విశాఖపట్నం

కొత్త అల్లుడి విందు భోజనం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి పండుగకు అత్తవారి నుండి అల్లునికి పిలుపువచ్చింది. భార్యతో కలసి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు సమర్పణరావు. ఈ తొందరలో ఇంటికి తాళం వేయడం మర్చిపోయాడు. ఈ విషయం రైల్వేస్టేషన్‌లో గుర్తుచేసింది వాళ్లావిడ ఆండాలమ్మ. అంతే ఇద్దరూ కసురుకొనేసరికి ప్రయాణికులు అంతా ప్రేక్షకుల్లాగ చూస్తున్నారు. వాళ్లలో ఒక పెద్దాయన వచ్చి ‘‘ముందు తాళం వేసే మార్గం ఆలోచించండి మొత్తమంతా దోచేయగలరు’’ అనేసరికి భార్యను స్టేషన్‌లో ఉంచి ఇంటికి బయలుదేరాడు. ఎంతసేపైనా బస్సు రాలేదు. పైగా సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. లాభం లేదని నడక ప్రారంభించాడు. చెమటతో ఒళ్లంతా స్నానం చేసినట్లయింది. సరిగా 100 మీటర్ల దూరంలో వాళ్ల ఇల్లు వస్తుందనగా రెండు బస్సులు, ఒక ఆటో రావడంతో వాటి వైపు చూసి ‘దురదృష్టం అంటే ఇదే కాబోలు’ అని మనసులో అనుకున్నాడు. ఇంటికి చేరుకోగానే వాళ్ల యజమాని ‘‘మీరు ఇంటికి తాళం వేయలేదని మా ఆవిడ చెబితే మా దగ్గర ఉన్న తాళం వేసాము’’ అని చెప్పగా నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు మన సమర్పణరావుకి. ‘అంత కష్టపడి పరుగెత్తుకు వచ్చేముందు యజమానికి ఫోన్ చేస్తే బాగుండేది’ అనుకుని రైల్వే స్టేషన్‌కి తిరుగు ప్రయాణమయ్యాడు. ఒక టాక్సీ డ్రైవర్ ఆపి ‘‘మూడు’’ అనగానే ఇదేదో బాగుందని స్టేషన్ దగ్గర దిగి మూడు రూపాయలు ఇవ్వబోతే ‘‘మూడు రూపాయలు కాదు మూడు వందలు’’ అన్నాడు. వాగ్వాదం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే డ్రైవర్ కిళ్లీ నములుతూ ‘మూడు’ అని ఉమ్మి ఊసి ‘వందలు’ అనగా సమర్పణరావుకి వందలు అనే మాట వినబడక చివరికి రెండు వందలకి తగవు తేలింది.
స్టేషన్‌కు చేరుకోగానే భార్య ఆండాళమ్మ ఫేన్ కింద కూర్చొని ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండడం చూసి ‘‘అంతా నీవల్లే జరిగింది’’ అని తిట్ల దండకం ప్రారంభించాడు. ఆండాళమ్మ లేచి ‘‘ఎర్రగా, బుర్రగా ఉన్నావని మా నాన్న నీకిచ్చి చేస్తే ఇదేనా మర్యాద’’ అంది. ‘‘మీ నాన్న ఇరవై ఎకరాల పొలం ఉందని నన్ను మోసం చేయలేదా?’’
