విశాఖపట్నం

లోకం తీరు! (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడలో ఓ అడ్రసు కాగితం పట్టుకుని సందుల్లో అపార్ట్‌మెంట్ల పేర్లు చదువుతూ, అలా చూసుకుంటూ తన వేలు విడిచిన మేనమామ ఇంటి కోసం ఎండన పడి తిరుగుతున్నాడు వంశీ.
అమ్మకి దూరపు బంధువైన చలపతిరావుని కలవమని ఆమె ఎన్నాళ్లగానో అతనికి చెబుతోంది. వీలైతే అతన్ని ఒకసారి తీసుకురమ్మని కూడా చెబుతోంది. తీరిక లేక వంశీయే అతన్ని తీసుకురాలేకపోయాడు.
మధ్యాహ్నం పనె్నండు దాటింది. కానీ ఆ అడ్రసు దొరకలేదు. ఓ ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి ఇల్లాలు కాబోలు వీధి గుమ్మంలోనికి వచ్చి వంశీ అడిగిన అడ్రసు గురించి వింది. ‘‘ఆ పేరు గలవాళ్లెవరూ ఈ వీధిలో లేరండి. అడ్రసు సరిగ్గా కనుక్కోవలసింది కదా’’ అనేసి తలుపు గడియ పెట్టేసుకుంది ఒకింత అనుమానంగా చూస్తూ.
అతను ఇంకో ఇంటి తలుపు తట్టాడు.
‘‘వేళాపాళా ఉండదా బాబూ మీకు? అడ్రసులు చెప్పడానికే ఉన్నామనుకున్నారా? వెళ్లండి’’ అని తలుపు గడియ వేసేసుకుంది.
‘ఏమిటో దొంగలు కూడా మంచి డ్రస్సులోనేగా వచ్చి మోసం చేస్తారు. అందుకే వీళ్లు అలా గడియలు వేసేసుకుంటున్నారు. అయినా ఇంత వేసవిలో అదీ మిట్టమధ్యాహ్నం తలుపులు తడితే ఏమైనా అనుకుంటారు మరి. చలపతి మామయ్యని తీసుకు రమ్మని సతాయిస్తోంది కాబట్టి వచ్చాను కానీ లేకపోతే ఇలా వీధివీధి తిరగాల్సిన పని నాకేమిటి?’ అనుకున్నాడు వంశీ.
ఇంతలో ‘‘ఏమండీ’’ అంటూ వినిపించి తిరిగి చూసాడు అతను.
‘‘ఎవరండీ గంట నుండీ ఎండలో తిరగడం చూసాను. మీకెవరు కావాలి? ముందు లోపలికి రండి’’ అని వంశీని ఇంట్లోకి రమ్మని కుర్చీ చూపించింది ఆమె.
వంశీ ఆ ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడు.
ఆమె పెద్ద గ్లాసు నిండా మజ్జిగ తీసుకుని వచ్చింది.
‘‘ముందు మీరు మజ్జిగ తాగండి’’ అంది.
వంశీ దాహానికి తాళలేక ఉన్నాడేమో గటగట ఆమె ఇచ్చిన మజ్జిగ తాగేశాడు.
‘‘నేనెవరో తెలీదు. అయినా మీరు ఫ్యాన్ కింద కూర్చోబెట్టి దేవతలా దాహం తీర్చారు. చాలా థ్యాంక్సండీ’’ అన్నాడు.
‘‘్ఫర్వాలేదు. ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకులెండి. ముందు ఆ అడ్రస్ కాగితం ఇలా ఇవ్వండి’’ అంటూ తీసుకుంది.
‘‘ఈ అడ్రసులో ఉన్నాయన మా అమ్మకి తమ్ముడు. ఈ వీధిలోనే ఉండేవారట. కొంచెం చూడండి’’ అన్నాడు వంశీ.
ఆమె ఆ అడ్రసులో పేరు అదీ చదివి ‘‘ఇతను ప్రస్తుతం ఇక్కడ ఉండడం లేదండీ. వేరే చోట ఉంటున్నారు. అడ్రసు, ఫోన్ నెంబరు చెబుతాను వెళ్లగలరా?’’ అంది.
‘‘వెళతాను’’ అన్నాడు వంశీ.
