పశ్చిమగోదావరి

రోజూ చచ్చేకంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, అక్టోబర్ 17: డ్రైనేజీ సమస్య తమను ఏళ్ల తరబడి వేధిస్తున్న పట్టించుకోరా అంటూ తీవ్ర ఉద్వేగానికి లోనైన ఓ వ్యక్తి గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆప్ట్రాల్ డ్రైనేజీ కోసం ప్రాణాలు తీసుకుంటావా అంటూ ఎమ్మెల్యే అనడంతో ఆ వ్యక్తి డ్రైనేజీ సమస్య తమకు ఆప్ట్రాల్ కాదంటూ ధ్వజమెత్తాడు. ద్వారకాతిరుమల మండలంలోని తిమ్మాపురంలో మంగళవారం జరిగిన ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. అలాగే గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో అడుగడుగునా ప్రజలు తమ సమస్యలు ఏకరవుపెట్టడంతో కార్యక్రమం రసాభాసగా మారింది. ముందుగా గ్రామ ప్రధాన కూడలికి వచ్చిన ఎమ్మెల్యే ముప్పిడి, ఇతర నేతల ముందు గ్రామానికి చెందిన హోటల్ వ్యాపారి అప్పసాని ధర్మారావు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయాడు. దీనిని నివారించిన ఎమ్మెల్యే ఏమి జరిగిందంటూ బాధితుడిని ప్రశ్నించారు. ప్రధాన రహదారిపై హోటల్‌ను నిర్వహిస్తున్నానని, రెండేళ్ల క్రితం నాలుగు లేన్ల రహదారి నిర్మించిన సమయంలో డ్రైనేజీ ఏర్పాటు పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మురుగునీరు సక్రమంగా పారక ఒకేచోట నిలిచి దుర్వాసనతోపాటు దోమల బెడద ఎక్కువై తరచూ తాము రోగాల బారిన పడుతున్నట్టు వివరించారు. ఎన్నిసార్లు సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదని ధ్వజమెత్తాడు. మురుగు వాసన, దోమల బెడదతో రోజూ చచ్చేకంటే పెట్రోలు పోసుకుని ఒకేసారి చావడం మంచిదని ధర్మారావు ఆవేదన చెందాడు. దీంతో బాధితుడి చేతిలోని అగ్గిపెట్టెను ఎమ్మెల్యే లాక్కొనే ప్రయత్నం చేయగా పలువురు నేతలు అతనిని సముదాయించి, ఆ తరువాత హరిజనపేటలోని మహిళలు సమస్యల పట్ల ఎమ్మెల్యే ముప్పిడిని చుట్టుముట్టారు. తమ కాలనీలో ఒక సిసి రోడ్డు కూడా నిర్మించలేదని ధ్వజమెత్తారు. ఇలావుండగా టిడిపికి చెందిన రెండు వర్గాల వారు ఎమ్మెల్యే ముందు సిసి రోడ్డు విషయమై బాహాబాహీకి దిగారు.
నవంబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఏలూరు, అక్టోబర్ 17 : నవంబర్ మొదటి వారంలో జిల్లాలో ధాన్యం కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో, మిల్లర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించే టెక్నికల్ అసిస్టెంట్లకు, వెలుగు కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని ధాన్యం క్వాలిటీ ఎంపిక చేసే విధానంపై సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. రానున్న ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో ధాన్యం పంట ఎన్ని ఎకరాల్లో ఎంత ధాన్యం వస్తుందీ అంచనా వివరాలను మిల్లర్లు నివేదిక ఇవ్వాలని కోరారు. రాబోయే ఖరీఫ్, రబీ సీజన్లు ఈ ఏడాది సెప్టెంబరు నుండి వచ్చే ఏడాది అక్టోబరు మాసం వరకు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మంచి దిగుబడిలు సాధించేందుకు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గత సంవత్సరం మిల్లర్లు ఏ విధంగా సహకరించారో అదే విధంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ద్వారా ప్రభుత్వానికి అందించి మిల్లర్లు కొనుగోలు చేసి బియ్యాన్ని అందించాలని చెప్పారు. ఎఫ్‌సి ఐ, సివిల్ సప్లయి ద్వారా ధాన్యాన్ని తీసుకుంటామని మిల్లర్లకు జెసి తెలిపారు. గత ఏడాది 44 వేల టన్నుల బియ్యం మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వవలసి వుందని మిల్లర్లకు జెసి తెలిపారు. గన్నీ సరఫరా సక్రమంగా నిర్వహించాలని క్వింటాలుకు 200 గన్నీలు అవసరమవుతుందని మిల్లర్లు తెలపగా ధాన్యాన్ని సరఫరా చేసేందుకు వీలుగా సరిపడ గన్నీలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ దేశంలో అన్నం పెట్టేది రైతేనని, రైతు సంక్షేమానికి ప్రబుత్వం సహకరించాలని కోరారు. మిల్లర్లకు ఇంతవరకూ డ్రైయర్ల ఛార్జీలు ఇవ్వలేదని వెంటనే ఇవ్వాలని కోరారు. ఎఫ్‌సి ఐతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సయ్యద్ ఆసిన్, ఎఫ్‌సి ఐ డి ఎం కొండయ్య, డిఆర్‌డిఏ పిడి కె శ్రీనివాసులు, అసిస్టెంట్ సప్లయి అధికారులు ఆర్ శివ ప్రసాద్, వై ప్రతాపరెడ్డి, జిల్లాలోని మిల్లర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల సేవలు ఎనలేనివి
ఏలూరు, అక్టోబర్ 17: ప్రజాస్వామ్యపరిరక్షణ, శాంతిభద్రతల సంరక్షణలో పోలీసుల సేవలు ఎనలేనివని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్ధానిక పోలీసు కళ్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన స్వచ్చంద రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా పోలీసు సిబ్బంది, సినీ అభిమానసంఘాల సభ్యులు రక్తదానం చేశారు. ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణాపాయంలో ఉన్న ఎందరికో జీవితాన్ని ఇస్తుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆశువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ఎప్పుడూ గుర్తించుకోవాలని, వారి అవిశ్రాంత త్యాగఫలం ఫలితంగా అందరూ నిశ్చింతగా జీవించగలుగుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, అదనపు ఎస్పీ వి రత్న, ఎఆర్ డిఎస్పీ ఎం మహేష్‌కుమార్, ట్రాఫిక్ డిఎస్పీ ఎ శ్రీనివాసరావు, ఏలూరు డిఎస్పీ కె ఈశ్వరరావు, డిసిహెచ్‌ఎస్ డాక్టరు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్ధానిక పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్‌లో మంగళవారం ఫోటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించి ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతపై విద్యార్ధినీవిద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ ఎగ్జిబిషన్‌లో ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, క్రైమ్ అండ్ సెక్యూరిటీ స్టాల్స్ ఏర్పాటుచేసి వివిధ రకాల తుపాకులు, బాంబులను కనుగొనే పరికరాలను ప్రదర్శించారు. విద్యార్ధినీవిద్యార్ధులకు వాటిని ఉపయోగించే విధానాలపై వివరించి వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం మాక్‌డ్రిల్ ఏర్పాటుచేసి టెర్రరిస్టులు నాయకులను కిడ్నాప్ చేసిన విధానం, పోలీసు బలగాలు వారిని రక్షించిన తీరు కళ్లకు గట్టిన్నట్లు చూపించారు. టెర్రరిస్టులు విఐపిలను కిడ్నాప్ చేసి ఒకచోట బంధించటం, వారి డిమాండ్లను ఒప్పుకుంటూనే మరోవైపు ఆపరేషన్ మొదలుపెట్టి నలువైపుల నుంచి టెర్రరిస్టులను చుట్టుముట్టడం, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా టెర్రరిస్టులను ఏవిధంగా మట్టుపెట్టి విఐపిలను విడిపించింది చూపించిన తీరు అందర్ని ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎస్పీ ఎం రవిప్రకాష్‌తోపాటు జిల్లా అదనపు ఎస్పీ వి రత్న, ఎఆర్ అదనపు ఎస్పీ ఎం మహేష్‌కుమార్, ఏలూరు ట్రాఫిక్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఏలూరు డిఎస్పీ ఈశ్వరరావు, డిటిసి డిఎస్పీ రాజేశ్వరరావు, ఎఆర్ డిఎస్పీ విఎస్ వాసన్, ఎస్‌బి సిఐ ఎస్ కొండలరావు, డిసిఆర్‌బి సిఐ జివి కృష్ణారావు, నగర సిఐ మధుబాబు, ఎఆర్ ఆర్‌ఐ కె వెంకటరావు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంక్షేమానికి చేయూత
ఆచంట, అక్టోబర్ 17: మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు ప్రభుత్వం వారికి అన్ని విధాలా చేయూతనందిస్తోందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనాశాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పెనుగొండ మండలంలోని వడలి, దేవ, రామన్నపాలెం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. రామన్నపాలెంలో రు. 35లక్షలతో నిర్మించిన మిషన్లుతో కూడిన లేసుపార్కును ఆయన ప్రారంభించారు. దేవ గ్రామంలో దేవ నుండి పెళ్ళికూతురమ్మ చెరువుకు రూ 1.54 కోట్లతో వేయబోయే రహదారికి భూమిపూజ చేశారు. రూ 70 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, 4.8 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. కార్యక్రమాలలో ఎఎంసి ఛైర్మన్లు సానబోయిన గోపాలకృష్ణ, ఉప్పలపాటి సురేష్‌బాబు, వైస్ ఛైర్మన్ బడేటి బ్రహ్మం, వడలి సర్పంచ్ పీతల మంజుల, దేవ సర్పంచ్ వెలిచేటి బాబూరాజేంద్ర ప్రసాద్, జడ్పీటీసీ రొంగల రవికుమార్, సర్పంచ్ కంకిపాటిపురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికి ప్రచారంలో టిడిపి... కేరళ వివాదంలో బిజెపి

భీమవరం, అక్టోబర్ 17: కేరళ రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతలపై జరుగుతున్న హత్యాకాండకు నిరసనగా భీమవరంలో బిజెపి ఆందోళనకు దిగింది. ఈ ఆందోళనలో పార్టీ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు కాయిత సురేంద్ర, యువమోర్చ పట్టణ అధ్యక్షులు కొండేటి నరేష్ పాల్గొన్నారు. కాగా ఇంటింటికి టిడిపి ప్రచారంలో భాగంగా పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తోట భోగయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రం దృష్టికి జిఎస్‌టి సమస్యలు
ఏలూరు, అక్టోబర్ 17 : ఎక్సైజ్, సర్వీస్ టాక్స్, వ్యాట్ తదితర స్థానిక సంస్థల పన్నులను ఒక స్థూలమైన ఫ్రేమ్ వర్క్ క్రిందకు తీసుకువచ్చేందుకు జిఎస్‌టి విధానాన్ని అమలు చేయడం జరుగుతోందని కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ తివారి చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం జిఎస్‌టి అమలుపై వివిధ వ్యాపార వర్గాలతో నిర్వహహించిన సమీక్షా సమావేశంలో ప్రమోద్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ జిఎస్‌టి అమల్లోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్బంగా జిల్లాకు సంబంధించి వ్యాపార సంస్థలు జిఎస్‌టి అమల్లో ఎదుర్కుంటున్న సమస్యలు, ఇబ్బందులను వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారి సలహాలు, సూచనలను క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ జిఎస్‌టి అమల్లో జిల్లాలోని వ్యాపారులు, వినియోగదారులకు ఎదురవుతున్న సమస్యలను తివారీకి వివరించారు. జి