‘‘మంచి ఉద్యోగం చేస్తున్నావని నీకు ఇచ్చారు. మా నానే్న పొరపాటు పడ్డాడు. ఏం చేస్తున్నావ్ అని అడగ్గానే ఎలక్ట్రీషియన్ అని చెప్పేలోగా ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అని, ఆస్తి నాలుగు అనే లోపు నలభై ఎకరాలకు కమిట్‌మెంట్‌కు వచ్చేశాడు’’ అని మాటల యుద్ధం ముగిసేలోగా అత్తవారి ఊరు వచ్చింది.
కొత్త అల్లునికి రెండు చెంబుల నీరు తాగించే అలవాటు అక్కడి వాళ్లకు ఉంది. ఇంకేముంది బానడు పొట్టయింది మన సమర్పణరావుకి. నడుస్తుంటే నీళ్ల శబ్దం వినబడేలా ఉంది. పోనీ మూత్రశాలకు వెళ్దామంటే అర కిలోమీటర్ దూరంలో ఉంది. ఇంతలో సమర్పణరావు బావమరిది తిక్కస్వామి ‘‘ఎంత సేపయింది బావా’’ అంటూ కౌగిలించుకున్నాడు. అంతే ప్రాణం నషాలానికి ఎక్కినట్లయింది. మెల్లగా అర కిలోమీటర్ నడిచాడు.
అల్లుడు గారికి మర్యాదలు చేయాలనే తలంపుతో అత్తగారు గారెలు, బూరెలు, వడలు, ఇంకా ఎన్నో పెట్టింది. కొంత సేపటికి అవన్నీ కడుపులో తన్నుకోవడం మొదలుపెట్టాయి. విపరీతమైన నొప్పితో గిలగిల కొట్టుకుంటున్నాడు. ఇది చూసిన అత్తగారు ‘‘అయ్యో నాయినా గ్యాస్ సిలిండర్‌లా ఉండేవాడివి ఇలా అయ్యావా’’ అని ఏడుస్తూ వెళ్లి భర్త లోభినాయుడికి చెప్పి డాక్టర్‌ను తీసుకురమ్మంది. ‘‘డాక్టర్ ఎందుకు వాము నమిలితే అదే తగ్గిపోతుందిలే’’ అన్నాడు.
‘‘కళ్లెదుట ప్రాణం పోతుంటే ఏమిటా మాటలు? డాక్టర్‌ను తీసుకురండి’’ అంది.
దాంతో డాక్టర్ వెర్రినాథాన్ని తీసుకొచ్చాడు. వెర్రినాథం వస్తూ వస్తూ ‘‘నేను చేయి పెడితే వెళ్లాల్సిందే’’ అన్నాడు.
‘‘వెళ్లాల్సింది అంటే పైకే కదండీ అయ్యో! నా కూతురా నీకెంత కష్టం వచ్చిందే’’ అంటూ ఏడుస్తూ కూర్చుంది అత్తగారు. డాక్టర్ ఆపరేషన్ చేసి రూపాయి బిళ్ల తీశాడు. ఇంతలో బావమరిది తిక్కస్వామి వచ్చి ‘‘ఇంకా 5, 10 రూపాయలు ఉంటాయేమో చూడండి’’ అన్నాడు.
‘‘నొప్పి తాళలేకున్నాను. నీ జోకులు ఆపు’’ అని సమర్పణరావు అన్నాడు. లోభినాథం వాళ్లావిడను ‘‘రూపాయి బిళ్ల ఎలా వచ్చింది?’’ అని అడగ్గా ‘‘ఏదో పిండిలో కలసిపోయింది కాబోలు’’ అని సమాధానమిచ్చుకుంది. అప్పటినుంచి ఎప్పుడు అత్తారింటికి వచ్చినా పిండి వంటలు పరిశీలించి తినాలనుకున్నాడు సమర్పణరావు.