‘‘వద్దులెండి! మీరు వెతుక్కోగలరో లేదో. నేనే తీసుకువెళతాను. నాకు అటు వెళ్లాల్సిన పని కూడా ఉంది’’ అంటూ తన స్కూటీ స్టార్ట్ చేసి ‘‘రండి’’ అంది.
అతను వెనక కూర్చున్నాడు.
‘‘నా పేరు వసంత. టీచర్‌గా పనిచేస్తున్నాను’’ అంది.
‘‘నా పేరు వంశీ. మీరెంత మంచివారండీ. ఒక్కరు కూడా నాకు సాయపడలేదు. మీలాంటి మంచి మనుషులు కూడా ఉంటారా?’’ అన్నాడు.
ఆమె వౌనంగా నవ్వేసింది.
అతనికి కావలసిన అడ్రసులో దింపింది.
అతను ఆ ఇంట్లోకి వెళ్లాడు. అడ్రసు కోసం తనెంత హైరానా పడిందీ, అప్పుడు తనకి వసంత ఎలా సాయపడిందీ చెప్పాడు.
‘‘ఓహో ఆవిడా తెలుసు. అందంగా, తెల్లగా ఉంటుంది. అంత మంచిది కాదు. కులం తక్కువది. వీధిలో ఆవిడకి మంచిపేరు లేదు’’ అన్నాడు చలపతిరావు.
‘‘అలా మాట్లాడకు మామయ్య. ఆవిడ ఎలాంటిదైనా కానివ్వు. ఈరోజు ఇక్కడికి సజావుగా వచ్చానంటే ఆవిడ చలవే కదా’’ అన్నాడు వంశీ.
చలపతిరావు మాట్లాడలేదు.
భోజనం గట్రా చేసి విశ్రాంతి తీసుకుంటుండగా వసంత గుర్తుకొచ్చింది వంశీకి.
‘తనకి సహాయం చేసిన వసంత మంచిది కాదా? అయినా నిప్పు లేకుండా పొగరాదు. ఆవిడ గురించి ముందే తెలుసుంటే స్కూటీ మీద ఆవిడ వెనక కూర్చున్నప్పుడే ట్రై చేద్దును కదా. అయ్యయ్యో మంచి ఛాన్స్ మిస్సయిపోయాను’ అనుకున్నాడు.
* * *
ఆఫీసులో కొలీగ్స్‌తో ఈ విషయమంతా చెప్పాడు.
మండుటెండలో తాను తన మామయ్య అడ్రసు గురించి వెతకడం, ఎవరూ సాయం చేయకపోవడం, వసంత కోరి పిలిచి మజ్జిగ ఇచ్చి మరీ అడ్రస్ చెప్పి, దగ్గరుండి ఆ అడ్రస్‌కి తీసుకెళ్లడం గురించి వివరంగా చెప్పాడు. వసంత గురించి మామయ్య చెప్పాడని కాకుండా ఆమె మంచిది కాదని, అందుకే అంత విచ్చలవిడిగా ఉందని, తాను ట్రై చేసి ఉంటే ఛాన్స్ దొరికి ఉండేది కానీ టైం లేక వీలు పడలేదని గొప్పగా చెప్పాడు.
అతను చెప్పింది విని కొలీగ్స్ ఒకరిద్దరు ‘అవునవును’ అన్నారు. ప్రసాద్ మాత్రం ‘‘మనకి సాయం చేసిన వారి గురించి అలా నీచంగా మాట్లాడకూడదు. నీ అవస్థ చూసి, నీకెవరూ సాయం చేయకపోవడం గమనించి ఆమె ఆదుకుని ఉండొచ్చు. అంత మాత్రానికే ఆవిడని బ్యాడ్ చేసేయడం సంస్కారం కాదు’’ అన్నాడు.
దానిని వంశీతో పాటు మిగిలిన వారు కూడా ఖండించారు. ఆమె కచ్చితంగా తిరుగుబోతే అయి ఉంటుందని, అందుకే ముక్కూమొహం తెలియని మగాడిని స్కూటీ మీద వెనక కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి దింపిందని అన్నారు.
ఆరోజు మధ్యాహ్నం వంశీ ఆఫీసు పనిలో బిజీగా ఉండగా ఫోను వచ్చింది. వాళ్లమ్మగారు చేశారు. ‘‘వంశీ! నీ భార్య అనితకు ఏక్సిడెంట్ అయింది. సాగర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంటికి ఫోన్ వస్తే నేను పక్కవాళ్లని తీసుకుని ఆటోలో వచ్చాను. హాస్పటల్లోనే ఉన్నాను. నువ్వు తొందరగా హాస్పటల్‌కి రా. నాకసలే గుండెదడగా ఉంది’’ అంటూ కంగారుగా చెప్పింది.
