పశ్చిమగోదావరి

పకడ్బందీగా ప్రవర్తనా నియమావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, ఫిబ్రవరి 21: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలుచేస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి కోటేశ్వరరావు చెప్పారు. మంగళవారం డివిజన్‌లో ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు వీలుగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. ఇప్పటికే ప్రతి మండలంలో మూడు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఎన్నికల కోడ్ అమలుకు సంబంధించి ఈ బృందాలు నిరంతరం పరిశీలిస్తున్నాయన్నారు. ప్రతీ అంశాన్ని వీడియోలో పొందుపరుస్తున్నామన్నారు. నరసాపురం డివిజన్‌లో మొత్తం 252 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసి నివేదక అందించాలని ఈ సందర్భంగా జెసి కోటేశ్వరరావు సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని ఆదేశించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, డిఎస్పీ పూర్ణచంద్రరావులతో జెసి కోటేశ్వరరావు సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి సూర్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎంవి నాగేశ్వరరావు, ఎంపిడిఒ కన్నమనాయుడు తదితరులు పాల్గొన్నారు.

టిడిపికి ఎమ్మెల్సీ ‘గండం’!

భీమవరం, ఫిబ్రవరి 21: ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి శిరోభారంగా మారాయ. జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయ. జిల్లానుండి ఇప్పటి వరకు ఎమ్మెల్సీలుగా ఉన్న అంగర రామ్మోహన్‌రావు (టిడిపి) , మేకా శేషుబాబు (వైసిపి)ల పదవీ కాలం కొద్ది రోజుల్లో పూర్తికానుంది. దీనితో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయ. జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రెండు స్థానాలూ తెలుగుదేశం ఖాతాకే చేరనున్నాయ. ఈ అంశమే పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. ఈ స్థానాలకు తెలుగుదేశం పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో పార్టీ సంపూర్ణ విజయానికి జెండా మోసిన నాయకులు ఎందరో జిల్లాలో ఉన్నారు. వీరంతా స్థాపించిన నాటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ప్రతీ ఎన్నికల్లో వీరే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లా విషయంలో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందించిన రెండు సామాజిక వర్గాల్లో కాపు, బిసి సామాజిక వర్గాలు క్రియాశీలక పాత్ర పోషించాయి. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇంత వరకు వారి విషయంలో ఎటువంటి ప్రాధాన్యత కల్పించలేదు. రానురాను వీరంతా ఎమ్మెల్సీలపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజల్లో అభిమానం లేనివారికి, డబ్బున్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందన్న పుకార్లు వినపడుతున్నాయి. ఇదే సమయంలో పార్టీ అధినాయకత్వం గుర్తిస్తే సరేసరి లేదంటే..జగన్ పార్టీయే బెటర్ అని జిల్లాలోని కొందరు టిడిపి నేతలు భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా డెల్టాలోని కొందరు నేతలు జగన్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వీరిలో కాపు సామాజిక వర్గంతోపాటు బిసి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు ఈ విధంగా ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలోని ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్న వైసిపి తనదైన శైలిలో పావులు కదుపుతోంది. అధికార టిడిపికి చెందిన అసంతృప్తులకు పార్టీలో ప్రాధాన్యత కల్పించి, భవిష్యత్తులో పదవులకు హామీ ఇచ్చే విధంగా చాపకింద నీరులా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించగానే అధికార పార్టీ నుంచి వలసలు తప్పవన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