- కుబిరెడ్డి చెల్లారావు, చోడవరం,
విశాఖ జిల్లా. సెల్ : 9885090752.

మినీకథ

ఆకలి

వేగంగా గోదావరి ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. విశాఖపట్నంలో ఉన్న ఒక పేరున్న యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీటు రావడంతో విశ్వ హైద్రాబాద్‌లో ట్రైన్ ఎక్కాడు. చాలా సున్నితమైన మనస్తత్వంతో పాట ఎవ్వరితోను కలిసే స్వభావం కూడా తనకి లేదు.
విశ్వ కూర్చున్న సీటు ఎదురుగా ఇద్దరు స్ర్తిలు కూర్చున్నారు. అందులో ఒక ముసలావిడ, వాళ్ల కూతురు ఉన్నారు.
అప్పటికే అందరూ తెచ్చుకున్న టిఫిన్లు, భోజనాలు చేస్తున్నారు. విశ్వ ఏమీ తినలేదు. వౌనంగా కూర్చున్నాడు. ‘గోదావరి ఎక్స్‌ప్రెస్ ఆగితే ఏమైనా తిందాం’ అనుకున్నాడు. అప్పుడే ఖమ్మం దాటింది. మూడు గంటలు దాటితే గాని విజయవాడ రాదనే విషయం విశ్వకి అప్పుడే తెలిసింది.
ఆకలి వేస్తోంది... నిద్ర వస్తోంది.. ఏం చేయాలో తెలియడం లేదు. ‘బయటైనా కొనుక్కుని తినుగాని ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోవద్దు’ అని తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. పైగా వీళ్లిది ఆచారాలు ఎక్కువగా ఉన్న కుటుంబం. విశ్వను చూసి ‘‘బాబు ఇదిగో ఈ పులిహోర తిను. ఆకలి వేస్తున్నట్లు వుంది. ఇంకో స్టేషన్ రావడానికి చాలా సేపు పడుతుంది. పైగా ఇప్పుడు అమ్మేవాళ్లు ఎవ్వరూ రారు’’ అంది ఎదురుగా ఉన్న ముసలావిడ.
‘‘వద్దండి! నాకు ఆకలిగా లేదు’’ అని చెప్పి ముఖం తిప్పుకున్నాడు.
‘‘కొంచెం తీసుకో అలా ఆకలితో ఉండకూడదు’’ అని ఆ ముసలమ్మ చెబుతున్నా విశ్వ వాళ్లవంక చూడలేదు.
‘‘బాబు! ఇంతకీ మీరు ఏ కుటుంబంవారు’’ అనగానే విశ్వ తన వివరాలు, తన కులం వివరాలు కూడా తెలియపరిచాడు.
‘‘మేము కూడా మీవారికి చెందినవాళ్లమే’’ అనగానే విశ్వ కళ్లల్లో ఒక రకమైన ఆనందం కనిపించింది.
‘‘ఇప్పుడు తిను’’ అంటూ ఒక ప్లేట్‌లో పులిహోర ఇచ్చింది. విశ్వ ఆకలితో ఉండడంతో గబాగబా తినేశాడు.
విశ్వ తన వారు కాబట్టి తేలికగా మాట్లాడటం మొదలు పెట్టాడు. వారిద్దరు కూడా విశ్వతో మాట్లాడారు. ‘‘కాలేజీలో జాయినవ్వడం కోసం వచ్చాను. అక్కడ తెలిసిన వారింట్లో ఉంటాను’’ అన్నాడు.
‘‘అలాగా బాబు’’ అని చెప్పి కాసేపు మాట్లాడుకుని తర్వాత నిద్రపోయారు.
సమయం పావుతక్కువ ఆరయ్యేసరికి గోదావరి ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నానికి చేరుకుంది.
అందరూ కిందకి దిగుతున్నారు.
విశ్వ తన బ్యాగ్, సూటుకేసు పట్టుకుని ట్రైన్ దిగాడు. వెంటనే ఆ బామ్మ, వాళ్ల కూతురు కూడా దిగారు.
‘‘మామ్మగారు వెళ్తానండి. మా వాళ్లు అడ్రస్ చెప్పారు. అక్కడికి వెళ్లిపోమన్నారు’’
‘‘సరే బాబు జాగ్రత్త. ఒక విషయం చెబుతాను ఏమీ అనుకోవద్దు’’ అంది.
‘‘ ఏమిటండీ అది’’ అన్నాడు విశ్వ.
‘‘నువ్వు అనుకుంటున్నట్లు మేము మీ కులం వాళ్లం కాదు. నీ ఆకలి తీర్చడానికి నేను ఆ మాట చెప్పాను. చూడు బాబు నువ్వు త్వరలో కాలేజీ చదవబోతున్నావు. అందరితో కలసిమెలసి ఉండాలి. అంతేగాని సాంప్రదాయాన్ని దృష్టాలో బెట్టుకుని ఎవ్వరితోను కలవను, ఎవరిచ్చినా తినను అంటే ఎలా కుదురుతుంది?’’
విశ్వకు ఆవిడ మాటలు జ్ఞానోదయం కలిగించేలా ఉన్నాయి. ‘నిజమే పట్టింపులు పెట్టుకుంటే మంచివాడు కూడా పగవాడిలా కన్పిస్తాడు’.
‘‘మీ మాటలు, మీ మనస్సు నాకు కొత్త ఆలోచనలు కలిగేలా చేశాయి’’ అంటూ అక్కడి నుండి చిరునవ్వుతో బయలుదేరాడు.

