలి కింద నలిపి నలిపి
త్యాగమనే చావు మెడలో
గోల్డ్‌మెడల్లా వేలాడదీశావు
అవతారాలు మారినా ఆకారాలు మారినా
సంపన్నుల సాలీడు నీవు
నీ అమ్ములపొదిలో ఏపుగా పెరిగిన
జాతి వివక్షకి నిత్యం దీపావళి పండగే
చీకటిని చీల్చే వేకువలా
గ్రహణం వీడిన సూర్యునిలా
విశ్వం చుట్టిన నీ విషవలయాన్ని ఛేదించేందుకు
కాలం వేగంగా కదులుతోంది
కమ్ముకుంటున్న యుద్ధ మేఘాల్లోండి
మెరిసే స్వేచ్ఛాకిరణమై
కోకిలమ్మ గొంతులో చైతన్యపు రాగమై
తిరుగుబాటుకి తొలి వసంతాన్నై
ఉగాదిలా ప్రభవిస్తాను
యుగాదికై జీవిస్తాను
నేను! ఓ సామాన్యుణ్ణే!

- రెడ్డి శంకరరావు, సెల్ : 9494333511

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. ళ్ఘౄజ: ౄళూఖఔఖ్పఒఔబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- గూడూరు గోపాలకృష్ణమూర్తి