పశ్చిమగోదావరి

నేడు చంద్రబాబు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంతకుముందు హామీ ఇచ్చినవిధంగా ఈ మూడవ సోమవారం జిల్లాకు రానున్నారు. పోలవరం పనుల పరిశీలన, అధికారులతో సమీక్షను ప్రతి మూడవ సోమవారం క్షేత్రస్ధాయిలో చేస్తానని ఇంతకుముందు ప్రకటించిన విషయం తెల్సిందే. దానికితగ్గట్టుగానే సోమవారం జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి రానున్నారు. అయితే ఇంతకుముందు సోమవారాలతో పోలిస్తే ఈ సోమవారానికి మరింత విశిష్టత ఉందనే చెప్పాలి. యధాప్రకారం పోలవరం పనుల పరిశీలన, సమీక్షతోపాటు ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద పోలవరం కుడికాల్వపై ఏర్పాటుచేసిన సోలార్ పవర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. దాదాపు 34కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పవర్‌ప్లాంట్ అయిదు మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంతకుముందు ఎన్నడూలేనివిధంగా సోలార్ విద్యుత్‌కు ప్రభుత్వం పెద్దపీట వేస్తుండటం తెల్సిందే. దానిలోభాగంగానే భారీగా సోలార్ పవర్‌ప్లాంట్‌లు ఏర్పాటుచేసేందుకు అనువైన స్ధలాలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినదగ్గర నుంచి ఆనే్వషిస్తూనే వచ్చారు. కాగా పలు దేశాల్లో కాల్వలపై ఉండే స్ధలాన్ని వినియోగించుకుంటూ పెద్దఎత్తున సోలార్ పవర్‌ప్లాంట్‌లను ఏర్పాటుచేస్తూ వస్తున్నారు. ఆ అవకాశాన్ని వినియోగించుకునేందుకు జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ ఎన్నో అవకాశాలు ఉండటాన్ని గుర్తించారు. అవిధంగా ఎపి జెన్‌కో ఆధ్వర్యంలో అయిదుమెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్‌ను పోలవరం కుడికాల్వ గట్ల వెంబడి నిర్మించారు. ఇది దేశంలోనే ఇలాంటి ప్రాజెక్టుల్లో విశిష్టమైందని చెప్పుకోవాలి. దాదాపుగా 17వేల సోలార్ ప్యానల్స్‌ను, అయిదు ఇన్వర్టర్లను, మూడు ట్రాన్స్‌ఫార్మర్లను దీనిలో ఏర్పాటుచేశారు. మొత్తం ఈప్రాజెక్టుకు 34కోట్ల రూపాయలు ఖర్చుకాగా ఇందులో 7.5కోట్ల రూపాయలను కేంద్రప్రభుత్వం సబ్సిడీగా అందజేసింది. కుడికాల్వ గట్ల వెంబడి 27ఎకరాల విస్తీర్ణంలో ఈప్రాజెక్టును ఏర్పాటుచేశారు. ఇక్కడ ఏడాదికి 7.5మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తుండగా ఆ మొత్తాన్ని జెన్‌కో ద్వారా ఎపిఇపిడిసిఎల్‌కు యూనిట్‌కు 5.99 రూపాయలకు అందజేస్తారు. కనీసం 25సంవత్సరాల కాలపరిమితి ఉంటుందని భావిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా అటు ట్రాన్స్‌కోకు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాలకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుందని చెపుతున్నారు. ఈప్రాజెక్టు ద్వారా పరిసర గ్రామాలైన నారాయణపురం, చేబ్రోలు, ముర్రమళ్ల, వెల్లమిల్లి, బాదంపూడి, గొల్లగూడెం, నల్లమాడులే కాకుండా మిగిలిన ప్రాంతాలకు కూడా అంతరాయాలు లేనివిధంగా అంతకుమించి వ్యవసాయ అవసరాల నిమిత్తం అవసరమైన విద్యుత్‌ను అందించే అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి విశిష్టమైన ప్రాజెక్టుకు సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక దీంతోపాటు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం పోలవరంలోనే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు అందజేయనున్నారు. కాగా ఇంతకుముందు ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 10గంటలకు గొల్లగూడెం చేరుకుని జిల్లా పర్యటనను ప్రారంభిస్తారని భావించారు. అయితే ముఖ్యమంత్రి పనుల వత్తిడి కారణంగా పర్యటనను ఉదయం 9గంటల నుంచే ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. 9గంటలకు నేరుగా హెలికాప్టర్‌లో గొల్లగూడెం చేరుకుని పవర్‌ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో చర్చిస్తారు. ఆతర్వాత 10.30గంటలకు పోలవరం హెడ్‌వర్క్స్ ప్రాంతానికి చేరుకుంటారు. పనుల పరిశీలన నిర్వహించి 11.30గంటలకు ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఒంటిగంటకు అక్కడ నుంచి బయలుదేరి వెళతారు.