- ఎన్. సురేంద్ర
అచ్యుతాపురం, విశాఖపట్నం
సెల్: 9490792553.

పుస్తక సమీక్ష

‘మట్టి-చెట్టు’ విలువలు తెలిపే
విత్తులోంచి... వియత్తలంలోకి

సి.కా.రా తొలి కవితా సంపుటి ‘కన్నీటి లిపి’. అందులోని కవితలు రైతు పక్షంతో నిండినవి. మట్టి విలువల్ని తెలిపేవి. అలాగే ద్వితీయ కవితా సంపుటి తర్వాత ‘ఎగిరే పావురాలు’ అనే నానీల పుస్తకం కూడా తెచ్చారు. తన తృతీయ వచన కవితా సంపుటి ఈ ‘విత్తులోంచి... వియత్తలంలోకి.’
కవికి ఆనందం, ఆవేశం లేదా ఉద్వేగం కలిగినప్పుడు కవిత్వం పుట్టుకొస్తుంది. కానీ సి.కా.రాకు అలా కాదు. పదునైన పరిశీలన చేశాక విజ్ఞతతో మధనపడినప్పుడు తన మనో సరోవరం నుండి ఉబికివచ్చిన రసగంగా తరంగాలే ఈ కవితలు అన్పించాయి ఈ సంపుటిలోని కవితలు చదువుతున్నప్పుడు. మానవతా విలువల్ని కొన్ని... మట్టి లోతుల్ని మరికొన్ని... చెట్టు నీడల్ని ఇంకొన్ని మన మెదడులో తిష్టవేసేట్టుగా రాశారు. సంపుటిలోని అన్ని కవితల్ని సమీక్షించాలని వున్నా... వినే ఓపికా నేటి సామాన్యులకు లేనేలేదు... కాబట్టి మచ్చుకు కొన్నింటిని సమీక్షించే ప్రయత్నం చేస్తాను.
అన్నట్లు మరో ముఖ్య విషయం చెప్పాలి. మాస్టారు తలచుకుంటే కవిత్వంలో శ్రేష్ఠ అయిన ప్రముఖ కవుల్లో ముఖ్యులైనవానిచే ‘సమీక్ష’ చెప్పంచుకోగలగినా... వారితో కాకుండా తన శిష్యుడనైన నాకు అవకాశం ఇవ్వడంలోనే ఆయన ఉదార మనస్సు కన్పిస్తుంది.
‘విత్తులోంచి వియత్తలంలోకి’ సంపుటి పేరులోనే కవి మనస్సు కన్పిస్తోంది. శిలలపై శిల్పాలు చెక్కినారు పాట మనకు తెలుసు. కానీ శిలలపై కవిత... శిలలే కదా అనుకోవద్దు.. తరతరాల నిశ్శబ్దాన్ని తలలో తురుముకున్న ఈ శిలలు...
‘ఏ తరానికి ప్రతిరూపాలో... ఏ సంస్కృతికి సాదృశ్యాలో అంటూ పలకడానికి నోరు లేకపోయినా కో... అంటే ‘ఓ’ అని ప్రతిధ్వనిస్తాయి. నడవడానికి కాళ్ళు లేకపోయినా నాట్య సుందరులై నర్తిస్తాయి. అందుకే ఖలులైన మానవులకన్నా శిలలైన ఇవియే మిన్న’ అని ముగించారు. మట్టితో మనిషికున్న అనుబంధాన్ని ‘అమృత మనస్విని’ కవిత ద్వారా నిరూపిస్తారు. మరపురానిది మాసిపోనిది మట్టి తినిపించిన బువ్వ చెప్తూ మానవీయ మధుర వాక్కుల్ని మట్టి ఒడిలోనే నేర్చుకోవాలంటూ మట్టి పాడిన జోలపాట మధురోహల మందిరమై మమతల రాగవీణా ధ్వనియై, మాతృమూర్తి దీవెనై మైమరపిస్తుందట. స్వార్థ మానవ కరాలతో చిక్కి సర్వస్వం కోల్పోయిన అభాగ్యులకు నేనున్నానంటూ వౌన సందేశం అందించిన మానవతా మాగాణం మట్టి అన్నారు.
