విశాఖపట్నం

ఒంటరి కాపురం! (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వేదవతీ! వేగంగా నిద్ర లేవమ్మా. ఆడపిల్ల పొద్దెక్కే వరకూ నిద్రపోకూడదు’’ అనసూయమ్మ కోడల్ని నిద్ర లేపుతోంది.
‘‘అవునే తల్లీ! ఆడపిల్ల బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోతే ఆ ఇంటికి అరిష్టం’’ అనసూయమ్మ అత్త ఆండాలమ్మ పిలుపు.
‘‘కొత్త కోడలు కదా! ఆ మాత్రం మొద్దునిద్ర తప్పదు కాసేపు నిద్రపోనివ్వండి’’ ఆండాలమ్మ భర్త ముక్తాయింపు.
‘‘అయినా ఇంతకీ మనవాడు నిద్ర లేచాడో లేదో చూడండి. వాడు లేస్తే ఆ అమ్మాయి కూడా నిద్ర లేస్తుంది కదా’’ కొంచెం కోపంగా అన్నాడు అనసూయమ్మ భర్త ఆనందరావు.
‘‘వేదావేదా లే నినే్న లేలే. మా అమ్మ, నానమ్మ, తాతయ్య, నాన్న అందరూ మన గురించే అనుకుంటున్నారు. లేలే’’ అంటూ వేదవతిని నిద్ర లేపాడు వేదవతి భర్త వినయ్.
‘‘అబ్బా ఉండండి. మరి కాసేపు నిద్రపోతాను. రాత్రి బాగా లేటుగా నిద్రపోయాం కదా’’ నెమ్మదిగా అంది వేదవతి.
‘‘అమ్మాయ్... ఈ రోజు మీ కొత్తకోడలు కాఫీ పెడితేనే తాగుతాము. ఇప్పుడు కూడా నాన్నమ్మ లేదా నువ్వు లేదా మా ఆవిడ లేదా మా చెల్లి లేదా మా వదిన కాఫీ పెట్టి మాకు ఇస్తే తీసుకోం’’ వేదవతి చినబావ అచ్యుతరావు.
‘‘అయినా మీ చాదస్తం కానీ ఈ రోజుల్లో కొత్తకోడళ్లు వేకువజామునే లేచి ఇల్లూగుమ్మాలు వూడ్చి, కళ్లాపు చల్లి, ఇల్లు ఒత్తి, తలంటు స్నానాలు చేసి తులసి పూజ చేసి, భర్తకీ, ఇంట్లో వాళ్లకీ కాఫీలు, టీలు అందించడానికి ఇదేమైనా సతీసావిత్రి, అనసూయల కాలం కాదు. కనీసం మేము కొత్త కోడళ్లుగా వచ్చినప్పటి కాలమైనా కాదు’’ దెప్పిపొడుస్తూ నవ్వుతుంది వేదవతి చినతోటికోడలు నీలవతి.
‘‘మరేం! మా బాగా చెప్పావమ్మా నీలవతి. మన కాలంలో అయితే పొద్దుమారక ముందే స్నానపానాలు అయిపోయి ఇంట్లో పెద్దవాళ్లకి కాఫీలు అందించేవాళ్లం’’ సాగదీసి అంది వేదవతి పెద్ద తోటికోడలు వీణావాణి.
‘‘సరిపోయింది సంబడం. ఆ అమ్మాయికి పెళ్లయి పట్టుమని పదిరోజులైనా కాలేదు. అప్పుడే క్లాసు పీకడం మొదలైందా. ఏదో కొత్త దంపతులు కాస్త నిద్రపోనివ్వండి’’ సర్దుబాటు చేశాడు వేదవతి బావ అమృతరావు.
‘‘సర్లేరా బాబూ! నీ ముద్దుల మరదల్ని మేమేమీ అనేయడంలేదు. అమ్మా కాస్త వేగంగా లేవమన్నాము అంతే’’ నవ్వుతూ అంది అనసూయమ్మ.
‘‘వేదా వేదా నినే్న లే. మన గురించి హాట్‌హాట్ చర్చ జరుగుతోంది’’ వేదవతి భర్త వినయ్ మరోసారి హెచ్చరించాడు.
‘‘సర్లెండి! ముందు నేను లేచి, స్నానం చేసి అందరినీ పలకరిస్తాను. అప్పుడు మీరు లేవండి. కాఫీ తెస్తాను’’ నవ్వుతూ భర్తకి చెప్పి నిద్ర లేచింది కొత్తకోడలు వేదవతి.
* * *
