పశ్చిమగోదావరి

నేడు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 1 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాజీపడేది లేదని పేర్కొంటూ మంగళవారం జిల్లా బంద్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపిలు ప్రజలను మోసగిస్తున్నాయంటూ వైకాపా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ బంద్‌కు పిలుపునిచ్చింది. మరోవైపు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి అన్నిపక్షాలు మద్దతు పలుకుతూ వైకాపా బంద్‌కు సంఘీభావం ప్రకటించాయి. దీనితో మంగళవారం నాటి బంద్ పూర్తిస్థాయిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ నిర్వహణకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. జిల్లా పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల బాధ్యులు, నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి బంద్ విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏలూరులో బంద్ నిర్వహణ విషయంలో స్వయంగా ఆ పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని రంగ ప్రవేశం చేసి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారని నాయకులు పేర్కొంటున్నారు. తెల్లవారుఝామునే ఆర్‌టిసి డిపో వద్ద బైఠాయించడం, బస్సుల రాకపోకలను అడ్డుకోవడంతో మొదలయ్యే ఈ బంద్ ఆ తరువాత నగరంలోని పలు ప్రాంతాల్లో నేరుగా పాదయాత్రలుచేస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, టిడిపిలు ఏ విధంగా మోసగిస్తున్నాయి అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, టిడిపిలు ప్రజలను మోసగిస్తున్నాయని విమర్శలు గుప్పించి బంద్‌నకు పిలుపునివ్వడం తెలిసిందే. అనంతరం జిల్లాస్థాయిలో కూడా దానికి సంబంధించి అటు ప్రచారం, ఇటు ప్రజలను అధికార పార్టీలు మోసగిస్తున్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైకాపా నేతలు, శ్రేణులు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాయి. ఆ విధంగా మంగళవారం నాటి బంద్‌కు ప్రజలను, సంఘాలను సమాయత్తం చేశాయనే చెప్పాలి. మరోవైపు ప్రైవేటు బిల్లు ద్వారా ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో వైకాపాకు మద్దతు ప్రకటించింది. బంద్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేసింది. అలాగే వామపక్ష పార్టీలు కూడా పూర్తి సంఘీభావాన్ని ప్రకటించాయి. ఇదే సమయంలో వివిధ కార్మిక సంఘాలు, సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా బంద్‌కు మద్దతు పలికి ప్రత్యక్షంగా బంద్‌లో పాల్గొంటామని ప్రకటించారు. ఆ విధంగా వైకాపా ప్రకటించిన బంద్ పిలుపునకు టిడిపి మినహా అన్ని వర్గాల నుంచి మద్దతు రావడం విశేషం. వాస్తవానికి ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి సర్వత్రా చర్చనీయాంశంగానే కొనసాగుతూ వస్తోంది. అప్పటి నుంచి వైకాపా ప్రత్యేక హోదా సాధించే విషయంలో టిడిపి అవసరమైన స్థాయిలో ప్రయత్నం చేయడం లేదని, దీని వెనుక ఆ పార్టీ నేతలు ఎదుర్కొంటున్న కొన్ని కేసులే కారణమంటూ తీవ్రస్థాయి విమర్శలు చేస్తూ వచ్చింది. మరోవైపు టిడిపి కూడా వైకాపాపై అదే స్థాయిలో విమర్శలు కురిపిస్తూ వచ్చింది. బిజెపి నేతలు కూడా దీనికి తోడయ్యారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుతో మరోసారి ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో ఈ బిల్లుకు టిడిపితో పాటు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి మద్దతును అందించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించడం, కేంద్ర మంత్రులు హోదా అంశాన్ని ప్రస్తావించకుండా ఎంతో సాయం చేశామని ప్రసంగాలు చేయడంతో సరిపెట్టారు. ఈ పరిణామాలు సహజంగానే ప్రతిపక్ష పార్టీలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఈ నేపధ్యంలోనే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం, దానికి అన్ని పార్టీలు, సంఘాలు మద్దతు పలకడంతో మంగళవారం జిల్లాలో కూడా ఈ బంద్ పూర్తి స్థాయిలో జరుగుతుందన్న అంచనాలున్నాయి.