సారీ..క్యాష్‌లేదు!

భీమవరం, నవంబర్ 20: పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కలిసి సుమారు 30 శాఖలు భీమవరంలో పని చేస్తాయి. వీటికి సంబంధించిన సిడిఎం, ఎటిఎంల నుంచి ఆదివారం నగదును జమ చేసి, విత్‌డ్రా చేసుకునే ఈ మెషీన్లు పని చేయలేదు. దీంతో ఖాతాదారులు చాలా ఇక్కట్లు పడ్డారు. ఒకటి రెండు ఎటిఎంలలో కొంత మేర నగదు మాత్రమే ఉండటంతో కొద్ది సేపటికే అ ఎటిఎం ఖాళీ అయిపోయింది. నగదు మార్పులు తగ్గినా..ఎటిఎంలలో విత్ డ్రాలు పెరిగాయి. మరి వీటి కష్టాలు ఎప్పటికి తీసుతాయో!
మడికట్టుకుంటే కుదరదు
*అందరూ బయటకు రావాల్సిందే*ఐక్యతతోనే అభివృద్ధి*సినీనటుడు చంద్రమోహన్

ఏలూరు, నవంబర్ 20: ఇప్పుడు సమాజం మన పాతకాలంలో ఉన్నట్లు లేదు... సమాజాన్ని బట్టి మనం మారాలి... మడికట్టుకుని కూర్చుంటే ఒంటరిగా మిగిలిపోతాం... బయటకు వచ్చి సమాజంలోని అన్నిరంగాల్లోనూ ప్రాధాన్యత చాటుకున్నప్పుడే ఏ కులానికైనా గుర్తింపు, గౌరవం... ఇదే సమయంలో ఐక్యతతోనే ఏ కులమైనా అభివృద్ధి సాధిస్తుంది... అంటూ సినీనటులు చంద్రమోహన్ బ్రాహ్మణులకు దిశానిర్దేశం చేశారు. ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడకు సమీపంలోని సారధితోటలో ఆదివారం బ్రాహ్మణుల కార్తీక వనసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రమోహన్ మాట్లాడుతూ అన్ని కులాలు క్రియాశీలకంగా మారుతున్నాయని, అలాంటి పరిస్దితుల్లో బ్రాహ్మణులు మాత్రం ఆ దారిలో వెళ్లకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని, ఒంటరితనం ఎదురవుతుందని అప్రమత్తం చేశారు. బేషజాలు వదులుకుని, నలుగురితో కలిసి ముందుకు వెళ్లినప్పుడే సమాజం కూడా ఆహ్వానిస్తుందని చెప్పారు. అయితే ఇదే సమయంలో బ్రాహ్మణులంతా ఐక్యంగా ముందుకు సాగినప్పుడే ఆ ఫలితాలు అందరికి అందుతాయని పేర్కొన్నారు. ఐక్యకార్యాచరణ సమితి నాయకులు మాట్లాడుతూ బ్రాహ్మణుల్లో ఐక్యత సాధించేందుకు తమవంతు కృషి చేస్తున్నామని చెప్పారు. అయితే ఇంతకాలం అటు రాజకీయంగాను, ఇటు సామాజికపరంగాను బ్రాహ్మణులు వివక్షను ఎదుర్కొంటూ వస్తున్నారని, ఆ పరిస్దితి నుంచి బయట పడేందుకు ఐక్యతతో కృషి చేస్తున్నామన్నారు. అయితే ఇంకా అవసరమైన మార్పులు కన్పించటం లేదని, రాజకీయపార్టీలు ఈకులాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని చెప్పారు. దీనికి నిదర్శనంగా ఇటీవలకాలంలో ప్రకటించిన ఆలయ ధర్మకర్తల మండలి కమిటీలను వారు పేర్కొన్నారు. ఆ కమిటీల్లో ఎక్కడా బ్రాహ్మణులకు స్ధానం కల్పించకపోవటం అన్యాయమని, పూజలు, పునస్కారాలు వీరితో చేయిస్తూ నిర్వాహణలో మాత్రం వారికి పాత్ర లేకుండా చేయటం సహేతుకం కాదన్నారు. ఇంతకుమించి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన ఆలయ కమిటీల్లోనూ వారికి ప్రాతినిధ్యం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినీనటులు చంద్రమోహన్‌ను సమితి నాయకులు ఘనంగా సత్కరించగా, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నేత సత్యవాడ దుర్గాప్రసాద్ ఆయనకు స్వర్ణ కంకణాన్ని బహుకరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబికా రాజా, రాష్ట్ర బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టరు ఎంబిఎస్ శర్మ, ఐక్యకార్యాచరణ సమితి అధ్యక్షులు వివివి హనుమంతరావు, కార్యదర్శి తోలేటి శ్రీనివాస్, కోశాధికారి దుర్భ విజయసాగర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ద్రోణంరాజు వెంకటరమణ, నాయకులు సిఎపి శ్రీనివాసరామానుజాచార్యులు, కె కృష్ణమాచార్యులు, మంత్రిప్రగడ శ్రీహరిరావు, డాక్టరు డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు అయిదువేల మంది బ్రాహ్మణులు ఈ కార్తీకసమారాధనలో పాల్గొన్నారు.

