పశ్చిమగోదావరి

పోలవరం నిర్వాసితుల కోసం 18 కాలనీలకు ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 10 : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకోసం కొత్తగా 18 ఇళ్లకాలనీలను ఆధునిక వసతిసౌకర్యాలతో ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సేద్యపునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణ పనుల ప్రగతి తీరుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టునకు సంబంధించి ఇంకా నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి 18 ఇళ్ల కాలనీలను అన్ని సౌకర్యాలతో నిర్మించే బాధ్యతను గృహ నిర్మాణ శాఖ, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖలకు అప్పగిస్తామని త్వరలోనే టెండర్లు పిలిచి యుద్ధప్రాతిపదికపై పనులు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పోలవరం ప్రాజెక్టునకు సంబంధించి ముంపునకు గురయ్యే భూములు, నిర్వాసితులకు భూమికి భూమి తదితర వాటికోసం 13800 ఎకరాలు ఇంకా సేకరించాల్సి వుందని ఇప్పటికే భూసేకరణకు ఇంకా వెయ్యి కోట్ల రూపాయల నిధులున్నాయని వాటిని 2017 మార్చి లోగా వినియోగించుకుంటే ఇంకా అవసరమైన నిధులను తీసుకురావడానికి తాను కృషి చేస్తానని కలెక్టర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని అందులో కూడా ఎక్కువ భాగం పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించేలా తాను చర్యలు తీసుకుంటానని చెప్పారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం పరిధిలో పోలవరం కుడి ప్రధాన కాల్వ పనులు యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని ముఖ్యంగా 75 కోట్ల రూపాయల వ్యయంతో 51 స్ట్రక్చర్ల నిర్మాణ పనులు చేపట్టి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఇందుకోసం పనులకు ఎక్కడా ఆటంకం కలగకుండా రెండు రోజుల్లో పట్టిసీమ ఎత్తిపోతల పధకం వద్ద అన్ని మోటార్లను పంపింగ్‌చేయడాన్ని నిలుపుదల చేస్తామని చెప్పారు. ఈ సీజన్‌లో రైట్ మెయిన్ కెనాల్ పరిధిలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని తాను మళ్లీ పోలవరం కుడికాల్వ వెంబడి జరుగుతున్న పనుల తీరును పరిశీలిస్తానని ఎప్పుడు వచ్చినా అధికారులు కాంట్రాక్టు ఏజెన్సీలతో పనులు చేయించేలా కనిపించాలని చెప్పారు. జిల్లాలో రబీ పంటకు 4.20 లక్షల ఎకరాలకు అవసరమయ్యే నారుమళ్లు ఈ నెల 18వ తేదీ నాటికల్లా పూర్తికావాలని వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే 6400 ఎకరాల్లో నారుమళ్లు వేసారని ఈ లోగా వార్ధా తుఫాన్ హెచ్చరిక రావడంతో నారుమళ్లు వేయడానికి రైతులు వెనుకంజ వేసారని బుధవారం తర్వాత మరో మూడు వేల ఎకరాల్లో నారుమళ్లు వేసేలా చస్తామని వ్యవసాయ శాఖ జెడి సాయి లక్ష్మీశ్వరి చెప్పగా వార్ధా తుఫాన్ వలన మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, కావున ఆయా ప్రాంతాలలో రైతులను అప్రమత్తం చేయాలని చెప్పారు. నారుమళ్లకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచి ఈ నెల 18వ తేదీ నాటికల్లా నారుమళ్ల ప్రక్రియ పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ సిహెచ్ భాను ప్రసాద్, ఆర్‌డివో కట్టా హైమావతి, పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ఎస్ ఇ శ్రీనివాసయాదవ్, ఇరిగేషన్ ఎస్ ఇ శ్రీనివాస్, సబ్ కలెక్టర్లు షాన్ మోహన్, సుమిత్ కుమార్ గాంధీ, గృహ నిర్మాణ శాఖ పిడి ఇ శ్రీనివాస్, భూసేకరణాధికారి ఆర్‌వి సూర్యనారాయణ, ఆర్‌డివోలు నంబూరి తేజ్‌భరత్, శ్రీనివాసరావు, లవన్న తదితరులు పాల్గొన్నారు.