సార్వత్రికానికి సంస్థాగత ఎన్నికలే కీలకం
పాలకొల్లు, ఫిబ్రవరి 21: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలే కీలకమని ఎంపి, టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. స్థానిక 17వ వార్డులో మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టిడిపి 35 సంవత్సరాల సుదీర్ఘ పయనంలో సుశిక్షితులైన కార్యకర్తలను పార్టీ తయారు చేసుకుందని వెల్లడించారు. పాలకొల్లు నియోజకవర్గం నుండి అన్ని సమావేశాలకు శిక్షణ తరగతులకు నూరు శాతం కార్యకర్తలు పాల్గొన్నారని ఆమె అభినందించారు. ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ప్రణాళికా బద్ధంగా చేస్తున్న అభివృద్ధిని ఆమె ప్రశంసించారు. ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ భారతదేశంలో కార్యకర్తలను గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని, సభ్యత్వం ఉన్న ప్రతీ వారికీ బీమా సౌకర్యం ఉండడం వల్ల గత రెండేళ్లలో రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల మృతిచెందిన 1300 మందికి రూ.26కోట్లు బీమా సొమ్ము అందిందన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో 28 మందికి రూ. 54 లక్షలు బీమా సొమ్ము పంపిణీ చేశామని తెలిపారు. తల్లిదండ్రుల్లేని అనాథ పిల్లలకు కార్యకర్తల కుటుంబాల నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా ఉచిత విద్య అందిస్తున్నారని ఆయన వెల్లడించారు. సంస్థాగత ఎన్నికల్లో అలంకారం కోసం కాకుండా పనిచేసేవారిని ఎన్నుకోవడం ద్వారా 2019 ఎన్నికలు వరకు పనిచేసే సేనలా ఉండేలా చూడాలని ఆయన సూచించారు. చంద్రబాబునాయుడు పరిపాలన మరో 20 సంవత్సరాలు కొనసాగినప్పుడే రాష్ట్రం ప్రపంచంలోనే అగ్ర పథాన్న నిలుస్తుందన్నారు. ఈ సమావేశానికి మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి అధ్యక్షత వహించారు. పాలకొల్లు పట్టణాన్ని రెండున్నర ఏళ్లలో రూ.60 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించగా, ఇప్పటి వరకూ 50 శాతం పూర్తిచేశామని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని, రూ.18కోట్లతో పనిచేసే ఎస్సీ సబ్ ప్లాన్ పనులను ఎన్నికల కోడ్ వల్ల టెండర్లు పిలవడానికి అడ్డుగా ఉందని, ఈ పనులు పూర్తిచేయడానికి ఎన్నికల అనంతరం 2 నెలలు గడువు పెంచాలని మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి కోరారు. ఎఎంసి ఛైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు మాట్లాడుతూ ఎన్నికలు ప్రతీ చోట ప్రశాంతంగా ఏకగ్రీవంగా జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే రామానాయుడు నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధికి తోడుగా పార్టీ కూడా బలోపేతం చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో సంపూర్ణ విజయానికి దోహదపడుతుందన్నారు. ఎన్నికల పరిశీలకులు ఏడిద శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ కర్నేన రోజారమణి, గౌరునాయుడు, జీవి, పీవీ, మేడిశెట్టి సత్యనారాయణ, ధనాని సూర్యప్రకాశ్, మహమ్మద్ జానీ, శిడగం జగన్నాధరావు, తోట రామకృష్ణ, మల్లంపల్లి పకీర్‌బాబు, అడబాల వెంకటరమణ, వట్టం గణేష్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన వార్డు కమిటీ కార్యవర్గాన్ని పచ్చ కండువా కప్పి ఎంపి తోట సీతారామలక్ష్మి అభినందించారు.
