పశ్చిమగోదావరి

పద్ధతి మార్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 22: జిల్లా రెవిన్యూ అధికారి కె హైమావతి తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ సమావేశం ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేలు డిఆర్వో తీరును, ఆమె చేస్తున్న వ్యాఖ్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించేదిలేదని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలుత తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇటీవల ఏదో విషయమై తాను డిఆర్వోకు ఫోన్ చేయగా ఆమె నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడారని పేర్కొన్నారు. జనం సమస్యలపై ఫోన్ చేస్తే జరుగుతుందో, జరగదో చెపితే సరిపోతుందని, అలాకాకుండా నిర్లక్ష్య ధోరణి సహించేది లేదని పేర్కొన్నారు. దీనిపై జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు జోక్యం చేసుకుంటూ డిఆర్వో వ్యవహారశైలి అభ్యంతరకరంగానే ఉందని, దీన్ని మార్చుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని చెప్పారు. అదే సమయంలో మండలి విప్ అంగర రామ్మోహన్ జోక్యం చేసుకుంటూ తనను కనీసం ప్రజాప్రతినిధిగా కూడా గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే ఈ వ్యాఖ్యలను డిఆర్వో ఖండించారు. తాను ఆవిధంగా మాట్లాడలేదని పేర్కొన్నారు. ఈదశలో ఇన్‌ఛార్జి మంత్రి పుల్లారావు జోక్యం చేసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఆదిశగా ముందుకు సాగాలని హితవు పలకటంతో ఈ చర్చ ముగిసింది.
ఇరిగేషన్-ఇరిటేషన్

ఏలూరు, సెప్టెంబర్ 22: సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం జరిగిన జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ సమావేశంలో ఇరిగేషన్ విభాగం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. పనిచేయని కాంట్రాక్టర్లపై ఎందుకంత మమకారమని స్వయంగా అమాత్యులే అధికారులను ప్రశ్నించే పరిస్థితి తలెత్తింది. త్వరలోనే ఈవిభాగం పనితీరుపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఇక ఆ తర్వాత జిల్లాకు కీలకమైన డెల్టా ఆధునికీకరణ పనుల తీరుపై ప్రధాన చర్చ జరిగింది. దశాబ్దం దాటిపోతున్నా ఇంతవరకు ఈపనులు అతీగతి లేకుండా పోయాయని, పనులు పూర్తికాకుంటే డెల్టా పరిస్థితి అయోమయమేనని పలువురు ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈవిషయంపై ముఖ్యమంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. అలాగే మరో చర్చనీయాంశంగా మారిన ఉపాధి కూలీల వేతనాల వ్యవహారం కూడా ఒక కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తోంది. దీనికి సంబంధించి జిఎస్‌టిపై ఉన్న కొన్ని సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉన్నతస్థాయిలో నిర్ణయాలు తీసుకోవటంతో ఈవేతనాలను విడుదల చేసేందుకు మార్గం సుగమం అయిందని స్పష్టమైంది. ఇక జిల్లాలో ఏ రోడ్డు చూసినా గతుకులమయంగా కన్పిస్తోందని, బయట నుంచి వచ్చిన తమకే ఇంత దారుణంగా కన్పిస్తోందంటే జిల్లావాసులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్ధమవుతోందని మంత్రులు సైతం వ్యాఖ్యానించారు. మరోవైపు డెల్టా పరిధిలో మంచినీరు కలుషితం అయిపోయిందని, కనీసం రెండు పూటలా నీటిని సరఫరా చేసే పరిస్ధితి లేకుండా పోయిందని, దీన్ని చక్కదిద్దకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని పలువురు ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తంమీద జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన దాదాపు తొలిసారి జరిగిన అధికారిక సమన్వయ సమావేశం సుదీర్ఘంగాను, విస్తృత చర్చల మధ్య ముగిసింది. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోగలిగింది.