పరిశ్రమ జియంకు జరిమానా
ఏలూరు, ఆగస్టు 1 : గత ఆరు నెలలుగా ప్రజల వినతులు పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉంచిన పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్‌కు జరిమానా విధిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రకటించారు. పరిశ్రమలకు సంబంధించి తగిన అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నందున ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి జి ఎంకు రూ.7400 జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లాస్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సొమ్ము చెల్లించి ఎదురు చూస్తున్నారని, అయితే నిర్ణీత కాల వ్యవధిలో వాటిని పరిష్కరించకుండా అధికారులు ఎందుకునిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. మండల స్థాయి అధికారి ఒకరు తన కుమారుని నివాస ధృవపత్రం కోసం తూర్పుగోదావరి జిల్లాలో దరఖాస్తు చేయగా సమస్య పరిష్కారం కాకపోతే రాష్టస్థ్రాయి అధికారికి ఫిర్యాదు చేశానని, అదే అధికారి తన పరిధిలో ప్రజా సమస్యలు పరిష్కరించకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి వసూలుచేయాల్సిన పన్నులు కూడా వసూలుచేయలేక బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇటువంటి అధికారుల వలన వ్యవస్థ పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రతీ అధికారి సమస్యలను సకాలంలో పరిష్కరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా వ్యవహరించాలన్నారు. ఆగస్టు 10వ తేదీ నాటికి రెండు లక్షల ఇ-ఫైలింగ్ అమలు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా మాన్యువల్‌గా ఫైల్స్ నిర్వహిస్తే సంబంధిత శాఖాధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, డిఆర్‌డిఏ పిడి కె శ్రీనివాసులు, డిపివో సుధాకర్, డ్వామా పిడి వెంకటరమణ, పంచాయితీరాజ్ ఎస్‌ఇ మాణిక్యం, ఆర్ అండ్ బి ఎస్‌ఇ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
వేలాదిమంది పుణ్యస్నానాలు
నరసాపురం, ఆగస్టు 1: గోదావరి అంత్య పుష్కరాలు రెండవరోజు సోమవారం పట్టణంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పట్టణంలోని అమరేశ్వరస్వామి, కొండాలమ్మ, ఎన్‌టిఆర్ పుష్కర ఘాట్‌లు భక్తులతో కిటకిటలాడాయి. అధికారులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ స్నాన ఘట్టాల వద్ద చేపట్టిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ పుష్కర ఘాట్‌లో చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాలసాయి పుష్కర స్నానం చేశారు. అమావాస్య తిధి పురస్కరించుకుని ఎక్కువగా పిండ ప్రదానాలు జరిగాయి. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా పుష్కర ఘాట్‌ల వద్ద గజ ఈతగాళ్లు, పడవలను ఏర్పాటుచేశారు. సబ్ కలెక్టర్ ఎఎస్. దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ యాత్రీకులకు సూచనలు అందించారు. పుష్కర ఘాట్‌ల వద్ద వైద్యశిబిరాలు ఏర్పాటుచేశారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం, మంచినీళ్లు, పిల్లలకు పాలు అందించారు. వైఎన్ కళాశాల ఎన్‌సిసి వలంటీర్లు భక్తులకు సేవలందించారు.
డివిజన్‌లో 18,666 మంది స్నానాలు
నరసాపురం డివిజన్‌లోని 15 పుష్కర ఘాట్‌లలో 18,666 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారని రెవెన్యూ అధికారులు తెలిపారు. నరసాపురంలో 10,436 మంది, ఆచంటలో 3210, యలమంచిలిలో 5020 మంది భక్తులు అంత్య పుష్కరాల సందర్భంగా స్నానాలు ఆచరించారు.
అన్నదాతలకు పాస్ పుస్తకాలు ఇవ్వరా ?
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఆగస్టు 1: ఎన్నో ఏళ్లుగా అదే పొలంలో సాగు చేసుకుంటూ జీవిస్తున్న అన్నదాతలకు ఆధారం ఏదీ? దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాస్‌పుస్తకాలు ఇవ్వదా? అని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ప్రశ్నించింది. వెబ్ పోర్ట్‌ల్యాండ్ అంటూ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఏర్పాటుచేసిన 1బిలో అన్ని తప్పులు తడకలేనన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 3వ తేదీన రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తున్నట్టు సమితి ప్రకటించింది. సోమవారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపతిరాజు పాండురంగరాజు, యర్రా లక్ష్మీరుషికేశ్వరరావు, గాదిరాజు నాగేశ్వరరాజు, తమ్మినీడి నాగేశ్వరరావులు మాట్లాడారు. వెబ్‌ల్యాండ్ విధానం తప్పులతడకగా మారిందని, ఆ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వెబ్‌ల్యాండ్‌లో 25 శాతం నుంచి 30 శాతం వరకు పేర్లు, వివరాలు తప్పుగా ఉన్నాయని, వాటిని సరిచేసే వరకు వెబ్‌ల్యాండ్ 1బిలోని భూ యాజమాన్య బదలాయింపులో లావాదేవీలు నిలిపివెయ్యాలని అఖిలపక్ష రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. తప్పుల పేర్లు వల్ల నిజమైన భూయాజమానులకు నష్టం జరుగుతుందని, ఒకరికి చెందిన భూములు మరొకరి పేరుపై ఉంటున్నాయన్నారు. సమగ్రంగా సర్వే చేసి భూయజమానులు, భూమి, హద్దులు వంటి వాటిని సక్రమంగా నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పాస్‌బుక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా 1బిలో చేర్చాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, చినమిల్లి వీరవెంకట సత్యనారాయణ, మేళం దుర్గాప్రసాద్, ఎపి రైతుసంఘం నేతలు చెల్లబోయిన వెంకటేశ్వరరావు, నాగిడి తులసీరావు, వైసిపి రైతు సంఘం నాయకులు బుంగా ప్రహ్లాదుడు తదితరులు పాల్గొన్నారు.
