పశ్చిమగోదావరి

భయం...్భయం బయోమెట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 17: ఇంతకాలం టైమ్‌కు ఉద్యోగం చేయటం, పనిచేసే చోట ఉండటం వంటి మాటలే విన్పిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా కొత్తగా రంగంలోకి దిగిన బయోమెట్రిక్‌తో ఉద్యోగవర్గాల సమస్యలు దాదాపుగా రెట్టింపు అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఈ బయోమెట్రిక్ విధానం పనిచేసే వారికి ఇబ్బందికరంగా మారుతుండగా ఎగకొట్టేవారికి మరింత సానుకూలంగా తయారైందనే చెప్పాలి. మొత్తంమీద జిల్లాలో వివిధ శాఖల్లో అమలుచేస్తున్న బయోమెట్రిక్ విధానం తాజాగా వివాదాల్లోకి చేరిపోయింది. పెరవలిలో గురువారం ఒక ఉపాధ్యాయురాలు తాను పనిచేసే పాఠశాలలో బయోమెట్రిక్ విధానం పనిచేయటం లేదని తెలియటంతో గడువులోగా వేలిముద్ర వేయాలన్న కంగారులో సమీపంలో పిహెచ్‌సికి వెళ్లి ఈప్రక్రియ ముగించాలని ప్రయత్నించిన తరుణంలో ఆమె రోడ్డుదాటుతూ ప్రమాదం బారిన పడింది. రావులపాలెం నుంచి తణుకు వెళ్తున్న ఒక వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి తొలుత తణుకు, ఆతర్వాత అక్కడ నుంచి భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. శుక్రవారం ఆమె మృతిచెందింది. ఈపరిణామం ఉద్యోగవర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వాస్తవానికి ఈ ఘటనను పరిశీలించుకుంటే దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ బయోమెట్రిక్ వేయాలన్న కంగారులో ఉదయం పూట ఉద్యోగులు పరుగులు తీయటం కన్పిస్తుంది. ఇంతకుముందు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు వస్తున్నారంటే పరుగులు తీసే ఉద్యోగులు ఇప్పుడు మాత్రం గడువులోగా బయోమెట్రిక్ వేసేందుకు మాత్రమే పరుగులు తీస్తున్నారు. ఈక్రమంలోనే కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తటం, ప్రమాదాలు జరగటం పరిపాటిగా మారింది. వాస్తవానికి ఉద్యోగవర్గాలు బయోమెట్రిక్ వేసి విధినిర్వహణ చేయాలనడంతో సాంకేతికంగా తప్పులేకపోయినా దానికి తగ్గ వనరులు, ఏర్పాట్లు అయా కార్యాలయాల్లో ఏర్పాటు అయి ఉంటే అసలు ఈ ఇబ్బందే తలెత్తేది కాదు. ఉద్యోగవర్గాల్లో అటు ఉపాధ్యాయులకు, ఇటు అంగన్‌వాడీ వర్కర్లకు, మరోవైపు వివిధ శాఖల ఉద్యోగులకు కూడా ఈ బయోమెట్రిక్ విధానాన్ని జిల్లాలో తప్పనిసరి చేశారు. ఒక్క పాఠశాలను పరిగణనలోకి తీసుకున్నా మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు అయి ఉన్న ఆ పాఠశాలల్లో ఫోన్ సౌకర్యమే గగనమనుకుంటే అలాంటిచోట ఇంటర్‌నెట్ అందుబాటులో ఉండటం కొంత అతిశయోక్తిగానే కన్పిస్తుంది. అయినప్పటికీ బయోమెట్రిక్ వేసి తీరాలన్న నిబంధన ఉండటంతో ఆ పంచాయితీ పరిధిలో నెట్ అందుబాటులో ఉండి, బయోమెట్రిక్ విధానం ఉన్న కార్యాలయానికి పరుగులు తీసి ఆతర్వాతే తమ పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇదే పరిస్ధితి అంగన్‌వాడీలకు, మిగిలిన శాఖల ఉద్యోగులకు కూడా తప్పటం లేదు. ఒకవేళ అందుబాటులో ఉన్న కార్యాలయంలో కరెంట్ కట్ అయినా, నెట్ అనుసంధానం తగ్గినా కూడా అవి సర్దుబాటు అయ్యేవరకు తమ కార్యాలయాలకు వెళ్లకుండా వీరంతా అక్కడే వేచి ఉండాల్సిన పరిస్దితి. ఇలా ఒకరోజు కాదు, రెండురోజులుకాదు నెలలతరబడి ఉదయం, సాయంత్రం ఈ వేచి ఉండే పద్ధతిమాత్రం మారటం లేదు. అయితే ఎక్కడికక్కడ ఈవిధానం అవసరమైన ఉద్యోగులకు నెట్, బయోమెట్రిక్ ఏర్పాటుచేస్తే ఈసమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. దీనికితోడు అందుబాటే పెద్ద సమస్య అనుకుంటే ఒకవేళ అన్ని హంగులు అమరినా చివరకు సర్వర్ రూపంలో పెద్దసమస్య తెరపైకి