వీక్ పాయింట్

‘బుగ్గ’ పోతేనేమిరా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్టి పుట్టిన వివిఐపీ ల్లారా!
మరీ ఎక్కువ వర్రీ కాకండి.
‘ఎర్రాబుగ్గల మీద మనసుంది-
కాని కేంద్రం కుదరదు పొమ్మంది’
-అని పాడుకుంటూ మనసు పాడు చేసుకోకండి.
నిజమే! మీకొచ్చిన కష్టం సామాన్యమైనది కాదు. పునిస్ర్తికి ఎర్రబొట్టు ఎంతో మీకు ఎర్ర‘బుగ్గ’ అంత. కారు మీద ‘లాల్ బత్తి’ మిరుమిట్లు గొలుపుతూ రైరై అని సైరన్ కొట్టుకుంటూ పోతేగాని మీ లెవెలేమిటో, మీ దర్జా ఎలాంటిదో అలగా జనానికి అర్థంకాదు. పేరుకు ప్రజాసేవకులైనా, నిజానికి మీరే ప్రజలకు యజమానులు. మీది ప్రత్యేక తరగతి కాబట్టి మీకు ప్రత్యేక హక్కులు ఉంటాయ. ఆ సంగతి దారిన పోయే ప్రతి దానయ్యకూ మీరు చెప్పాల్సిన పని లేకుండా మీ ఎర్ర లైటే చాటుతుంది. దూరాన మీ బుగ్గ కళ్లపడగానే దారి వెంట పోలీసులు ఠక్కున సెల్యూటు కొట్టి, ఎక్కడి ట్రాఫిక్‌ను అక్కడే నిలిపేసి, ఎంతసేపైనా నిలిపే ఉంచి మీ కార్ల బారుకు లైన్‌క్లియర్ చేస్తుంటారు. మీ కారు నెత్తిన ‘బత్తి’ని చూడగానే హైవేల్లో టోల్‌గేట్లన్నీ బుద్ధిగా పక్కకు తప్పుకుని మీకు సలాం చేస్తాయి. ఇనే్నళ్లూ తేరగా అనుభవించిన ఈ వైభోగమంతా దయలేని మోదీ చేసిన ఒక్క కర్కోటక నిర్ణయంతో కిందుమీదుకానున్నది.
ఎర్రబుగ్గ మీకు రాజ్యాంగం ఇచ్చింది కాదు. సందట్లో సడేమియాలా మీరు లాఘవంగా లాక్కున్నది. యాభై ఏళ్ల కిందట రాష్టప్రతి, ఉపరాష్టప్రతి, ప్రధానమంత్రి, గవర్నరు, ముఖ్యమంత్రి వంటి బహుకొద్ది మందికి మాత్రమే బుగ్గకార్లు ఉండేవి. పోనుపోను మిలిటరీ పెద్ద తలకాయలు కార్లకు స్టార్లు, జండాలు, కారుపైన బత్తీలు తగిలించుకు తిరగడం చూసి పోలీసుదొరలూ అదే దారి పట్టారు. ఐ.పి.ఎస్. వాళ్లకంటే మేము తక్కువా అని ఐ.ఎ.ఎస్‌లూ ‘బుగ్గ’్ధరులయ్యారు. కేబినెట్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీల ముందు తామెందుకు తీసిపోవాలని గింజుకుని కేంద్ర, రాష్ట్రాల మంత్రులూ బీకన్లు బిగించారు. చీఫ్ సెక్రటరీని చూసి మిగతా సెక్రటరీలూ, కేబినెట్ మంత్రులను చూసి కేబినెట్ ర్యాంకుకు సమానమైన పదవుల వాళ్లు, జిల్లాల్లో కలెక్టర్లను, ఎస్.పి.లను చూసి జెడ్.పి. ఛైర్మన్లు, కో-ఆపరేటివ్ బ్యాంకుల పెద్దలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కొండొకచో సర్పంచులు, దేవస్థానాల ఛైర్మన్లు కూడా ‘రెడ్‌లైటు’ ఏరియాలోకి చొరబడ్డారు. అలా ఎంతో కష్టపడి లాక్కున్నది కాబట్టే ‘బుగ్గ’ భోగం పోతుందనే సరికి తలకొట్టేసినట్టు విలవిలలాడటం సహజం.
మీ బాధ, మీ క్షోభ మనసున్న ప్రతి వాడినీ కలిచివేసేవే అయినా నాయనలారా, తమాయించండి. నింపాదిగా ఆలోచించి స్థిమితపడండి. మీ నుంచి లాగేసింది ఇంకొకడికి ఉంచితే మీకు చిన్నతనం కాని... అందరికీ తీసేస్తే మీకేమిటి నామోషీ!? కార్లకు ఎర్రబుగ్గలను ఎవరుపడితే వారు విచ్చలవిడిగా తగిలించుకోకుండా చూడమనీ, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మాత్రమే దాన్ని పరిమితం చేయమనీ సుప్రీంకోర్టు చెబితే... అవి ఎవరికీ వద్దంటూ మోదీ సర్కారు మొత్తం అందరికీ ఎగ్గొట్టింది. ఇప్పటిదాకా విఐపి స్టేటస్ సింబల్‌గా ఉన్నదాన్ని కాస్తా ఇకపై ఫైరింజన్లకు, అంబులెన్సులకు, పోలీసు కార్లకు మాత్రం మిగిల్చి, విలువను దిగజార్చింది. విలువే పోయింది మీకు మాత్రం ఎందుకు?