వంశీ సెలవు చీటీ రాసి కొలీగ్‌కి ఇచ్చి బయటపడ్డాడు. అతను హాస్పిటల్‌కి వెళ్లేసరికి అనితకి తెలివి లేదు.
బ్లడ్ ఎక్కిస్తున్నారు. నిద్రకి కూడా ఇంజెక్షన్ ఇచ్చినట్లున్నారు. కళ్లు మూసుకుని ఉంది. తలకి కట్టు కట్టి ఉంది. ‘‘అనితా’’ అన్నాడు బెడ్ దగ్గరకి వెళ్లి.
ఆమె మాట్లాడలేదు. అక్కడే ఉన్న తల్లి వైపు చూసాడు. ఆమె బేలగా చూసింది.
‘‘బండి మీద ఇంటికి వస్తుండగా ఆటో ఢీకొట్టిందట. పక్కనే ఉన్న రాయి మీద పడిపోయిందట. ఎవరూ సాయం చేయలేదట. రక్తం చాలా పోయింది. ఆ సమయంలో ఒకావిడ ఎవరో చూసి ఆటోలో ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేసిందట. ట్రీట్‌మెంట్ చేద్దామంటే అనిత గ్రూపు బ్లడ్ లేదిక్కడ. అనితని ఇక్కడ చేర్చినావిడే తన బ్లడ్ సరిపోతుందేమో చూడమందట. చూస్తే సరిపోయింది. దాంతో డాక్టర్లు వైద్యం మొదలుపెట్టారు. మగాళ్లు కూడా చొరవ తీసుకోని టైములో ఆడదైనా ఆవిడ ఎవరో కానీ నీ భార్యని ప్రాణాపాయం నుండి కాపాడింది. ఆమె నిజంగా దేవతే’’ అంది వంశీ తల్లి.
‘‘ఇంతకీ ఎవరమ్మా ఆవిడ?’’ అన్నాడు వంశీ.
‘‘అదిగో అక్కడ గదిలో ఉంది. బ్లడ్ ఇచ్చింది కదా వైద్యులు కాసేపు ఉండి వెళ్లమన్నారు. పద ఆమె దగ్గరకి వెళదాం’’ అంటూ లేచింది వంశీ తల్లి.
తల్లితో పాటు ఆ గదిలోకి వెళ్లాడు వంశీ.
ఆమె నీరసంగా పడుకుని ఉంది.
‘‘అమ్మా!’’ ఆమెని పిలిచింది వంశీ తల్లి.
ఆమె కళ్లు తెరచి చూసింది.
ఆమెని చూసిన వంశీ ఒక్కసారిగా షాక్ తిన్నాడు.
ఆమె ఎవరో కాదు వసంత. మామయ్య, అతని మాటలు విని తనూ నోటికొచ్చినట్లు మాట్లాడిన వసంత ఆమె. ఆరోజు తనెవరో తెలియకపోయినా ఒక మగాడిని తన బండి వెనుక కూర్చోబెట్టుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా ఆలోచించకుండా ఎండలో తనకి సహాయం చేసిందీవిడ. తన భార్య చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు మగాళ్లు ఎవరూ ముందుకు రాకపోయినా హాస్పిటల్‌కి తీసుకొచ్చి, బ్లడ్ ఇచ్చి కాపాడిందీ రోజు. మంచిది కాదని, కులం తక్కువదని మామయ్య అన్నాడు. మరి ఆవిడ రక్తమే ఇప్పుడు తన భార్య అనిత శరీరంలో ప్రవహిస్తోంది. మంచివాళ్లని ఎప్పుడూ లోకం అర్థం చేసుకోలేదు. సేవాదృక్పథంతో ఆమె ప్రవర్తించిన తీరును విచ్చలవిడితనంగా అర్థం చేసుకునే సమాజంలో తానూ ఒకడిని. ఛీఛీ ఇలాంటి దేవత గురించి ఎంత నీచంగా ఆలోచించాను’ అనుకుంటూ లెంపలేసుకుని ఆమె కాళ్లు పట్టుకున్నాడు.