వస్తుంది. సహజంగానే ఉద్యోగులంతా తమ సమయనిబంధనలకు అనుగుణంగా బయోమెట్రిక్ వేసేందుకు సిద్ధమవుతారు. ఫలితంగా ఒకేసారి సర్వర్‌పై ఒత్తిడి పెరగడంతో హ్యాంగ్ అవటం, లేదా అసలు కనెక్షనే లేకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. చివరకు సర్వర్ వద్ద ట్రాఫిక్ తగ్గేవరకు వేచి ఉంఢి ఆతర్వాతే బయోమెట్రిక్ వేసి విధులకు వెళ్లాల్సిన పరిస్దితిని ఉద్యోగవర్గాలు ఎదుర్కొంటున్నాయి. ఈపరిణామాల మధ్య గత కొన్నివారాలుగా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతూనే ఉంది. దీనికితోడు తాజాగా పెరవలి ఉపాధ్యాయురాలు బయోమెట్రిక్ కంగారులోనే ప్రమాదం బారినపడటం, చివరకు మృత్యువాత పడే పరిస్దితి రావటం ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఈవిషయంలో తమ అసంతృప్తిని వ్యక్తపరిచేందుకు సిద్దమవుతుండగా వీరి ప్రయత్నానికి రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కూడా అండగా నిలబడతామని ముందుకు రావటం గమనార్హం. ఈపరిణామాలు ఎటు దారితీస్తాయో వేచిచూడాలి.
చెత్త కనిపిస్తే చర్యలు
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, ఫిబ్రవరి 17 : జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా... చెత్త కనిపిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం పంచాయితీల్లో పన్నుల వసూలు తీరు, పారిశుద్ధ్య పరిస్థితులు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. పంచాయితీల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పి ప్రజలంతా ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు పల్లెపల్లెలో ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని రోడ్డుపై ఎక్కడా చెత్త కనిపించకుండా పటిష్టమైన నిర్వహణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం వల్లే గ్రామీణ ప్రాంతాలలో 30 శాతం మంది ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని వాటిని నయం చేసుకోవడానికి కుటుంబ ఆదాయం చాలక అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని ఈ పరిస్థితి నుండి ప్రజలను ఆరోగ్యవంతులను చేయాలటే పల్లెల్లో పటిష్టవంతమైన చెత్త సేకరణ విధానం అమలు కావాలని అప్పుడే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని చెప్పారు. మార్చి 31వ తేదీ లోగా ప్రతి పల్లెను పరిశుభ్ర పరిచేందుకు కొంత సమయం ఇస్తున్నానని ఏప్రిల్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు నిరంతరం ప్రతిపల్లెలో ఉదయం 5.30 గంటల నుండే తాను ఆకస్మిక పర్యటనలు చేస్తానని ఎక్కడైనా చెత్త కనిపించినా, పందులు, కుక్కలు బెడద వున్నా సహించబోనని స్పష్టం చేశారు. పల్లె ప్రాంతాల్లో పందులు, కుక్కల వల్ల ప్రజలు భయభ్రాంతులవుతున్నారని డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పందులు, కుక్కల నియంత్రణ కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. పంచాయితీల్లో సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని, పన్నులు కూడా కట్టడంలో ప్రజలు ఆసక్తి చూపుతారని చెప్పారు. జిల్లాలో గత కొంతకాలంగా పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని ఇక క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి రెండు నెలలు పర్యటిస్తానని తప్పుడు సమాచారం ఇస్తే సహించబోనని వాస్తవాలు స్వయంగా పరిశీలన చేస్తానని కావున రాబోయే 40 రోజులు పల్లెల్లో చెత్త కుప్ప తొలగింపు, మురికి కూపాలు లేకుండా చూసుకోవాలని డ్రైన్లలో పూడికతీత, తాగునీటి కుళాయిలు లీకేజీలు లేకుండా చూడాలని చెప్పారు.