వ్యభిచార ముఠా గుట్టురట్టు
పోలీసుల అదుపులో ముగ్గురు: గుడివాడకు కేసు బదిలీ
ఏలూరు, నవంబర్ 20: స్ధానిక కొత్తబస్టాండ్ వద్ద చోటుచేసుకున్న ఒక చిన్న ఘటన చివరకు పెద్ద వ్యభిచారముఠా గుట్టును రట్టుచేసింది. ముంబైకి చెందిన ఒక యువతి కొత్తబస్టాండ్ వద్ద కారు దిగింది. ఈలోగా ఆ కారు వేగంగా అక్కడ నుంచి దూసుకుపోయింది. అయితే తన సామాన్లు అందులో ఉండిపోయాయంటూ ఆ యువతి ఆందోళన చెందుతుండగా పక్కనే ఉన్న త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని స్ధానికులు సూచించారు. అవిధంగా ఆ యువతి పోలీసుస్టేషన్‌కు చేరింది. ఆతర్వాత కారు వివరాలను సేకరించి చివరకు ఇందులో ఏదో తిరకాసు ఉందని గమనించిన పోలీసులు ఆమెను వెంటాడుతూ వచ్చారు. అక్కడ నుంచి పోలీసు ట్రాప్ మొదలైంది. చివరకు ఆ యువతిని కారు నుంచి దింపేసి వెళ్లిపోయిన వాహనం స్ధానిక జూట్‌మిల్లు వద్ద ఉండగా యువతి గుర్తించటంతో పోలీసులు ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆతర్వాత పోలీసు విచారణలో ఇది అంతా పెద్ద వ్యభిచార రాకెట్టుగా గుర్తించారు. ముంబైకి చెందిన యువతులను బెంగుళూరులో ఉన్న ఒక మహిళ తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తూ వస్తోంది. అలాగే వారిని ఏలూరు, విజయవాడ, రాజమండ్రి ఇలా పలుప్రాంతాల్లో ఉన్న వ్యభిచార గృహాలకు ఒకటి,రెండురోజులపాటు పంపుతుంటుంది. అవిధంగానే ఈ యువతి రాష్ట్రానికి చేరుకుంది. అయితే విజయవాడలో రెండురోజులు ఉన్నతర్వాత రాజమండ్రి వెళ్లాలంటూ నిర్వాహకులు సూచించటంతో ఆమె దాన్ని వ్యతిరేకించి బెంగుళూరు వెళ్లిపోతానని పట్టుపట్టినా ఎలాగోలా సర్దిచెప్పుకుంటామని రాజమండ్రి నిర్వాహకులు ఆమెను తీసుకుని బయలుదేరారు. అయితే అక్కడకు రానని ఆమె మొండికేయటంతో ఆమెను ఏలూరులో వదిలేసి ఆమె సామాన్లు, ఐడికార్డులు తీసుకుని కారులో వారు ఉడాయిస్తూ చివరకు ఆమె పోలీసుస్టేషన్‌కు చేరటంతో వారి ఆదుపులోకి వెళ్లాల్సి వచ్చింది. కాగా ఈయువతి విజయవాడలో ఉన్న సమయంలో గుడివాడకు చెందిన ఒక టాక్సీ డ్రైవర్‌తో సంబంధం ఏర్పడటం, అతను ఈమెను వినియోగించుకుని సొంతంగా ఒక గృహాన్ని నిర్వహించే పరిస్ధితి వచ్చింది. అసలు కధ గుడివాడలో ప్రారంభం కావటంతో త్రీటౌన్ పోలీసులు ఈ కేసును గుడివాడ స్టేషన్‌కు బదిలీ చేశారు. కాగా ఈవ్యవహారంలో బయటపడుతున్న అంశాలను చూస్తే రాష్టవ్య్రాప్త నెట్‌వర్కే కాకుండా అంతరాష్ట్ర ముఠా కూడా బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భీమవరంలో అంతర్జాతీయ ఆక్వా సదస్సు
సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు , చైనా, తైవాన్, యుకె దేశాల నుంచి వ్యాపారులు, శాస్తవ్రేత్తలు రాక

భీమవరం, నవంబర్ 20: మరో సారి భీమవరం అంతర్జాతీయ సదస్సుకు వేదికకానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11,12,13 తేదీల్లో ‘ఫ్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్ -2017’తో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు చైనా, యుకె, బ్యాంకాక్, తైవాన్, ఇండోనేషియాతో పాటు అనేక దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, శాస్తవ్రేత్తలు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాయ సదస్సుకు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ఆనంద ఫౌండేషన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బ్యాంకాక్), ఆంధ్రప్రదేశ్ మత్య్సశాఖ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం సంయుక్తంగ ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించబోతోంది. భారతదేశం నుంచి రూ.32 కోట్ల రొయ్య ఎగుమతులు ప్రతీ ఏడాది జరుగుతున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తోంది. పైగా అమెరికా వంటి దేశాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. సముద్ర ఉత్పత్తులను కొనుగోలు చేసే దేశాలు పెరిగాయి. అంతేకాకుండా రొయ్యల సాగులో యాంటిబయోటిక్స్ వినియోగం ఎక్కువగా ఉంది. అన్ని దేశాల్లోని ఇదే పరిస్ధితి నెలకొంది. దీంతో అంతర్జాతీయంగ భారతదేశంలో పండించే రొయ్యతో పాటు ఇతర దేశాల్లోని చెరువుల్లో పండించే రొయ్యకు ఎదురుదెబ్బ తగులుతోంది. రొయ్య రైతులు కుదేలవుతున్నాయి. ఇక ఆ విధానానికి స్వస్ధి చెప్పి సేంద్రియ సాగును ప్రోత్సహించడం, దానికి మెళకువలు, చేపల ఉత్పత్తులను పెంచడం, అంతర్జాతీయంగ నాణ్యమైన రొయ్యలు, సముద్ర ఉత్పత్తులను ఎగుమతులు చెయ్యడం తదితర అంశాలపై 13 మంది వ్యాపారవేత్తలు, శాస్తవ్రేత్తలు ప్రసంగాలు చేయడం జరుగుతోంది. ఆదివారం నాడు భీమవరంలో ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు ఆద్వర్యంలో ఎపి మత్య్సశాఖ కమీషనర్ రమాశంకర్ నాయక్ అధ్యక్షతన ఆర్గనైజింగ్ కమిటీ బేటి అయ్యింది. ఈ బేటిలో అనేక అంశాలపైన చర్చించడం జరిగింది.