వేదవతి గవర్నమెంట్ స్కూల్ టీచర్. వినయ్ ఎండిఒ. ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్. ఇద్దరికీ లేట్ మ్యారేజ్. కనీసం సీనియర్ అసిస్టెంట్ స్థాయి వచ్చే వరకైనా పెళ్లి చేసుకోకూడదని వినయ్ అనుకుంటే టీచర్ పోస్టు కొట్టి రెగ్యులర్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంది వేదవతి. ఇద్దరూ అనుకున్నట్లే జరిగింది. ఇద్దరికీ ఈడూజోడూ బాగుంది. ఇరు కుటుంబాలు మంచి సంస్కృతీ సాంప్రదాయాలతో వున్నవారే కాబట్టి పెళ్లి నల్లేరు మీద నడక అన్నట్లు చక్కగా ఏ పేచీలు, పూచీలు లేకుండా జరిగిపోయింది. అయితే వేదవతి మనసులో కోరిక మాత్రం నెరవేరేటట్లు లేదు. ఇలా ఆలోచించుకుంటూ వేదవతి స్నానాల గదికి వెళ్లింది. కనీసం స్నానమైనా ప్రశాంతంగా చేసుకుందామంటే అక్కడ పిల్లలు, పెద్దలు అందరూ లైన్లో ఉన్నట్లు గుమిగూడి ఉన్నారు. పిల్లలు అమాయకంగా పలకరిస్తే పెద్దలు ముసిముసి నవ్వులతో వేదవతిని పలకరించారు. ఇక ఈ జన్మకి నా కోరిక నెరవేరేటట్లు లేదు అనుకుంటూ కాస్త కష్టంగా ‘‘తప్పుకోండి తప్పుకోండి’’ అంటూ బాత్‌రూంలోకి దూరింది వేదవతి. ఇంతకీ ఆమె కోరిక ఏమిటో తెలుసా? ఎప్పటికైనా ఉమ్మడి కుటుంబానికి కాకుండా ఒంటరిగా ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని. ఒకవేళ ఉమ్మడి కుటుంబానికి చెందిన వాడిని పెళ్లి చేసుకున్నా అతన్ని ఒప్పించి ఒంటరి కాపురం పెట్టి స్వేచ్ఛగా బతకాలని. ఎందుకంటే తాను చిన్నప్పటి నుండి ఉమ్మడి కుటుంబంలో ఉండి ఉండి విసిగి వేసారిపోయింది కాబట్టి. స్నానాల గదిలోనే ఒక నిర్ణయానికి వచ్చింది. ఎలాగైనా భర్తని ఒప్పించి త్వరలోనే ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా, స్వేచ్ఛగా, హాయిగా కాపురం పెట్టాలని సీరియస్‌గా నిర్ణయించుకుంది.
ఈ విషయమే తర్వాత భర్తకి చెప్పింది.
అయితే అతను దీనికి మొగ్గు చూపలేదు.
దాంతో వేదవతి అలిగింది. అన్నం మానేసింది. భార్య అలా చేయడంతో వినయ్ కూడా అభోజనంగా ఉండిపోయేవాడు.
అలా ఇద్దరి మధ్య వార్ మొదలయింది.
ప్రతి పనికీ భర్త మీద గయ్‌మని లేవడం మొదలుపెట్టింది వేదవతి.
ఇంట్లో ఇది రాద్ధాంతం సృష్టించింది.
ప్రశాంతంగా ఉన్న ఆ కుటుంబంలో ముసలం పుట్టింది.
‘‘అమ్మాయికి నచ్చనప్పుడు అంత బలవంతంగా ఇంట్లో ఉంచకూడదు. మనమూ అర్ధం చేసుకోవాలి. ఇద్దరూ ఉద్యోగులు, కొత్తగా పెళ్లయిన వాళ్లు. స్వేచ్ఛగా ఉండాలని ఆమెకు ఉండడం సహజమే కదా’’ వేదవతి పెద్ద బావ అమృతరావు అన్నాడు.
‘‘అమ్మాయికి ఇష్టం లేకపోతే చెప్పే పద్ధతి వేరుగా ఉండాలి తప్ప మొగుడిని రాచి రంపాన పెట్టకూడదు’’ కాస్త కటువుగా అన్నాడు వేదవతి చిన్న బావ అచ్యుతరావు.
‘‘పైగా ఉమ్మడి కుటుంబమంటే ఎంతో విలువ ఇచ్చే వినయ్‌ని ఎలా ఆడిపోసుకుంటుందో చూశారా?’’ అగ్గి రాజేసింది వేదవతి చిన్న తోటికోడలు నీలవతి.
‘‘అవునవును’’ తలూపింది పెద్ద తోటి కోడలు వీణావాణి.
‘‘అయినా మనమందరమూ ఉంటే చిన్న వదినకే మంచిది కదా. మన వల్ల ఆమెకేం ఇబ్బంది?’’ అమాయకంగా అంది వేదవతి ఆడపడుచు, పెళ్లి కాని పద్మావతి.
ఇంట్లో అందరూ వౌనంగా ఉండిపోయారు.
* * *
చివరికి వేదవతి అనుకున్నట్లే భర్త సొంత టౌన్‌లోనే ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక ప్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కొత్త కాపురం అందులోకి మారింది.