ఎర్రబుగ్గ పోయినా ఎర్రబుగ్గ సంస్కృతి ఎక్కడికీ పోదు. కారు మీద రెడ్‌లైటు లేకపోయినా మీ వైభోగాలు, ప్రత్యేక హక్కులు ఏమీకావు. మీ కారుకు బుగ్గ లేకపోయినా మీకు కష్టంకలగకుండా ట్రాఫికును నిలబెట్టి ‘గ్రీన్ చానల్’లో మిమ్మల్ని ఎలా దూసుకుపోనివ్వాలో బతకనేర్చిన పోలీసులకు ఒకరు నేర్పక్కర్లేదు. మీ కారుకు బుగ్గ, సైరను లేకుంటేనేమి, పోలీసు బుగ్గకారు మీకు ముందుండి కూతపెట్టుకుంటూ మిమ్మల్ని తోడ్కొని పోతుంది. మర్యాదలు వడ్డించేవాడు మనవాడైనప్పుడు బుగ్గ ఉంటే ఎంత? పోతే ఎంత?
బుగ్గను తీసేస్తే చాలు విఐపి సంస్కృతి హుష్ కాకి అయిపోతుందని సత్తెకాలపు సత్తెయ్యలను మీడియా నిండా మురిసిపోనీయండి! అసలు సంగతి మీకు తెలుసు. మన వ్యవస్థ కష్టపడి పెంచిపోషిస్తున్న విఐపి కల్చరు పదిలంగా ఉన్నంతకాలం విఐపిల రాజభోగాలకు కొదవు ఉండదు. మీ నెత్తిమీద ‘బత్తి’కంటే మీ కుడి ఎడమల గన్‌మెన్లు మీకు గొప్ప దర్జా! మీ చుట్టూ ఎంతమంది తుపాకులు పట్టి నిలబడితే, అలగాజనం మీ దరిదాపులకు రాకుండా తోసేస్తూ, గర్జిస్తూ వారు ఎంత ఓవరాక్షను చేస్తే మీకు అంత గ్లామరు! బుగ్గ పోయినా ‘్భద్రత భద్రం’ అని వెంకయ్యామాత్యుడు భరోసా ఇచ్చాడు కనుక మీ ఆడంబరానికి, పటాటోపానికి ఢోకాలేదు.
అట్టహాసంగా కనపడుతుంది కాబట్టి బుగ్గ్భోగాన్ని అందరూ ఆడిపోసుకుంటారేగాని, విఐపి వైభోగాల్లోకెల్లా తేలిగ్గా వదులుకోదగ్గది అదే. మీకు గుర్తుందా? రెండేళ్ల కింద ఢిల్లీ ఎన్నికల్లో ‘ఆపా’త్ముల చేత క్రేజీవాల్ ఏమని ప్రమాణం చేయించాడో? గెలిచాక ఎర్రబుగ్గ కారులో తిరగము; గవర్నమెంటు పెద్ద బంగళాల్లో ఉండము; అనవసరపు పోలీసు సెక్యూరిటీ తీసుకోము - అంటూ ప్రతి అభ్యర్థి చేతా ఆర్భాటంగా అఫిడవిటును గుప్పించాడు. తీరా గెలిచాకో? ఎర్రబుగ్గలనైతే చిటికెలో రద్దుచేసి పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రిగా తనకుతాను పది పడకగదుల బ్రహ్మాండమైన బంగళాలు ఇప్పించుకుని... జడ్ ప్లస్ సెక్యూరిటీని అడిగిపుచ్చుకుని - మిగతా ప్రమాణాలను యమునలో కలిపాడు.
తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రులూ కారుకు బుగ్గను ఎప్పుడూ వాడరు. బెంగాలీ దీదీ డిటో డిటో. పంజాబులో కాంగ్రెసు కెప్టెను గద్దెపైకి వచ్చీరాగానే బుగ్గకార్లు వద్దు పొమ్మన్నాడు. కాని ఆయా రాష్ట్రాల్లో మంత్రుల నుంచి ఎమ్మెల్యేలూ, మండలాధీశుల దాకా అమాంబాపతు విఐపిలు కూడా సర్కారీకార్లు, సెక్యూరిటీ హంగులు, ఎడాపెడా జీతాలు, బత్తేలూ, రకరకాల రాయితీలు, మహారాజభోగాలు విచ్చలవిడిగా అనుభవిస్తూనే ఉన్నారు. రవీంద్ర గైక్వాడ్ లాంటి ఎంపీలు బుగ్గకార్లలో తిరగకపోయినా విమానాల్లో సిబ్బందిని చెప్పు తీసుకుని విఐపి దర్జాతో కొడుతూనే ఉన్నారు. అలాంటి గుణవంతుల విఐపి లీలలను అన్ని పార్టీల నీతిమంతులూ కడుపులో పెట్టుకుని కాపాడుతూనే ఉన్నారు.
విఐపి సంస్కృతి మన జీవన విధానమైపోయి చాలాకాలమైంది. మామూలు గృహస్థుల ఇళ్లలో పెళ్లిళ్లలో కూడా విఐపి సీట్లు, విఐపి పార్కింగులు, విఐపి డైనింగులు మామూలైపోయాయి. విఐపి సీట్లు, విఐపి ఎంట్రీలు, విఐపి కోటాల కోసం ఎగబడటం ఫ్యాషనైంది. విఐపి హోదాకోసం అంగలార్చే కల్చరు సమాజంలో చిరంజీవిగా ఉన్నంతకాలం విఐపిలకు ఎందుకు దిగులు?

-సాక్షి