వీక్ పాయింట్

‘విశాఖకట్టు’ ప్రహసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశీమజిలీ కథల్లో, జానపద సినిమాల్లో రాజకుమారుడు పెద్ద సాహసం చేసి గొప్ప ఘనకార్యం సాధిస్తాడు. వేరొకడు అతడిని కాపీకొట్టి అదే సాహసం తాను చెయ్యబోయి బొక్కబోర్ల పడతాడు.
తమిళనాట సూపర్‌హిట్ అయిన ‘జల్లికట్టు’ ఉద్యమాన్ని అర్జంటుగా తెలుగులో రీమేక్ చేస్తే అట్టర్‌ఫ్లాప్ అయింది. హీరో కమ్ డైరెక్టర్ అని చాలామంది పొరబడ్డ ‘తెలుగు తమ్ముడు’ ట్వీటు మీద ట్వీటు పెట్టి, తన పాత సినిమా పాటలు రీమిక్సు చేసి, ఎన్ని స్పెషల్ ఎఫెక్టులు ఇచ్చినా ‘విశాఖకట్టు’ పుటుక్కుమంది. కుర్రకారు అమర్చిపెట్టిన డూప్లికేటు ఉద్యమం సెట్టింగును సందట్లో సడేమియాలా హైజాకు చేయబోయిన తొందరవందర జగనన్న హైడ్రామా బెడిసికొట్టింది.
కర్కశంగా విరుచుకుపడి ప్లానంతా చెడగొట్టారని పోలీసులను తిట్టిపోసి లాభం లేదు. ఈ కాలంలో పోలీసులున్నది అలజడిని అణచడానికి. జగన్‌బాబు బెదిరిస్తున్నట్టు రెండేళ్ల తరవాతో, ప్రభువు దయతలిస్తే అంతకంటే ముందో ఆ బాబే ముఖ్యమంత్రి అయినా పోలీసుల తీరు అంతే! పాత్రలు తారుమారై ఒకవేళ అపోజిషను చంద్రబాబు విమానం మీద వచ్చివాలి వైజాగ్‌బీచ్‌లో వేలమందిని పోగేసి యమర్జంటుగా కొవ్వొత్తుల ర్యాలీ పెడతానంటే జగన్‌సారు పోలీసులూ ఊరుకోరు. ససేమిరా కుదరదని తెగేసిచెప్పి, అటునుంచి అటే వెనక్కి పంపితీరుతారు.
ఆ మాటకొస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా పోలీసులు ప్రభుత్వ వ్యతిరేక ప్రజాందోళనలను ఉక్కుపాదంతో అణచాలనే చూస్తారు. అయితే ఉద్యమంలో దమ్మున్నప్పుడు, ప్రజలు పిడికిలి బిగించినప్పుడు ఏ ప్రభుత్వమూ ఏమీ చెయ్యలేదు. పోలీసులు ఎంత ప్రతాపం చూపినా, జనశక్తిని అడ్డుకోలేరు. అరవై ఐదేళ్ల కింద ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని గాని, మూడు నాలుగేళ్ల కింద తెలంగాణ ఉద్యమకారుల ‘మిలియన్ మార్చ్’, ‘సాగర హారా’లను గాని అదుపు చెయ్యటం ఎంత విరుచుకుపడ్డా పోలీసుల తరం అయిందా?
ఇప్పుడు ‘విశాఖకట్టు’ ఫట్టుమనటానికి వేరెవరో కాదు. దాని సృష్టికర్తలే కర్తలు. అసలు లోపం దాన్ని తలపెట్టినవారి బుర్రల్లో ఉంది. తమిళనాట కుర్రవాళ్లు సోషల్ మీడియాలో కూడబలుక్కుని మెరీనా బీచిని వేలమందితో నింపేస్తే, ప్రభుత్వం గడగడలాడి దిగివచ్చింది కాబట్టి మనమూ అలాగే కూడబలుక్కుని రామకృష్ణా బీచ్‌లో అదే పనిచేస్తే మనకూ గొప్ప పేరు వస్తుందన్న ఆలోచన వరకు బాగానే ఉంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా కాక, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టు, ప్రజలకు ఎక్కే అంశాన్ని పట్టుకుని, కార్యాచరణలో గట్టి జాగ్రత్తలు తీసుకుని ఉంటే ‘విశాఖకట్టు’ కూడా మరో చరిత్ర సృష్టించేదేమో!
‘జల్లికట్టు’ తమిళ సంస్కృతితో, సెంటిమెంటుతో ముడిపడిన ఉద్వేగభరిత సమస్య. ‘ప్రత్యేక హోదా’ సాధారణ ప్రజలకు ఎమోషనల్ అపీల్ లేని అరిగిపోయిన సమస్య. ‘ప్రత్యేక హోదా’ విషయంలో ఆంధ్రులకు జరిగింది నిస్సందేహంగా తీరని అన్యాయం. రాజాలాంటి రాజధాని నుంచి అమాంతం గెంటేసినందుకు పరిహారంగా ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పింది కేంద్రం. ప్రతిపక్షంలో ఉండి ‘ప్రత్యేక హోదా’ కోసం పార్లమెంటులో పట్టుపట్టి, అధికారం అందాకేమో అది కుదరదు పొమ్మని మొరాయించి, పనికిమాలిన పాకేజీ మొగాన పడేసి బిజెపి ప్రభువులు చేసింది పచ్చి మోసం. దానికి నిలదీయవలసింది మోది ప్రభుత్వాన్ని. పోరాడవలసింది కేంద్రంతో రకరకాల మొగమాటాలు, పైకి చెప్పుకోలేని రాజకీయ ఈతిబాధలుగల రాష్ట్ర సామంతుడితో కాదు. బాధ్యత గాలికొదిలిన ఢిల్లీ దర్బారుతో! ఆ తెగువ ప్రధాన ప్రతిపక్షానికి లేదు. పీత కష్టాలు పీతవన్నట్టు విపక్షనేత అవసరాలు విపక్షనేతవి. రెండేళ్ల తర్వాత తాను అధికారంలోకి వచ్చి బ్రహ్మాండం బద్దలుకొడతానని కోతలు కోయడమే తప్ప ఇప్పటి ప్రజాసమస్య మీద ఇప్పుడే, తక్కిన పార్టీలనూ కూడగట్టి పట్టువదలక పోరాడాలన్న వివేకం ‘ప్రవాస ప్రతిపక్ష నాయకుడి’కి లేదు.