వేసవిలో నీటి ఎద్దడి నివారణపై ప్రత్యేక దృష్టి
వేసవి తీవ్రత ప్రారంభమవుతోందని ఎక్కడా కూడా ఈ వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా చూడాలని శివారు ప్రాంత గ్రామాలలో ప్రజలకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ ఏ గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తుతుందో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, మోటార్లు కాలిపోతే తక్షణమే ప్రత్యామ్నాయ మోటార్లు ఉండేలా చూడాలని చెప్పారు. గ్రామ పంచాయితీలలో ఆదాయ ఒనరులు పెంపొందించుకునేలా ప్రత్యేక స్థలంలో వాణిజ్య, వ్యాపార, ఇతర ప్రచారాలకు సంబంధించి ప్రకటన బోర్డులుసిద్దం చేయాలని, గ్రామంలో ఆ బోర్డులోనే ఆయా ప్రచార ప్రకటనలు ఉండాలే తప్ప గ్రామంలో ఎవరికి వారే పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఏర్పాటుచేస్తే సహించవద్దని, వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. శాసనమండలి ఎన్నికల దృష్ట్యా జిల్లాలో మోడల్ కోడ్ అమలులో వున్నదని, జిల్లాలో ప్రభుత్వపరంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపరాదని, అధికారులు, ఉద్యోగులు అధికారికంగా ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించరాదని ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో ఎటువంటి ప్రచార బోర్డులు కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు ఏర్పాటుచేయాలని ఎక్కడా కూడా ఎన్నికల నిబంధనలు అతిక్రమించవద్దని అధికారులను ఆదేశించారు. పంచాయితీలలో ఇళ్ల పన్నులు, ఇతర పనులు వసూళ్లలో బాగా వెనుకబడిన దేవరపల్లి, చాగల్లు, ఆకివీడు, వీరవాసరం, పాలకొల్లు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పెదపాడు తదితర మండల ఇవో పి ఆర్‌డిలు మరింత కష్టపడి పన్నుల వసూళ్ల తీరును వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డిపివో కె సుధాకర్, డివిజనల్ పంచాయితీ అధికారులు రాజ్యలక్ష్మి, అమ్మాజీ, శ్రీరాములు, సత్యనారాయణ, ఇవో పి ఆర్‌డిలు పాల్గొన్నారు.
