పశ్చిమగోదావరి

అసహనంతో రోడ్డెక్కుతున్న ఖాతాదార్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, డిసెంబర్ 8: పెద్దనోట్లు రద్దుచేసి నెల కావస్తున్నా యలమంచిలి, పోడూరు మండలాల్లో బ్యాంకు ఖాతాదారుల ఇబ్బందులు మాత్రం అలానే ఉన్నాయి. దీంతో నానాటికీ ఖాతాదారుల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. గురువారం యలమంచిలి ఎస్‌బిఐ వద్ద, పోడూరు మండలం కవిటం ఇండియన్ బ్యాంకు వద్ద ఖాదారులు ధర్నాకు దిగారు. స్థానిక ఎస్‌బిఐకు వచ్చిన రూ.6లక్షలు ఖాతాదారులు డ్రా చేసుకున్నారంటూ గేట్లు మూసివేయడంతో నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బ్యాంకు అధికారులతో చర్చించి, సొమ్ములు నేడు (శుక్రవారం) తీసుకునేలా టోకెన్లను ఖాతాదారులకు ఎస్సై అప్పారావు అందించారు. అలాగే పోడూరు మండలం కవిటంలో ఇండియన్ బ్యాంకుకు వచ్చిన రూ.10లక్షలు మూడు రోజులపాటు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో ఖాతాదారునికి రూ.2వేలు చొప్పునే ఇవ్వడంతో నిత్యం బ్యాంకు వద్దకు వచ్చి నిలబడాల్సి వస్తోందని ఖాతాదారులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. బ్యాంకు అధికారులు దిగివచ్చి ఒక్కొక్కరికీ రూ.4000 చొప్పున ఇవ్వడంతో శాంతించారు.
కైకరంలో...
ఉంగుటూరు: బ్యాంకుల్లో సొమ్ము ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, గంటల తరబడి సమయాన్ని వృధా చేయాల్సి వస్తోందని కైకరం స్టేట్ బ్యాంకు పరిధిలోని రైతులు, ఖాతాదారులు గురువారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు 30 నిముషాల పాటు జాతీయ రహదారిని స్తంభింపజేశారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై చావా సురేష్, తహసీల్దార్ అప్పారావు కైకరం వెళ్లి ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగితే వ్యవసాయ పనులు ఎలా చేస్తామని, పెట్టుబడులు ఎక్కడ్నుంచి తేగలమని ఆవేదన వ్యక్తం చేశారు. దాళ్వా ధాన్యం చేతికివ్వకుండా ప్రభుత్వ నిబంధనలంటూ బ్యాంకులకు లింకేజీ పెట్టడం వల్ల బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వక నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు.
బ్యాంకుల వద్ద బారులు తీరిన పింఛనుదారులు
చాగల్లు, డిసెంబర్ 8: పెద్దనోట్లు రద్దయి సరిగ్గా నెలరోజులైనా ప్రజలు, పింఛనుదారుల కష్టాలు తీరలేదు. బ్యాంకుల వద్ద బారులు తీరి ఉంటున్నారు. మరోపక్క ఉద్యోగులు పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ఎటిఎంలలో సరిపడా నగదు లేక క్యూలలో నిలబడి వంతు వచ్చేసరికి నగదు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రాబ్యాంకు వద్ద 9 గంటల నుండి వినియోగదారులు క్యూలో నిలబడుతున్నారు. ప్రభుత్వం, బ్యాంకులు ఖాతాదారుల ఇక్కట్లను పరిష్కరించాలని, చిన్న నోట్లు ఎటిఎంలలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కొల్లేరు కాలుష్యంపై సిపిఎం పాదయాత్ర
ఏలూరు, డిసెంబర్ 8: గొంతేరు, యనమదుర్రు, గోస్తనీ, కొల్లేరు జీవ నదులు, పంటకాల్వలు, డ్రైన్లు, మంచినీటి చెరువులు, భూగర్భజలాలు, తాగునీరు, సాగునీరు కాలుష్యంపై పోరాటంలో భాగంగా సిపిఎం గురువారం ఏలూరు మండలం కొల్లేరు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించింది. గుడివాకలంక, పత్తికోళ్లలంక, పైడిచింతపాడు, కొక్కిరాయిలంక తదితర గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరామ్ మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించాలని, కాలువలు, డ్రైన్లు, మంచినీటి చెరువులలో కొల్లేరులో కలవకుండా చూడాలని, కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాలుష్య వ్యర్ద జలాల తరలింపునకు ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలని సూచించారు. భూగర్భజలాలను, జల వనరులను కాలుష్యం నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. ఆక్వా మెగా ఫుడ్ పార్కును మత్స్యకారులకు హాని లేని వేరే ప్రాంతానికి తరలించాలని, తుందుర్రులో ఆక్వా యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కోరారు. డెల్టా ఆధునీకరణ పనులు అవినీతికి తావులేకుండా నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని, వంతెనల నిర్మాణాలను పూర్తిచేయాలని కోరారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు ఆర్ లింగరాజు, దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ మావూరి శ్రీనివాసరావు, కొల్లేరు సంఘ నాయకులు సైదు వెంకటేశ్వరరావు, సైదు కోటేశ్వరరావు, బలే రామకృష్ణ, సైదు శివప్రసాద్, ఘంటసాల వెంకటేశ్వరరావు, బలే సత్తిపండు తదితరులు పాల్గొన్నారు. ఈ బృందానికి కొల్లేరు గ్రామాల్లో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
ప్రజా సంతకాల సేకరణ
జిల్లాలో జీవనదులు, డ్రైన్లు, పంటకాల్వల్లో కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాభేరి పాదయాత్ర శుక్రవారం ముగింపు సందర్భంగా గురువారం నగరంలోని ఫైర్‌స్టేషన్ సెంటర్, పాతబస్టాండ్ సెంటర్‌లోనూ ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ, ఎన్ భాస్కరరావు, ఎస్ ఎన్ రమేష్, వై కనకేశ్వరరావు, మహిళా ప్రతినిధులు కొర్రి విజయలక్ష్మి, జి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపి ఎం నాయకులు ప్రకటించారు. ఉదయం 8 గంటలకు చాటపర్రులో పాదయాత్ర ప్రారంభమవుతుందని, 10 గంటలకు కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.