అధికార పక్షం తలచుకుంటే అన్ని రాజకీయ పక్షాలను, మేధావులను, ప్రజాహిత సంస్థలను, సమీకరించి, మాట తప్పిన కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించగలదు. ఆ పని అది చేయదు. అమరావతి పచ్చటి పొలాలపై రియలెస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటానికే దాని పెద్దలకు ఎక్కడి సమయం చాలడం లేదు. అన్ని పార్టీలను కూడగట్టి రాష్ట్ర ప్రయోజనాలను సాధించటం కంటే పక్కలోని జగన్ బల్లేన్ని దూరం పెట్టటమే వారికి ప్రయారిటీ. కేంద్ర పాలక పక్షమూ, రాష్ట్రంలో మిత్రపక్షమూ అయిన కమలం గట్టిగా పట్టుబడితే ప్రత్యేక హోదాకోసం అధి నాయకులను ఒత్తిడి పెట్టగలదు. కాని ఆ పార్టీ తెలుగుదేశంతో కొంగుముడి వేసుకుని సహగమన ధర్మానికి కట్టుబడ్డ పతివ్రతా శిరోమణి! రాష్ట్ర ప్రయోజనాల మాట దేవుడెరుగు. తన రాజకీయ ప్రయోజనాన్ని సాధించటం ఎలాగన్నదే పాపం దానికి తెలియదు. ఇక కాలగర్భంలో కలిసిన కాంగ్రెసు గురించి ఆలోచించాల్సిన పనే లేదు.
రాగాపోగా రంగంలో మిగిలింది జనసేన. ప్రపంచంలో దానికదేసాటి. సింగిల్ లీడర్ పార్టీలు ఎన్నయినా ఉండొచ్చు. కాని అది సింగిల్ మెంబర్ పార్టీ. సభ్యత్వం నమోదు, కమిటీలు, బాధ్యతల పంపకాలు, ఎన్నికల్లో పోటీ వంటి బాదరబందీ దానికి లేదు. పార్టీయే నాయకుడు; నాయకుడే పార్టీ. అతడికి ఓట్ల మీద గాక ట్వీట్ల మీదే దృష్టి. అతడు జవాబులు చెప్పడు. ఎవరికీ జవాబుదారీ కాడు. ప్రశ్నించడమే అతడి పని. షూటింగుకూ షూటింగుకూ నడుమ విరామ సమయంలో ట్వీట్లు! అడపా దడపా ప్రెస్‌మీట్లు! మూడ్ వచ్చినప్పుడు జనాన్ని పోగేసి, సింగిల్ ఛైర్ మీటింగ్‌లు! ఉద్రేకంతో ఊగిపోతూ, దేశాన్ని బచాయస్తూ, పాచిపోయిన డైలాగుల లడ్డులను పంచుతూ అతడు చేసే ఏకపాత్రాభినయం చూచువారలకు ఉచిత వినోదం. శత్రుపక్షం బెడదను కాచుకోవడానికి తనకు రాజకీయ కవచంలా అతడిని ఎలా ఉపయోగించుకోవాలో చాణక్యుడిని చంపి పుట్టిన చంద్రబాబుకు తెలుసు. అందుకే అతడు శివమెత్తితే సర్కారు వ్యూహాత్మకంగా శిరసు వంచుతుంది; ఇలా ట్వీటగానే అలా పని అయిపోతుంది. చిటికేస్తే సమస్య పరిష్కారమవుతుంది. అదో రకం మ్యాచ్ ఫిక్సింగ్. కాని అదంతా తన ప్రతాపమేననుకుంటాడు ట్విట్టర్ వీరుడు.
నాయకుడినని అనుకునేవాడు జనాన్ని ఆందోళనకు ఉసిగొలిపితే చాలదు. సీనులో ఉండి శ్రేణులను నడిపించాలి కూడా. ఈ చిన్న పాయింటును సినీ మాలోకం సలహాదారులు, స్క్రిప్టురైటర్లు చెప్పలేదేమో. కుర్రాళ్లను ఎగదోయటంతో తన బాధ్యత ముగిసిందనుకుని, తన షూటింగులో తానున్నాడు కాటమరాయుడు. దాన్ని సందు చేసుకుని ఉద్యమాన్ని తేరగా తన్నుకుపోవాలనుకున్నాడు కడపరాయుడు. అతడికాచాన్సు దక్కకుండా పోలీసులచేత కాగలకార్యం చక్కపెట్టించాడు నారా నాయుడు. ఇలా- తలా ఒక చేయ వేసి ‘విశాఖకట్టు’ను జయప్రదంగా రసాభాస ప్రహసనం చేశారు.

-సాక్షి