పశ్చిమగోదావరి

ముఖ్యమంత్రి ఆశయ సాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, ఏప్రిల్ 2: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చారని, ఆయన ఆశయాలు వమ్ము కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని నూతనంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ పేర్కొన్నారు. దేవరపల్లిలో ఆదివారం మండల టిడిపి అధ్యక్షుడు సుంకర దుర్గారావు స్వగృహంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు మంత్రి పదవి రావడం పూర్వజన్మ సుకృతమని, ఈ పదవి తనకు వస్తుందని ఊహించలేదన్నారు. కొవ్వూరు నియోజకవర్గాన్ని విశేషంగా అభివృద్ధి చేశానని, పుష్కరాల సమయంలో తాను చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తించారన్నారు. కొవ్వూరు నియోజకవర్గంతో పాటు గోపాలపురం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషిచేస్తానని మంత్రి జవహర్ హామీ ఇచ్చారు. అంతకుముందు ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత విగ్రహానికి కూడ పూలమాలలు వేశారు. సమావేశంలో ఎంపిపి శ్రీకాకొళపు వెంకట నరసింహారావు, జడ్పీటీసీ కొయ్యలమూడి సుధారాణి, ఎఎంసి చైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, సర్పంచ్ సుంకర యామిని తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కేక్ కట్ చేసి మంత్రి జవహర్‌కు తినిపించారు.
ఇద్దరికి మంత్రి పదవులు హర్షణీయం

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 2: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా జిల్లాలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం పొందటం హర్షణీయమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పితాని సత్యనారాయణ ఆదివారం తాడేపల్లిగూడెంలో దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణకు మాణిక్యాలరావు అభినందనలు తెలిపారు. పితాని మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో టిడిపి మరోసారి విజయ పతాకం ఎగురవేసే దిశగా సమష్టిగా శ్రమిద్దామన్నారు. మంత్రి పితాని వెంట నర్సాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, బిజేపి పట్టణాధ్యక్షుడు కర్రి ప్రభాకర బాలాజీ, కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు, బిజేపి జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు తదితరులున్నారు.

ఒకరు తగ్గె... ఇద్దరు వచ్చె...