ఏలూరులోని కలెక్టరేట్ సమావేశమందిరంలో శుక్రవారం జిల్లా ప్రతిప్రతినిధులు, అధికారులతో జరిగిన సమన్వయ సమావేశానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాది కౌలురైతులకు 1100కోట్ల రూపాయల రుణాలు ఇవ్వగా, ఇందులో పశ్చిమగోదావరి జిల్లాలోనే 439కోట్ల రూపాయలను అందించటం అభినందనీయమన్నారు. ఈవిషయంలో జిల్లా కలెక్టరు డాక్టరు భాస్కర్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో దోమ, పొడ, తాటియాకు తెగుళ్లు వివిధ పంటలకు సోకాయన్న సమాచారంపై మంత్రి పుల్లారావు మాట్లాడుతూ వీటి నివారణకు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్తవ్రేత్తలను జిల్లాకు పంపి అధ్యయనం చేయిస్తామని తెలిపారు. ఉపాధి హామీ వేతనాల అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. దీనిపై కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ స్పందిస్తూ ఇటీవల కర్నూలు జిల్లాలో కేంద్రబృందం వెళ్లినప్పుడు కొన్ని అంశాలను బట్టి ఉపాధి హామీ వేతనాల నిధులను నిలిపివేశారని, ఆతర్వాత అన్ని జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించాయని తెలిపారు. ఈవిషయంపై కేంద్రంతో రాష్ట్ర ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపినమీదట ప్రస్తుతం నిలిచిన ఉపాధి హామీ వేతనాలను విడుదల చేస్తున్నట్లు చెప్పారన్నారు. వీటిని త్వరలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు. జిఎస్‌టికి సంబంధించి పన్ను వసూళ్లలో శాతం నిర్దేశించటంలో కొంత సాంకేతిక సమాచారం లోపించిందని, ఈనేపధ్యంలో 18శాతం నిధులను పక్కనపెట్టి మిగిలిన సొమ్ము చెల్లించవచ్చునని తమకు సమాచారం వచ్చిందని, ఈమేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతితీరుపై ప్రతి మూడునెలలకు ఒకసారి ముఖ్యమంత్రి విశే్లషిస్తున్నారని, జిల్లాలో కూడా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చే నెల మరో సమావేశాన్ని నిర్వహిస్తానని తెలిపారు. ఇకనుంచి రెండునెలలకు ఒకసారి సమన్వయ సమావేశాలను నిర్వహిస్తానన్నారు. ఇరిగేషన్ విభాగం పనితీరుపై ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, దీనిని తొలగించేందుకు సంబంధిత పనులపై అధికారులు దృష్టి సారించాలన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లపై మమకారం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మంజూరు అయిన పనులు సకాలంలో పూర్తిచేయించటంలో మొద్దునిద్ర పోతే కుదరదని, పనిచేయని కాంట్రాక్టర్లను తొలగించి కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. త్వరలో ఇరిగేషన్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానన్నారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడిన పశ్చిమలో డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి స్ధాయిలో ప్రత్యేకంగా చర్చించిన సమయంలో జిల్లాలో దీనికి సంబంధించి చేయాల్సిన పనుల ప్రాధాన్యతతో కూడిన కార్యాచరణ రూపొందించి నివేదిక పంపామని చెప్పారన్నారు. దాంతోపాటు ఈ ఏడాది డెల్టా ఆధునీకరణకు అవసరమైన పనులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారని, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. తాగునీటి విషయంలో ఆచంటలో కూడా మంచినీటి పథకం ఇప్పటికీ పూర్తికాకుండా ఉందని, దీనిని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. జిల్లాలో కాలుష్యనివారణకు ప్రభుత్వం సబ్-కమిటీని వేసిందని, దీని ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ వ్యవహారాలు ముందుకెళ్తాయన్నారు. ఎంపి మాగంటి బాబు మాట్లాడుతూ కొల్లేరు సమస్యను పరిష్కరించాలన్నారు. సొసైటీలకు 8వేల ఎకరాలు, జిరాయితీ భూములకు సంబంధించి 13వేల ఎకరాలు అందించే ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. కొల్లేటికోట వంతెన నిర్మించాలన్నారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ కొల్లేరు సమస్యపై ఈనెల 29న సిఎం స్దాయిలో సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ కాంటూరులో ఉన్న పట్ట్భామికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పెరిగిన జనాభాకు అనుగుణంగా సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులను పెంచాలని కోరారు. లంకలకోడేరులో కాంగ్రెస్ హయాంలో చేపట్టిన మంచినీటి పధకం ఇప్పటికీ పూర్తికాలేదన్నారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఏ ఒక్క మంచినీటి పధకాన్ని పూర్తి నీటితో నింపలేకపోతున్నామని, సముద్రతీరంలో ఉండటంతో నీరు చిక్కబడిపోతోందన్నారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. నల్లిక్రీక్ జిఓ ఏనాడో విడుదలైందని, అలాగే వియర్ ఛానల్ జివో వచ్చి నెలలు దాటిందని, ఈవేవి పనుల స్ధాయికి రాలేకపోయాయన్నారు. వీటితోపాటు పలు సమస్యలను ఆయన ప్రస్తావించారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ తాగునీటి పధకాలకు సంబంధించి విద్యుత్‌బిల్లులు చెల్లించలేదని సర్వీసులు నిలుపుదల చేస్తున్నారని, దీనివల్ల తాగునీటి సమస్యలు ఏర్పడతాయన్నారు. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ జిల్లాలో పోలవరం, పట్టిసీమ, చింతలపూడితోపాటు మిగిలిన సాగునీటిరంగంపై కూడా దృష్టి సారించాలన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుండుగొలను-కొవ్వూరు రోడ్డును జాతీయరహదారికి బదలాయించి తక్షణం విస్తరణ పనులు చేపట్టాలని, లేనిపక్షంలో ట్రాఫిక్‌ను గుండుగొలను నుంచి రావులపాలెం వైపు మళ్లించాలని సూచించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రైతు అవసరాల నిమిత్తం మండలానికి కనీసం రెండువేల టార్పాలిన్‌లు అందించాలని కోరారు. సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, శాసనమండలి విప్ అంగర రామ్మోహన్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీలు కంతేటి సత్యనారాయణరాజు, షరీఫ్, కలిదిండి సత్యనారాయణరాజు, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీఫ్, డిఆర్వో కె హైమావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు
కొవ్వూరు, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో మిషన్ ఫింగర్ లింక్ పథకం ద్వారా అయిదు లక్షల చేప పిల్లలను మంత్రి జవహర్ గోదావరి నదిలోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జవహర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా మత్స్యకారులకు సుమారు కోటి రూపాయల వరకూ జీవనోపాధి లబ్ధి కలుగుతుందన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని నీటి గుంతలు, చెరువుల్లో చేప పిల్లలను విడిచిపెడితే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందన్నారు. మన రాష్ట్రం నుంచే దేశానికి 46 శాతం మత్స్య సంపద ఎగుమతి అవుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మత్స్య సంపదపైనా ఆధారపడి ఉందన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఆర్డీవో బి శ్రీనివాసరావు, మత్స్య శాఖ ఎడి జి రాధాకృష్ణ, బిజెపి నేతలు బివి ముత్యాలరావు, పి రాధాకృష్ణ, పిల్లలమర్రి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గంజాయిని పూర్తిగా అరికడతాం
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణా పూర్తిగా అరికడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేసారు. మండలంలోని గురవాయిగూడెంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గంజాయి విశాఖపట్నం జిల్లాలో నాలుగు నుండి ఆరు మండలాల్లోను, తూర్పుగోదావరి జిల్లాలో రెండు మండలాల్లోను సాగు చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. వీటి నిర్మూలన, అక్రమ రవాణా అరికట్టేందుకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారని చెప్పారు. గత నెల 15 నుండి ప్రత్యేక బృందాలతో గంజాయి సాగు, రవాణాపై తనిఖీలు ప్రారంభించామన్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు దాడులు చేస్తున్నాయని, ఇప్పటికే సాగులో ఉన్న గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. గంజాయి రవాణా అరికట్టాలనే లక్ష్యంతో హైవేల్లో అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. విశాఖ జిల్లాలో ఈ నెల 21న పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గంజాయి సాగు, రవాణా అంశాలలో రాజకీయ కోణం లేదని చినరాజప్ప స్పష్టం చేసారు. కళాశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రహదార్లపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ప్రధాన రహదార్లపై ప్రమాద ప్రదేశాలు గుర్తించి, ఆయా ప్రదేశాల్లో ప్రత్యేక పోలీస్ సిబ్బందిని నియమిస్తామన్నారు. జాతీయ రహదార్లలో వాహనాలు విచ్చలవిడిగా రోడ్లపక్కన నిలిపివేయకుండా ఉండేందుకు ప్రతి 15, 20 కిలోమీటర్లకు ఒక చోట ఐదు ఎకరాల స్థలం సేకరించి, పార్కింగ్ ఏర్పాటుచేసే ఆలోచన ఉందన్నారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు, స్థల సేకరణ త్వరలో చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత పోలీస్ సిబ్బంది లోటు ఏర్పడిందని, దీనిని భర్తీ చేసేందుకు 6,500 పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంటు చేపట్టినట్టు తెలిపారు. రిక్రూట్‌మెంటు అయిన తరువాత పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో నక్సలైట్ల ప్రాబల్యం అంతగా లేదని చినరాజప్ప స్పష్టంచేశారు. ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులలో నక్సలైట్ల సమస్యను అరికడతామని చెప్పారు. ప్రభుత్వం కాపులను బిసిల్లో చేర్చడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం నియమించిన మంజునాథ్ కమిషన్ సిఫార్సులు ఇచ్చిన తరువాత పరిశీలించి, బిసిలకు నష్టం జరగకుండా కాపులకు బిసి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ భాస్కరరావు, సిఐ జి శ్రీనివాస్ యాదవ్, ఎస్సైలు జిజె విష్ణువర్థన్, వి జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అవినీతి రహిత పాలన ధ్యేయం