అందరికీ కుల ధ్రువీకరణ పత్రాలు
జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు
ఏలూరు, ఫిబ్రవరి 17 : జిల్లాలో వచ్చే విద్యాసంవత్సరానికి విద్యార్ధినీ విద్యార్ధులకు అవసరమైన కుల ధృవీకరణ పత్రాలు అందించేందుకు ప్రతీ పాఠశాలలోనూ మీ-సేవా కేంద్రాన్ని ఏర్పాటుచేసి అందరికీ ధృవీకరణ పత్రాలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసి పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకూ విద్యార్ధినీ విద్యార్ధులు కుల ధృవీకరణ పత్రాలు కోసం ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో పాఠశాలలో చదువు పూర్తికాకముందే ప్రతీ విద్యర్ధికీ కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలన్నదే ప్రధానోద్దేశ్యమని చెప్పారు. పాటశాలలో సెక్షను వారీగా ఎంతమంది పిల్లలు ఉన్నారో వారందరికీ ఆయా కులాల వారీగా ముందుగానే కులధృవీకరణ పత్రాలను అందించడానికి మీ-సేవా ప్రతినిధులను పాఠశాలకే తీసుకురావడం జరుగుతుందని పాఠశాలలో ఎంత మంది ఏ కులం విద్యార్ధినీ విద్యార్ధులున్నారో వారి డేటాను ముందుగానే ఆయా మండల తహశీల్దార్లకు జాబితాలు పంపించాలని దాన్ని పరిశీలన చేసి నివేదిక సిద్ధం చేస్తారని దానికనుగుణంగా మీ-సేవా కేంద్రాలలో వచ్చిన దరఖాస్తుల ప్రకారం యుద్ధప్రాతిపదికపై ఆయా విద్యార్ధినీ విద్యార్ధులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుందని దాని వలన కొత్తగా పాఠశాలలో చేరే సందర్భాల్లో విద్యార్ధినీ విద్యార్దులు ఇబ్బందులు పడకుండా ఉంటారని చెప్పారు. కులధృవీకరణ పత్రం కోసం విద్యార్ధినీ విద్యార్ధులు 35 రూపాయలు చెల్లించాల్సి వుంటుందని, సర్ట్ఫికెట్లు కోసం అధిక రుసుం వసూలు చేయకుండా నిరోధించవచ్చునని చెప్పారు. సమావేశంలో డి వో గంగాభవాని, సర్వశిక్ష అభియాన్ పివో బ్రహ్మానందరెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గణపతిరావు, అసిస్టెంట్ మేనేజరు షర్మిల తదితరులు పాల్గొన్నారు.
మహా శివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు
ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్
ఏలూరు, ఫిబ్రవరి 17 : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో గల 180 శైవక్షేత్రాల వద్ద భక్తుల సౌకర్యార్ధం అభిషేకాలు నిర్వహించుకునేందుకు, దర్శనం చేసుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ దుర్గా ప్రసాద్ తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రాచుర్యం కలిగిన 15 పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్ధం అదనపు సౌకర్యాలు కలగజేస్తున్నామని పేర్కొన్నారు. 23, 24, 25 తేదీల్లో దేవాలయాల వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశామన్నారు. మహా శివరాత్రి నాడు దర్శనం చేసుకునేందుకు, అభిషేకాలు చేసుకునేందుకు వేర్వేరు ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పంచాయితీ, రెవిన్యూ, పోలీసు శాఖ సమన్వయంతో భక్తులకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. శివరాత్రి సందర్భంగా భక్తులపై ఎటువంటి అదనపు భారం పడదని స్పష్టం చేశారు. ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం ప్రతీ ఆలయం వద్ద భక్తులకు అందజేయడం జరుగుతుందన్నారు. లింగోద్భవ సమయంలో శివనామస్మరణ జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఒక వైపు మహాన్యాసాపూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం, మరోవైపు శివనామస్మరణాలు ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులు, బాలింతలు, వికలాంగులు దర్శనార్ధం వస్తే వారిని త్వరితగతిన దర్శనం చేసి పంపించేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా ఆలయాల వద్ద ఏర్పాటు చేశామన్నారు. శివరాత్రి సందర్భంగా జాగారాలు నిర్వహించుకునే వారికి సౌకర్యంగా