ఏలూరు, ఏప్రిల్ 2 : ఎంతోకాలంగా ఊహిస్తూ వచ్చిందే... అయితే అది జరుగుతుందా? లేదా? అన్న సంశయం అప్పటి నుంచి కొనసాగుతూనే వచ్చింది. చివరకు అదే నిజమైంది. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మరింత ప్రాధాన్యం దక్కిందనే చెప్పాలి. మొత్తం జిల్లా నుంచి ముగ్గురు అమాత్యులు ఉండటం విశేషం. వాస్తవానికి దాదాపుగా ప్రతీ మంత్రివర్గంలోనూ జిల్లాకు కనీసం మూడు అమాత్యపదవులు దక్కడం ఒక రకంగా ఆనవాయితీగా వస్తుందనే చెప్పాలి. అయితే ప్రస్తుత మంత్రివర్గంలో ఇంతవరకు జిల్లా నుంచి ఇద్దరు అమాత్యులు వుండగా వారిలో ఒకరికి ఉద్వాసన పలికి, మరో ఇద్దరికి అమాత్య పదవులు కట్టబెట్టారు. దీనితో జిల్లాలో గతంలోని ఆనవాయితీ మళ్లీ అమలులోకి వచ్చినట్లు చెప్పుకోవచ్చు. ఇంతకాలం జిల్లా నుంచి టిడిపి తరఫున పీతల సుజాత, బిజెపి తరఫున పైడికొండల మాణిక్యాలరావు మంత్రులుగా కొనసాగడం తెలిసిందే. వీరిలో పీతల సుజాతకు ఉద్వాసన పలికి జిల్లా నుంచి సీనియర్ రాజకీయ వేత్త, విశేష అనుభవం వున్న పితాని సత్యనారాయణకు, తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉపాధ్యాయ సంఘ నాయకుడు కె ఎస్ జవహర్‌కు అవకాశం కల్పించారు.
ఈ పరిణామాలు జిల్లాలో మిశ్రమ స్పందనలకు కారణం కాగా మరో విధంగాచూస్తే కొన్ని చోట్ల అసంతృప్తి స్వరాలు కూడా వినిపించడం గమనార్హం. కొంతమంది తమకు రాలేదన్న ఆవేదనను వ్యక్తం చేస్తుంటే మరికొందరు ఫలానా వారికి ఎలా ఇచ్చారన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు.
ఏది ఏమైనా మంత్రివర్గ కూర్పులో అవకాశం సాధించుకున్న పితాని సత్యనారాయణ, కె ఎస్ జవహర్‌తో కలిపి ఇప్పుడు జిల్లాలో ముగ్గురు మంత్రులున్నట్లు అవుతుంది. కాగా నూతన అమాత్యుల నేపధ్యం చూసుకుంటే పితాని సత్యనారాయణది విశేష అనుభవం కాగా కె ఎస్ జవహర్‌ది కొత్త ఉత్సాహం. కలగలిసి జిల్లా అభివృద్ధికి మెరుగైన అవకాశాలు సాధ్యపడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గతంలో లేసు ఎగుమతుల వ్యాపారంచేసేవారు. 1994 సమయంలో ఆయన స్పిన్నింగ్‌మిల్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా, అంతకుముందు పాలకొల్లు షుగర్స్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. కాగా బలహీన వర్గాల నాయకులుగా గుర్తింపు పొందిన పితాని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో ఆయన 1994, 1999లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2004, 2009లో తిరిగి కాంగ్రెస్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2009లో ఆయన ఆరోగ్యశ్రీ, వౌలిక వసతుల కల్పన శాఖామంత్రిగా పనిచేశారు. ఆ తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య మంత్రిగా వున్న సమయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగాను, ఆ తరువాత ఆర్ అండ్ బి శాఖ ఇన్‌ఛార్జి మంత్రిగాను పనిచేశారు.
రాష్ట్ర విభజన పరిణామాల్లో పితాని 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తిరిగి ఆచంట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత మూడేళ్లుగా అటు పార్టీపరంగాను, ఇటు ప్రభుత్వపరంగాను పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఇక పార్టీ పరంగా చూస్తే జిల్లాలో మొత్తం పార్టీని ఏకతాటిపైకి తీసుకురాగల నాయకుని కోసం అనే్వషిస్తూనే వున్నారు. అయితే పితాని తన విశేష అనుభవంతో మెట్ట, ఏజెన్సీ ప్రాంత నాయకులను సమన్వయ పర్చడంలో అందెవేసిన చేయిగా చెబుతున్నారు. అంతేకాకుండా జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన పితానికి అమాత్య పదవి కట్టబెట్టడం ద్వారా రాబోయే ఎన్నికల సమయానికి అది పార్టీకి మరింతగా ఉపకరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక తొలిసారి ఎమ్మెల్యేగా అనూహ్యమైన రీతిలో విజయం సాధించిన ఉపాధ్యాయ సంఘ నేత కె ఎస్ జవహర్ రాజకీయ ప్రస్థానం మరింత ఆసక్తికరంగాను, అంతకుమించిన ఉత్కంఠతోను కొనసాగుతోందనే చెప్పాలి. మొత్తం మీద సరికొత్త ఉత్సాహానికి అందివచ్చిన అమాత్య పదవి జిల్లాకు మేలు చేయగలదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. జవహర్ రాజకీయప్రస్థానాన్ని పరిశీలిస్తే ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆయన అనంతరకాలంలో ఉపాధ్యాయ సంఘ నేతగా గుర్తింపు పొందారు. ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా తిరువూరు. వ్యాపారనిమిత్తం ఇక్కడ స్ధిరపడి ఉపాధ్యాయునిగా ఉద్యోగం సంపాదించారు. ఆతర్వాత సంఘ నేతగా జిల్లావ్యాప్తంగా మంచి పట్టు సాధించారు. ఇలాంటి సమయంలో గత ఎన్నికల ముందునాటి పరిస్దితుల్లో అనూహ్యంగా జవహర్ పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్న టివి రామారావు మరోసారి పోటీ చేసేందుకు సిద్ధపడినా అప్పట్లో అధిష్టానం అవకాశం కల్పించలేదు. చివరకు ఆ అవకాశం జవహర్‌కు దక్కటం, వెంటనే రాజకీయరంగప్రవేశం, వెనువెంటనే ఎన్నికల రాజకీయం జరిగిపోగా చివరకు ఆయన మంచి మెజార్టీతో కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా పరిస్దితుల్లో సామాజికవర్గ సమీకరణాల నేపధ్యంలో జవహర్‌కు ఒక్కసారిగా అదృష్టం కలిసివచ్చిందనే చెప్పాలి. ఒక సామాజిక వర్గానికి చెందిన మంత్రిని తప్పించిన నేపధ్యంలో అదే వర్గసమీకరణల్లో ఉన్న జవహర్ పేరు అనూహ్యంగా తెరపైకి రావటం, వెంటనే అధిష్టానం ఆమోదముద్ర వేయటం జరిగిపోయింది. దీంతో కొత్త ఎమ్మెల్యేగా మరింత ఉత్సాహంగా పనిచేస్తున్న జవహర్‌కు అమాత్యపదవి అవకాశం కూడా లభించటంతో రానున్నరోజుల్లో జిల్లా అభివృద్ధి విషయంలోనూ అదే ఉత్సాహాన్ని చూపుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.