వార్థా తుపానుపై అప్రమత్తం
ఏలూరు, డిసెంబర్ 10 : వార్ధా తుపాను ప్రభావం దృష్ట్యా జిల్లాలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం రాత్రి ఆన్‌లైన్‌లో వార్ధా తుఫాన్ కదలికల తీరును కలెక్టర్ పరిశీలించారు. వాతావరణ పరిశోధనా కేం6దం ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసామని ఏ క్షణంలో తుపాన్ ఎటువైపు పయనిస్తుందో నిరంతరం పరిశీలిస్తున్నామని ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం వెంబడి అవసరమైన నిత్యావసర సరుకులు ఇతర వస్తువులను సిద్ధం చేసామని చెప్పారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాన్‌కు వార్ధా అని నామకరణం చేసారని ఇది ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నెల్లూరు జిల్లాలో తీరం దాటవచ్చునని అంచనా వేస్తున్నారని దాని ప్రభావం వలన జిల్లాలో నరసాపురం, మొగల్తూరు, తదితర మండలాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నామని ఆయా మండలాల్లో వరిపంట ఇంకా పొలాల్లో ఉంటే వాటిని రైతులు జాగ్రత్త చేసుకోవాలని జిల్లా అంతటా ఇప్పటికే వరిపంట కోత పూర్తి కావస్తోందని అయినా సరే రైతులంతా పంటను సంరక్షించుకోవాలని చెప్పారు. జిల్లాలో వ్యవసాయ, ఇరిగేషన్, ఉద్యానవన, తదితర శాకాధికారులు సమన్వయంతో వ్యవహరించాలని రైతులను చైతన్యపరిచి పంట రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించాలని ఆదేశించారు. వర్ధా తుఫాన్ ప్రభావం వల్ల ఎక్కడా కూడా ప్రాణ నష్టంకానీ, ఆస్థినష్టం కానీ ముఖ్యంగా పశు సంపదకు నష్టం గానీ జరగకుండా అన్నీ ప్రాంతాలలో సంబంధిత మండలాధికారులు ఈ నెల 15వ తేదీ వరకు అప్రమత్తంగా వుండాలని ఏ ఒక్కరూ కూడా సెలవుపై వెల్లరాదని తుఫాన్ అనంతరం పరిస్థితులను కూడా అంచనా వేసి ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
గ్రామీణ క్రీడాకారుల గుర్తింపునకు కృషి:మంత్రి సుజాత
చాగల్లు, డిసెంబర్ 10: గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగిన్న క్రీడా ప్రతిభను, గుర్తించి వెలికితీసి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే విధంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని స్ర్తి, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. శనివారం చాగల్లు జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన 62వ ఆంధ్రప్రదేశ్ అంతర్రాష్ట్ర జిల్లాల అండర్-17 బాలబాలికల స్కూల్ గేమ్స్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2016-17 పోటీల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. విజేతలకు ట్రోఫీలను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కెఎస్ జవహర్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా అంతర్జాతీయ కీర్తిని సాధించవచ్చునని, విద్యతో పాటు క్రీడల పట్ల బాలబాలికలు ఆసక్తిని పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా విద్య, క్రీడల అభివృద్థికి చంద్రబాబు చేస్తున్న కృషిని సద్వినియోగం చేసుకొని రాణించాలన్నారు. 13 జిల్లాల నుండి 13 టీమ్స్ బాలబాలికల జట్లు పాల్గొనగా బాలుర విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు విన్నర్సుగాను, రన్నర్సుగా విశాఖ జిల్లా, బాలికల్లో వైజాగ్ జట్టు విన్నర్సు కాగా, రన్నర్సుగా నెల్లూరు జిల్లా విజేతలుగా నిలిచారు. పోటీల్లో 8 మంది బాలురు, బాలికల జట్టును నేషనల్ జట్టును ఎంపిక చేశారు. కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ రీజియన్ అధ్యక్షుడు సుధాకర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి శ్రీనివాస్, త్రిమూర్తులు, ఎంపిపి కోడూరి రమామణి, ఎఎంసి ఛైర్మన్ ఆళ్ల హరిబాబు, మాజీ కొవ్వూరు మున్సిపల్ ఛైర్మన్ సూరపని చిన్ని, గ్రామ సర్పంచ్‌లు జొన్నకూటి వెంకాయమ్మ, ఊబా దుర్గ, టిడిపి నాయకులు నాదెళ్ల నాని, కోడూరి ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి చిక్కాల సతీష్ కుమార్, నిర్వాహకులు పిఇటి కోడి రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
400 గ్రాముల బంగారు వస్తువులు, కారు, రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు టెలివిజన్లను స్వాధీనం : డిఎస్పీ పూర్ణచంద్రరావు
పెనుగొండ, డిసెంబర్ 10: పెనుగొండ సర్కిల్ పరిధిలో వివిధ దొంగతనాలు, నేరాలకు పాల్పడిన సంఘటనలో అంతర్‌రాష్ట్ర ముఠాను పట్టుకొని అరెస్టు చేసినట్టు డిఎస్పీ జి.పూర్ణచంద్రరావు తెలిపారు. పెనుగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ రాపాక గ్రామం వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎపి 37, బిఎల్ 7799 కారులో ముగ్గురు పాత నేరస్థులు ఉన్నారని, కారులో ఉన్న ముగ్గురిని విచారించగా మొదటి వ్యక్తి పెనుమంట్ర గ్రామానికి చెందిన జక్కంశెట్టి నాగరాజుగా, రెండవ వ్యక్తి కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన గుత్తికొండ పవన్‌కుమార్, మూడవ వ్యక్తి హైదరాబాద్ ఎల్‌బి నగర్‌కు చెందిన ఆవుల కిరణ్‌కుమార్‌గా గుర్తించామన్నారు. వీరి నుండి 400 గ్రాముల బంగారు వస్తువులు, కారు, రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు టెలివిజన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిలో పసుపులేటి కిరణ్‌కుమార్ అనే నేరస్థుడు పరారీలో ఉన్నట్టు డిఎస్పీ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో 7 నేరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 14 నేరాలు, వీటితోపాటు విశాఖపట్నం, కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ప్రాంతాల్లో కేసులున్నాయని, జైల్లో పరిచయమైన వీరు పలు కేసుల్లో నిందితులని డిఎస్పీ తెలిపారు.
నవంబరు 24వ తేదీన పెనుగొండ ఆంధ్రాబ్యాంకు వద్ద కుంచే బర్రమ్మ అనే వృద్ధురాలు తన వద్దనున్న రూ. లక్షా 10 వేల ఐదు వందల నోట్లు మార్చుకోవటానికి వెళ్లిన సంఘటనలో తిరిగి వస్తుండగా ఆమె వద్దనుండి సొమ్ము కాజేసిన సంఘటనలో నిడదవోలుకు చెందిన ఉర్ల శ్రీను అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు డిఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. బ్యాంకు వద్ద ఉన్న సిసి కెమెరాల ఆధారంగా ఈ నేరస్తుని పట్టుకున్నట్టు సిహెచ్ రామారావు తెలిపారు. ఈ దర్యాప్తులో పెనుగొండ, పెనుమంట్ర ఎస్సైలతో పాటు ఇరగవరం కానిస్టేబుల్ కొండ ధైర్యసాహసాలు ప్రదర్శించారని, ఇతనికి రివార్డు కోసం పై అధికారులకు సిఫార్సు చేసినట్టు తెలిపారు. పెనుగొండ సర్కిల్ పరిధిలోని పెనుగొండ, పెనుమంట్ర. ఇరగవరం ఎస్సైలు పాల్గొన్నారు.
పోలవరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో
మృతదేహం ఖననం చేసేందుకు నిర్వాసితుల యత్నం
అడ్డుకున్న అధికారులు: కేసు నమోదు
పోలవరం, డిసెంబర్ 10: నిర్వాసితులకు శ్మశానవాటిక కేటాయించలేదన్న కారణంతో మరణించిన నిర్వాసితురాల్ని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఖననం చేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. కొత్తదేవరగొందికాలనీకి చెందిన కొణుతుల రఘుపతి (54) అనారోగ్యంతో మరణించింది. అయితే నిర్వాసితులకు రెవెన్యూ వారు కేటాయించిన స్థలంలో ఖననం చేయబోతుండగా, ఆ స్థలానికి చెందిన సిరపురపు వీర్రాజు అడ్డుకున్నారు. దాంతో నిర్వాసితులు నిరసన తెలుపుతూ తహసీల్దార్ కార్యాలయంలో మృతదేహాన్ని ఖననం చేసేందుకు గొయ్యి తవ్వారు. అక్కడికి చేరుకున్న ఎస్సై కె శ్రీహరిరావు, తహసీల్దార్ ఎం ముక్కంటి, సిబ్బంది నిర్వాసితుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. నిర్వాసితులు అధికారులతో మాట్లాడుతూ మీరు మాకు కేటాయించిన స్థలంలో మృతురాలిని ఖననం చేస్తుంటే ఆ స్థలం తమదని రైతు అడ్డుకున్నారని వివరించారు. ఈలోగా అడ్డుకున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకురాకుండా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఖననం చేసేందుకు ప్రయత్నించడం ఏమిటని ఎస్సై నిర్వాసితులను అడగగా, తహసీల్దార్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పినా ఆయన స్పందించకపోవడంతో నిరసన తెలుపుతూ కార్యాలయ ఆవరణలో ఖననం చేద్దామని ప్రయత్నించామని చెప్పారు. ఈ లోపు ఖననాన్ని అడ్డుకున్న రైతును రప్పించారు. ఆయన ఎస్సైతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇవ్వగా మిగిలిన తన పొలంలో ఖననం చేయడానికి ప్రయత్నించడంతో అడ్డుకున్నానని తెలిపారు. ఈలోగా మృతదేహాన్ని రెవెన్యూ కార్యాలయ ఆవరణలోకి తీసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సై, తహసీల్దార్ నిర్వాసితులతో మాట్లాడి వారికి కేటాయించిన స్థలానికే తీసుకువెళ్లారు. అక్కడ ప్రభుత్వం నిర్వాసితుల శ్మశానవాటికకు కేటాయించిన స్థలంలో మృతదేహాన్ని ఖననం చేయించారు. దీనిపై తహసీల్దార్ ఎం ముక్కంటి మాట్లాడుతూ దేవరగొంది నిర్వాసితులకు శ్మశానవాటిక కోసం 1.95 ఎకరాల స్థలం సేకరించామని, నిర్వాసితులు సేకరించిన స్థలం పక్కనే మృతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. వారికి శ్మశానానికి కేటాయించిన స్థలంలో సరిహద్దులు గుర్తించి బోరు, షెడ్డు నిర్మించి వారికి అప్పగిస్తామని తహసీల్దార్ తెలిపారు.
ఖననం చేసేందుకు యత్నించినవారిపై కేసు నమోదు
చట్టానికి వ్యతిరేకంగా మృతదేహాన్ని తీసుకువచ్చి రెవెన్యూ కార్యాలయ ఆవరణలో పూడ్చేందుకు ప్రయత్నించారంటూ తహసీల్దార్ ఎం ముక్కంటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు ఎస్సై కె శ్రీహరిరావు తెలిపారు. శనివారం సాయంత్రం కొత్తదేవరగొంది కాలనీకి చెందిన కొణుతుల రఘుపతి అనే గిరిజన మహిళ మృతిచెందడంతో ఆమెను ఖననం చేసేందుకు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గొయ్యి తీసి పూడ్చేందుకు ప్రయత్నించిన మామిడిగొంది, చేగొండపల్లి సర్పంచ్‌లు బొరగం కన్నపరాజుదొర, మడకం పరమేశ్వరరావు, ముచ్చిక శివ, మరికొందరిపై తహసీల్దార్ ఫిర్యాదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్టు ఎస్సై చెప్పారు.