కానీ... నేడు ఆ మట్టినే బంగారం చేసిన ఇసుకాసురులు ఎక్కువైపోయారు. మట్టినే అమ్మేస్తున్నారు. మన నాయకులు వారితీరూ-తెన్నూ తన ‘ముఖాముఖి’ కవితలో తెలుస్తుంది.
ఆడినమాట... అరక్షణంలో మార్చేయడం మాకు వెన్నతో పెట్టన విద్య... అలాగే విధులను, నిధులను- దుర్వినియోగం చేయడం వారికి నల్లేరు మీద నడక అంటూనే... ఊసరవెల్లి రంగులు మార్చినంత వేగంగా... పార్టీలు మార్చేయడం... ఎదుటివార్ని దోచుకునే మీకు షరామామూలే!
తన ‘మానవీయ కోణంలోకి’ కవిత ద్వారా...
‘ఆకాశాన్నడుగు అవినీతి మాయావలయం ఎంత విస్తరించిందో చెబుతుంది
అవనీ స్థలినడుగు భూకబ్జాదారుల చేతుల్లో చిక్కి
భూమి ఎంత పరితపిస్తుందో చెబుతుంది
వాయుమూర్తి నడుగు విశ్వమంతా ఉగ్రవాదం
ఎలా ఊపిరి పోసుకుందో చెబుతుంది
అగ్ని సెగలనడుగు మనిషి మనిషికీ మధ్య
మత రాగ్ని ఎలా రగులుతుందో చెబుతుంది
జలజలపారే నీటినడుగు వక్రబుద్ధుల కాలుష్యం
ప్రకృతినెట్లు నిర్వీర్యం చేస్తోందో చెబుతుంది’
అని పంచభూతాల విలువల్ని వివరిస్తూనే చివరగా హింసను వృత్తిగా స్వీకరించినంతకాలం మనిషి మనుగడ మసైపోతుంది. అందుకే ఆపదలోనున్న వారికి చేయూతనిచ్చినవాడే ‘అమర మానవుడు’. కన్నీటి చెలమల్ని కారుణ్య హస్తాలతో స్పృజించినవాడే మానవీయుడు, మహనీయుడని ముగింపుతో కవి హృదయం కనిపిస్తుంది.
ఇకపోతే... ‘‘విత్తులోంచి వయత్తలంలోకి...’’
విత్తుతోనే జగత్తు వుంది అని రుజువుచేసే కవిత ఇది
భూకుహరంలో వున్న విత్తు (విత్తనం) వియత్తలం (ఆకాశం)లోకి వచ్చే తీరుకు ప్రతిరూపం ఈ కవిత
మట్టిలోని వౌనాన్ని స్పర్శించే నాపేరు ‘సౌమ్యవాదం’అట
చిలక పలుకుల్ని సింగారించుకుంటూ
కోకిల పాటల్ని హారాలుగా అలంకరించుకుంటుందట
‘విత్తులోంచి వియత్తలంలోకి ఎదిగి
చల్లని నీడనిచ్చే సౌజన్యమూర్తియై...
ప్రాణాంతక విషవాయువుల్ని పీల్చే
పర్యావరణ పరిరక్షక స్ఫూర్తియైపోతూ...
నీరు పోసి పెంచే వాణ్ణీ... కరవాలంలో త్రుంచే వాణ్ణీకూడా
పచ్చని చిరునవ్వుతో స్వాగతిస్తుంది’ అనడం కవికి
‘చెట్టుపై ప్రేమ- మమకారం’ అర్ధమవుతుంది. చదువుతున్న ప్రతి పాఠకునికీ తెలుస్తుంది. అంతే కాదు ఈ కవిత చివర పాదంలో శ్రమజీవుల స్వేదాన్ని ఒడిలో దాల్చి అమ్మలా లాలించే ప్రేమామృత బంధువు పరోపకారమే పరమార్ధంగా ఎంచి మట్టిలోంచి పుట్టుకొచ్చిన మానవతా సింధువు’ అని ముగించడం బాగుంది.