పెద్ద నోట్ల రద్దుతో రైతు నె త్తిన పిడుగుపాటు
* జనతాదళ్ (యూ) పార్టీ రాష్ట్ర సలహాదారులు డాక్టర్ శిరిగినీడి
నరసాపురం, నవంబర్ 20: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రైతుల నెత్తున పిడుగుపాటులా ఉందని జనతాదళ్ (యూ) పార్టీ రాష్ట్ర సలహాదారులు డాక్టర్ శిరిగినీడి నాగభూషణం అన్నారు. ఆదివారం బట్టల వర్తక సంఘం భవనంలో ‘్భరతదేశ ఆర్థిక వ్యవస్థ నాడు-నేడు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ నాగభూషణం మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండానే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో రైతులు, కూలీలు,సామన్య, మద్య తరగతి వర్గాలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో కూడా రెండు సార్లు పెద్దనోట్లను రద్దు చేయారని, అయితే ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారన్నారు. రాష్ట్రంలో వరి కోతల సమయం ఆసన్నం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కూలీలు, యంత్ర పరికరాలకు సొమ్ము చెల్లించేందుకు రైతుల వద్ద చిల్లర లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి రైతులు, ప్రజలను ఆదుకోవాలని డాక్టర్ నాగభూషణం డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కవురు పెద్దిరాజు, సిపిఐ నాయకులు నెక్కంటి క్రాంతికుమార్, కాంగ్రస్ పార్టీ నాయకులు చీర్ల రామచంద్ర రావు, జెడియూ నాయకులు కరింశెట్టి చంద్రశేఖర రావు, వైసిపి నాయకులు ముత్యాల వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
ఉంగుటూరు, నవంబర్ 20: ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడ నుండి గొల్లగూడెం, పోలవరంలో దిగే హెలికాప్టర్ ట్రయల్న్ పూర్తి చేశారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రశేఖరరావు ఆదివారం సభాస్థలిని, హెలిపాడ్‌ను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. అలాగే సిఎం సెక్యూరిటీ ఎస్పీ ఎం సుందరరావు, డిఎస్పీ నాగేశ్వరరావు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. హెలిపాడ్‌ను బాంబ్ స్క్వాడ్ బృందం పరిశీలించింది. ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
కార్యక్రమంలో స్వల్ప మార్పు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలుత గొల్లగూడెంలో హెలికాప్టర్‌లో దిగి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సభలో మాట్లాడాల్సి ఉంది. అనంతరం విద్యుత్ ప్లాంటును ప్రారంభించాలి. అయితే కార్యక్రమంలో జరిగిన స్వల్ప మార్పుల కారణంగా ఆయన హెలికాప్టర్ దిగిన వెంటనే నేరుగా విద్యుత్ ప్లాంటును ప్రారంభించి అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడతారని సిఎం సెక్యూరిటీ ఎస్పీ సుందరరావు తెలిపారు. కాగా ముఖ్యమంత్రి తొలిసారిగా గొల్లగూడెం వస్తున్నందున కార్యకర్తలు గ్రామాన్ని తోరణాలు, జెండాలతో అలంకరించారు.
పోలవరం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సోమవారం చేసే పర్యటనా ఏర్పాట్లను ఆర్డీవో ఎస్ లవన్న, పోలవరం, జంగారెడ్డిగూడెం డిఎస్పీలు రవికుమార్, జె వెంకటరావులు ఆదివారం పర్యవేక్షించారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చేరుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనులను పరిశీలిస్తారు. అనంతరం రెండున్నర నుంచి మూడున్నర గంటల వరకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, కాంట్రాక్ట్ ఏజన్సీ ప్రతినిధులతో సమావేశమై ప్రాజెక్టు నిర్మాణ పనులపై రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం విజయవాడ బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా బందోబస్తు నిర్వహించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ఆదివారం సాయంత్రమే పోలవరానికి చేరుకుని ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లారు.
సీనియర్లకు ఆదరణ కరవు
సినీ నటుడు చంద్రమోహన్