- పుష్ప గుర్రాల, విజయనగరం.
సెల్ : 9491762638.

మినీకథలు

సుస్మిత రాగం

‘అనుకున్నట్లే జై ప్రపోజ్ చేశాడు. అతనికి ఎస్ చెప్పాలా? నో చెప్పాలా?’ మంచం మీద పడుకుని దీర్ఘంగా ఆలోచించింది సుస్మిత.
పడుకుందే కానీ ఆమెకి నిద్ర రావడంలేదు. ఆమె ఆలోచనలన్నీ జై చుట్టే తిరుగుతున్నాయి.
జై డిగ్రీ చదువుతూ వ్యవసాయం చేస్తున్నాడు. దాంతో పాటు ఆవులు, గేదెలను పెంచుతున్నాడు. తండ్రి ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
నాలుగు నెలల క్రితం జై తన పెదనాన్న కొడుకు పెళ్లిలో సుస్మితను చూశాడు. తొలి చూపులోనే ఆమెని ప్రేమించాడు. ఆ రోజు ఎంతగానో మాట్లాడాలని ప్రయత్నించినా కుదరలేదు. పెళ్లి అయిపోవడంతో సుస్మిత వెళ్లిపోయింది.
జై మాత్రం సుస్మితను మరిచిపోలేదు. ఒకసారి అనూహ్యంగా జై ఇంటికి సుస్మిత, వాళ్లమ్మ, జై అన్నయ్య, వదిన వచ్చారు.
జై చూపు సుస్మిత మీదే ఉంది.
జై అమ్మ సుస్మితకి చీర పెట్టింది. ఆనందంతో ఉప్పొంగిపోయింది సుస్మిత. అప్పుడే జైతో పరిచయం అయింది. జై ఎలాగోలా సుస్మిత నెంబర్ సంపాదించాడు. మెల్లగా సాగిన వారి ప్రయాణం ఫేస్‌బుక్, వాట్సప్ వరకు పాకింది. మంచి ముహూర్తం నాడు జై ‘ఐ లవ్ యు’ చెప్పాడు.
‘నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తాను’ అన్నాడు.
సుస్మిత ఇంజనీరింగ్ చదువుతోంది. మరో మూడు నెలల్లో పెద్ద సంస్థలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ‘ఈ పరిస్థితిలో జై ప్రేమను అంగీకరించడం కత్తిమీద సామే’ అనుకుంది.
జై మంచోడు. వాళ్ల కుటుంబం కూడా మంచిదే. కానీ ఇంకా సెటిల్ కాలేదు. అదే వేధిస్తోంది సుస్మితని. చాలా మంది ఈ వయసులోనే లక్షలకు లక్షలు జీతాలు అందుకుంటున్నారు. ఒప్పుకుంటే ఒక బాధ... ఒప్పుకోకపోతే మరో బాధ. ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్నా బంధువులు, స్నేహితులకు జై ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పను. కానీ చేసుకోకపోతే మంచి వ్యక్తిని మిస్ అవుతానేమో’ పరిపరి విధాలా ఆలోచిస్తోంది సుస్మిత.