ఎస్‌టి నెట్ వర్క్ సిస్టమ్ పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం వుందని సూచించారు. సిజిఎస్‌టి కమిషనరు శ్రీహరిరావు మాట్లాడుతూ ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, టాక్స్ ప్రాక్టీషనర్స్, ఆంధ్రా షుగర్స్, తదితర పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు జిఎస్‌టి అమల్లో వారు తెలియజేసిన ఇబ్బందులు తివారి దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కమిషనరు వి నాగేంద్రరావు, సెంట్రల్ టాక్స్, ఐఎస్‌ఆర్ ఐ అశోక్ కుమార్,జాయింట్ కమిషనర్ టి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీలకు పౌష్టికాహారం:మంత్రి జవహర్
కొవ్వూరు, అక్టోబర్ 17: పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉన్న గర్భిణీలకు రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణీలకు గుడ్డు, పాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి వి రాజ్యలక్ష్మి, టిడిపి నేతలు జెవిఎస్ చౌదరి, బివి రాఘవులు, ఎఎంసి ఛైర్మన్ వేగి చిన్న, ఎంపిడిఒ ఎ రాము తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు స్థానిక శ్రీరామా సొసైటీలో ఏర్పాటుచేసిన బాణాసంచా విక్రయ కేంద్రాన్ని మంత్రి జవహర్ ప్రారంభించారు. లాభాపేక్ష లేకుండా ప్రజలకు తక్కువ ధరకే బాణాసంచాను సొసైటీ ద్వారా విక్రయిస్తుండడం పట్ల మంత్రి జవహర్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి నేతలు జెవిఎస్ చౌదరి, కె రామకృష్ణ, ఎం రామకృష్ణ, మద్దుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణా లోపమే ప్రైవేటుకు వరం

ఆకివీడు, అక్టోబర్ 17: ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పన సక్రమంగా లేదని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆకివీడులోని పులవర్తి లక్ష్మణస్వామి జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు గొట్టుముక్కల జానకీరామరాజు నివాసంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల వైపు పేదలు సైతం ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ పాఠశాలల నిర్వహణా లోపమేనన్నారు. ప్రభుత్వం సగటున ఒక్కో విద్యార్థిపై రూ.60వేలు వంతున ఏటా రూ.23వేల కోట్లు విద్యారంగంపై వెచ్చిస్తున్నా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. తాను సందర్శించిన సుమారు 200 పాఠశాలల్లో పట్టుమని 20మంది విద్యార్థులు కూడా లేరన్నారు. 80 పాఠశాలల్లో అయిదుగురు మాత్రమే విద్యార్థులు ఉన్నారన్నారు. విద్యార్థులపై వత్తిడి తీసుకువచ్చి విద్యను బోధించడం సరికాదన్నారు. జయప్రకాష్ నారాయణకు ఆకివీడు జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కాకర్ల రాజేశ్వరి, ఉపాధ్యాయులు గోపి, సతీష్, విజయకుమార్, భమిడిపాటి భాస్కరరావులు తమ పాఠశాల ప్రగతిని గూర్చి తెలియజేశారు.
ఆకివీడును నగర పంచాయతీగా మార్చాలని తీర్మానం

ఆకివీడు, అక్టోబర్ 17: ఆకివీడు పంచాయతీని నగర పంచాయతీగా మార్పు చేయడానికి రంగం సిద్ధం చేశారు. 2011 జనాభా లెక్కలను అనుసరించి ఆకివీడు పంచాయతీలో 32,412మంది ఉండగా, సాధారణ ఆదాయం కింద రూ.1,86,72,000లు పంచాయతీకి వచ్చినట్టు అంచనా వేశారు. ప్రముఖ వ్యాపార పారిశ్రామిక కూడలిగా అభివృద్ధి చెందిన పంచాయతీలను నిబంధనల మేరకు నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా జిల్లాలోని చింతలపూడి, వీరవాసరం-శృంగవృక్షం, పెనుగొండ - మార్టేరు, వెలగలేరు, నెగ్గిపూడి పంచాయతీలతోపాటు ఆకివీడు పంచాయతీని కూడా నగర పంచాయతీగా అభివృద్ధిచేసేందుకు రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మంగళవారం సర్పంచ్ బి గణపతి అధ్యక్షతన పాలకవర్గ సభ్యులు నగర పంచాయతీగా మార్పు కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మానం 48గా చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని అధికారులకు పంపిస్తున్నట్టు కార్యదర్శి నందేటి ఠాగూర్ తెలిపారు.