పశ్చిమగోదావరి

పరుగెడుతున్న పోలవరం పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, డిసెంబర్ 8: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యల కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతీ సోమవారం నిర్మాణ పనులపై వర్చువల్ ఇన్‌స్పెక్షన్, మూడవ సోమవారం నిర్మాణ ప్రాంతానికి వచ్చి పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, వేగవంతమవ్వటానికి అన్ని చర్యలు ముఖ్యమంత్రి తీసుకుంటున్నారన్నారు. గురువారం పోలవరం ప్రాజెక్టు పనులైన స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ పనులను, కాంక్రీట్ పనుల నిమిత్తం వచ్చిన అధునాతన యంత్రాన్ని పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చి రాతి పరీక్షలు నిర్వహిస్తున్న శాస్తవ్రేత్తల బృందాన్ని కలిసి పరీక్షల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి ఉమ మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో లక్షా 60వేల 541 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 83వేల 932 ఎకరాలు సేకరించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఒక రూపాయి ఖర్చు చేస్తే నిర్వాసితుల ప్యాకేజీకి, భూసేకరణకు రెండు రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. పట్టిసం ఎత్తిపోతల ద్వారా ఈ ఏడాది 55 టిఎంసిల నీటిని కృష్టా డెల్టాకు తరలించి పదిలక్షల 74వేల ఎకరాలకు నీటిని ఇవ్వడంతోపాటు చేపల చెరువులకు నీరందించామన్నారు. జనవరి మొదటి వారంలో డయాఫ్రంవాల్ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభిస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ పోలవరం మండలంలో భూసేకరణ దాదాపు పూర్తయ్యిందన్నారు. 14వేల 868 ఎకరాలు భూసేకరణకు రూ.560 కోట్లు చెల్లించామన్నారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇప్పటివరకు 11వేల ఎకరాల భూమిని సేకరించామని, ఇంకా 13వేల ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో రూ.21వేల కోట్ల రూపాయలు ప్యాకేజీకి, భూసేకరణకు ఖర్చు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ రంగంలో ముందుగా ఖాళీ చేయాల్సిన ఎనిమిది గ్రామాలకు రూ.110 కోట్లు స్పెషల్ గ్రాంటు ద్వారా నిర్వాసితులకు అదనపు ప్యాకేజీ చెల్లించామని కలెక్టర్ తెలిపారు. మంత్రి వెంట పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, ఎఎంసి ఛైర్మన్ పారేపల్లి రామారావు, ప్రాజెక్టు ఎఇ మునిరెడ్డి, ఆర్డీవో ఎస్ లవన్న, డిఎస్పీ రవికుమార్, ఎంపిపి పి అరుణకుమారి, జడ్పీటీసీ కుంజం సుభాషిణి, కుంచే దొరబాబు తదితరులున్నారు.

ముందు నుయ్య - వెనక గొయ్య
*ఒకపక్క తుపాను హెచ్చరికలు
*చేలో పంటను గట్టెక్కించాలంటే కరెన్సీ కొరత
*పొలం వెళ్లాలా - బ్యాంకు క్యూలో నిల్చోవాలా
*అయోమయంలో వరి రైతన్న
ఆచంట, డిసెంబర్ 8: ఒకపక్క తుపాను హెచ్చరికలు, మరోపక్క కరెన్సీ కటకటతో రైతుల పరిస్థితి ముందు నుయ్య, వెనక గొయ్య అన్నచందంగా తయారయ్యంది. ఓపక్క తుపాను తరుముకొస్తుండగా పంటంతా చేలోనే ఉండిపోయింది. పంట గట్టెక్కిద్దామంటే కూలీలకు, కోత యంత్రాలకు డబ్బులు ఇవ్వాల్సిందే. ఏరోజు డబ్బులు ఆరోజు ఇవ్వకపోతే కూలీలు వచ్చే పరిస్థితి లేదు. నగదు రహిత లావాదేవీలు వచ్చాక ఒక్క రూపాయి కూడా బయట అప్పు పుట్టకపోవడంతో బ్యాంకులో ఉన్న నగదుకోసం రోజంతా క్యూలోనే నిల్చుంటే కేవలం రోజుకు రూ.2 వేలు కూడా ఇవ్వని పరిస్థితి. ఆచంట స్టేట్‌బ్యాంకులో బుధవారం మధ్యాహ్నం నుండి గురువారం మధ్యాహ్నం వరకు నగదు లేకపోవడంతో ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామూలు ఖాతాదారులతో పాటు వృద్ధాప్య పెన్షన్లు, వితంతు, వికలాంగుల పెన్షన్లు కూడా బ్యాంకుల ద్వారా ఇవ్వడంతో రద్దీ మరింతగా పెరిగిపోయింది. దీంతో బ్యాంకు లోపల రద్దీ ఎక్కువగా ఉండి ఊపిరి కూడా ఆడని పరిస్థితుల్లో బ్యాంకు సిబ్బంది లోపల ఉన్న ఖాతాదారుల పని అయ్యేవరకు గేట్లు వేసి ఆ తరువాత మరలా బ్యాచ్‌లుగా పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు బ్యాంకు నుండి నగదు తెచ్చుకోలేక, చేతికందిన పంటనే చేలోనే వదల్లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెద్దనోట్ల రద్దయి నెల రోజులు దాటుతున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పు రావడం లేదు. సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. దీంతో బ్యాంకులకు వెళ్లాలంటేనే భయపడి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఖాతాదారులు బ్యాంకులో నగదు ఉంచుకుని ఇవ్వడం లేదని పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్న సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి.