పశ్చిమగోదావరి

సాంఘిక బహిష్కరణ చేసిన వారి ఆస్తుల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 27: సాంఘిక బహిష్కరణ చేసిన వారి ఆస్తులు జప్తు చేసే అవకాశం కూడా ఉందని ఎపి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రతీ బాధిత కుటుంబానికి రూ.లక్ష ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో మంగళవారం మంత్రులు నక్కా ఆనందబాబు, కెఎస్ జవహర్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు తదితరులు పర్యటించి బహిరంగ విచారణ చేపట్టారు. సత్యాల దేవరత్నం, ఇ వాసు, కె ఆనందరాజు, సామర్లరాజు, విప్పర్తి ప్రసాద్, వి రాజు, బేబి మరి కొంతమంది చెప్పిన అంశాలను వారు విన్నారు. గ్రామంలో 13 కులాలన్నీ ఒక్కటయ్యాయని, వారంతా కలిసి ఎస్సీలను సాంఘిక బహిష్కరణ చేశారని బాధితులు తెలిపారు. దళితులు 90 శాతం బహిష్కరణకు గురైనట్టు తేలిందని ఛైర్మన్ శివాజీ చెప్పారు. దీంతో మంత్రుల కమిటీ తహసీల్దార్ జి రత్నకుమారి, ఎస్సై రాంబాబులను సస్పెండ్ చేయాలని తీర్మానించాయి. గ్రామ సర్పంచ్ చెక్‌పవర్ రద్దు చేయాలని, విఆర్వోను సస్పెండ్ చేయాలని నిర్ణయంచారు. అనంతరం స్థానికులనుద్దేశించి కారెం శివాజీ, మంత్రులు నక్కా ఆనందబాబు, జవహర్, జూపూడి ప్రభాకరరావులు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితుల పక్షపాతి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ దళిత ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, పనిదినాలు కల్పిస్తామని తదితర హామీలు ఇచ్చారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు, సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ, డిఎస్పీ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. కాగా ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి చేరుకునే దళిత సంఘాల నేతలను పోలీసులు అడ్టుకున్నారు. కాగా ఈ ఘటనకు నైతిక బాధ్యతగా ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు రాజీనామా చేయాలని పలు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.

భీమడోలు పశువైద్యశాలలో పోస్టుమార్టం
*చిరుత మృతి, గోళ్లు గల్లంతుపై విచారణ:అటవీశాఖ రేంజర్ ప్రకాశరావు
భీమడోలు, జూన్ 27: ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన చిరుతపులి మృతిపై దాని కాలి గోళ్లు గల్లంతవడంపై విచారణ నిర్వహించనున్నట్లు వన్యప్రాణి శాఖ టెరిటోరియల్ ఏలూరు రేంజర్ పి ఎస్ ప్రకాశరావు తెలిపారు. మృతిచెందిన చిరుతకు మంగళవారం భీమడోలులోని పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. డిడి ఎస్‌జిటి సత్యగోవింద్ ఆధ్వర్యంలో జరిగిన పోస్టుమార్టం కార్యక్రమంలో ప్రకాశరావుతోపాటు నల్లజర్ల సహాయ రేంజర్ శ్రీనివాసరావు, ఇతర అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. రేంజర్ ప్రకాశరావు మాట్లాడుతూ మృతిచెందిన చిరుత వయస్సు 5 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. ఆహారం కోసం లేదా నీటి కోసం జంగారెడ్డిగూడెం కుకునూరు తదితర ప్రాంతాల మీదుగా పులి తిరుమలంపాలెంకు చేరివుండవచ్చునని అభిప్రాయం వ్యక్తంచేశారు. మిడత లక్ష్మీనారాయణకు చెందిన పొలంలోని దూడపెయ్యిలను చంపి తిన్న చిరుత మృతకళేబరాన్ని వదిలి వెళ్లింది. వేరే జంతువేదో తినివుంటుందని, తిరిగి వచ్చే అవకాశం వున్న దృష్ట్యా విషపుగుళికలు ఏర్పాటుచేశారు. 24వ తేదీన ఆ గుళికలు తిన్న చిరుత పాకలపాటి రామారావు అనే రైతు కౌలు చేస్తున్న పామాయిల్ తోటలో మృతిచెందింది. 25వ తేదీన ఆ ప్రాంతంలో తచ్చాడిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పులిగోళ్లు మాయంచేసి, కళేబరాన్ని వదిలి వెళ్లి వుండవచ్చునని గ్రామస్థులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది 26వ తేదీ సాయంత్రం టెరిటోరియల్ డిఎఫ్‌వో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమడోలు తరలించారు. పామాయిల్ వ్యవసాయ క్షేత్రం కౌలు రైతుతోపాటు గుర్తుతెలియని ఆ ముగ్గురు వ్యక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. పులి మృతికి కారణాలను తెలుసుకునేందుకై పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు డిడి సత్యగోవింద్ తెలిపారు. శరీరంలోని కొన్ని భాగాలను విజయవాడలోవున్న ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నామని, నివేదిక వచ్చిన తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో భీమడోలు పశువైద్య ఎడి డాక్టర్ వై సుధాకర్, ద్వారకాతిరుమల పశువైద్యురాలు డాక్టర్ ఎస్ శిరీషలు సహకరించారు.

