పశ్చిమగోదావరి

వేసవి తాగునీటి సమస్యలకు ప్రత్యేక సమాచార కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 11: జిల్లాలో వేసవికాలంలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తినా, ఇబ్బందులు ఎదురైనా సమాచారం అందించేందుకు ప్రత్యేక సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు తెలిపారు. ఏలూరులోని ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయంలో ఈ కేంద్రం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని, ప్రజలు తమ ఫిర్యాదులను 08812-222891కు ఫోన్ చేసి చెప్పాలన్నారు.

నిర్వాసితులను పలకరించిన హక్కుల సంఘం
పోలవరం, ఏప్రిల్ 11: జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యుల బృందం సోమవారం పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన రామయ్యపేట గ్రామంలో పర్యటించింది. గతంలో రామయ్యపేట, పైడిపాక, చేగొండిపల్లి, దేవరగొంది గ్రామ నిర్వాసితులు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆర్థిక వేత్త పెంటపాటి పుల్లారావు ద్వారా జాతీయ మానవహక్కుల సంఘానికి చేసిన ఫిర్యాదుమేరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇంద్రజిత్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ రణబీర్‌సింగ్ పర్యటించారు. ఉదయం పదిగంటలకు రామయ్యపేట చేరుకున్నారు. ముందుగా సర్పంచ్ సంకురు వెంకాయమ్మతో మాట్లాడారు. అనంతరం వారు ఇంటింటికీ తిరిగి నిర్వాసితులతో మాట్లాడారు. నరుకుల దుర్గారావు మాట్లాడుతూ ఇల్లు పూర్తవకపోయినా ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. కుంచే సత్యనారాయణ మాట్లాడుతూ మూడున్నర ఎకరాలు ప్రాజెక్టు ముంపులో కలిసిపోతున్నందున పరిహారం ఎకరాకు 1.4 లక్షలు మాత్రమే ఇచ్చారన్నారు. సత్యం బ్రహ్మయ్య మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు భూములకు అతి తక్కువ పరిహారం చెల్లించారని, అయితే ఇప్పటికీ ఆ భూముల్లో తామే వ్యవసాయం చేసుకుంటున్నామన్నారు. నిర్వాసితులు చెప్పిన విషయాలను లిఖిత పూర్వకంగా తీసుకున్నారు.
అనంతరం దేవరగొంది, చేగొండపల్లి నిర్వాసితులు కమిటీ సభ్యులతో మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్ట ప్రకారం ప్యాకేజీ, భూములకు పరిహారం చెల్లించాలని కోరారు. అనంతరం కమిటీ సభ్యులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం రామయ్యపేట చేరుకుని అక్కడ నిర్మించిన గృహాలను పరిశీలించి వివరాలను జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, హౌసింగ్ పిడి శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భూ సేకరణ స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్, ఆర్డీవో ఎస్ లవన్న, డిఎస్పీ జె వెంకట్రావు, తహసీల్దారు ఎం ముక్కంటి తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనకు
ముమ్మరంగా ఏర్పాట్లు
కుకునూరు, ఏప్రిల్ 11 : విలీన ముంపు మండలమైన కుకునూరులో జరగబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలవరం ప్యాకేజీ విషయంలో ముంపు బాధితులకు న్యాయపరమైన ప్యాకేజీ ఎంత ప్రకటిస్తారన్నదానిపై కొండంత ఆశతో ముంపు మండల బాధితులు ఈ సభకు భారీగానే తరలి వచ్చే అవకాశాలున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సబ్ కలెక్టర్ షాన్‌మోహన్ ప్రత్యేక దృష్టి సారించి చివ్వాక, మారేడుబాక మధ్యలో వున్న ఖాళీ స్థలంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయించారు. దానికి ఎదురుగానే హెలిప్యాడ్‌ను ఏర్పాటుచేశారు. ఎటువంటి అవాంతరాలు తలెత్తే అవకాశాలకు తావివ్వకుండా పోలీసులు సైతం డాగ్‌స్క్వాడ్‌తో సహా సోమవారమే రంగ ప్రవేశం చేశారు. ఈ సభా ప్రాంగణానికి దగ్గరలో నీరు-చెట్టు కార్యక్రమానికి సైతం చివ్వాక చెరువును ఎంపిక చేసి అక్కడ సైతం అధికారులు దగ్గరుండి ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా పనులు చేపట్టారు. 2004 నుంచి పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల అభివృద్ధికి ఆటంకంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలవరం పేరుతో నేటి వరకు ముంపు బాధితులు తమ భవిష్యత్తు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు ఒక ఎతె్తైతే, రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్రతిష్టాత్మకంగా మారింది. దీనికి తోడు కేంద్రం సైతం దీనిని జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించడంతో ఇది పూర్తిస్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారని ముంపు బాధితులకు ఒక నమ్మకం ఏర్పడింది. ముంపు మండలాలైన తెలంగాణ మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలుపుకుని ఎక్కడ అన్యాయం చేస్తారోనని భయపడిన ముంపు బాధితులకు బుధవారం జరగబోయే ముఖ్యమంత్రే స్వయాన బాధితులకు వరాజల్లు కురిపిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సభకు సర్వం కోల్పోతున్న ముంపు మండలాల బాధితులందరూ తరలిరానున్నారు. కొండంత ఆశతో సర్వం కోల్పోతున్న తమకు నిర్ధిష్టమైన ప్యాకేజీ ప్రకటించి తమకు పూర్తి భవిష్యత్తును కల్పిస్తారని ఇక్కడి ప్రజలు నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.

ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు
పోలవరం, ఏప్రిల్ 11: ఉచిత ఇసుక విధానం అపహాస్యం పాలయ్యేలా కన్పిస్తోంది. ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేస్తుండటంతో భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశముంది. జిల్లాలో పది ర్యాంపులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ ర్యాంపుల్లో కూలీలు లోడ్ చేస్తుండడంతో ర్యాంపుల ఒత్తిడి తగ్గించేందుకు గోదావరి తీరాన ఎక్కడ ఇసుక ఉందో అక్కడే మిషన్‌నుతో లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు. అప్పటి నుండి పోలవరంలో మహా నందీశ్వరస్వామి ఆలయం వద్ద ఇసుక రవాణా ప్రారంభమైంది. క్యూబిక్ మీటరుకు అధిక మొత్తం వసూలు చేస్తున్నారనే ఆరోపణపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పోలవరం ర్యాంపును సందర్శించి అధికంగా వసూలు చేస్తే కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. ఈ ర్యాంపులో వివిధ పార్టీల నాయకులు మూడు ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించారు. రోజుకు సుమారు 300కు పైగా భారీ లారీలతో ఇసుక తీసుకెడుతున్నారు. అయితే పోలవరం ర్యాంపునకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయా అనేదే ప్రశ్న. మహా నందీశ్వరస్వామి ఆలయం వద్ద మూడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉందని అధికారులు గుర్తించి ఈ వేలంలో ఈ ర్యాంపు కూడ ప్రకటించారు. అయితే ఈ ర్యాంపు పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉందని, అనుమతులు రద్దు చేయాలని ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి, గనుల శాఖకు లేఖలు రాశారు. ప్రభుత్వం ఈ లోగా ఇసుకను ఉచితమని ప్రకటించింది. దాంతో ఇక్కడ ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేస్తున్నారు. వందలాది లారీలు పోలవరం మీదుగా వెడుతుంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణా నియంత్రించాలని అధికారులను కోరుతున్నారు.

