ఆటాపోటీ

క్రికెట్ ప్రపంచంపై పొట్టి ఫార్మెట్ పట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తున్నది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీ 2007లో ఆరంభమైంది. మ్యాచ్ మొత్తంలో అత్యధికంగా 40 ఓవర్లు మాత్రమే ఉంటాయి కాబట్టి, ఫలితం అప్పటికప్పుడే తేలిపోతుంది. తక్కువ సమయంలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధించడానికి బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేస్తారు. ఒకప్పుడు విశ్రాంతి దినంతో కలిపి ఆరు రోజులు.. తర్వాతి కాలంలో విశ్రాంతి లేకుండా ఐదు రోజులు జరుగుతున్న టెస్టు క్రికెట్‌లో ఫలితం తేలుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. క్రీజ్‌లో పాతుకుపోయి జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానుల సహనానికి పరీక్ష పెట్టడం బ్యాట్స్‌మెన్‌కు అలవాటుగా ఉండేది. జెఫ్ బాయ్‌కాట్, రవి శాస్ర్తీ, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, మార్క్ టేలర్, క్రిస్ టావీస్, మార్క్ రిచర్డ్‌సన్, షోయబ్ మహమ్మద్, బ్లెయిర్ పొకాక్, మైక్ బ్రియర్లీ, మహేల జయవర్ధనే, మహమ్మద్ యూసుఫ్ వంటి ఎంతో మంది బ్యాట్స్‌మెన్ ఎంతకీ అవుట్‌కాకుండా, పరుగులు చేయకుండా, ప్రతి బంతిని రక్షణాత్మక విధానంలో ఆడుతూ అటు బౌలర్లకు, ఇటు ప్రేక్షకులకు విసుగుతెప్పింవారు. ఐదు రోజులు ఓపిగ్గా వేచిచూసినా మ్యాచ్ ఫలితం వెల్లడి అవుతుందో లేదో తెలియని పరిస్థితి. అందుకే మొదట 60 ఓవర్లుగా రంగ ప్రవేశం చేసి, ఆతర్వాత 50 ఓవర్ల ఫార్మెట్‌గా మారిన వనే్డ ఇంటర్నేషనల్స్ చాలా తక్కువ కాలంలోనే విశేషాదరణ పొందింది. ఒకే రోజు మ్యాచ్ కావడం, ఫలితం ఎప్పటికప్పుడు తేలిపోవడం వంటి అంశాలు స్టేడియాలకు ప్రేక్షకులను పరుగులు తీయించాయి. అయితే, పగలు ఐదారు గంటలు క్రికెట్ మ్యాచ్‌ని చూసేందుకు చాలా మంది సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, వనే్డలు కూడా క్రమంగా ప్రేక్షకుల సంఖ్య పలుచపడింది.
నష్ట నివారణ చర్యల్లో భాగంగా డే/నైట్ మ్యాచ్‌లు తెరపైకి వచ్చాయి. సాయంత్రాలు మ్యాచ్‌లు జరుగుతాయి కాబట్టి, భారీగా ప్రేక్షకులు హాజరుకావడం, స్టేడియాలు కిక్కిరిసిపోవడంతో, ఈ ఫార్మెట్ ఆదాయం గనిగా మారింది. అయితే, వనే్డలు చూడడం వల్ల కూడా సమయం వృథా అవుతున్నదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ఫార్మెట్ కూడా క్రమంగా ప్రాభవం కోల్పోవడం ఆరంభమైంది. అలాంటి దశలో వచ్చిన టి-20 ఫార్మెట్ యావత్ క్రికెట్ రంగానే్న కొత్త మలుపు తిప్పింది. ఇంగ్లీష్ కౌంటీల్లోనూ, ఆస్ట్రేలియా దేశవాళీ పోటీల్లోనూ జరిగే టి-20 మ్యాచ్‌లకు విపరీతమైన ఆదరణ ఉంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొత్త ఒరవడిని సృష్టించింది. క్లబ్ సాకర్, కౌంటీ క్రికెట్‌లోని అంశాలను రంగరించి, చీర్ లీడర్ల అందాలను అద్ది ఐపిఎల్‌ను సరికొత్త టి-20 టోర్నీగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కళ్ల ముందు ఆవిష్కరించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టి-20 ఫార్మెట్‌కు ఆదరణ గణనీయంగా పెరిగింది.
టి-20 ఫార్మెట్‌కు పెరుగుతున్న ఆదరణను గమనించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధికారికంగా ఈ ఫార్మెట్‌ను గుర్తించింది. ఫలితంగా టి-20 ఇంటర్నేషనల్స్ తెరపైకి వచ్చాయి. ఈ మ్యాచ్‌లకు ఆదరణ పెరగడంతో, ప్రపంచ కప్‌ను 2007లో ప్రవేశపెట్టారు. రెండేళ్లకోసారి ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.

