పశ్చిమగోదావరి

మరింత గడ్డుకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 4: వ్యవసాయరంగాన్ని దాదాపు కుదిపేసే స్ధితిలో మరో నిర్ణయం అమలులోకి రానుంది. అదే ఎరువులకు నగదు బదిలీ అంశం. కేంద్రప్రభుత్వం గ్యాస్‌కు అనుసరించిన విధానానే్న ఎరువులకు కూడా వర్తింపచేయాలని తాజాగా నిర్ణయించింది. దీనిలోభాగంగా దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాలను పైలెట్ జిల్లాలుగా ఎంపిక చేయగా ఆ జాబితాలో పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఉంది. ఈ నెల 7వ తేదీన దీనిపై ఢిల్లీలో పెద్దఎత్తున కసరత్తు జరగనుంది. ఈ భేటీకి హాజరుకావాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్‌కు కూడా ఆహ్వానం అందింది. అయితే ఇంత కీలకమైన నిర్ణయం జిల్లాలో ఏ విధంగా అమలవుతుందన్నది పెద్దఎత్తున ఆందోళనకు కారణమవుతోంది. గ్యాస్ విధానంలోనే తొలిదశలో అనేక సమస్యలు ఎదురుకావటం, వాటిలో కొన్ని కొనసాగుతూనే రావటం తెల్సిందే. అయితే అదే విధానం ఎరువుల విషయంలో అమలుచేయటం ఎంతవరకు ఆచరణ సాధ్యమన్నది పలు సందేహాలకు తావిస్తోంది. ప్రాథమికంగానే గ్యాస్, ఎరువుల వ్యవహారాల్లో భారీగా అంతరాలు ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం నగదు బదిలీ అంశాన్ని ఎరువుల విషయంలోనూ అమలుచేయాలని నిర్ణయించటం, దానిలో పశ్చిమ కూడా ఒక పైలెట్ జిల్లా కావటం గమనార్హం.
జిల్లాలో వ్యవసాయం జరుగుతున్న తీరును ఒక్కసారి పరిశీలిస్తే ఈపథకం అమలు ఎంత సజావుగా ముందుకు సాగుతుందో అంచనావేయవచ్చు. ప్రధానంగా జిల్లా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నా 90శాతానికి పైగా భూముల్లో వ్యవసాయం కౌలు రైతుల ఆధ్వర్యంలోనే నడుస్తుంది. దాదాపు రాష్ట్రంలోనే కౌలు రైతులు అత్యధికంగా ఉండే జిల్లాల్లో పశ్చిమ ప్రధమ స్థానంలో నిలుస్తుంది. వ్యవసాయ ప్రధానమైన జిల్లాలను నగదు బదిలీ అమలుకు ఎంచుకోవటంలో కారణాలు కన్పిస్తున్నా దాని అమలు మాత్రం ఆచరణ సాధ్యంకాదనే చెప్పుకోవచ్చు. జిల్లాలో మూడు లక్షలకు పైగా కౌలురైతులు ఉన్నారని ఒక అంచనా ఉంటే రుణ అర్హత కార్డుల సంఖ్య మాత్రం లక్ష దాటిన దాఖలాలు లేనేలేవు. ఇక ఆ తర్వాత కౌలు రైతులకు రుణాలిస్తున్న పరిస్థితి కూడా దాదాపుగా లేదనే చెప్పాలి.
ఈనేపథ్యాన్ని అలావుంచితే అయా గ్రామాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న భూములన్నీ యజమానుల ఆధీనంలోనే కొనసాగుతున్నాయి. వెబ్‌ల్యాండ్‌లోనూ భూ యజమానుల పేర్లే నమోదైఉన్నాయి. ఇటీవల జిల్లావ్యాప్తంగా భూసార పరీక్షల జాతర నిర్వహించి, భూయజమానుల పేరుమీదే అయా భూముల సారం, సామర్ధ్యంపై వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఇప్పుడు ఫలానా సర్వే నెంబరు గల భూమికి సంబంధించి ఎరువులు తీసుకోవాలంటే ఆప్రాంతంలో ఉన్న ఎరువుల దుకాణానికి వెళితే ఆన్‌లైన్‌లో ఆ సర్వే నెంబర్ కలిగిన భూమి సామర్ధ్యాన్ని బట్టి ఏ ఎరువులు ఎంతమోతాదులో వాడాలన్నది స్పష్టంగా నిర్దేశిస్తారు. ఆమేరకు మాత్రమే ఎరువులను అందజేస్తారు. ఇక్కడే ఒక మెలిక లేకపోలేదు. భూములన్నీ యజమానుల పేర్ల మీదే ఉండటం సహజం. ఆ పేర్ల మీదే భూసార పరీక్షల ఫలితాలు కూడా నమోదై ఉన్నాయి. ఇక ఎరువులు ఇవ్వాలంటే ఇటీవల బయోమెట్రిక్, ఇతర విధానాలనుకూడా ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధంచేశారు. ఇక తాజాగా నగదు బదిలీ కార్యక్రమం కూడా అమలైతే ఆవిధంగా ఎరువులు తీసుకుంటే యజమానులకు మాత్రమే ఆ మొత్తాన్ని ఇచ్చే అవకాశం ఉంది. దీనికితోడు తీసుకున్న ఎరువులకు సంబంధించిన సబ్సిడీ మొత్తాలు యజమానుల ఖాతాలోనే జమ అవుతాయి. అలా చూస్తే జిల్లాలో అత్యధికంగా ఉండే కౌలురైతుల పరిస్దితి పూర్తి అగమ్యగోచరంగా మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న పరిస్దితులు చూసుకుంటే డిఎపిని కొనాలంటే సబ్సిడీతో 1200 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. అలాకాకుండా నగదు బదిలీ అమలైతే సబ్సిడీ లేకుండా 2590 రూపాయలు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే యూరియా 350 రూపాయలకు అందుబాటులో ఉంటే ఈపధకం అమలైతే సబ్సిడీ లేకుండా దానికి 1900 రూపాయలు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయరంగంలో ఉన్న పరిస్దితులు, అమలవుతున్న విధానాలను చూసుకుంటే ఈ నగదు బదిలీ సహజంగానే యజమానులకు మాత్రమే ఉపయోగంగా ఉండి కౌలురైతులు ప్రస్తుతానికి వ్యవసాయం చేసే పరిస్దితిని లేకుండా చేసే అవకాశాలే కన్పిస్తున్నాయి. ఎక్కడో ఉన్న యజమాని వచ్చి ఎప్పటికప్పుడు ఎరువులు తీసుకుంటూ తన ఖాతాలో పడిన సబ్సిడి సొమ్మును కౌలురైతుకు ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో అందరికి తెల్సిందే. ఇలాంటి నేపధ్యంలో రానున్న రోజుల్లో వ్యవసాయరంగాన్ని పూర్తిస్దాయిలో కుదిపివేసే స్ధాయి ఉన్న నగదు బదిలీ నిర్ణయం జరగనుంది. వచ్చే అక్టోబర్ నుంచి ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. దీనిపైనే ఢిల్లీలో కలెక్టర్ల స్ధాయిలో కసరత్తు జరగనుంది. ఈనిర్ణయం అమలుకు సంబంధించి జిల్లా కలెక్టరు డాక్టరు భాస్కరే పూర్తి ఇన్‌ఛార్జిగా వ్యవహరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తంమీద వచ్చే వారంలో ఏ నిర్ణయం జరిగినా అది జిల్లా వ్యవసాయాన్ని పూర్తిస్దాయిలో ప్రభావితం చేస్తుందనే భావించాలి.