అప్పుడే సుస్మితకి మెసేజ్ వచ్చింది ‘డిగ్రీ పాస్’ అని జై నుండి.
‘‘నీ ప్రేమ విషయం దీర్ఘంగా ఆలోచించాను. ఈ కాలంలో మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అంటే అంతా వింతగా చూస్తారు. మంచి ఉద్యోగస్తుడిని చేసుకుంటా అంటే అదిరిపోయేలా చూస్తారు. అందుకని బ్యాంకు ఉద్యోగం లాంటిది ఏదైనా సంపాదించు’’ అంటూ అతనికి ఫోన్ చేసి చెప్పింది సుస్మిత.
‘‘అలాగే సుస్మిత. ఇప్పటి వరకు నేను ఫలానా కావాలని ఏదీ ఆలోచించలేదు. ఇప్పుడు నీ కోసం నా జీవితాన్ని దిద్దుకుంటాను. నాకు డిగ్రీలో మార్కులు బాగానే వచ్చాయి. బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తా. నాకు కులమతాల పిచ్చి లేదు’’ అన్నాడు.
‘‘ఓకే క్యారీయాన్ అండ్ ఆల్ ది బెస్ట్’’ అంది సుస్మిత.
జై బాగా శ్రమించాడు. రెండు మూడు బ్యాంకు ఎగ్జామ్స్ రాశాడు. ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత మరింత కష్టపడ్డాడు. చివరికి గుమస్తా ఉద్యోగం వచ్చింది.
ఆ విషయం సుస్మితకి చెబుదామని ఫోన్ చేశాడు.
‘‘ఇది చాలా చిన్న ఉద్యోగం. కష్టపడ్డాను కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు’’ అన్నాడు.
‘‘నో ప్రాబ్లం. నువ్వు కష్టపడే మనస్తత్వం ఉన్నవాడివని ప్రూవ్ అయింది. అదుంటే చాలు తర్వాతైనా మంచి స్థానాన్ని సంపాదించవచ్చు. నీ వెనుక నేనుంటాను’’ అతనికి ధైర్యం కలిగిస్తూ చెప్పింది సుస్మిత.
‘‘్థంక్యూ డియర్’’ ఆనందంగా అన్నాడు జై.
వాళ్ల ప్రేమ ప్రయాణం అలా సాఫీగా ముందుకు సాగింది. చివరికి పెద్దల సమక్షంలో వారిద్దరూ దంపతులు అయ్యారు.

- నల్లపాటి సురేంద్ర,
సెల్ : 9490792553.

పీడకల!