ఏలూరు, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో ప్రజలకు అవినీతిరహితపాలన అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. స్ధానిక టిటిడి కళ్యాణమండపం వద్ద 85లక్షల రూపాయలతో నిర్మించిన అవినీతి నిరోధక శాఖ నూతన కార్యాలయ భవనాన్ని శుక్రవారం మంత్రి పితాని సత్యనారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ అవినీతిరహిత సమాజం ఏర్పాటుకావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమన్నారు. ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు టోల్‌ఫ్రీ నెంబరు 1100ను ఏర్పాటుచేశామన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా ఈనెంబర్‌కు ఫోన్ చేసి తెలపవచ్చునన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అద్ద్భెవనాలలో కొనసాగుతున్న ఎసిబికి నూతన భవనాలు, వాహనాలు, సిబ్బందిని సమకూర్చామన్నారు. ఎసిబి డిజి ఆర్‌పి ఠాకూర్ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా చురుకుగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.
ఎసిబి డిజి ఆర్‌పి ఠాకూర్ మాట్లాడుతూ రాష్టవ్రిభజన అనంతరం వైజాగ్‌లో ఎసిబికి నూతన భవనాన్ని నిర్మించామనిని, రెండవదిగా ఏలూరులో ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో 2005 నాటికి అవినీతి ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటిగా ఉందని, ప్రస్తుతం తీసుకున్న చర్యలు మూలంగా అవినీతిరహిత రాష్ట్రాల్లో మూడవదిగా నిలిచిందన్నారు. అవినీతికి పాల్పడేవారు ఇప్పటికైనా తమ అలవాటును మార్చుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. ఎవరైనా ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తే వారి సమాచారాన్ని అందించేందుకు ఎసిబిలో టోల్‌ఫ్రీనెంబరు, ప్రత్యేక వెబ్‌సైట్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటివి తీసుకువచ్చామన్నారు. అనంతరం మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, పోలీసు గృహనిర్మాణసంస్ధ ఛైర్మన్ షేక్ నాగూర్‌మీరా, ఎసిబి డిజి ఆర్‌పి ఠాకూర్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపి మాగంటి బాబు, ప్రభుత్వవిప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, కంతేటి సత్యనారాయణరాజు, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎసిబి అడిషినల్ డైరెక్టర్లు ఎ అబ్రహాంలింకన్, హరికుమార్, ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ, జెడి ఆంధ్రా టి మోహనరావు, ఎసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ అధికారి జగన్నాధరావు, జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్, అదనపు ఎస్పీలు వి రత్న, ఎం మహేష్‌కుమార్, ఎసిబి డిఎస్పీలు గోపాలకృష్ణ, సుధాకరరావు, ఇంటిలిజెన్స్ డిఎస్‌పి కె విజయపాల్, ఎసిబి సిఐ యుజె విల్సన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ మద్ది ఆంజనేయస్వామి సేవలో మంత్రి చినరాజప్ప
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 22: స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయస్వామివారిని శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖామాత్యులు నిమ్మకాయల చినరాజప్ప కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి రాజప్ప, ఆయన సతీమణి అనురాధ, కుమారుడు రంగనాగ్‌కు దేవస్థానం ఇఒ పెనె్మత్స విశ్వనాధరాజు(శివ) ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం చినరాజప్ప దంపతులు స్వామివారికి 108 బంగారు తమలపాకులతో అష్టోత్తర పూజ గావించి స్వామివారికి 108 టెంకాయలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ ముఖ మండపంలో అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేసారు. దేవస్థానం ఇఒ పెనె్మత్స విశ్వనాధరాజు(శివ) మంత్రి రాజప్పను స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి, స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కర్పూరం వెంకన్నబాబు, మానుకొండ వెంకటరెడ్డి, ధూళిపాళ ప్రభాకరరావు, తూటికుంట దుర్గారావు, ఏలూరు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ భాస్కరరావు, జంగారెడ్డిగూడెం సిఐ జి శ్రీనివాస్ యాదవ్, ఎస్సైలు జిజె విష్ణువర్థన్, వి జగదీశ్వరరావు పాల్గొన్నారు.
అక్టోబర్ 31 నుంచి పంచాయతీల్లో నగదు లావాదేవీలు బంద్

ఏలూరు, సెప్టెంబర్ 22: జిల్లాలో అక్టోబర్ 31వ తేదీ నుంచి అన్ని పంచాయతీలలో నగదు లావాదేవీలు నిలుపుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్ తెలిపారు. స్ధానిక కలెక్టరేట్‌లో శుక్రవారం పంచాయతీలలో పనుల తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పంచాయతీలలో ఇంటిపన్నులు, ఇతర లావాదేవీలు అన్ని నగదురూపంలో కాకుండా స్వైపింగ్ మిషన్ల ద్వారా జరపాలన్నారు. అన్ని పంచాయితీలు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి ప్రతి రూపాయి ఆన్‌లైన్ ద్వారానే జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్ లావాదేవీలపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ పూర్తిచేశామని, స్వైపింగ్ మిషన్లు ఉన్న పంచాయతీలలో ఎంతమంది ఆన్‌లైన్ లావాదేవీలు జరుపుతున్నది నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆన్‌లైన్ లావాదేవీల వల్ల నగదు అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం ఉండదన్నారు. జిల్లాలో సుమారు 3లక్షల 75వేల ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటుచేయాల్సి ఉండగా ఇంతవరకు కేవలం ఆరువేలు మాత్రమే ఏర్పటుచేయటం పట్ల నెడ్‌క్యాప్ అధికారులపై కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ అధికారులు ఉదయం 5.30గంటలకే విధులకు హాజరై బయోమెట్రిక్ హాజరువేయడంలో ఇదివరకుకంటే ఇప్పుడు మెరుగుపడిందని తెలిపారు.

రాబోయే ఎన్నికలు ఏకపక్షమే
చింతలపూడి, సెప్టెంబర్ 22: రాబోయే సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా జరుగనున్నాయని ఇందుకు నంద్యాల, కాకినాడ ఎన్నికలే నిదర్శనమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం చింతలపూడిలో జరిగిన టిడిపి నియోజకవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి కనీసం పది ఎకరాల ఉపయోగాలు జరిగే విధంగా చంద్రబాబు పాలన సాగుతున్నారన్నారు. రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏం కావాలంటే అది చేస్తామని, కానీ వైసిపి మాత్రం సైంధవుడిలా అభివృద్ధికి అడ్డుపడుతోందని ఆరోపించారు. సభలో పాల్గొన్న ఎక్సయిజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాత్రమే దళితులను గౌరవించే పార్టీఅని, అందువల్లనే అత్యధిక దళిత నాయకులు టిడిపిలో ఉన్నారన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో మాట్లాడిన ఏలూరు ఎంపి మాగంటి బాబు చింతలపూడి నియోజకవర్గం టిడిపికి కంచుకోటలాంటిదన్నారు. సభకు అధ్యక్షత వహించిన చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత మాట్లాడుతూ తనను గెలిపించిన చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఈ సభలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని ఆంజనేయులు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీ అంగర రామమోహనరావు, ఎమ్మెల్సీ షరీఫ్, ఏలూరు పార్లమెంటు కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు తదితరులు ప్రసంగించారు.
చింతలపూడిలో వర్గ సమస్య పరిష్కరిస్తాం : మంతి పితాని
చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయిందని, ఈ సమస్యను ఈరోజే పరిష్కరిస్తామని సభలో ప్రకటించారు. ఇది పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర సమస్యగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే, ఎంపిలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సహకరించాలని కోరారు. తొలుత స్థానిక ఎఎంసి కార్యాలయం నుంచి సభాస్థలి వరకు భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ జరిగింది.