కోస్తా జిల్లాల్లో పనిచేస్తే తెలుగు మాట్లాడాల్సిందే
నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి కలెక్టర్ ఆదేశం
ఏలూరు, డిసెంబర్ 10 : కోస్తా జిల్లాల్లో పనిచేస్తే ఖచ్చితంగా తెలుగు మాట్లాడాల్సిందేనని అవసరమైతే ప్రత్యేక ట్యూటర్‌ను ఏర్పాటుచేసుకుని త్వరలోనే తెలుగులో మాట్లాడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం నరసాపురం ప్రాంతంలో రైల్వే లైన్ ఏర్పాటు, భూసేకరణ, తదితరాంశాలపై అధికారులతో సమావేశం జరుగుతుండగా సుమిత్‌కుమార్ ఆంగ్లంలో సమాధానం చెప్పడంతో కలెక్టర్ జోక్యం చేసుకుని తెలుగులో మాట్లాకపోతే కుదరదని ఈ ప్రాంత ప్రజలు అంతా తెలుగులోనే మాట్లాడితే తెలుసుకోగలుగుతారని చెప్పారు. అవసరమైతే అనుభవం గల ట్యూటర్‌ను నరసాపురం పంపించి ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా చూడాలని డిఆర్‌వో కె హైమావతిని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలిచ్చిన వినతిపత్రాలు తెలుగులోనే ఉంటాయని వాటిని చదివి అర్ధం చేసుకోకపోతే కష్టమని తెలుగు రాదని ఇతరులపై ఆధారపడితే తప్పుదోవ పట్టించే ప్రబుద్ధులు కూడా ఉంటారని, కావున తెలుగులో వ్రాయడం, చదవడం, మాట్లాడటం కనీస నాలెడ్జ్ పెంచుకోవాలని కలెక్టర్ కోరారు. నరసాపురం నుండి తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లికి గోదావరిపై నిర్మించే రైల్వే కం రోడ్ బ్రిడ్జికి సంబంధించి తగు ప్రతిపాదనలు తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని చించినాడ నుండి కోటిపల్లికి రైల్వే బ్రిడ్జి ప్రతిపాదన ఉందని దాని బదులు నరసాపురం - కోటిపల్లి బ్రిడ్జి నిర్మిస్తే ఉభయగోదావరి జిల్లాల మధ్య ప్రజలకు రాకపోకల సౌకర్యమే కాకుండా నరసాపురం నుండి పెద్ద ఎత్తున కొబ్బరిపీచు, లేసు ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తులను కూడా ఎగుమతికి అవకాశాలున్నాయని చెప్పారు. అయిదు వారాల నుండి నరసాపురం - కోటిపల్లి మధ్య రైల్ కం రోడ్ బ్రిడ్జి నిర్మాణంపై తాను చర్చిస్తుంటే ఇటీవల రైల్వే డి ఆర్ ఎం నరసాపురం వచ్చి చించినాడ నుండి కోటిపల్లికి రైల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని ఎలా ప్రకటించారని స్థానిక రైల్వే అధికారులు డిఆర్‌ఎంకు సరైన సమాచారం ఇవ్వలేదా? అంటూ కలెక్టర్ రైల్వే అధికారులను ప్రశ్నించారు. నరసాపురం ప్రాంతంలో పోర్టు కూడా ఏర్పాటు చేయనున్నారని దాని వలన అనేక రకాల మత్స్య ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి కూడా ఈ రైల్ కం రోడ్ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కార్యక్రమాన్ని చేపడతామని కేంద్రం నుండి నిధులు కొంత ఆలశ్యంగా వచ్చినా అడ్వాన్స్‌గా తమ వద్దనున్న డబ్బును ముందు చెల్లిస్తామని చెప్పారు. భూసేకరణకు సంబంధించి 13.5 కోట్ల రూపాయలు రైల్వే శాఖ విడుదల చేసిందని వారం రోజుల్లో నిధులు జిల్లా కలెక్టరుకు బదిలీ చేస్తామని రైల్వే అధికారి చెప్పారు.