తెల్లవార్లూ కూడా శివాలయాల వద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ప్రతీ ఆలయం వద్ద వేర్వేరు విభాగాలను ఏర్పాటు చేసి అంతరాలయంలో ప్రవేశం కల్పించడం జరుగుతుందన్నారు. రధోత్సవం జరిగే రోజున ఆ ఒక్క రోజు విధిగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. అనివార్య కారణాల వల్ల అనుకోని సంఘటనలు జరిగితే ఆయా కుటుంబాలకు చేదోడుగా వుంటుందని, దేవాలయాలకు భారమైనప్పటికీ భీమా సౌకర్యం కలగజేశామన్నారు. మంచినీటి సౌకర్యం, నిలువనీడ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, అదనపు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. జిల్లాలోని అతి ముఖ్యమైన పట్టిసీమలోని వీరేశ్వరస్వామి, పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వరస్వామి, గునుపూడిలోని సోమేశ్వర జనార్ధన స్వామి, నత్తా రామేశ్వరంలోని రామేశ్వరస్వామి, ఆచంటలోని రామేశ్వరస్వామి, లక్ష్మణేశ్వరంలోని దుర్గా లక్ష్మణేశ్వరస్వామి, కొవ్వూరులోని గోష్పాదక్షేత్రంలోని బాలత్రిపుర సుందరీ సమేత సుందరేశ్వరస్వామి, జుత్తిగలోని ఉమా వాసుకీ రవి సోమేశ్వరస్వామి, నర్సాపురంలోని అమరేశ్వరస్వామి, పోలంగిలోని రామలింగేశ్వరస్వామి, సజ్జాపురంలోని సోమేశ్వరస్వామి, గణపవరంలోని సువర్ణేశ్వరస్వామి, నిడదవోలులోని గోలింగేశ్వరస్వామి, అనంతపల్లిలోని వేగిలింగేశ్వరస్వామి, చింతలపూడిలోని వేగి లింగేశ్వరస్వామి, ఏలూరు నగరంలోని పత్తేబాధ లోని చౌడేశ్వరస్వామి, దక్షిణపువీధిలోని మార్కండేయ ఓంకార విశే్వశ్వరస్వామి, అగ్రహారంలోని అన్నపూర్ణ ప్రతాప విశే్వశ్వరస్వామి, పవర్‌పేటలోని కాశీ అన్నపూర్ణా సమేత విశే్వశ్వరస్వామి ఆలయాలకు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని అంచనాతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని దుర్గా ప్రసాద్ వివరించారు.
రబీకి సాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి
ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఎస్‌ఇకి కలెక్టర్ ఆదేశం
ఏలూరు, ఫిబ్రవరి 17 : జిల్లాలో రబీ పంటకు సాగునీటి ఇబ్బంది లేకుండా నిత్యం 4500 క్యూసెక్కుల నీరు ఖచ్చితంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ధవళేశ్వరం హెడ్ వర్క్స్ ఎస్‌ఇ రాంబాబును ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ ఫోన్‌లో రాంబాబుతో మాట్లాడుతూ గోదావరి ఇన్‌ఫ్లో తగ్గడం వలన జిల్లాలో శివారు ప్రాంత భూములకు నీరు లభించడం లేదని రైతులు చెబుతున్నారని జిల్లాలో నిర్ధేశించిన మేరకు వేసిన ప్రతీ ఎకరం పంటను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉన్నదని అవసరమైతే సీలేరు నుండి అదనపు జలాలను మళ్లించి గోదావరి నీటి మట్ట తగ్గకుండా చూడాలని చెప్పారు. జిల్లాలో మరో 10 రోజులపాటు సమృద్ధిగా గోదావరి జలాలు అందిస్తే రైతాంగం ఇబ్బందిపడకుండా ఉంటారని ఆయన చెప్పారు. గోదావరి ఇన్‌ఫ్లో 2500 క్యూసెక్కులకు పడిపోవడంతో సీలేరు నుండి 5400 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నామని మొత్తం 7900 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం విడుదల జరుగుతోందని రాంబాబు చెప్పగా అవసరమైతే సీలేరు నుండి వెయ్యి క్యూసెక్కుల నీరు పెంచి వెష్టన్ డెల్టాలో 4500 క్కూసెక్కుల నీరు తగ్గకుండా నిరంతరం చూడాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో పంట వేసిన ప్రతీ రైతుకూ సేద్యపునీరు అందించి ఆదుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశ్యమని ఇటువంటి స్థితిలో నీరు తగ్గితే రైతులు చాలా నష్టపోతారని కావున చివరి దశలో మరింత సమన్వయంతో పనిచేస్తూ గోదావరి నీటి మట్టం తగ్గకుండా చూడాలని జిల్లాలోని శివారు ప్రాంత భూములకు కూడా సమృద్ధిగా సేద్యపునీరు అందాలన్నదే ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు.