ఏలూరు, నవంబర్ 20 : తన సినీ ప్రస్థానంలో గతానికి, నేటికీ ఎంతో వ్యత్యాసం వుందని, తాను హీరోగా నటిస్తున్నాగానీ సీనియర్లు సెట్టుకు వస్తే తామెంతో మర్యాదగా లేచి నిలబడేవారని, కాగా నేడు ఆ సంస్కృతి లేదని సినీ నటుడు చంద్రమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పవర్‌పేటలోని అంబికా భవన్ వద్ద విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఏలూరుతో తనకు మంచి అనుబంధం వుందని, ఇక్కడకు వస్తే తాను పుట్టింటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. తన విద్యాభ్యాసం అంతా కూడా ఈ ప్రాంతాల్లోనే చేశానని, తన స్వగ్రామం ఉయ్యూరు మండలం పైడిముక్కల గ్రామం అని, అయినప్పటికీ ఏలూరుతో విడదీయరాని అనుబంధం వుందని అన్నారు. ముఖ్యంగా అంబికా కుటుంబ సభ్యులంటే తనకెంతో గౌరవమని, వారు కూడా ఎంతో సత్ప్రవర్తనతో స్నేహభావంగా వుంటారని అన్నారు. వారి కారణంగానే తరచూ ఏలూరు వస్తున్నానన్నారు. తాను బాపట్లలో బి ఎస్‌సి అగ్రికల్చర్ చేసి 1966 వరకు డిమానిస్ట్రేటర్‌గా పనిచేశానని, అనంతరం సినీ రంగ ప్రవేశం చేశానని పేర్కొన్నారు. దాదాపు 800లకు పైగా చిత్రాల్లో నటించానని, ఇప్పుడు కూడా ఇంకా కొన్ని సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. స్వర్గీయ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు 1966లో పెద్ద సంస్థల సహకారంతో కొత్త చిత్రాలు తీయడానికి ముందుకు వచ్చారని, ఆ తరుణంలో తాను ఎంపికయ్యానని చెప్పారు. కృష్ణ, కృష్ణంరాజు, తాను ఒకే సారి సినీరంగ ప్రవేశం చేశానని పేర్కొన్నారు. తాను నటించిన రంగులరాట్నం చిత్రం ఉత్తమ చిత్రమేకాకుండా స్వర్ణపతకం కూడా లభించిందన్నారు. అలాగే సిరిసిరి మువ్వ వంద రోజులు ఆడి మంచి పేరు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం గోపీచంద్‌తో నటిస్తున్న ఆక్సిజన్ చిత్రం, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం, శ్రీను వైట్ల వరుణ్‌తేజ్‌తో నిర్మిస్తున్న చిత్రంలోనూ తాను నటిస్తున్నట్లు చెప్పారు. నేటి చిత్రాల్లో సాహిత్యం పూర్తిగా పోయిందని, ఎక్స్‌పోజింగ్‌లు, ఫైట్స్‌కే పరిమితమైపోయిందన్నారు. నేడు వస్తున్న హీరోలకు పెద్దలంటే గౌరవమే లేదని, ఒక సినిమా కొద్దిపాటి హిట్టైనా గానీ అమితాబచ్చన్, ఎన్టీఆర్ లెవెల్‌లో ఫోజులు ఇస్తుంటారని అన్నారు. నేడు చిరంజీవి, బాలకృష్ణ వంటి నటులు ఎంతో గౌరవమిస్తున్నారని అన్నారు. నేడు వస్తున్న చిత్రాల్లో కూడా కామెడీ పూర్తిగా తగ్గిందన్నారు. ఆశించిన రీతిలో కూడా వేషాలు రావడం లేదని పేర్కొన్నారు. తనకు ఇద్దరు ఆడపిల్లలని, వారంతా సెటిల్ అయ్యారని, సినీ రంగానికి వారు వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
అమిత్‌షా సభ జయప్రదం చేయండి
తాడేపల్లిగూడెం, నవంబర్ 20: ఈ నెల 26న తాడేపల్లిగూడెంలో జరిగే అమిత్‌షా సభ జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధ్రీశ్వరి కోరారు. ఆదివారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. బిజెపి హయాంలో రైతులకు యూరియా కొరత తీరిందని, పంటలకు బీమా కల్పించిందన్నారు. అలాగే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తోందన్నారు.
వైభవంగా సువర్చలా హనుమత్కల్యాణం
జంగారెడ్డిగూడెం, నవంబర్ 20: స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాసోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ సువర్చలా హనుమత్కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఈ కల్యాణోత్సవం కన్నుల పండువుగా నిర్వహించారు. గురవాయిగూడెంకు చెందిన వేదాంతం శ్రీరామ్, సాయిపూజిత దంపతులు, కామవరపుకోటకు చెందిన కుమారి యండమూరి దీప్తితేజ ఉభయదారులుగా పాల్గొని ఈ కల్యాణోత్సవం జరిపించారు. దేవస్థానం ఛైర్మన్ యిందుకూరి రంగరాజు, కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ) కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నసమారాధన జరిగింది. ఆదివారం ఆలయానికి 1.71 లక్షల రూపాయల ఆదాయం లభించినట్టు ఇఒ శివ తెలిపారు. కాగా, స్వామివారిని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎస్‌ఎస్ మూర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి తమలపాకులతో అష్టోత్తరపూజ చేయించుకున్నారు. అనంతరం వీరికి వేదాశీర్వచనం అందజేసి, స్వామివారి శేషవస్తమ్రులతో సత్కరించారు. అనంతరం ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సామ్రాజ్యం దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఛైర్మన్ యిందుకూరి రంగరాజు, ఇఒ శివ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామివారి పూజల అనంతరం వేదాశీస్సులు అందజేసి, స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. సోమవారం స్వామివారికి లక్ష లిల్లీపూలతో అర్చన నిర్వహిస్తున్నట్టు ఇఒ శివ తెలిపారు.