ఎన్టఆర్ వైద్యసేవలపై జగన్ విమర్శలు తగదు
- ఎమ్మెల్యే పితాని
ఆచంట, డిసెంబర్ 10: ఎన్‌టిఆర్ వైద్యసేవల గురించి వైఎస్ జగన్ విమర్శించడం తగదని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. శనివారం ఆచంటలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నాయకుల పేర్లు ఆయా పథకాలకు పెట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అలాగే తెలుగుదేశం అధికారంలో ఉంది గనుక ఎన్‌టిఆర్ పేరు పెట్టారన్నారు. గత ప్రభుత్వం హయాంలో 938 సేవలు వైద్యసేవలో ఉంటే వాటికి మరో 106 సేవలు కలిపి మొత్తం 1044 సేవలు అందిస్తున్నామన్నారు. గతంలో ఏడాదికి ఒక రేషన్ కార్డుమీద రూ. 2 లక్షలు మాత్రమే ఖర్చుచేస్తే ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.2.50 లక్షలకు పెంచారని, ఈ విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 13 జిల్లాల్లో ఆరోగ్యసేవల కింద రూ.1100 కోట్లు ఖర్చు చేస్తే నేడు రూ. 1860 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రూ. 16 వేల కోట్లు బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడు ప్రజాసంక్షేమాన్ని విస్మరించ లేదన్నారు. కొత్తగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో సేవలందిస్తున్నామన్నారు. పిహెచ్‌సిలలో 20, సిహెచ్‌సిలలో 40 వైద్యపరీక్షలు ఉచితంగా చేస్తున్నట్టు తెలిపారు. కొత్తగా ప్రభుత్వాసుపత్రుల్లో 1400 మంది వైద్యులను నియమించామన్నారు. ప్రభుత్వాసుపత్రులన్నీ పటిష్టం చేయాలన్న చంద్రబాబు ప్రయత్నానికి సహకరించడం మానివేసి ఆయనపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ సమావేశంలో ఎఎంసి ఛైర్మన్ ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపిపి మేకా పద్మకుమారి, జడ్పీటిసి బండి రామారావు, సీనియర్ టిడిపి నాయకులు గొడవర్తి శ్రీరాములు, తమ్మినీడి ప్రసాద్, సర్పంచ్ బీర తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

దేశ సుభిక్షం కోసం 18న వెంకటేశ్వర కల్యాణం

మంత్రి మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 10: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఈ నెల 18న తాడేపల్లిగూడెం జడ్పీ హైస్కూలులో నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్థానిక మంత్రి కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తేతలి సత్యనారాయణమూర్తి జడ్పీ హైస్కూలులో ఈ నెల 18 సాయంత్రం 4.30కు ప్రారంభమవుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు గరికిపాటి నరసింహారావుప్రవచనం చేస్తారన్నారు. సాయంత్రం 5 గంటల నుండి వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు. టిటిడి వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య కన్నుల పండువగా కల్యాణం జరిపేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్వామివారి కల్యాణం సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ ఆహ్వాన పత్రికలు అందించి కల్యాణోత్సవానికి ఆహ్వానిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలంతా స్వామివారి కల్యాణానికి హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. సమసమాజ స్థాపన కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం విశేష కృషిచేస్తోందన్నారు. నల్లధనాన్ని వెలికితీసి సామాన్య, పేద ప్రజల సంక్షేమం కోసం పెద్దనోట్లు రద్దుచేశారన్నారు. ఈ సమావేశంలో బిజెపి పట్టణాధ్యక్షుడు కర్రి ప్రభాకర బాలాజీ, బీజేపీ నాయకులు ఖండభట్టు శ్రీనివాసరాజు, పోతుల అన్నవరం, కోట రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
జాతీయరహదారిపై పోలీసు తనిఖీలు
ఆకివీడు, డిసెంబర్ 10: పెద్దనోట్ల మార్పిడి వ్యవహారాలపై పోలీసులు దృష్టి సారించారు. రూ.500, రూ. 1000 నోట్లు రద్దుకావడంతో కొత్తనోట్లకు కమీషన్ వ్యాపారంపై పలుచోట్ల మారుస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీనిలో భాగంగా ఆకివీడు ఎస్సై కడియాల అశోక్‌కుమార్ అజ్జమూరు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
తెరుచుకోని ఎటిఎంలు: భక్తుల ఇక్కట్లు
ద్వారకాతిరుమల, డిసెంబర్ 10: బ్యాంకులు మూతపడడంతోపాటు ఎటిఎంలు సైతం తెరుచుకోకపోవడంతో ప్రజలతోపాటు క్షేత్రానికి వచ్చిన భక్తులకు సైతం నగదు కష్టాలు తప్పలేదు. శనివారం నుంచి సోమవారం వరకూ బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉన్నా వాటిని పొందలేని స్థితిలో ఉన్నామని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు తెరుచుకోని ఈ మూడు రోజులూ కనీసం ఎటిఎంల ద్వారానైనా కాస్తోకూస్తో నగదు పొందుదామన్నా అవి కూడా పనిచేయని పరిస్థితులు ఏర్పడ్డాయంటూ వినియోగదారులు ధ్వజమెత్తుతున్నారు. శనివారం క్షేత్రంలో ఉన్న అయిదు ఎటిఎంలు మూతపడే ఉన్నాయి. దీంతో స్థానికులతోపాటు సుదూర ప్రాంతాల నుండి శ్రీవారి దర్శనానికి వచ్చిన యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎటిఎంలను అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.