జిల్లాలో క్షయవ్యాధి నివారణకు కృషి
*డిటిసిఒ వెంకటరావు వెల్లడి

భీమవరం, ఫిబ్రవరి 17: జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్. వి వెంకటరావు చెప్పారు. శుక్రవారం స్థానిక ఎఆర్‌టి సెంటర్‌ను పరీశీలించేందుకు వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రతీ ఏడాది జిల్లాలో సుమారు నాలుగు వేల కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకులో ఎఆర్‌టి సెంటర్లను ఏర్పాటుచేశామన్నారు. టిబి వచ్చిన వారిలో కొందరికి హెచ్‌ఐవి పాజిటివ్‌గా ఉంటుందని, హెచ్‌ఐవి ఉన్న కొందరికి టిబి వస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. క్షయ వ్యాధిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారని వెంకటరావు వెల్లడించారు. నిర్ణయ సమయానికి మందులు వేసుకోవడం ద్వారా దేశంలోని చాలా మంది క్షయ వ్యాధిగ్రస్తులు మంచి ఆరోగ్యవంతులయ్యారని గుర్తు చేశారు. నూతనంగా ఎల్‌బి నెట్ పరికరాలను ఏర్పాటుచేశామని, వీటి వల్ల చాలా తక్కువ సమయంలో పరీక్షల ఫలితాలు వెల్లడవుతాయన్నారు. డిఎల్‌ఒ రమాదేవి మాట్లాడుతూ 99 డాట్స్ ద్వారా మందులను అందిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం బిబి రోగుల పట్ల చాలా మంచిగా వ్యవహరిస్తున్నాయన్నారు. సమావేశంలో ఎస్‌టిఎస్ రవిశేఖర్, ఎ.కృష్ణ, కెసిడి.రెడ్డి, డాక్టర్.ఆర్‌ఎస్‌ఎం రాజు, సిస్టర్ రోసి, ఎల్వీరా, ఎపిఎం పెద్దిరాజు, ఎల్‌టి హర్ష, మయూరి పాల్గొన్నారు.
‘మండవ’కు ఎమ్మెల్సీ కోసం పట్టు
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 17: జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత మండవ లక్ష్మణరావుకు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఈ ప్రాంత పార్టీ నేతలు కోరుతున్నారు. ఏజన్సీ, మెట్ట ప్రాంతాల్లో గత యాభై సంవత్సరాలుగా జనరల్ అభ్యర్థులెవరూ శాసన సభలోగాని, శాసన మండలిలోగాని అడుగుపెట్టే అవకాశం లభించలేదు. జిల్లాలో ఏజన్సీ, మెట్ట ప్రాంతాలకు కేంద్రంగా, మున్సిపల్ పట్టణంగా స్థాయిని సంతరించుకున్న జంగారెడ్డిగూడెం నుండి జనరల్‌కు అవకాశమే రాలేదు. ఈ పట్టణం నియోజకవర్గ పునర్విభజనకు ముందు పోలవరం ఎస్టీ రిజర్వుడు. ఇప్పుడు చింతలపూడి ఎస్సీ రిజర్వుడు. ఏజన్సీ ప్రాంతానికి పోలవరం నియోజకవర్గ నుండి 1962లో జనరల్ అభ్యర్థి కరాటం బాబూరావు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. 1967లో పోలవరం నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు కేటాయించారు. అప్పటి నుండి గిరిజనులే శాసనసభ్యులు అవుతున్నారు. నియోజకవర్గ పునర్విభజనలో జంగారెడ్డిగూడెం పోలవరం నుండి విడిపోయినప్పటికీ చింతలపూడి షెడ్యూల్డ్ కులాల రిజర్వుడు నియోజకవర్గంలో చేరిపోయింది. దీనికి తోడు జిల్లాలో పక్కపక్కనే ఉన్న పోలవరం(ఎస్టీ), గోపాలపురం, చింతలపూడి, కొవ్వూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు అయ్యాయి. ఈ ప్రాంతంలో జనరల్ అభ్యర్థులు ఎంపిపి, జడ్పీటిసి పదవులతో సరిపెట్టుకోవలసి వస్తోంది. జిల్లాలో తాజాగా రెండు శాసనమండలి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇవి రెండూ స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకోవలసినవే. ప్రస్తుతం ఈ రెండు పదవులు పాలకొల్లుకు చెందిన బిసి సామాజిక వర్గం నేతలే అనుభవిస్తున్నారు. వీటిలో ఒకటి డెల్టా ప్రాంతానికి ఇచ్చినప్పటికీ మరొకటి ఏజన్సీ, మెట్ట ప్రాంతాలకు కేటాయించాలనేది ఈ ప్రాంత తెలుగుదేశం నాయకుల వాదన. 1982లో పార్టీ ఆవిర్భావం నుండి నందమూరి తారకరామారావుతో కలిసి పనిచేసిన లక్ష్మణరావు 1983లో పోలవరం నుండి మొడియం లక్ష్మణరావు విజయం నుండి ప్రస్తుత మంత్రి పీతల సుజాత చింతలపూడి నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో విజయం సాధించడంలో, ఏలూరు ఎంపి మాగంటి బాబు విజయంలోను కీలకపాత్ర పోషించారు. లక్ష్మణరావును ఎమ్మెల్సీ రేసులో నిలపాలనేది ఇక్కడి ‘దేశం’ నేతల అకాంక్ష. ఆయన 