కొన్నిరోజులు ఇద్దరూ ఎడముఖం, పెడముఖంగా ఉన్నారు. వేదవతి పోరు పడలేక వినయ్ కొత్త కాపురం పెట్టాడు గానీ, అతనికి తన ఉమ్మడి కుటుంబాన్ని వదలడం ఇష్టంలేదు.
‘‘సర్లే అన్నీ సర్దుకుంటాయి. నా దారిలోకి వస్తున్నాడు కదా’’ మనసులో అనుకుంటూ కాస్త మురిసిపోయింది వేదవతి.
వేదవతి అనుకున్నంత నిర్మలంగా లేడు వినయ్. చాలా రోజులు ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోలేదు. ఒకరోజు భర్త తీరు భరించలేక నిలదీసింది వేదవతి.
వినయ్ మనసులోని మాట చెప్పాడు.
‘‘తాతయ్య పౌరోహిత్యం చేసి, పూజలు, వ్రతాలు చేసి వచ్చే రాబడితో కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. నాన్న, తాతయ్య వారసత్వాన్ని పుచ్చుకుని లంకంత కొంపని, ఊరంత కుటుంబాన్ని లాక్కుని వచ్చాడు. నీకు తెలియదు మా ఇంట్లో ఇప్పుడున్న వాళ్లే కాదు పెదనాన్న కుటుంబం, చిన్నాన్న కుటుంబం, అత్తయ్యలు, మామయ్యలు అందరమూ ఉండేవాళ్లం. అందరికీ ఏ లోటూ లేకుండా నానే్న చూసుకుంటూ ఉండేవాడు. మా పెద్ద వదిన వచ్చిన తర్వాత కొంత కుటుంబం విడిపోయింది. చిన్న వదిన వచ్చిన తర్వాత మిగిలిన కుటుంబం విడిపోయింది. నువ్వు వచ్చిన తర్వాత ఉన్న కుటుంబం విడిపోయింది. నీకు తెలీదా నాన్నకి గుండెజబ్బు. తాతయ్య బాగా ముసలివాడు అయిపోయాడు. అన్నయ్యలవి ప్రైవేటు ఉద్యోగాలు. కనీసం మన పెళ్లి తర్వాతైనా వాళ్లు ఇబ్బంది లేకుండా మూడు పూటలా చక్కగా తింటారని అనుకుంటే నువ్వు నన్ను లాక్కుని వచ్చావు. వేరే కాపురం పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని హెచ్చరించావు. నేను అందరితో చెప్పలేక, అక్కడ ఉండలేక ఆ ఉన్న కొన్ని రోజులైనా ఆ కుటుంబానికి మన మీద విసుగు వచ్చి ఒంటరిగా వెళ్లిపోండి అని వాళ్లు వాళ్ల నోటితో చెప్పేటట్లు ప్రవర్తించాను. నీకు తెలుసా నా చదువు గురించి అన్నయ్యలు గుడిగోపురాల్లో అభిషేకాలు, వ్రతాలు చేస్తూ వచ్చే రాబడిని నాకు ఇచ్చి ఏ లోటూ లేకుండా చూసుకునేవారు. ఉద్యోగం కోసం సుమారు అయిదారు లక్షలు ఖర్చు చేశారు, అడ్డమైన వాళ్లకూ లంచాలు ఇస్తూ. అయినా నేను మెరిట్‌తో ఉద్యోగం పొందాను. ఇచ్చిన లంచాలు పోయాయి’’ వినయ్ చెప్పుకుంటూ పోతున్నాడు.
వేదవతి ఆలోచనలో పడింది. తన పుట్టింట్లో కూడా తండ్రికి పైసా రాబడి లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ తన చిన్నాన్న అందరి కుటుంబాలను పోషించాడు. ఆనాడు చిన్నాన్న తనలాగే ఒంటరి బతుకు, స్వేచ్ఛ కావాలని అనుకుంటే తన తండ్రి, తమ కుటుంబ పరిస్థితి ఏమయ్యేది?
ఆలోచన నుండి తేరుకుని వెంటనే అత్తయ్యకి ఫోన్ చేసింది.
కొత్తగా అద్దెకు తీసుకున్న ఇల్లు బాగా లేదు. మంచి ముహూర్తం చూసుకుని మేము మళ్లా మన ఇంటికే వచ్చేస్తున్నాం అని.
అందరూ సంతోషించారు.
అది మొదలు టీచరమ్మ వేదవతికి ఉమ్మడి కుటుంబాన్ని వదిలి పోవాలనే ఆలోచనలే రాలేదు.

