పశ్చిమగోదావరి

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 28: ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో 104 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం 9గంటల నుండి 12గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్ధులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. జిల్లాలో మొత్తం 73245మంది విద్యార్ధులు ఈఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రధమసంవత్సరం జనరల్ కేటగిరిలో 33500 మంది, ఒకేషనల్ కేటగిరిలో 4011 మంది మొత్తం 37511 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ కేటగిరిలో 32219మంది, ఒకేషనల్ కేటగిరిలో 3515 మంది మొత్తం 35734 మంది విద్యార్ధులు ఉన్నారు. 104 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 104మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 104మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను, 22 మంది కస్టోడియన్స్‌ను, 4 ఫ్లైయింగ్ స్వ్కాడ్‌లను నియమించారు. అంతేకాకుండా జిల్లా కలెక్టరు అధ్యక్షతన హైపవర్ కమిటీని కూడా ఏర్పాటుచేశారు. పరీక్షా పత్రాలను భద్రపరిచేందుకు 35 స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటుచేశారు. ఇప్పటికే మూడు సెట్ల ప్రశ్నాపత్రాలు అయా పాయింట్‌లకు చేరుకున్నాయి. పరీక్షలు ప్రశాంతవాతావరణంలో కొనసాగేందుకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్ధుల సౌకర్యార్ధం మంచినీరు, బెంచీలు వంటి సౌకర్యాలను ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్స్ షాపులను మూయించి వేయాలని ఇప్పటికే తహసిల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధుల సౌకర్యార్ధం ఎపిఆర్‌టిసి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటుచేసింది. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు విద్యార్ధులు, తల్లిదండ్రులు సహకరించాలని ఆర్‌ఐఓ ఖాదర్ కోరారు. ఏలూరు నగరంలో శ్రీ చైతన్యపేరుతో నాలుగు పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, ఇవన్నీ ఎన్‌ఆర్ పేటలోనే ఉన్నాయని, విద్యార్ధులు హాల్‌టికెట్‌లోని పరీక్షా కేంద్రం కోడ్ ఆధారంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కొన్ని కారణాల వల్ల మార్చి 9వ తేదీన జరగాల్సిన మ్యాథ్స్-2బి, జువాలజి పేపర్-2, హిస్టరీ పేపరు-2 పరీక్ష మార్చి 19వ తేదీకి వాయిదా పడిందని ఆయన తెలిపారు. విద్యార్ధులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఇప్పటికే విద్యార్ధులకు హాల్‌టిక్కెట్లు పంపిణి పూర్తి చేశామని, ఎవరైనా హాల్‌టిక్కెట్ పొందకపోతే వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్ధులు ఎవరైనా మాల్‌ప్రాక్టీస్‌కి పాల్పడితే నాలుగుసంవత్సరాల పాటు డిబార్ చేయటం జరుగుతుందన్నారు. భీమవరంలోని బ్రౌనింగ్ జూనియర్ కళాశాల, గూడెం వాసవీ జూనియర్ కళాశాల, నల్లజర్ల ఏకేఆర్‌జి కళాశాల, వేలేరుపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సిసి కెమెరాల నిఘా మధ్య ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు. గోపాలపురం ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, చింతలపూడి, ఆచంట, జీలుగుమిల్లి, దుంపగడపలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సమస్యాత్మక పరీక్షాకేంద్రాలుగా గుర్తించి అదనపు తనిఖీ బృందాలను ఏర్పాటుచేశామన్నారు.