2014లో జరిగిన మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గ్రామ పంచాయతి, సహకార సంఘ ఎన్నికల్లో సైతం ‘దేశం’ అభ్యర్థుల విజయానికి అవిశ్రాంత కృషి చేసారు. పార్టీలో వ్యూహకర్తగా పేరుగాంచారు. ఆయన వ్యూహం వల్లే ఈ ప్రాంతంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతోందని కార్యకర్తలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మండవ లక్ష్మణరావుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఇవ్వాలని కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈమేరకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపిపి కొడవటి మాణిక్యాంబ, జడ్పీటిసి శీలం రామచంద్రరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ ముస్త్ఫా, రూరల్ అధ్యక్షుడు ముళ్ళపూడి గంగాధర శ్రీనివాసరావు తీర్మానించి జిల్లా నాయకులు నంబూరి రామచంద్రరాజు, పెనుమర్తి రామ్‌కుమార్, తూటికుంట దుర్గారావు, పెసరగంటి జయరాజు తదితరులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి కోరారు. జిల్లాలో ఉన్న ముఖ్య నేతలను, ఎంపి, ఎమ్మెల్యేలను కలిసి అభ్యర్థించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె కళావెంకటరావు, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని కూడా కోరారు.
నోడల్ అధికారిగా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ భాస్కరరావు
ఏలూరు, ఫిబ్రవరి 17 : శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో మద్యం సరఫరా, నిల్వ, తదితర అంశాల నియంత్రణకు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వైబి భాస్కరరావును నోడల్ అధికారిగా నియమిస్తూ పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఈ ఎన్నికల సమయంలో పెయిడ్ న్యూస్, ఎన్నికల ప్రకటనలు, తదితర అంశాల పర్యవేక్షణకు జిల్లాస్థాయిలో మీడియా సర్ట్ఫికేషన్ మోనటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి జిల్లా పౌర సంబంధాల అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మహాశివరాత్రికి ప్రత్యేక సర్వీసులు
ఆర్టీసీ ఆర్‌ఎం ధనంజయరావు
ఏలూరు, ఫిబ్రవరి 17 : ఈ నెల 24వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రాచుర్యం కలిగిన శివాలయాలు గల ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశామని ఎపి ఎస్ ఆర్‌టిసి ఏలూరు ఆర్ ఎం ఎస్ ధనంజయరావు తెలిపారు. పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో గల బలివే ప్రాంతానికి ఏలూరు డిపో నుంచి అదనపు సర్వీసులను నడుపుతామన్నారు. జానంపేట తమ్మిలేరు ప్రక్కనే బలివే వెళ్లే మార్గంలో తాత్కాలిక బస్‌స్టేషన్ కూడా ఏర్పాటు చేశామని, పాతబస్టాండ్‌లో ప్రత్యేక కంట్రోలర్‌ను ఏర్పాటు చేసి 23వ తేదీ అర్ధరాత్రి నుంచి భక్తుల రద్దీని బట్టీ ఎన్ని బస్సులైనా నడిపేందుకు సిద్ధమయ్యామన్నారు. శివరాత్రి సందర్బంగా ప్రయాణీకులపై ఎటువంటి అదనపు భారం వేయడం లేదన్నారు. అదే విధంగా జిల్లాలోని నలువైపుల నుంచి పట్టిసీమకు, భీమవరం, కొవ్వూరు, పాలకొల్లు, నర్సాపురం కేంద్రాలకు తమ సంస్థ అదనపు సర్వీసులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. పట్టిసీమలో కూడా తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేసి అక్కడ కంట్రోలర్‌ను కూడా ఏర్పాటుచేస్తామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాత్కాలిక టెంట్లు వేసి మంచినీటి సౌకర్యం, నీడ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రాధాన్యతను ఇచ్చి వారికి సేవలు అందించేందుకు గాను తమ సంస్థ అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసిందని వివరించారు. శైవక్షేత్రాలకు అవసరమైన అదనపు బస్సులు కావాల్సిన వారు సంప్రదించవచ్చునని చెప్పారు. అదేవిధంగా శ్రీశైలంనకు కూడా సర్వీసులను నడుపుతున్నామని, ఇందు కోసం రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించామని వివరించారు.