విద్యార్థులంతా పుస్తకాలు చూసి వెదుక్కుని మరీ రాస్తున్నారు. ఎవరూ కాపలా లేరు. ప్రశ్నపత్రాన్ని అడ్డుపెట్టుకుంటూ ర్యాంకుల్ని ఊహించుకుంటున్నారు.
ప్రభుత్వానికి ఇన్విలేజిలేటర్లు, స్క్వాడ్, ఇంకా పై అధికారులను నియమించనక్కరలేకపోయింది. కేవలం ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్టర్లు సూపర్‌వైజ్ చేస్తే చాలంతే!
ఇప్పుడు గొప్ప మార్పు కనిపించింది ఒక్కసారిగా. గైడ్లు లేవు, టెస్టు పేపర్లు లేవు. టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే. పరీక్ష టైం తగ్గింది. పోటీలు పడి మరీ రాస్తున్నారు. ఇంతకు ముందు కన్నా నిజాయితీగా. ప్రైవేటు కళాశాలలకు పోటీ తగ్గింది. ఒకరి మీద ఒకరికి ఫిర్యాదులూ తగ్గిపోయాయి. చదువుకునే వారే జాయిన్ కావడం వల్ల సెల్‌ఫోన్లు కంట్రోల్ అయ్యాయి. స్కాలర్‌షిప్ కూడా పూర్తిగా సద్వినియోగం అయింది. పుస్తకాలు ప్రభుత్వమే ప్రభుత్వ సంస్థలకు ఫ్రీగా, మిగిలిన వారికి ఖరీదుకి అందించింది అవసరానికి మించి.
డిస్టింక్షన్ సిస్టం మళ్లీ పురుడు పోసుకోవడం వల్ల చదువు మీద ధ్యాస పెరిగింది అందరికీ. చదివే వాళ్లలో ఆలోచనాశక్తి పెరిగింది. ప్రభుత్వానికి సంవత్సరానికి పదుల కోట్లు మిగిలాయి. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మార్కుల పోటీ పెరిగి ప్రతిభ అవార్డుల విలువ పెరిగింది.
‘‘్ఛ! భయంకరమైన పీడకల’’ అంటూ దిగ్గున లేచాడు సుగుణాకరరావు. ఇలా అయితే అక్షరాలు రాయడం కన్నా చూసి రాస్తే శ్రమ తక్కువ. హాజరు చాలకపోతే, చదవకపోతే, యూనిట్ పరీక్షలు ఫెయిల్ అయితే ఇప్పటికే తిడుతున్న మాస్టార్లు తనని పై తరగతులకి రానిస్తారా? అమ్మో అనుకున్నాడు. చదవకపోయినా స్కాలర్‌షిప్ వస్తే చాలు. పాస్ కాకపోతే టీచర్లదే బాధ్యత. అప్పుడే స్లిప్‌లు అచ్చయినా, ఇంకొకలాగైనా పాస్ చేస్తారు. లేకపోతే అమ్మో’’ అనుకున్నాడు.
ప్రజాస్వామ్యం నవ్వుతూ తలూపింది.

- శ్రీనివాసభారతి, శ్రీకాకుళం.