- ఎం.వి. స్వామి,
చోడవరం, విశాఖ జిల్లా-531036.
సెల్ : 9441571505.

మినీకథ

అమ్మాయి నవ్వితే...

ఈ తరం కుర్రకారు ఎవరైనా అమ్మాయి అలవోకగా చూసి ఏమరుపాటుగా ఎవరినో చూసి నవ్వితే తననే చూసి నవ్విందని తెగ ఫీలయి వింత చేష్టలు చేస్తూ వెర్రెక్కిపోతుంటారు.
శ్రీ్ధర్ శ్రీకాకుళం నుండి ఎక్స్‌ప్రెస్ బస్సులో నుండి గురుద్వారా బస్టాప్ వద్ద దిగాడు.
ఇంతలో ఫోన్ వచ్చింది. మాట్లాడుతూ బస్టాప్ వైపు చూశాడు. ముగ్గురమ్మాయిలు శ్రీ్ధర్ వైపు చూస్తూ వారిలో వారు ఏదో మాట్లాడుకుంటున్నారు. కాని వారు తన వైపే చూసి నవ్వారని శ్రీ్ధర్ అనుకున్నాడు.
బైక్ తీసుకురమ్మని ఫ్రెండ్‌కి ఫోన్ చేశాడు.
ఇంతలో ఆ అమ్మాయిలు ముగ్గురు బస్సెక్కేశారు. శ్రీ్ధర్ కూడా పరుగు పరుగున వెళ్లి ఆ బస్సు ఎక్కాడు. కాంప్లెక్స్ టర్నింగులో బస్సు కొంచెం స్లో అయింది. ఆ ముగ్గురు అమ్మాయిలు బస్సు దిగిపోయారు. శ్రీ్ధర్ కూడా అమ్మాయిలను ఫాలో అవుతూ బస్సు దిగాడు. ఇంతలో శ్రీ్ధర్ ఫ్రెండ్ కరుణాకర్ కూడా బైక్ మీద శ్రీ్ధర్ చెప్పిన చోటుకు వచ్చాడు.
అతన్ని చూసి శ్రీ్ధర్‌లో హుషారు పెరిగింది. ధైర్యం కూడా వచ్చింది. ఆ అమ్మాయిల దగ్గరకు వెళ్లి ‘‘హాయ్’’ అన్నాడు.
‘‘ఎవరూ?’’ అన్నట్లు వారు అతని వైపు చూశారు.
‘‘పిలిచారు కదా వచ్చేసాము. మేమిద్దరము, మీరు ముగ్గురు. ఫర్వాలేదు సర్దుకుపోదాం రండి. ఎక్కడికి వెళదాం? రండి రండి’’ అంటూ వాళ్లని విపరీత చేష్టలతో కవ్వించసాగాడు.
తమలో తాము నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న ఆ అమ్మాయిలు వాళ్ల వెకిలి చేష్టలకు సైలెంటైపోయారు. అప్పటికి వారు ఏదో నిశ్చయించుకున్నారు. ఒకమ్మాయి పక్కన ఉన్న పబ్లిక్ టెలిఫోన్‌బూత్ వద్దకు వెళ్లి ఎక్కడికో ఫోన్ చేసింది.