శరవేగంగా సార్వా మాసూళ్లు
వర్ధా తుపానుపై రైతులు అప్రమత్తం
పొలాల్లోనే రైతులు.. కూలీలు..
ఆచంట, డిసెంబర్ 10: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్ద తుపాను మరికొద్ది గంటల్లో తీరాన్ని చేరుతుందని, తుపాను తీరానికి చేరే సమయంలో భారీగా ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందునుంచి ప్రకటిస్తుండడంతో రైతాంగం అంతా చాలా వేగంగా సార్వా మాసూళ్లు చేసుకుంటున్నారు. ఆచంట మండలంలో నీటి ఎద్దడి కారణంగా ఆచంట, పోడూరు, యలమంచిలి, పెనుగొండ మండలాల్లో సార్వా నాట్లు ఆలస్యంగా వేశారు. దీంతో పంట కూడా చేతికి అందివచ్చే సమయం కూడా ఆలస్యమైంది. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కన్నా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా మాసూళ్లు జరగలేదని రైతాంగం వాపోతున్నారు. ఓ పక్క భారీగా వరికోత యంత్రాలు కోత కోస్తున్నాయి. మరోపక్క కూలీలు కూడా ఉదయం నుండి రాత్రి వరకు మాసూళ్లు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికి ఈ ప్రాంతాల్లో మరో 30 శాతం వరకు పంట మాసూళ్లు అయ్యే పరిస్థితి కనపడడం లేదు. ఓ పక్క పంట మాసూలు చేసి ధాన్యం గట్టుకు చేర్చినప్పటికీ వాటిని ఆరబెట్టే అవకాశం కూడా వారికి దొరకడం లేదు. ఇంకా 10 రోజులు వరకు తమ 10 ఎకరాలు చేను కోతకు వచ్చే అవకాశం లేదని, ఇప్పటికే పెట్టుబడి చాలా పెట్టామని, భారీ వర్షాలు వస్తే తమకు ఏమిచేయాలో పాలు పోవడం లేదని ఆచంటకు చెందిన నెక్కంటి ఆదినారాయణ తెలిపారు. మరోపక్క పెద్ద నోట్ల రద్దు కూడా రైతుల పాలిట శాపంలా మారింది.
అసలే చేతిలో నగదు లేక అప్పుదొరక్క, కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతుంటే ఈ సమయంలో బ్యాంకులకు కూడా వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో మొత్తం వ్యవస్థ స్తంభించిపోయినట్టయ్యిందని రైతాంగం వాపోతున్నారు. వరి చేలతో పాటు ఈ ప్రాంతంలో రొయ్యలు, చేపలు చెరువులు కూడా విస్తారంగానే ఉన్నాయి. ఇవి కూడా తుపాను దెబ్బకు కుదేలవనున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ప్రకృతి కరుణిస్తే తప్ప తమను ఎవరూ కాపాడలేరని రైతాంగం వాపోతున్నారు.