సౌకర్యాలున్నా మరుగుదొడ్ల నిర్మాణంలో జాప్యమా!
అధికారులను ప్రశ్నించిన కలెక్టర్
ఏలూరు, ఫిబ్రవరి 17 : ఏ సౌకర్యాలు లేని ఉత్తరాంఛల్‌లో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మల విసర్జన లేని ప్రాంతంగా ప్రకటించారని, కానీ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా మనమెందుకు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించలేకపోతున్నామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ప్రశ్నించారు. స్థానిక కలెక్టరేట్‌లో ఆదర్శ గ్రామాల అభివృద్ధిపై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. చలికాలంలో ఆరునెలలు ఉత్తరాంఛల్ ప్రజలు బయటకు రావడానికే చాలా ఇబ్బందులుపడతారని అందుకే ప్రభుత్వం అక్కడ పనిచేసే సిబ్బందికి ఆరునెలల జీతం ముందుగానే ఇస్తుందని వాటితో ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటారని 450 కిలోమీటర్ల దూరం వెళితేనే తప్ప వారికి ఎటువంటి వస్తువులు లభ్యం కావని, కొండలపై ఎంతో శ్రమకోర్చి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కానీ అన్ని వసతులూ ఉండి అన్ని వస్తువులూ అందుబాటులో ఉన్న మనం ఎందుకు బహిరంగ మల విసర్జన నిరోధించలేకపోతున్నామని ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వ సహాయం కూడా ఉండదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక్కొక్క మరుగుదొడ్డికి తొమ్మిది వేల రూపాయలు పంచాయితీ ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుందే తప్ప నేరుగా లబ్ధిదారులకు ఇవ్వదని అయినా సరే ప్రజలు కష్టపడి మరుగుదొడ్లు నిర్మించుకుని బహిరంగ మల విసర్జన లేని ప్రాంతంగా తీర్చిదిద్దుకోగలిగారని కానీ పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్క మరుగుదొడ్డికి 15 వేల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నప్పటికీ అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ జిల్లాలో ఇంకా 70 వేల మరుగుదొడ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయంటే మనం ఏమి చేస్తున్నామని కలెక్టర్ ప్రశ్నించారు. బాధ్యతగా పనులు నిర్వర్తిస్తే మార్చి 31వ తేదీ నాటికి జిల్లాను బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దవచ్చునని చెప్పారు. ప్రజా ప్రతినిధులు దత్తత తీసుకున్న పలు గ్రామాల అభివృద్ధికి నిర్ధేశించిన నిధులను సకాలంలో ఖర్చు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దత్తత గ్రామాలలో 24 గంటలూ మంచినీటి సౌకర్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పేదలకు పక్కా గృహాల నిర్మాణం, అర్హత గల పేదలందరికీ సంక్షేమ పధకాలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అంతేకాకుండా సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుపై కూడా తగుచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సిపివో బాలకృష్ణ, గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్ ఇ అమరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.