వరుసగా ఆరోసారి

ఇప్పటి వరకూ ఐదు టి-20 వరల్డ్ కప్ టోర్నీలు జరగ్గా, అన్నింటిలోనూ ఆడిన కొంత మంది క్రికెటర్లు వరుసగా ఆరోసారి ఈ పోటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యారు. టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ఆరో టి-20 వరల్డ్ కప్‌లో పాల్గొననున్నారు. వీరితోపాటు మష్రాఫ్ మొర్తాజా, షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, మహమ్మదుల్లా, ముష్ఫికర్ రహీం (బంగ్లాదేశ్), డ్వెయిన్ బ్రేవో, క్రిస్ గేల్, దనెష్ రాందీన్ (వెస్టిండీస్), నాథన్ మెక్‌కలమ్, రాస్ టేలర్ (న్యూజిలాండ్), ఎబి డివిలియర్స్, జీన్ పాల్ డుమినీ (దక్షిణాఫ్రికా), తిలకరత్నే దిల్షాన్, లసిత్ మలింగ (శ్రీలంక), షహీద్ అఫ్రిదీ (పాకిస్తాన్), షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) కూడా ఆరోసారి టి-20 వరల్డ్ కప్‌లోకి అడుగుపెడుతున్నారు.

విజేత జట్లు
ఇప్పటి వరకూ జరిగిన టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో విజేత జట్ల వివరాలు ఇలావున్నాయి. 2007లో మొదటి చాంపియన్‌షిప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఈ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. 2009లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో శ్రీలంకపై 8 వికెట్ల భారీ తేడాతో విజయభేరి మోగించింది. 2010లో ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ విశ్వవిజేతగా ఆవిర్భవించింది. 2012లో శ్రీలంకపై 36 పరుగుల తేడాతో విజయం సాధించిన వెస్టిండీస్‌కు ట్రోఫీ దక్కింది. రెండు పర్యాయాలు ఫైనల్‌లో ఓడిన శ్రీలంక 2014లో టైటిల్ సాధించింది. ఫైనల్‌లో భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.

సిక్సర్ల హీరో గేల్
వెస్టిండీస్ సూపర్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ టి-20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టి రికార్డు పుటల్లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. 23 టి-20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడిన అతని ఖాతాలో 49 సిక్సర్లు ఉన్నాయి. యువరాజ్ సింగ్ 27 మ్యాచ్‌ల్లో 31, షేన్ వాట్సన్ 20 మ్యాచ్‌ల్లో 27, మహేల జయవర్ధనే 31 మ్యాచ్‌ల్లో 25 చొప్పున సిక్సర్లు కొట్టారు. కాగా, టి-20 వరల్డ్ కప్‌లో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్న అఫ్రిదీ కేవలం 57 బంతుల్లోనే 117 పరుగులు చేశాడు. 2007 టి-20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గేల్ చెలరేగిపోయినప్పటికీ వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొత్తం మీద గేల్ టి-20 వరల్డ్ కప్‌లో 807 పరుగులు సాధించాడు.

టాప్ స్కోరర్ కోహ్లీ
టి-20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. అతను 319 పరుగులు సాధించాడు.
నెదర్లాండ్స్‌కు చెందిన టాప్ కూపర్ 231, స్టెఫెన్ మైబర్గ్ 224 చొప్పున పరుగులు చేసి వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ 200, జీన్‌పాల్ డుమినీ 187 చొప్పున పరుగులు
సాధించారు.