పుస్తక సమీక్ష

అవినీతిని నిరసించే మహా శ్మశానం

ఇంద్రపాల శ్రీనివాస్ అయిదవ కవితా సంపుటి 88 కవితలతో పదునైన పదాలతో బరువైన భావాలతో వాడిగా వేడిగా రూఢిగా సాగి అరుదైన కవిత్వంగా కానవస్తుంది.
అయిదు వికెట్లు తీయడం కన్నా ఒక పుస్తకం గొప్పదని అందులో ఒక వాక్యం గొప్పదని యువతకిచ్చిన సందేశం స్వాగతించదగినది. యువతలో పుస్తక పఠనం పెరగాలన్న కవి ఆకాంక్ష గమనార్హం.
ఆనందం అంగడి సరుకైన ఈ లోకంలో దు:ఖం పెంపుడు కుక్క అయిందనడంలో అంతరార్థం తవ్విన కొద్దీ లభిస్తుంది. యెదను తొలుస్తుంది.
ఆమె బీడీలు చుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. వాళ్లాయన బీడీలు తాగి తాగి కాలం చేశాడు/ ఒకే పదార్థంలో కర్మలు వేరుగా మార్గాలు వేరుగా వ్యక్తుల జీవన్మరణాలకు దారి తీసిన రూపాన్ని అల్పక్షరాలలో అనంత భావాన్ని ఇమిడ్చిన తీరు బాగుంది.
కంటికి కాకుండా చూపులకు/మనిషికి కాకుండా మాటలకు/శరీరాలకు కాకుండా మనసులకు/శస్త్ర చికిత్స మహోద్యమానికి తరలి రండి, అంతా అర్హులే అనడంలో శిల్పం, భావం పోటీ పడి కవిత్వం కదం తొక్కింది. బరువైన భావాన్ని స్వాగతించింది.
కోడలు ఓ ముద్ద పెట్టలేదని/ముసలి మామలంతా, అరుగుల మీద ఆకలి తపస్సు/చచ్చిన పెళ్లాం విలువ, భర్త చచ్చేదాకా పడిపోదు/అన్నది అక్షర సత్యం ఓ సున్నితమైన హెచ్చరిక కోడళ్లకు. మనిషి ఎక్కడో ఉంటాడు, వాడి రాక్షసత్వం మరెక్కడో బయటపడుతుంది. కొందరు క్రూరమృగాలై పచ్చినెత్తురు తాగగలరంటూ వారి నీచబ్రతుకుల నికృష్టతను ఖండిస్తాడు ఈ కవి.
ఆశలు అసువులు బాసి కవితలో మంచం పాతదే అయినా దాని మీద పడక కొత్తది. జీవితం పాతదే అయినా దానితో గడపడం కొత్తదిలో వేదాంత తత్వం ఉంది. శరీరం కొత్తదైనా ఆత్మ పాతదేయన్న గీతా సందేశం అంతర్వాహిని.
అవినీతిని నిరసిస్తూ ఖండిస్తూ కవి ఇలా అంటాడు మనిషి విషవృక్షంగా ఎదుగుతున్న వేళ, బ్రతుకు పెంటకుప్ప మీద, దరిద్రం ప్రళయతాండవం చేస్తుంది. జీవితాన్ని చదును చేసుకోలేని చేతులెప్పుడూ గాయాలపాలవుతూనే ఉంటాయి.
మనుషులను మనషులే పచ్చనోటు మీద వేపుకు తినే ఆధునిక పిశాచాల నిలయం ఇది. మహాశ్మశానం, శీర్షిక కవిత సామాజిక దుర్భర స్థితిని కళ్ల ముందు ఉంచాడు. తల నిండా తూటాలు నింపి, శవాలకు పూలదండలు సిద్ధం చేసే నాగరిక సమాజం నర్తిస్తోందంటూ ఆవేదన, ఆర్ద్రతలను వ్యక్తం చేస్తాడు కవి.
కన్నీళ్లలో, కావేరిలో కన్నీరుంది పన్నీరుంది, పస ఉంది, పరిమళం ఉంది. జీవితమిప్పుడు మయస్థలీపురం, పుట్టుకతోనే చావును రిజర్వేషన్ చేసుకున్న వాళ్లం, ఎలా బ్రతికామన్నది కాదు, ఎలా చచ్చామన్నది ముఖ్యంలో నేటి రవాణా స్థితిని రుజువు చేస్తుంది.
ప్రతి రూపం పాప కూపం. ప్రతి జీవితం జీవచ్ఛవం, ఆశల సవ్వడి జీవితపు పుప్పొడి, కవితలో నేటి మనిషి ప్రతిబింబిస్తాడు. ఆధునిక సమాజంలో నేటి అత్యాధునిక శ్మశానాలు, అపార్ట్‌మెంట్లు, రాత్రి పడుకోవు, పగలు మేల్కోవు. పుట్టడానికి అవకాశమిచ్చిన అమ్మనాన్నలు బతకడానికి అవకాశం ఇవ్వకపోవడమే దరిద్రం అన్న కొసమెరుపు నింగిలో మెరుపుని మించింది.
ఇలా ప్రతి కవితలో నవ్యత ఉంది, భవ్యత ఉంది. ఉద్రేకం ఉంది, ఉద్యమం ఉంది.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు,
సెల్ : 92933 27394.