స్వల్పంగా పెరిగిన పొగాకు ధర
దేవరపల్లి, ఏప్రిల్ 11: ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలో పొగాకు ధర స్వల్పంగా కిలోకు రూపాయి పెరిగింది. వేలం ప్రారంభంలో కిలో 155 రూపాయలుండగా సోమవారం నిర్వహించిన వేలంలో కిలో 158 రూపాయల గరిష్ఠ ధర పలికింది. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి బంగార్రాజు మాట్లాడుతూ దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో పది కంపెనీలు పాల్గొన్నాయని, సరాసరి కిలో 153.84 రూపాయలు, మీడియం 129.81 రూపాయలు, లో గ్రేడు 96.42 రూపాయలు పలికిందన్నారు. ఇప్పటివరకు 1.17 లక్షల కిలోలు విక్రయించినట్టు చెప్పారు.
కాగా అక్రమ పొగాకు కొనుగోళ్లపై నిఘా పెట్టామని రాజమహేంద్రవరం పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ శ్రీరామ్మూర్తి హెచ్చరించారు. సోమవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ అక్రమ పొగాకు విక్రయాలను ప్రోత్సహిస్తే రైతులే నష్టపోతారన్నారు. అక్రమంగా కొనుగోలు చేసిన వారిపై వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలోని అయిదు వేలం కేంద్రాల్లో 0.75 మిలియన్ కిలోల పొగాకు అమ్మకం జరిగిందని, దీని విలువ 5.29 కోట్ల రూపాయలుందని చెప్పారు. ఇప్పటివరకు సరాసరి రేటు 137.25 రూపాయలు పలికిందన్నారు. పొగాకు వేలంలో ఐటిసి 58.22 శాతం, జిపిఐ 3.68, పిఎస్‌ఎస్ 6.48 శాతం, డిఒ 2.87 శాతం, పిటిపి 3.79 శాతం, ఎంఎల్ 3.22 శాతం, ఎంఎల్ 2 4.9 శాతం, వైఇపి 1.02, డక్కన్ 3.97 శాతం కొనుగోలు చేసినట్టు ఆర్‌ఎం చెప్పారు.

ఘనంగా మదన గోపాలస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ
ఆకివీడు, ఏప్రిల్ 11: మండలంలోని అయి భీమవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాల పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠతోపాటు ఆలయ ప్రాంగణంలో పెద్దఎత్తున టిటిడి వేదపండితులచే హోమాలు నిర్వహించారు. నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు, టిటిడి మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. హోమం వద్ద హారతులు అందుకున్నారు. కార్యక్రమానికి అశేష జనవాహిని తరలిరావడంతో ఆ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మార్మోగింది. గోకరాజు రామరాజు, మాజీ సర్పంచ్ కనుమూరి రామకృష్ణంరాజు, మాజీ ఎంపిపి కనుమూరి రామకృష్ణంరాజు, జెఎస్‌ఆర్, కొల్లిపర లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

పంట బోదెలో స్కూలు వ్యాను బోల్తా
వీరవాసరం, ఏప్రిల్ 11: వీరవాసరం మండలం కొణితివాడ సమీపంలో సోమవారం ఒక స్కూలు వ్యాన్ అదుపుతప్పి పంటబోదెలో బోల్తాపడింది. స్కూల్లో చిన్నారులను ఇంటి వద్ద దింపి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న పంటబోదెలోకి బోల్తాపడింది. ప్రమాద సమయంలో వ్యానులో పిల్లలు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఆకట్టుకుంటున్న
పనస చెట్టు!
ఆకివీడు, ఏప్రిల్ 11: పనస చెట్టుకి కాయలు కాయడం సహజం. అయితే ఆకివీడు పోలీసు స్టేషన్‌లో పనస చెట్టుకి భూమికి తాకేటట్టు కాసిన కాయలు ఆ ప్రాంతానికి వచ్చేవారిని ఆకర్షిస్తున్నాయి. రోజువారీ ఫిర్యాదుదారులు కాసింత ఉపశమనం కోసం స్టేషన్ ఆవరణలోని బల్లపై కుర్చుంటే వారికి మొదటగా కనిపించేవి ఈ పనస కాయలే. వీటిని ఫిర్యాదుదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.