కిలోమీటరుకు నాలుగు మరణాలు
ఏలూరు, ఫిబ్రవరి 21: జిల్లాలోని తణుకు-పెరవలి మధ్య జాతీయ రహదారిపై కిలోమీటరుకు నాలుగు మరణాలు సంభవిస్తున్నాయని ఇది దేశంలోనే అత్యధిక మరణాల రేటుగా నమోదు కావడం బాధాకరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఒక కిలోమీటరుకు నాలుగు విలువైన ప్రాణాలు బలి అవుతున్నాయంటే లోపం ఎక్కడ ఉందో? ఎందువల్ల తణుకు - పెరవలి జాతీయ రహదారిపై అన్ని మరణాలు సంభిస్తున్నాయో ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. ఈ ప్రమాదాలను ఎలా అరికట్టాలనే అంశంపై ప్రతీ ఒక్కరూ చిత్తశుద్ధిగా దృష్టి పెడితే ప్రమాదాలను నివారించడం కష్టం కాదన్నారు. కొద్దిపాటి జాగ్రత్త చర్యలు పాటిస్తే విలువైన ప్రాణాలను కాపాడగలుగుతామని ఆ దిశగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. బాధ్యతగా వివిధ శాఖల అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని జిల్లాలో రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడం కష్టం కాదన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బడ్జెట్ లేదని కొన్ని శాఖల అధికారులు చెబుతున్నారని ప్రాణాలు పోయినా తర్వాత ఆదాయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ లేకపోయినా అవసరమైతే దాతల సహకారంతో నివారణా చర్యలు అమలుచేయాలని సూచించారు. జిల్లాలో ఏ రోడ్డు చూసినా గతుకులు, గుంటలతో సరైన మార్గం లేక అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి వాటిని నిరోధించి విలువైన ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు. జాతీయ రహదారిపై టోల్ పన్ను వసూలు చేయడమే తప్ప రోడ్డు ప్రమాదాల నివారణపై నేషనల్ హైవే సంస్థ దృష్టి పెట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు. జాతీయ రహదారిపై నిరంతరం పెట్రోలింగ్ చేయాలని రోడ్డుకు ఎదురుగా వాహనాలు వస్తుంటే వాటిని నియంత్రించాలని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు తాను బాధ్యత వహిస్తానని కానీ ప్రతీ అధికారి బాధ్యతాయుతంగా భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే కలెక్టరును ప్రశ్నిస్తున్నారని వివిధ శాఖల అధికారుల నిర్లక్ష్యం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని భవిష్యత్తులో అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పనిచేసి ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని ఎస్‌పి కోరారు. సమావేశంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణమూర్తి, డిఎంహెచ్‌ఒ డాక్టర్ కె కోటేశ్వరి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ నిర్మల, పంచాయితీరాజ్ ఎస్ ఇ మాణిక్యం, నేషనల్ హైవే అధికారి వెంకటరత్నం, డిఇఒ గంగాభవాని, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై సాయి శ్రీకాంత్, ఎక్సైజ్ శాఖ అధికారి చౌరి, ఏలూరు ట్రాఫిక్ డిఎస్‌పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు అసౌకర్యం కలుగరాదు
పోలవరం, ఫిబ్రవరి 21: పట్టిసం మహా శివరాత్రి ఉత్సవాల్లో విధులు నిర్వహించే సిబ్బంది భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడాలని ఉత్సవ కమిటీ ఛైర్మన్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్ లవన్న అన్నారు. మంగళవారం సాయంత్రం మహా శివరాత్రిలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ సిబ్బంది విధులు చేపట్టే సమయంలో తన స్థానంలో మరొకరు వచ్చే వరకూ తప్పని సరిగా విధులు నిర్వహించాలన్నారు. గోదావరి నది దాటేందుకు లాంచీలపై కెపాసిటీకి మించి ఎక్కించరాదని, పోలీసులకు, ఎజిఆర్‌బి అధికారులకు సూచించారు. ప్రతి లాంచీకి కెపాసిటీ బోర్డులు పెట్టాలన్నారు. డిఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం శివరాత్రి ప్రాంతాన్ని నాలుగు సెక్టార్లుగా విభజించగా, ప్రస్తుతం ఆరు సెక్టార్లుగా విభజించి, ఒక ఎఎస్పీ పర్యవేక్షణలో అయిదుగురు డిఎస్పీల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తామన్నారు. ఎజిఆర్బీ ఇఇ ఎన్ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ పట్టిసంకు మూడు పంట్లు చేరుకున్నాయని, మరో మూడు బుధవారం సాయంత్రానికి చేరుకుంటాయన్నారు. భక్తులు లాంచీలు ఎక్కేందుకు దిగేందుకు ఆరు ఫ్లాట్‌ఫారంల నిర్మాణం దాదాపు పూర్తయ్యాయన్నారు. లాంచీలకు ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్లు ఇవ్వడంతోపాటు డ్రైవర్ల లైసెన్సులను పరిశీలిస్తామన్నారు. మత్స్యశాఖ ఎడి పి రామకృష్ణరాజు మాట్లాడుతూ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా చూసేందుకు 54మంది గజ ఈతగాళ్లను ఏర్పాటుచేశామన్నారు. అలాగే స్నానమాచరించే భక్తులు లోతుల్లో వెళ్లకుండా ఉండేందుకు 12 నాట్లు పడవలను నిలుపుతామన్నారు. డిఎల్పీవో అమ్మాజీ మాట్లాడుతూ మహా శివరాత్రిలో పట్టిసం గ్రామంలో శానిటేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. శివరాత్రి ప్రాంతాన్ని సర్వేయర్‌తో ప్లాన్ వేయించుకుని ఆ ప్లాన్ ప్రకారం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆర్డీవో డిఎల్పీవోకు సూచించారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్ రమేష్‌బాబు మాట్లాడుతూ భక్తుల దైవదర్శనానికి క్యూ లైన్ల నిర్మాణం పూర్తయిందన్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం లక్షా, 50వేలు వాటర్ ప్యాకెట్స్ సిద్ధం చేస్తున్నామన్నారు. మహా శివరాత్రి రోజు రాత్రి ఇసుక తినె్నలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నామని, అందుకోసం స్టేజ్‌ను ఏర్పాటుచేయాలని దేవస్థాన ఇవో విశ్వనాధరాజును సమాచార శాఖ ఎడి భాస్కర్ నర్సింహమ్మూర్తి కోరారు. అదే సమావేశంలో మహా శివరాత్రి ఏర్పాట్లపై కూడా చర్చించారు. సమావేశంలో జంగారెడ్డిగూడెం ఎంవిఐ సిహెచ్ వెంకటరమణ, తహసీల్దార్ ఎం ముక్కంటి, ఆర్‌అండ్‌బి డిఇ అనిల్‌కుమార్, సిఐ కె బాలరాజు, ఎంపిడిఒ నిర్మలాజ్యోతి, ఎస్సై కె శ్రీహరిరావు తదితరులు ఉన్నారు.

రోడ్డుపైనే ఉతికేశారు!
-ఆచంటలో రజకుల వినూత్న నిరసన
ఆచంట, ఫిబ్రవరి 21: ఆచంట శివారు కాపులపాలెంకు చెందిన రజకులు చెరువు సమస్యను పరిష్కరించాలని కోరుతూ గత 35 రోజుల నుండి బట్టలు ఉతకకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆందోళనలో భాగంగా మంగళవారం కాపులపాలెం నుండి ఆచంట పురవీధుల గుండా తలపై బట్టల మూటలు పెట్టుకుని, ఇస్ర్తి బళ్లను లాక్కుంటూ వినూత్నరీతిలో తమ నిరసనను తెలియజేశారు. స్థానిక కచేరీ సెంటర్‌లో రహదారిపైనే బట్టలు ఉతికి నిరసన తెలిపారు. అనంతరం ధర్నా నిర్వహించి తహసీల్దార్ కుక్కల రాజేంద్రప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. కాపులపాలెంలో సుమారు 40 కుటుంబాలు రజకవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వారు బట్టలు ఉతికే చెరువు విషయమై 35 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. బ్రిటీష్ ప్రభుత్వం 1926లో చెర్వు, రెవెన్యూ కాలిదారి, పోరంబోకు స్థలాల్లో బట్టలు ఆరబెట్టుకునేందుకు గాను అనుమతి ఇచ్చిందని, అప్పటి నుండీ పంచాయతీకి లీజు కట్టుకుంటూ వృత్తి చేసుకుంటున్నామని రజకులు తెలిపారు. ఇటీవల కాలంలో చినపేటకు చెందిన కొందరు వ్యక్తులు వచ్చి తమను అడ్డుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ బీర తిరుపతమ్మ, గ్రామ పెద్దల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. సమస్యను మాత్రం ఇంతవరకు పరిష్కరించలేదని తెలిపారు. అధికార్లు వెంటనే సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