పట్టిసం ఘాట్‌లో సాదాసీదాగా పుష్కర స్నానాలు
పోలవరం, ఆగస్టు 1: అంత్య పుష్కరాలు రెండవ రోజు సోమవారం పుష్కర ఘాట్లలో స్నానమాచరించిన భక్తుల సంఖ్య స్వల్పంగానే ఉంది. ప్రధాన ఘాట్ పట్టిసంలో దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులే పుష్కర స్నానం చేస్తున్నారు. ఆర్డీవో ఎస్ లవన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం వెళ్లిపోవడంతో పోలవరం తహసీల్దార్ ఎం ముక్కంటి పరిస్థితిని సమీక్షించారు. మహిళలే ఎక్కువ సంఖ్యలో పుష్కర స్నానాలు చేశారు. స్నానం చేసిన అనంతరం లాంచీలపై గోదావరి నది దాటి వీరేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు.
పట్టిసం, గూటాలలోని పుష్కర ఘాట్లలో 1200మంది వరకూ స్నానాలు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఇతర ఘాట్లలలో స్థానికులు తొలి రోజు కంటే అధిక సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు చేశారు. గోదావరి నది నీటి మట్టం పెరుగుతుండడంతో నది దాటేందుకు, లాంచీలపై వెళ్లిన భక్తులు దిగేందుకు ఏర్పాటుచేసిన ఇసుక బస్తాలు మునిగిపోతుండడంతో వడ్డుకు ఇంకా బస్తాలు వేస్తున్నారు.
పెరవలి మండలంలో...
పెరవలి: అంత్య పుష్కరాల రెండోరోజైన సోమవారం మాసశివరాత్రి కలిసి రావడంతో గోదావరి తీరంలోని పుష్కర స్నానఘట్టాలు భక్తవాహినితో పొటెత్తాయి. అది పుష్కరాలను తలపించే విధంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు క్యూ కట్టారు. తీపర్రులోని శ్రీ రాజరాజనరేంద్రస్వామి, ముక్కామల బ్రహ్మగుండ క్షేత్రంలోని శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వరస్వామి, ఖండవల్లి పంచలింగ క్షేత్రంలోని శ్రీ మార్కండేయ, మల్లేశ్వరం శ్రీ కపిల తీర్థంలోని శ్రీ కపిల మల్లేశ్వరస్వామి, కానూరు అగ్రహారంలోని శ్రీ సోమేశ్వరస్వామి, కాకరపర్రులోని శ్రీరాజరాజ నరేంద్రస్వామివార్లను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఖండవల్లి స్నానఘట్టంలో డిసిఎంఎస్ ఛైర్మన్ భూపతిరాజు రవివర్మ పుష్కర స్నానం అచరించారు. తీపర్రు స్నానఘట్టం వరకు సిమ్మెంటు రోడ్డు సౌకర్యంగా ఉండడంతో వృద్ధులు సైతం కుటుంబ సభ్యుల సహకారంతో పుణ్యస్నానాలను అచరించారు.
కిటకిటలాడిన కేదార్‌ఘాట్
పెనుగొండ, ఆగస్టు 1: గోదావరి అంత్య పుష్కరాల్లో భాగంగా రెండవరోజు సోమవారం మాసశివరాత్రి సందర్భంగా మండలంలోని సిద్దాంతం కేదార్ ఘాట్ భక్తులతో కళకళలాడింది. ఉదయం నుంచి విశేష సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. కేదారేశ్వర స్వామి ట్రస్ట్‌బోర్డు అధ్యక్షుడు నక్కా సత్యనారాయణ భక్తులకు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తహసీల్దార్ బ్రహ్మానందం ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
-విప్ చింతమనేని
ఏలూరు, ఆగస్టు 1 : పేదల సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమని సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడానికే మీ-కోసం కార్యక్రమాన్ని ప్రతీ సోమవారం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ను కలుసుకునేందుకు వచ్చిన ప్రభాకర్‌ను పలువురు కలుసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏలూరు కత్తేపువీధికి చెందిన లక్కురాజు లక్ష్మీ ప్రశాంతి మాట్లాడుతూ అంగవైకల్యం గల తన కుమారునికి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంది. దీనిపై ప్రభాకర్ స్పందిస్తూ వెయ్యి రూపాయలు సొంత సొమ్ము ఆమెకు అందించి వచ్చే నెలలో పెన్షన్ మంజూరు అయ్యేలా చూడాలని డిఆర్‌డిఏ ఎపిడిని ఆదేశించారు. వట్లూరులోని నెహ్రూ నగర్‌కు చెందిన ఒక వృద్ధురాలు తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయించాలని వేడుకొంది. పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి వృద్ధురాలికి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.