- ఈవేమన, శ్రీకాకుళం
సెల్: 7893451307

మనోగీతికలు

చెక్కని శిల్పాలు
చరిత్ర గతానుగతం నుండి తొంగిచూస్తూ
వర్తమానాన్ని ఆవహిస్తుంది
విక్రమిస్తున్న పుస్తకీకరణతో
అక్షర అనుబంధం పెనవేసుకుంటోంది
సాంస్కృతీకరణ ప్రాంగణాల చుట్టూ అగడ్తలు
నిర్మించుకుంటూ అవ్యక్తీకరిస్తోంది
అడుగుల సవ్వడుల అనుకరణ అందిబుచ్చుకుని
ఆవిష్కరణ పర్వాలు తెరమీదకొస్తున్నాయి
తవ్వినదానినే తవ్వుకుంటూ
తరచినవాటినే తరచుకుంటూ
పరిశోధనల ఆత్మోదయానికి
అవధుల పరిధుల నుండి
ఉపాధుల ఉద్యమానికి ఊపిర్లు పోస్తోంది
రిక్తహస్తాల నీడన శుష్కించుకుపోతున్న ‘శోధన’
ఉన్న తలకు పరిక్రమణ తలపాగాలు చుడుతోంది
అమర్చబడిన పదబంధాల నుండి
స్థానభ్రంశం చెందిన పంక్తులు
పరమపద సోపానంపై పరిఢవిల్లుతున్నాయి
అంతర్జాలాల అంతరాల సంగ్రహణా మేథ
మేనాలెక్కి మేజువాణీ జరుపుకుంటోంది
గతితార్కిక వాదాన్ని యుక్తిమథనంతో
సాధన చమత్కారాల తళుకుల చమక్కే
శాస్ర్తియ నిర్దేశవౌతోంది
ఆర్భాటాల కోట నిండా గబ్బిలాల దండు
మెదళ్లు వేల్లాడేసుకుని అరికాళ్లతో
అవకాశాల ఆకాశాన్ని అడ్డుకుంటోంది
అక్షరాలను తూకం వేస్తూ గురుత్వం
గుజ్జనగూళ్లు కట్టుకుంటున్న
బజ్జల వక్రనేత్రం అక్రమార్కుల
ఆలింగనంలో ఆవలిస్తోంది
విజ్ఞాన ఘనులు శృతి చేసిన విశ్వాంతర
విద్వత్ తంత్రుల విహాయస విపంచి
వస్తు ప్రదర్శనశాలను అలంకరించింది
అవరోహణలో దిశాసూచిక
పాతాళ పరిష్వంగానికి ఆయత్తమైంది
కృతక జ్ఞానదీప మిణుగురుల ఎకసెక్కాలకు
సిగ్గుల చితి పేర్చుకుని ప్రతిభ ఆత్మాహుతి చేసుకుంది
గణనీయమైన గుణాంకాలతో జేబులు నింపుకుంటూ
ఆచారత్వపు ఆలంబన విశిష్ఠ వేదిక
గంతలు కట్టుకుంది
నిజాయితీ దర్పణం ప్రతిబింబిస్తున్న
వికార ఆకారం రంగులు దిద్దుకుంటోంది
పర పాలన పరపీడన ఆనవాళ్లు చెరగిపోయినా
సొంత గొంతుకలను నొక్కేసే స్వార్థచింతన
ఊడలుదిగి ఊపిర్లు తీస్తోంది
నవ్య ప్రమాణాల ఆవిష్కరణలకు
పురిటిలోనే ఆయువు తీరుతోంది
చెక్కని శిల్పాల చెక్క్భజన బృందాలకు
పీఠాధిపత్యం కట్టబడింది
మొక్కితేనో మొక్కుబడులు చెల్లిస్తేనో
అభిజాత్యానికి అంతరాత్మను ఆహుతిస్తేనో
పరిశోధన ‘పరిశీలన’ లేకుండానే
పురుడు పోసుకుంటుంది!