సమయం కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పోలీసు మొబైల్ స్క్వాడ్ వాళ్ల ముందు ఆగింది. ఎదురుగా ఉన్న శ్రీ్ధర్, కరుణాకర్‌లను చూపించారు. లాఠీలు శ్రీ్ధర్, కరుణాకర్ల ఒంటిపై నాట్యం చేయసాగాయి. నాలుగు లాఠీదెబ్బలు ఒంటి మీద పడగానే టెంపరితనం, పొగరు తగ్గిపోయింది వారికి. అంతా జరిగాక పోలీసు లాకప్పులో ఉన్నారు మిత్రద్వయం.
అమ్మాయి ఎర్రగా, బుర్రగా కనిపిస్తే చాలు, అలవోకగా ఏమరుపాటుగా ఆ అమ్మాయి అనుకోకుండా నవ్వితే చాలు కుర్రకారు ఒంటి మీద తెలివి ఉండదు. ప్రతి అమ్మాయి బజారులో దొరికే రెడీమేడ్ రబ్బరుబొమ్మ అనుకుంటారు. ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒకమ్మాయి శ్రీ్ధర్ అన్న జగన్ క్లాస్‌మేట్. పేరు సుజాత. ఎప్పుడో జగన్‌తో పాటు శ్రీ్ధర్‌ను చూసింది. పలకరింపుగా ఓ చిన్న చిరు మందహాసం చేసింది. అంతే శ్రీ్ధర్ తననే చూసి నవ్విందనుకుని లాకప్ పాలయ్యాడు అతని మిత్రుడితో సహా.
కొంత సేపటికి తేరుకుని సుజాత శ్రీ్ధర్ అన్నయ్య జగన్‌కు ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. జరిగిన విషయం విన్న జగన్ కంగుతిని పోలీసు స్టేషన్‌కు వెళ్లి నానా అగచాట్లు పడి శ్రీ్ధర్, కరుణాకర్‌లను సొంత పూచీకత్తుపై విడిపించి ఇంటికి తీసుకెళ్లి నానా చీవాట్లు పెట్టాడు.
‘‘ఏరా! ఆ అమ్మాయి నా క్లాస్‌మేట్ కనుక చూసి నవ్వింది. అంత మాత్రానికే ఆ అమ్మాయి నినే్న చూసి నవ్విందని డిసైడ్ అయిపోయి ఆ అమ్మాయి నీ వలలో పడిపోయిందని తోక తెగిన పాములా ఒంటి మీద స్పృహ లేకుండా ఆ అమ్మాయిని ఏడిపిస్తావా? సిగ్గులేని జన్మ’’ అంటూ చీవాట్లు పెట్టాడు.
‘అమ్మాయిలు ఎందుకో నవ్వుతారు. తమని చూసే ఆమె నవ్విందని అనుకోవడం పొరపాటు. వాళ్ల నవ్వుల వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి’ చీవాట్లు తిని బొప్పి కట్టిన తలని నిమురుకుంటూ అనుకున్నాడు శ్రీ్ధర్.