శతకాలు
క్రిస్ గేల్ (117), మహేల జయవర్ధనే (100), సురేష్ రైనా (101), బ్రెండన్ మెక్‌కలమ్ (123), అలెక్స్ హాలెస్ (116 నాటౌట్), అహ్మద్ షెజాద్ (111 నాటౌట్) మాత్రమే ఇప్పటి వరకూ టి-20 వరల్డ్ కప్ టోర్నీలో శతకాలను నమోదు
చేయగలిగారు.

పరుగుల్లో ఉదారం
ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఉదారంగా పరుగులు అందించిన బౌలర్ల జాబితాలో సనత్ జయసూర్య (శ్రీలంక) మొదటి స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 64 పరుగుల సమర్పించుకున్నాడు. అదే జట్టుతో ఆడుతున్నప్పుడు బంగ్లాదేశ్ ప్రస్తుత కెప్టెన్ మష్రాఫ్ మొర్తాజా 63 పరుగులిచ్చాడు. కెన్యా ఆటగాడు ఆన్యాంగో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 61, భారత్‌ను ఢీకొన్నప్పుడు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 60 చొప్పున పరుగులు ఇచ్చారు.

నాగపూర్‌లో మొదలు..
నాగపూర్‌లో ఈనెల 8వ తేదీ నుంచి మొదలుకానున్న టి-20 వరల్డ్ కప్ 27 రోజులు కొనసాగుతుంది. మొత్తం మీద వివిధ దేశాలకు చెందిన 19 మంది క్రికెటర్లు వరుసగా ఆరోసారి ఈ మెగా టోర్నీలో ఆడనున్నారు. భారత్‌లోని ఎనిమిది కేంద్రాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఏప్రిల్ 3న ఫైనల్ జరుగుతుంది.

భారీ భాగస్వామ్యాలు
టి-20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని అందించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో శ్రీలంక సూపర్ స్టార్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర అగ్రస్థానాన్ని ఆక్రమించారు. వెస్టిండీస్‌పై వీరు రెండో వికెట్‌కు 166 పరుగులు జోడించారు. ఈ జాబితాలో రెండో స్థానం అలెక్స్ హాలెస్, ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) జోడీకి లభించింది. వీరు శ్రీలంకపై మూడో వికెట్‌కు 152 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్, డ్వెయిన్ స్మిత్ దక్షిణాఫ్రికాపై మొదటి వికెట్‌కు 145 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పారు. ఈ జాబితాలో వీరిది మూడో స్థానం. వికెట్ల వారీగా చూస్తే మొదటి వికెట్‌కు వీరి భాగస్వామ్యమే అత్యుత్తమమైనది. రెండో వికెట్‌కు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర వెస్టిండీస్‌పై చేసిన 166 పరుగుల స్కోరు వస్తుంది. మూడో వికెట్‌కు హాలెస్, మోర్గాన్ 152, నాలుగో వికెట్‌కు కూడా వీరిద్దరే 107, ఐదో వికెట్‌కు షోయబ్ మాలిక్, మిస్బా ఉల్ హక్ 119 (వికెట్ పడకుండా), ఆరో వికెట్‌కు కామెరూన్ వైట్, మైఖేల్ హస్సీ 101 (వికెట్ కూలకుండా), ఏడో వికెట్‌కు మైఖేల్ హస్సీ, మిచెల్ జాన్సన్ 74, ఎనిమిదో వికెట్‌కు మైఖేల్ హస్సీ, మిచెల్ జాన్సన్ 53 (వికెట్ కూలకుండా), తొమ్మిదో వికెట్‌కు గులాబ్ నబీ, షాదత్ జర్డాన్ 44, పదో వికెట్‌కు నికితా మిల్లర్, సులేమాన్ బెన్‌తోపాటు స్టీవెన్ ఫిన్, బ్రాత్‌వైట్ కూడా 20 పరుగుల భాగస్వామ్యాలను అందించారు.

ఉత్తమ బౌలింగ్..

