పశ్చిమగోదావరి

పేదల కోసం 5.39 లక్షల గృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 19 : రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు 5.39 లక్షల గృహాలను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు. స్థానిక ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9 లక్షల మంది పేద ప్రజలు సొంత ఇళ్లు కావాలని దరఖాస్తు చేశారని, వాటిని పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించి పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని తీసుకుంటామని చెప్పారు. మంజూరు చేసిన 5.39 లక్షల ఇళ్లలో నాలుగు లక్షల ఇళ్లను బహుళ అంతస్తుల భవనాలుగా పేదలకు అందించాలని నిర్ణయించామన్నారు. దేశ వ్యాప్తంగా పట్టణ పేదలకు 22 లక్షల గృహాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా అందులో అయిదు లక్షల ఇళ్లు రాష్ట్రానికి కేటాయించాలని తెలిపారు. గత ప్రభుత్వంలో 2005 నుంచి 2007 వరకు నిర్మించిన నాశిరకం ఇళ్లలో ప్రజలు నివాసముండటం లేదని, ఒక్క నెల్లూరు జిల్లాలోనే 6400 ఇళ్లు నాశిరకంగా వున్నట్లు గుర్తించామన్నారు. రాజీవ్ స్వగృహ కింద నిర్మించిన ఇళ్ల కాలనీల్లో వౌలిక వసతులు లేవని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు, డ్రైన్లు, విద్యుత్తు, కమ్యూనిటీ హాళ్లతోపాటు సామాజిక, వౌలిక వసతులను కల్పించి ఇవ్వడమే నిజమైన గృహసముదాయాలు అవుతాయని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. నిర్మించే ఇళ్లు గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో వుండాలని, వందేళ్లు ఆ ఇంటిలో కుటుంబం హాయిగా వుండాలన్నదే చంద్రబాబు సంకల్పమని చెప్పారు. ఆధునిక ఇళ్లను పేదల కోసం నిర్మించేందుకు చైనా, జపాన్, సింగపూర్, బ్రిటన్ వంటి దేశాల్లో పర్యటించి కొత్త టెక్నాలజీని తీసుకువచ్చామన్నారు. షెల్‌వాల్ పద్దతిని అత్యంత నాణ్యతగా గుర్తించామని, నాలుగు గోడలు, శ్లాబ్ ఒకే సారి నిర్మాణం జరుగుతుందని, ఈ కట్టడాలు భూకంప తాకిడిని కూడా తట్టుకుంటాయని చెప్పారు. ఏలూరు నగరంలో 12176 ఇళ్లు మంజూరు చేశామని, ఇంటి స్థలం వున్న 2810 మందికి ఇళ్లు మంజూరు చేసి 2.50లక్షల రూపాయల నగదు మంజూరు చేస్తున్నామని చెప్పారు. స్థలం లేని వారికి బహుళ అంతస్తు భవనాలు నిర్మిస్తామన్నారు. పోణంగి ప్రాంతంలో 58 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే గృహ కాలనీకి 50.60 కోట్ల రూపాయల భూసేకరణ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఈ కాలనీకి వెళ్లే పోణంగి రోడ్డు నిర్మాణానికి 1.80 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నామని చెప్పారు. అన్నీ జి+7 నమూనాలో నిర్మిస్తామని, 13 జిల్లాల్లో 110 మున్సిపాల్టీల్లో నిర్మించే ఇళ్లకు ధర నిర్ణయించామని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో నిర్మించిన 4700 కోట్ల రూపాయల విలువైన 14 లక్షల గృహాలు నివాస యోగ్యం కానివిగా ఇటీవల నిపుణుల కమిటీ నిర్ధారించిందన్నారు. ప్రధానంగా ఇందులో కొన్ని లక్షల గృహాలకు సంబంధించి ఆన్‌లైన్ చేయించుకోమని కోరుతున్నా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఇందుకు కారణం ఒకే పేరుతో మూడునాలుగు చోట్ల ఇళ్లు పొందినవారే వున్నారన్నారు. అటువంటి ఇళ్లను తొలగించి పటిష్టమైన గృహాలు నిర్మించి పేదలకు ఇస్తామన్నారు. ప్రభుత్వం నిర్మించే ఒక గృహం ఒక ఆస్థి కావాలని, అయిదారు సంవత్సరాల తరువాత కుటుంబ అవసరాల కోసం ఆ ఇంటిని అమ్ముకునే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా షెల్‌వాల్ విధానంలో ఇళ్లు నిర్మిస్తామని, ఇప్పటికే 150 టవర్స్ సంక్రాంతి నాటికి పేదలు గృహప్రవేశం చేసేలా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. నెల్లూరులో ఈ బహుళ అంతస్తుల కాలనీని సంక్రాంతి సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్మించిన 20 బ్లాక్‌లను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం సొంత ఇల్లు లేదని బాధపడకుండా ప్రతీ కుటుంబానికి దశల వారీగా ఇళ్లు నిర్మిస్తామన్నారు. రానున్న మూడ్నెల్లలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి వాటిని పేదలకు ఇస్తామన్నారు. రాష్ట్రంలో షెల్‌వాల్స్ పద్దతిలో నిర్మించే ఇళ్లను ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు త్వరలో ఒక అవగాహనా సదస్సును నిర్వహిస్తుందని చెప్పారు. గత మూడేళ్లలో మున్సిపాల్టీల్లో 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. ప్రత్యేక హోదా రాలేదని కొంతమంది చెబుతున్నారని, కానీ ప్రత్యేక హోదా వస్తే ఏ రీతిలో రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందో అదే స్థాయిలో ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు (ఇఎపి) కింద కేంద్రం 4700 కోట్ల రూపాయాలను మంజూరు చేసిందన్నారు. ఏలూరు నగరానికి 131 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే ఆ నిధులు ఏలూరు వస్తాయని తెలిపారు. శివారు ప్రాంతాలు విస్తరిస్తున్న కారణంగా ఆ ప్రాంతాల్లో వౌలిక వసతులను కల్పిస్తామన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అసెంబ్లీని గాలికి వదిలేసి పాదయాత్ర పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. 46 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంటే ఏ ఒక్కరికైనా పెన్షన్ వస్తుందా అని జగన్మోహన్‌రెడ్డి అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. రైతు రుణమాఫీ, మహిళా గ్రూపులకు రుణమాఫీ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తుంటే దాన్ని కూడా జగన్మోహన్‌రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఆయన మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. అందుకే నంద్యాల, కాకినాడల్లో జగన్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పినా మారకుండా ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అక్రిడిటేషన్ సౌకర్యం వున్న ప్రతీ జర్నలిస్టుకు త్రిబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. 15 నెలల కాలంలో జర్నలిస్టులందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని చెప్పారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ నగరాన్ని తనిఖీ చేసి కార్పొరేషన్‌కు 200 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తామని చెప్పిన నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 150 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేసామని, 762 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ ఆర్‌జెడి వై సాయి శ్రీకాంత్, ఇన్‌ఛార్జి కమిషనర్ రాంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.