ఏలూరు, ఫిబ్రవరి 21:ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. రాష్ట్రంలో మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 73,245 మంది విద్యార్ధినీ విద్యార్ధులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 37,571 మంది విద్యార్ధినీ విద్యార్ధులు, రెండవ సంవత్సరం పరీక్షలకు 35,734 మంది విద్యార్ధినీ విద్యార్ధులు హాజరవుతున్నారని చెప్పారు. ప్రతీ ఒక్క విద్యార్ధినీ విద్యార్ధులు ముందుగానే పరీక్షా కేంద్రానికి హాజరు అయ్యేలా తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో 104 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశామని 35 కేంద్రాలలో ప్రశ్నాపత్రాల స్టోరేజీ పాయింట్లు ఏర్పాటుచేశామని వివరించారు. జిల్లాలో ఆరు రూట్‌లను ఎంపిక చేశామని, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు నిరంతర తనిఖీ నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గోపాలపురం, చింతలపూడి, ఆచంట, జీలుగుమిల్లి, దుంపగడప పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని అక్కడ మాస్ కాపీయింగ్ జరగకుండా నిరంతర నిఘా చర్యలు చేపట్టామని వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్‌తోపాటు రీజనల్ జాయింట్ డైరెక్టరు ఎ అమ్మాజీ, జిల్లా ఒకేషనల్ విద్యాశాఖాధికారి కె వెంకట్రామయ్య, చింతలపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయరావులను కమిటీలో సభ్యులుగా నియమించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణాధికారి ఎస్ ఏ ఖాదర్ చెప్పారు. జిల్లాలో ఎగ్జామ్స్ నిర్వహణా కమిటీని కూడా ఏర్పాటు చేశామని ఈ కమిటీలో పెంటపాడు ప్రిన్సిపల్ వైవి సుబ్బారావు, పెదపాడుజూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ బి ప్రభాకరరావు, నిడదవోలు ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, బుట్టాయిగూడెం ప్రిన్సిపల్ ఎం మానేశ్వరరావును నియమించినట్లు చెప్పారు. జిల్లాలో విద్యార్ధినీ విద్యార్ధుల సౌకర్యార్ధం అవవసరమైన బస్సులను ఉదయం వేళ అందుబాటులో ఉంచామని తిరిగి పరీక్షలు అనంతరం విద్యార్ధినీ విద్యార్ధులు ఇళ్లకు చేరేందుకు అనువుగా ఎక్కువ బస్సులను నడపాలని ఆర్‌టిసి ఆర్ ఎం ధనంజయరావును కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణాధికారి ఖాదర్, ఆర్‌టిసి ఆర్ ఎం ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు.

దక్షిణాదిలో అభివృద్ధి చెందుతున్న ఔషద పరిశ్రమలు

భీమవరం, ఫిబ్రవరి 21: దక్షిణ భారతదేశంలో ఔషధ పరిశ్రమలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ మండలి మాజీ డైరెక్టర్ పి నాగభూషణం అన్నారు. ఇందుకు ఫార్మశీ విద్య రాణించడమే కారణమన్నారు. ప్రతీ ఏడాది గ్రాడ్యుయేట్స్ సంఖ్య మరింత పెరుగుతోందన్నారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలోని విష్ణు ఫార్మశీ కళాశాలలో డి ఫార్మశీ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం గ్రాడ్యుయేషన్ డేను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన నాగభూషణం మాట్లాడుతూ ఫార్మశీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎన్నో వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో పరిశోధనల వైపు విద్యార్థులు దృష్టిసారించాలని ఆయన సూచించారు. మానవాళికి అవసరమైన అన్ని మందులను ఫార్మశీ విద్యార్థులు అందించేలా ఉండాలన్నారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ కెవి విష్ణురాజు మాట్లాడుతూ దేశ, విదేశాల్లో విష్ణులో ఫార్మశీ విద్యను అభ్యసించిన విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నారన్నారు. ప్రపంచంలోని మానవాళి కోసం మరిన్ని ఔషధాలను కనుగొనాలన్నారు. ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మా డి కోర్సును కేవలం విష్ణులో మాత్రమే అందిస్తున్నామని గుర్తుచేశారు. ఈ ప్రాంతాన్ని గుర్తించి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఔషధ రంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోర్సును పూర్తిచేసుకున్న విద్యార్థుల్లో ఉత్తమ విద్యార్థులకు బహుమతులను నాగభూషణం అందించారు. కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు గ్రాడ్యుయేట్ దుస్తుల్లో ప్రమాణం చేశారు. డైరెక్టర్ డాక్టర్ డి బసవరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు నృత్యాలతో అలరించారు.

శివరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
ఆచంట, ఫిబ్రవరి 21: జిల్లాలో మొత్తం 280 శైవ క్షేత్రాలు ఉండగా..వాటిలో ప్రధానంగా పట్టిసీమ, భీమవరం, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, కొవ్వూరు, జుత్తిగ, నత్తారామేశ్వరం దేవాలయాల్లో శివరాత్రి మహోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. మహా శివరాత్రి ఉత్సవాలకు ఆచంటీశ్వర దేవాలయంలో ఏర్పాట్లను మంగళవారం రాత్రి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎసి మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం ఏరాట్లుచేయాలని, అవసరమైతే అక్కడి పరిస్థితులను బట్టి ముందుగానే దర్శనం ఏర్పాట్లు చేయాలన్నారు. దర్శనానికి ముందుగా విఐపిలకు అవకాశం ఇస్తే క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది ఉండదన్నారు. అలాగే అర్చకులందరూ ఒక్కసారిగా స్వామివారికి అభిషేకం చేస్తే స్వామివారిని దర్శించుకునే వారికి ఇబ్బంది కలుగుతుందని, కాబట్టి వారికి కూడా ముందుగానే అవకాశం ఇస్తే, భక్తులకు ఇబ్బంది ఉండదన్నారు. మూలవిరాట్ కనబడే విధంగా స్వామివారిని అలంకరించాలని సూచించారు. దేవాలయంలో తప్పనిసరిగా ఓం నమ:శివాయ, బిల్వాష్టకం మైక్‌లో నిరంతరాయంగా పెడితే బావుంటుందని సూచించారు. గ్రామాల్లో ఉన్న చిన్న దేవాలయాల్లో శివరాత్రికి టిటిడి వారిచే 36 మంది శివతత్వం, మహా శివరాత్రి ప్రాధాన్యత, హిందూ ధర్మ పరిరక్షణపై ఉపన్యాసం ఇస్తారని దుర్గాప్రసాద్ తెలిపారు. ఆచంటలో అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అయిదు రోజులపాటు 50 వేల మందికి భోజన వసతి కల్పించడం అభినందనీయమంటూ కమిటీని అభినందించారు. ఉత్సవ ఏర్పాట్లను ఛైర్మన్ గొడవర్తి సూర్యకృష్ణ్భగవాన్, ఇవో దండు వెంకట కృష్ణంరాజు, కమిటీ సభ్యులు మనె్న ఉదయ భాస్కరరావు, మానేపల్లి వీరాంజనేయులు తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

భక్తులపై భారం సరికాదు
పోలవరం, ఫిబ్రవరి 21: మహా శివరాత్రికి వచ్చే భక్తులు గోదావరి నది దాటేందుకు లాంచీకి అనధికారికంగా రూ.5లు అదనంగా వసూలు చేయడం దారుణమని పట్టిసం గ్రామస్థులు పేర్కొన్నారు. అదనంగా పెంచాలంటే పెర్రీ పాట సమయంలో మినిట్స్ బుక్‌లో రాసి పాట నిర్వహించాలన్నారు. ఏర్పాట్ల ఖర్చులు అధికంగా అయ్యాయని భక్తులపై భారం మోపడం భావ్యం కాదన్నారు. అలాగే శివరాత్రిలో అన్నదానం నిర్వహిస్తామని డివిజన్ పరిధిలోని రేషన్ షాపుల నుండి, ప్రభుత్వ కార్యాలయాల నుండి చందాలు వసూలు చేయడం దారుణమన్నారు. శివరాత్రిలో ఎంతోమంది దాతలు అన్నసమారాధనలు నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రేషన్ డిపోల నుండి అన్నదానం పేరుతో అధికారులు చందాలు వసూలు చేయడం పట్టిసం శివరాత్రికి చెడ్డపేరు వస్తుంది కాబట్టి ఆ ప్రయత్నం విరమించాలని పట్టిసం మాజీ సర్పంచ్ నౌడు నాగేశ్వరరావు, మాజీ ఎంపిటిసి కర్రి వెంకటేశ్వరరావు, పప్పల సత్యనారాయణ, సిరపరపు వెంకటేశ్వరరావు తదితరులు డిమాండు చేశారు.