టి-20 వరల్డ్ కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణలో శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ రికార్డు పుటల్లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అతను 2012 సెప్టెంబర్ 18న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకకే చెందిన రంగన హెరాత్ 2014 మార్చి 31న న్యూజిలాండ్‌పై కేవలం మూడు పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చాడు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ 2009 జూన్ 13న జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగులకు 5 వికెట్లు సాధించాడు. నెదర్లాండ్స్ బౌలర్ అసాన్ మాలిక్ 2014 మార్చి 27న దక్షిణాఫ్రికాపై 19 పరుగులిచ్చి 5, శ్రీలంక పేసర్ లసిత్ మలింగ 2012 అక్టోబర్ ఒకటోతేదీన ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడుతూ 31 పరుగులకు 5 చొప్పున వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ పేరు ఈ జాబితాలో ఉంది. అతను మొత్తం 16 వికెట్లు కూల్చాడు.

జయాపజయాల చిట్టా

ఇప్పటి వరకూ జరిగిన ఐదు టి-20 ప్రపంచ కప్ టోర్నీల్లో మొత్తం 18 జట్లు పాల్గొన్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఐదేసి పర్యాయాలు ఈ టోర్నీకి హాజరయ్యాయి. టెస్టు హోదాగల మరో జట్టు జింబాబ్వే నాలుగు పర్యాయాలు టోర్నీలో ఆడింది. కాగా, అఫ్గానిస్తాన్ మూడుసార్లు ఈ టోర్నీలో పాల్గొని 7 మ్యాచ్‌లు ఆడింది. ఒక విజయాన్ని సాధించింది. ఆరు పరాజయాలను ఎదుర్కొంది. ఆస్ట్రేలియా 25 మ్యాచ్‌ల్లో 14 విజయాలను సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఓడింది. బంగ్లాదేశ్ 18 మ్యాచ్‌లో కేవలం మూడు మాత్రమే గెల్చుకుంది. 15 మ్యాచ్‌లను చేజార్చుకుంది. ఇంగ్లాండ్ 26 మ్యాచ్‌ల్లో 11 విజయాలను అందుకోగా, 14 పరాజయాలను చవిచూసింది. ఒక మ్యాచ్‌లో ఫలితం వెల్లడికాలేదు. హాంకాంగ్ మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయాన్ని సాధించింది. రెండు పరాజయాలను ఎదుర్కొంది. భారత్ ఇప్పటి వరకూ 28 మ్యాచ్‌లు ఆడి, 17 మ్యాచ్‌ల్లో విజయభేరి మోగించింది. తొమ్మిది పరాజయాలను ఎదుర్కొంది. ఒక మ్యాచ్‌లో ఫలితం వెల్లడికాలేదు. ఐర్లాండ్ 12 మ్యాచ్‌లు ఆడి, మూడు గెలిచింది. ఏడు ఓడింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. కెన్యా ఆడిన రెండు మ్యాచ్‌లనూ కోల్పోయింది. నేపాల్ మూడు మ్యాచ్‌లో రెండు విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొంది. నెదర్లాండ్స్ 9 మ్యాచ్‌లు ఆడి, నాలుగు విజయాలు, ఐదు పరాజయాలను చవిచూసింది. న్యూజిలాండ్ 25 మ్యాచ్‌లు ఆడి 11 గెలిచింది. 12 మ్యాచ్‌లను ఓడింది. పాకిస్తాన్ 30 మ్యాచ్‌లు ఆడి, 18 విజయాలను సాధించింది. 11 మ్యాచ్‌లను ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. స్కాట్‌లాండ్ నాలుగు మ్యాచ్‌లో మూడింటిని కోల్పోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. దక్షిణాఫ్రికా 31 మ్యాచ్‌లు ఆడి, 21 విజయాలను అందుకుంది. పది పరాజయాలు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి.
శ్రీలంక 31 మ్యాచ్‌ల్లో 21 విజయాలను నమోదు చేయగా, 9 పరాజయాలను ఎదుర్కొంది. ఒక మ్యాచ్‌లో ఫలితం వెల్లడికాలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మూడు మ్యాచ్‌లు ఆడి, అన్నింటినీ కోల్పోయింది. వెస్టిండీస్ 25 మ్యాచ్‌లు ఆడి, 12 విజయాలు సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఓడింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. జింబాబ్వే 9 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు విజయాలు సాధించింది. ఆరు పరాజయాలను చవిచూసింది.

- మైత్రేయ