- వేగి నూకరాజు,
బుచ్చిరాజుపాలెం,
విశాఖపట్నం-530027.
సెల్ : 7702141014.

పుస్తక సమీక్ష

చిట్టిచిట్టి ఊహలను ఆవిష్కరించిన
బాలగేయాలు

ప్రతులకు : కె. ధర్మారావు,
రిటైర్డ్ టీచర్, 5-139/1,
ప్లాట్ నెంబర్ - 47, ప్రగతినగర్, పెందుర్తి,
విశాఖపట్నం - 531173. సెల్ : 8500930756.

బాలసాహిత్యంలో గేయాలు కోవాల్లాంటివి. పాడుకోమని పల్లవినందిస్తాయి. ఆడుకోమని పదాలనందిస్తాయి. అభినయించమని ఆజ్ఞాపిస్తాయి. ప్రాసల ప్రాంగణంలోకి తీసుకుపోతాయి. లయ విన్యాసాలను ప్రదర్శించమంటాయి. ఊహల్ని ఆవిష్కరించడంలో గేయాలు గొప్ప తారకమంత్రాలు. ఇలాంటి గేయాలు రాసిన కలమట సోమేశ్వరరావు మంచి ఉపాధ్యాయుడు, పాఠ్య పుస్తక రచయిత కావడం వలన ప్రాథమిక స్థాయి విద్యార్థులకు పాడను, చదవను వీలు కలిగిన గేయాలను బాలి చిత్రాలతో సిద్ధం చేశారు.
పుస్తకంలోకి ప్రవేశిస్తే 55 గేయాల ఈ సంపుటి పిల్లల ఆశల్ని, ఊసుల్ని, ఊహల్ని, ఉత్సుకతను చక్కగా పండించింది. వినాయక ప్రార్థనతో మొదలై ‘బడికి వెళతాం’ గేయంతో ముగుస్తుంది. కొన్ని గేయాలను పరిశీలిద్దాం.
‘కనిపెంచే దైవాలు అమ్మనాన్నలు/కనిపించే దేవుళ్లు గురుభాస్కరులు/వీరిని పూజించు వీళ్లే ధన్యజీవులు’
తల్లిదండ్రులను, గురువులను పూజించమని సందేశంతో చక్కటి నడకతో నడిచింది. గురుభాస్కరులు అనడం చాలా బాగుంది. గురువు చీకటిని పారద్రోలేవాడు కనుక భాస్కరుడు అనడం సమంజసంగా ఉంది. నైతిక విద్యకు ఈ గేయం ఒక మచ్చుతునక.
‘వానావానా వస్తావా ఆనందాన్ని తెస్తావా/ ఉరుములు మెరుపులు చూపిస్తావా/ ఉత్సాహాన్ని మాకిస్తావా?’ అంటూ సాగిన ఈ గేయం చెరువులు నిండాలని, పైర్లు పండాలని ఆశావహ దృక్పథాన్ని వెదజల్లుతుంది. ఆంగ్లేయులా ‘రెయిన్ రెయిన్ గో అవే’ అనడం సరికాదని, మన ప్రాంతానికి వర్షం కావాలని సూచిస్తుంది ఈ గేయం.
మరో గేయంలో కొన్ని భాగాలు చదువుదాం.
నాన్నమంటే మాకిష్టం/నాన్నమ్మకు నేనిష్టం/తెలియక నేను మట్టిని తింటే వద్దని మిఠాయి పెడుతుంది/నిద్దురపోనని ఏడిస్తే/కమ్మని కథలు చెబుతుంది’.
ఈ గేయం నాన్నమ్మ, మనవడి ఆత్మీ బంధానికి ప్రతీక. కథల వారసత్వాన్ని ప్రసాదించే నాన్నమ్మలు, తాతయ్యలు గనుక ఉంటే బాల్యం సృజన స్రవంతిలా మారదా?
ఈ గేయ రచయిత పిల్లలకు గేయాలతో ‘తోప’, ‘పూతరేకులు’, ‘పాయసం’, ‘అరిసెలు’, ‘బజ్జీలు’ వండి వారి ముందుంచారు. ప్రకృతి వరాలను పరిచయం చేస్తారు. ప్రకృతిలో ఉదాహరణలు చూపి మనల్ని నడుచుకోమంటారు. కాలకృత్యాలు తీర్చుకోమని ఒక గేయం పాడతారు. అల్లరి చేసే పిడుగుల సోదరభావాన్ని ప్రకటిస్తాడు. సాయపడే వారికి పిల్లలతో జేజేలు చెప్పిస్తారు.
శీర్షికాగేయం ‘చిట్టిచిట్టి ఊహల్లో’ భూగోళం బంతిగా మారిపోతుంది. ఆకాశం ఆటస్థలమవుతుంది. నక్షత్రాలు గోళీలవుతాయి. చిట్టిని, చిట్టి ఊహను వటుండితై అన్నట్లు’ తెలియకుండానే వారిలో ఒక వామనుడిని చూపెడతాయి.
పిల్లల ఇష్టాలు, చేష్టలు బొమ్మలతో పాటు గేయాలు చక్కగా భావచిత్రాలుగా కనబడతాయి.
ఈ రచయిత ఇంకా మునుముందు పరిణతితో కూడిన గేయాలు రాసే శక్తి గలవాడని ఈ సంపుటి కొంత ప్రకటిస్తుంది. మంచి అనుప్రాశ, చక్కని అంత్యప్రాస, రసము, అలంకారము అద్దిన గేయాలను రాయాలని ఆశిస్తూ రచయితను అభినందిద్దాం.