ఎక్కడిదో ఈ చిరుత...!
*ప్రజల్లో భయాందోళనలు
ద్వారకాతిరుమల, జూన్ 27: అటవీ ప్రాంతాల్లో సంచరించే చిరుత పులులు జనావాసాల్లోకి రావడంతో ప్రజలు కంటిపై కునుకులేకుండా పోయింది. ఇదేనా..ఇంకేమైనా చిరుతలు ఈ ప్రాంతంలో ఉన్నాయేమోనని పలువురు భయాందోళన చెందుతున్నారు. ఇది ఏ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చిందో అర్ధంకాక స్థానికులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే..చిరుత కాళ్లకు ఉండాల్సిన విలువైన అయిదు గోళ్లు మాయమవడంపై అటవీ శాఖ అధికారులు సీరియస్‌గా ఉన్నారు. వీటిని తస్కరించిన వారిని గుర్తించేందుకు వారు ఇప్పటికే చర్యలు చేపట్టారు. అరుదుగా సంచరించే చిరుత మృతికి కారకులు, అలాగే దాని గోళ్లను మాయం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అటవీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. మండల పరిసరాల్లో రెండు ఫారెస్టు ఏరియాలు ఉన్నాయి. నల్లజర్ల రిజర్వు ఫారెస్టు రేంజ్ పరిధిలో 2173.19 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అలాగే ఐఎస్ జగన్నాథపురం రిజర్వ్ ఫారెస్టు పరిధిలో 838.08 హెక్టార్ల పరిధిలో అటవీ ప్రాంతం ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో వన్యప్రాణులైన అడవి పందులు, కుందేళ్లు వంటి సంచారాన్ని స్థానికులు గుర్తించారే మినహా, క్రూర జంతువుల జాడ ఇప్పటి వరకూ కనిపించలేదు. ఈ నేపథ్యంలో బెంగాల్ టైగర్‌గా పిలవబడే ఈ తెల్ల చిరుత ఉనికి ఈ ప్రాంత వాసులను ఉలికిపాటుకు గురిచేసింది. ఇటీవల బుట్టాయగూడెంలో గిరిజనులు ఒక చిరుత పులి పిల్లను చంపిన ఘటన చోటుచేసుకుంది. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశువులపై దాడులు జరిగి ఎన్నో జంతువులు మృత్యువాతకు గురికాగా, ఇందుకు కారణం తోడేలు సంతతికి చెందిన హైనాగా అధికారులు చెప్పుకొచ్చారు. తాజాగా తిరుమలంపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో క్రూర మృగాలు ఎలా ప్రవేశిస్తున్నాయో అనే దానిపై దర్యాప్తు చేపట్టారు.
నిఘా పెంచుతాం:డిఎఫ్‌ఒ
క్రూర మృగాల సంచారంపై జిల్లాలో ఇక నిఘా పెంచుతామని జిల్లా అటవీ శాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు. దట్టమైన అడవుల్లో సంచరించే చిరుతలు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉందని, అయితే టైగర్‌గా పిలిచే పులులు మాత్రమే అడవులను వదిలి బయటకు రావన్నారు. నల్లజర్ల అటవీ ప్రాంతం నుంచి ఈ చిరుత ఇక్కడకు వచ్చినట్టు భావిస్తున్నామన్నారు. అడవి విడిచి రెండు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఈ చిరుతలు వెళ్లవని, అయితే ఇది మాత్రం దాదాపు 7కిలోమీటర్లకు పైగా ప్రయాణించిందని డిఎఫ్‌ఒ పేర్కొన్నారు. దీని మృతికి కారకులను, అలాగే గోళ్లు తస్కరించిన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.