ఆక్వా రైతులు ఆదాయపన్ను చెల్లించాల్సిందే

భీమవరం, సెప్టెంబర్ 22: ఆక్వా రైతులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆక్వా రైతులతో విశాఖపట్టణం, రాజమండ్రి కార్యాలయాలకు చెందిన అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భీమవరం ప్రాంతం నుంచి ఏఏ రైతులు ఎంత దిగుబడి సాధిస్తున్నారో వివరాలను నమోదు చేసుకుని మరీ వచ్చారు. ఈ వివరాలను రైతులకు వారు చెప్పారు. దిగుబడి ఆధారంగా వచ్చిన ఆదాయానికి సంబంధించి పన్నులు చెల్లించాలని ఆదేశించారు. అయితే దీన్ని కొంత మంది ఆక్వా రైతులు ప్రతిఘటించారు. తాము రైతులమని పన్నులు చెల్లించేది లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ప్రోసెసింగ్ ప్లాంట్లు, ఎగుమతిదారుల నుంచి పన్నులు వసూలు చేసుకోవాలని, రైతుల్ని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని చెప్పినట్లు సమాచారం. దీనిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మాత్రం ఎక్కువ మొత్తంలో సాగుచేసే రైతులు కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని, వారు తప్పనిసరిగా టర్నోవర్ ఆధారంగా పన్నులు చెల్లించాలన్నారు. తమ వద్ద లెక్కలు కచ్చితంగా ఉంటాయని, ఇది గమనించి రైతులు పన్నులు చెల్లించాలని గట్టిగా ఆదేశించినట్లు సమాచారం.
కౌలు రైతులకే రుణాలు, మాఫీలు వర్తించాలి
ఏలూరు, సెప్టెంబర్ 22: కౌలురైతులకే పంటరుణాలు ఇవ్వాలని, పూర్తి రుణమాఫీ చేయాలని, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలని, నష్టపరిహారాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కౌలురైతులు స్ధానిక కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం కౌలురైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉరితాళ్లకు వేలాడుతూ నిరసన వ్యక్తం చేశారు. రుణభారం మోయలేకపోతున్నామంటూ రుణభారం బండను నెత్తిమీద పెట్టుకుని తమ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన కౌలురైతుల నినాదాలతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ధర్నానుద్దేశించి కౌలురైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ 2011 కౌలురైతుల చట్టప్రకారం పంటరుణాలు కౌలురైతులకు ఇవ్వాల్సి ఉన్నా బ్యాంకులు చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్నాయన్నారు. భూములు కౌలుకిచ్చి పంటలు వేయని భూయజమానులకే రుణాలు ఇస్తూ కౌలురైతులకు బ్యాంకులు అన్యాయం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. బ్యాంకర్లు పెడుతున్న ఆంక్షలను తక్షణమే రద్దుచేసి ప్రభుత్వం బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంకులు రుణాలు ఇవ్వక, ప్రైవేటు అప్పులు దొరకక భార్యల మెడలో పుస్తెలు తాకట్టు పెట్టి వ్యవసాయం చేయాల్సిన దుస్ధితి కౌలురైతులకు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల భారంతో కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కౌలురైతుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ జిల్లాలో కౌలురైతులకు రుణగుర్తింపుకార్డులు మంజూరులో అనేక అంక్షలు పెట్టడం తగదన్నారు. కొన్నిచోట్ల రెవిన్యూ అధికారులు కార్డుల మంజూరుకు సొమ్ములు వసూలు చేయటం దారుణమన్నారు. నకిలీ పురుగుమందులు అమ్మకాలు వల్ల కౌలురైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తెగుళ్లు నివారణ కావటం లేదన్నారు. కౌలురైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ధనికొండ శ్రీనివాస్, జుజ్జువరపు శ్రీనివాస్, వాడవల్లి రామారావు, జిల్లా సహాయ కార్యదర్శులు మామిడిశెట్టి రామాంజనేయులు, పెచ్చెట్టి నరసింహమూర్తి మాట్లాడారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఎంపి మాగంటి బాబు ధర్నా శిబిరం వద్దకు చేరుకుని సంఘం నేతల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం కౌలురైతుల సంఘం నాయకుల సమక్షంలో కలెక్టరేట్ సమావేశమందిరంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో కౌలురైతుల సమస్యలపై చర్చించారు. ఈసందర్భంగా కలెక్టరు డాక్టరు భాస్కర్‌కు కూడా వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కొర్ని అప్పారావు, జివి సుబ్బారావు, కిలారి తవిటినాయుడు, కోయ పెద్దిరాజు, వీరవల్లి త్రిమూర్తులు, ఎస్ అప్పారావు, ఎం రాంబాబు, పల్లి జార్జిబాబు, ఇంజేటి శ్రీనివాస్, బెజవాడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.