- కిలపర్తి దాలినాయుడు,
సెల్ : 9491763261

మనోగీతికలు

ఏమో! ఏమవుతుందో?
వర్తమాన హిమఖండపు అంచులపై
ఎగబాకిన ఉత్సాహంతో నిగిడి
భూభ్రమణగతులను
కళ్లల్లో నక్షత్రాలను ఉంచి
రాబోయే కాలం లోతులను
ఊహల పాథోమీటరుతో కొలుస్తుంటాను
కరిగిన గత సముద్రాన్ని చిలకలేక
వర్తమాన ఘణాన్ని నిర్లక్ష్యం చేస్తూ
పయనించే మేఘాలలో
నీటి పరిమాణాన్ని అంచనా వేస్తుంటాను
వర్ణములు మారుతున్నా గగనం నన్ను హెచ్చరిస్తున్నా
నిశ్చలంగా ఉన్న సూరీడు జగతిగతిని నిర్దేశిస్తున్నా
నాలో బలహీనతల కెరటాలు
అలజడులు రేపుతుంటాయి
నా కళ్ల లోగిళ్లలో
కాలుష్యపు తెరలు కమ్మేస్తున్నా
కనిపించని వెనె్నల వనంలో
వికసించని కమలాలను దర్శిస్తున్నాను
మలినం పేరుకుపోయిన దిక్కుల చేతుల్తో
అగ్ని దుప్పట్లను తొలగిద్దామనుకున్నా
పొగమంచు ముళ్ల పరుపయింది
అంతరించుకుపోతున్న వన్య మృగాల్లాగా
నాలో శక్తి హరించుకుపోతోంది
నా బుద్ధి మొగ్గ వికసించే రోజు కోసం
నా మరుగుజ్జు మనసు ఎదురు చూస్తోంది!

- చావలి శేషాద్రి సోమయాజులు,
విజయనగరం జిల్లా. సెల్ : 9032496575.

మనసు గీతిక
నా హృదయంలో తీయగా
మమతలు పంచిన మల్లెయా
మనసును నీవే త్రుంచావా?
మన అనురాగమే మరిచావా?
వెనె్నల బతుకున తొలగినదీ
కన్నీరే ఇక మిగిలినది
ఎన్నో ఆశల తీవెలు అన్నీ
వాడి అడియాశలయ్యాయి
మనసున శూన్యం నిండినది
సుధలొలింకించే నా హృదయం
వ్యథలకు నిలయం చేశావు
నిర్మలమైన నా హృదినే
నిరసన హృదితో చూసావు
ఎన్ని చేసినా ఎడబాటయినా
అన్నీ నీ కొరకు మోసాను
నినే్న హృదిలో నిలిపాను

- పురిజాల సుధాకర్, నరసన్నపేట,
శ్రీకాకుళం జిల్లా-532421. సెల్ : 7702956929.

ఆడబతుకు
మొగ్గ తొడిగిన నాడే చిదిమేసి
గర్భంలోనే బందీగా
దాచి ఉంచిన మనుషులు
తల్లి మనసు గొప్పదని
పేలే నరరూప రాక్షసుల నడుమ
అంకురించలేక
నిస్సహాయస్థితిలో ఉన్న
మాపై కరుణ లేదా మానవాళికి?
సమత్వం చూపలేక
అడబతుకు ఆశలను ఆవిరిగా చేసి
పురుష సామ్రాజ్య స్థాపనకు
అణువణువూ శ్రమించిన మనుషులు
వరకట్న సాకు చూపి
ఆడబ్రతుకే భారమని
ముళ్లపొదల మాటున
మూలుగుతూ ఉన్న నాకు
స్వేచ్ఛ లేదా ఈ ప్రపంచంలో!

- కుబిరెడ్డి చెల్లారావు,
చోడవరం. సెల్ : 9885090752

ఎదురుచూపు
ఏమిటి ఈ ఆకర్షణ?
ఎందుకు ఈ నిరీక్షణ?
దేని కోసమీ అనే్వషణ
మారిపోతుంది సుమీ నా మనోవర్తన!
ఏదో కావాలని ఆరాటం
మనసులో దానికై పోరాటం
ఆపుతున్నా ఆగని ఆత్రం
మనోఫలకంపై చెరగని చిత్రం
నీ చెంతన గడిచే కాలం
గంటలైనా క్షణమాత్రం
ఎప్పుడిస్తారో కదా నాన్న పైకం
త్వరగా ఎక్కించాలి అంతర్జాల వ్యూహం!

- గుమ్మా నాగమంజరి,
ఎస్‌కోట - 535145. సెల్ : 9985667500.

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- ఎం.వి. స్వామి