మనోగీతికలు

మనసు
మనుగడ
ప్రేమగా పలకరించడం
ప్రేమతో మాట్లాడడం
అది చేతగానపుడు
వౌనంగా ఉండిపో, కదిలిపో!
నిన్ను పొగడాలనుకోకు
ప్రశంసలు ఆశించకు
నీ ప్రేమనో, ప్రతిభనో, నిన్నో
గుర్తించాలని ఏనాడూ కోరకు!
ఇక్కడే అందరికీ ఇబ్బంది
గుర్తింపుకై ఒకటే ఆరాటం
ఆరాట, పోరాటాలు నిరంతరం
ఆశ నిరాశలు జీవితాంతం!
లభించని దానిని
పట్టించుకోకపోవడం
దొరకని దానికై
నిత్యమూ వెతుకులాట
ఎంత సేపూ ఊహల్లో జీవించడం
ఎప్పటికీ సత్యాన్ని గుర్తించకపోవడం!
ఎదుటి వారిలో సుగుణాలను
వారు చేసే మంచి పనులను
గుర్తించగలగాలి ఆమోదించాలి
ఎంతసేపూ నేను,
నా ఘనత అనుకుంటే ఎలా?
శరీరం సహకరించకపోవచ్చు
అవయవం ఏదైనా కుంటుపడవచ్చు
అంత మాత్రం అచేతనులవరు
మనసు వికలమైతేనే
మనుగడ ఇబ్బంది!

- శ్రీమతి గంటి కృష్ణకుమారి,
బాబామెట్ట, విజయనగరం.
సెల్ : 9441567395.

మాయలాడి
అబ్బా! ఏమిటో నీ గోల తోచనీయవు కదా!
వద్దంటే దగ్గరికొస్తావ్
అక్కడ ఇక్కడా తేడా లేకుండా
నీ ఇష్టం వచ్చినట్లు...
ఛీఛీ ననె్నందుకిలా ఇబ్బంది పెడతావు
అబ్బా అలా కొరకద్దు పొడవద్దు
మధ్యలో నీ వెధవ పాటొకటి
నీ సరసం పాడుగాను
ఎందుకిలా వేధిస్తావ్
నీకసలు లింగభేదం, వయోభేదం లేదు
ఛీఛీ నీ మొహం తగలెయ్యా
అంత మందినీ ఇష్టమొచ్చినట్లు
మరగడం రకరకాల రోగాలు మాకంటగట్టడం
ఎంత పెద్ద శాల్తీ అయినా
నీ ముందు బలాదూర్
నీతో యుద్ధం చేయడానికి
కోట్ల రూపాయల వ్యయమవుతోంది
నీ పేరు చెప్పుకుని
చాలా కంపెనీలు బ్రతుకుతున్నాయి
నీ నివారణ కొరకు కొత్త ఆవిష్కరణలు
నిన్ను వదిలించుకోవడానికి
ఒక డిపార్ట్‌మెంటే ఉంది
ఎంత మంది, ఎన్ని సాధనాలు,
ఎన్ని మందులు ఉన్నా
నీ పవరు ముందు బలాదూర్
జ్వరాలు తెప్పిస్తావ్, గజగజ వణికిస్తావ్,
చిరాకు కలిగిస్తావు, నిద్రను పాడు చేస్తావు,
విసిగించి వదిలేస్తావు
దోమా! ఇంతున్నావ్...
ఎన్ని తిప్పలు పడుతున్నావే!

- చావలి శేషాద్రి సోమయాజులు
పాచిపెంట, విజయనగరం జిల్లా.

సహితలు
దేహపు గుండెగూటిలో ప్రాణంలా
కనిపించడు గుడిలో ప్రత్యక్షమై దేముడు
ఫలమును చూచిన రుచి తెలియని
గతి జీవితము గడుచును హేమా!
గుడిగుడిలోన వెలుగు దివ్వె
గూటిగూటిలో వెలిగే దీపం
స్థానాలే వేర్వేరు కాని
దైవం వెలుగు ఒక్కటే హేమా!
తనను తాను తెలుసుకొనని
తనువున్న పరాయివాడు వాడు
పొగతోడి కూడిన నిప్పు
నీట పడిన ఉప్పు కదరా హేమా!
దేహదేహమున ఇలలోన
రాతిలోన పరమాత్మ ఆత్మ
చూచూ వారికి మతసహితం
హిత జాతీయత కదరా హేమా!

- ఎల్. రాజాగణేష్,
పాతగాజువాక, సెల్ : 9247483700.

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- పుష్ప గుర్రాల