- బిఎస్ నారాయణ దుర్గా భట్టు

నీరాజనం
కొండల్లో కోనల్లో
ముళ్ల బాటల్లో
రాళ్ల దారుల్లో
కాలినడకన
మాకోసం శ్రమిస్తూ...
ఆకలి నిద్రలు లేక కర్తవ్యాన్ని
ఉచ్ఛ్వాశ నిశ్వాసలుగా మలచుకొని
త్యాగాలే ఊపిరిగా
సరిహద్దుల్లో సింహాల్లా,
అలసట లేని మీ పోరాటం!
శుత్రుకూటములను
హతమారుస్తూ
మా భద్రత మీ జీవితాలైతే
సాహసులారా,
మీ ఉనికి ఆకాశమంత!
మీ స్మృతులు మా జీవితమంత!
మా ఆశలు మీరే! మా ఊపిరి మీరే!
మా జీవన వికాసానికి
విధాతలు మీరే!!

- శృంగారం ప్రసాద్,
శ్రీకాకుళం

తాగాలి మరి...!
అగ్గిలోన దూకినా
వలువలన్ని జారినా
యముని తోటి పోరినా
మగని మనసు మారునా?
బొమ్మలాట కాదురా మనసంటే
బ్రహ్మ ఆట ఆడునా మనసుంటే
బతుకేంటో, బాధేంటో తెలియాలంటే
అమ్మతత్వం ఎరగాలి
ఆ అమృతత్వం తాగాలి!

- చావలి శేషాద్రియాజులు, పాచిపెంట, విజయనగరం జిల్లా.
సెల్ : 9032496575

చెట్టు
మనిషి బతికేది
కొందరి కోసం
చెట్టు బతికేది
అందరి కోసం
నీటిబొట్టుకు నేస్తం
నీ గుండె నడకకు ప్రాణం
శక్తి సడలి వంగిపోయిన వేళ
ఊతకర్రగా నిలుస్తుంది
కన్నబిడ్డలు కసాయిలైతే
కడదాకా తోడుగా ఉంటుంది!

- హృషీకేశం, విజయనగరం. సెల్ : 8790455653.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి.email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

email: merupuvsp@andhrabhoomi.net

- కుబిరెడ్డి చెల్లారావు