పశ్చిమగోదావరి

యాప్‌తో యాతనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 5 : పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో గత రెండు మూడు వారాలుగా సాగుతున్న నోట్ల కష్టాలు సా...గుతూనే వున్నాయి. సోమవారం కూడా సగం మంది జనం బ్యాంకులు, ఎటి ఎంల వద్దే క్యూలలో నిలబడి సగం పనిదినాన్ని కానిచ్చేశారు. దీనికి తోడు టోల్‌గేట్ల ఇబ్బందులు కూడా తోడయ్యాయి. అయితే ఈ విషయంలో కేంద్రం కొంత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం ప్రకటించినా గత రెండు రోజుల నుంచి మాత్రం ఈ ఇబ్బందులతో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతూ వచ్చాయి. సోమవారం కేంద్రం ఈ పరిస్థితిని గమనించి పాత 500 నోట్లు టోల్‌గేట్ల వద్ద చెల్లుతాయని ప్రకటించడంతో కొంతలో కొంత వెసులుబాటు లభించింది. అయితే నోట్ల రద్దు కారణంగా తలెత్తిన పరిస్థితులు మాత్రం ఎక్కడా చక్కబడలేదు. ఎటి ఎంల వద్ద దాదాపుగా ఒక పూట క్యూలో నిలబడినా దక్కుతున్నది రెండు వేలు నోటు కావడంతో జనమంతా గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్‌లో అవసరమైన స్థాయిలో వందనోట్లు లేకపోవడంతో ఈ రెండు వేల నోటు చేతుల్లో వున్నా పెద్దగా ఉపయోగం లేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఎక్కడ ఎటి ఎంలో నిలబడినా గంటన్నర, రెండు గంటల్లో మొత్తం నోట్లన్నీ ఖాళీ అవడంతో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ కారణంగా జనం ఉసూరుమంటు మరో ఎటి ఎం వద్దకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు కొన్ని బ్యాంకుల ఎటి ఎంలు దాదాపుగా తెరచుకోవడం లేదంటే అతిశయోక్తికాదు. ఈ బ్యాంకుల్లో విత్‌డ్రాల ద్వారానే లావాదేవీలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏది ఏమైనా రోజులు గడుస్తున్నా నోట్ల కష్టాలు పెరుగుతుండటమే తప్ప మార్కెట్‌లోకి చిన్న నోట్ల చెలామణి పెరుగుతున్న దాఖలా గానీ, ఉన్న కష్టాలు తగ్గే అవకాశాలు గానీ సమీప భవిష్యత్తులో కనిపించడం లేదనే చెబుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నామని, రానున్న రోజుల్లో వ్యవహారాలన్నీ నగదు రహితంగానే ఉంటాయన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. దీనితో మరో ప్రత్యామ్నాయం లేక ఇప్పుడున్న కష్టాలు తగ్గే మార్గం కనిపించక చాలామంది మొబైల్ వ్యాలెట్లు, బ్యాంకుల యాప్‌లతో కుస్తీ పట్టడం ప్రారంభించారు. అయితే ఏలూరు వంటి ప్రాంతంలోనే వీటిని వాడుతున్న వారి సంఖ్య అతి స్వల్పంగా, దాదాపుగా లేరంటే అతిశయోక్తి కాదనే పరిస్థితి కొనసాగుతున్న తరుణంలోనూ ఈ యాప్‌లతో లేటు వయస్సులో కుస్తీలు పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏ బ్యాంకుకు ఏ తరహా యాప్ ఉంది? మన దగ్గర వున్న యాప్‌కు సరిపడా నగదు తీసుకునే వారు కూడా ఈ యాప్ కలిగి వుండాలా? లేక ఎలాగైనా ఎకౌంట్‌కు పంపించవచ్చా? అన్న ప్రయోగాల్లోనే చాలా మంది మొబైల్ ఫోన్లను ప్రస్తుతం వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యం కాదు. అయితే అలవాటు లేని వ్యవహారం, అవగాహన లేని యాప్‌ల కారణంగా జనమంతా నానా తంటాలు పడుతున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో పండగలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడున్న నోట్ల కష్టాలు ఎప్పటికి చక్కబడతాయో, పండగ సరదా అయినా దక్కుతుందో లేదోనన్న ఆందోళనలో జనమున్నారు.