పశ్చిమగోదావరి

అవినీతిలో ఆరితేరిన ఆజాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 12 : దేవాదాయ ధర్మాదాయ శాఖలో రీజనల్ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న శీలం సూర్యచంద్రశేఖర్ ఆజాద్ నివాసాలపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న ఆరోపణలు రావడంతో రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురం తదితర 16 చోట్ల 21 బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో భారీ స్థాయిలో అక్రమాస్తులు వెలుగుచూసినట్లు సమాచారం. కాగా ఆజాద్ ఏలూరులో కూడా అక్రమాస్తులు కలిగివున్నారన్న సమాచారం రావడంతో శ్రీకాకుళం ఎసిబి ఇన్‌స్పెక్టర్ రమేష్ తన సిబ్బందితో స్థానిక పత్తేబాదలోని ఆజాద్ బంధువుల ఇంటిపై దాడిచేశారు. ఈ సందర్భంగా సిరికొండ సత్యవతి పేరుతో అయిదున్నర ఎకరాలు, రంగమ్మ, లక్ష్మణరావు పేరుతో 26 ఎకరాలు భూములు అనంతపురం జిల్లా ఊగిచర్లలో వున్నట్లు గుర్తించారు. ఇటీవలే ఈ భూములను వారు ఆజాద్ సోదరుని పేరుతో బదిలీచేసినట్లు ఎసిబి అధికారులు కనుగొన్నారు. ఇదిలా ఉండగా అసిస్టెంట్ కమిషనర్‌గా దేవాదాయ శాఖలో ప్రవేశించిన ఆజాద్ ముక్కుసూటి మనిషిగా పేరొందారు. అయితే తెరవెనుక వ్యవహారాలు భారీ ఎత్తున సాగించేవారని ఎసిబి సోదాల్లో బహిర్గతమవుతోంది. ఇటీవల దేవాదాయ శాఖపై ప్రత్యేక దృష్టిసారించిన ఎసిబి అధికారులు వరుస దాడులు నిర్వహిస్తూ అవినీతి తిమింగలాల భరతం పడుతూ వస్తున్నారు. ఆ శాఖ కమిషనర్ కార్యాలయంతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో పనిచేస్తున్న కొంతమంది అసిస్టెంట్ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కూడా భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఎసిబి అధికారులు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ దాడులు మున్ముందు రోజుల్లో మరింత విస్తృతంగా కొనసాగుతాయని ఎసిబి ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
గూడెంను కమ్మేసిన మంచు

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 12: శీతాకాలం కావడంతో ప్రతీ రోజూ కన్నా మంగళవారం తెల్లవారు జాము నుంచి పట్టణ పరిసర ప్రాంతాల్లో మంచు అధికంగా కురిసింది. దీంతో పట్టణంలో రెండవ ఫ్లై ఓవర్, నల్లజర్ల రోడ్డు, రైల్వే స్టేషన్, పడాల రోడ్డు ప్రాంతాలు పొగమంచుతో నిండిపోయాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ఉండటంతో రోడ్డుపై లైట్లు వేసుకుని వెళ్ళే పరిస్థితి నెలకొంది.

రైల్వే గేటుకు గ్రీన్ సిగ్నల్

భీమవరం, డిసెంబర్ 12: భీమవరం పట్టణంలోని రహదారులు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బి) బైపాస్ రోడ్డులో రైల్వే గేటు ఏర్పాటుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులు టెండర్ల దశ దాటి ప్రారంభ దశకు చేరుకుంటే భీమవరంలో దాదాపుగా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నోచుకుంటుంది. కాలుష్యానికి పట్టణం దూరంగా కూడా ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆర్‌అండ్‌బి బైపాస్ రోడ్డులోని రైల్వే గేటు ఏర్పాటుచేయిస్తున్న ఘనత ఎవరిదనే అంశం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. అటు నాయకులు, కార్యకర్తలు చాలా సీరియస్‌గా చర్చించుకోవడం విశేషం. తెలుగుదేశం పార్టీకి చెందిన పివినర్సింహరాజు ఎమ్మెల్యేగా ఉండగా తొలి దశ ఆర్‌అండ్‌బి బైపాస్ రహదారి పనులపై దృష్టిసారించి ఆ పనులు పూర్తిచేయించడంలో సఫలమయ్యారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన గ్రంధి శ్రీనివాస్ రాజీవ్ నగరబాటలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భీమవరం వచ్చిన సమయంలో మిగిలిన పనులకు శిలాఫలకాన్ని ఏర్పాటుచేసి ఆయన చేత ప్రారంభోత్సవం చేయించారు. అదే సమయంలో ప్రకాష్ నగర్‌లో ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభోత్సవం, కొత్త పంపుల చెరువు, భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి హామీ ఇచ్చి, వాటిని ఆచరణలో పెట్టారు. 2009 ఎన్నికలకు ముందు భీమవరం యనమదుర్రు డ్రెయిన్ పైన వంతెన నిర్మాణం, ఆ పై బైపాస్ రహదారి నిర్మాణం పనులను ఎమ్మెల్యేగా గ్రంధి శ్రీనివాస్ పూర్తిచేశారు. వంతెన, రహదారికి వివాదాలు తలెత్తడంతో ఆయన స్వయంగా బాధ్యత వహించి ఈ పనులను పూర్తిచేశారు. అప్పటికే రైల్వే గేటు ఆర్‌అండ్‌బి బైపాస్‌లో ఏర్పాటుచేయాల్సి ఉందని గుర్తించిన గ్రంధి శ్రీనివాస్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆ తర్వాత 2009లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన పులపర్తి రామాంజనేయులు, ఎంపీ కనుమూరి బాపిరాజులు రైల్వే గేటు విషయంపై ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పట్లో ఈ గేటు సమస్య అంతగా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే నర్సయ్య అగ్రహారం ప్రాంతంలో ఉన్న భూముల విలువలు పెరుగుతాయి తప్ప ఈ గేటు ఇంకెవరికీ అంత ఉపయోగం లేదన్న వాదన కూడా నడిచింది. ఇది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి తప్ప కొంతమందికే ప్రయోజనం కాకూడదన్నది ప్రభుత్వ ఆలోచన. 2014లో తిరిగి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన పులపర్తి రామాంజనేయులు ఈ గేటుపై దృష్టిసారించారు. ఇదిలా ఉండగా రైల్వే గేటు అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం. ఇది అందరికీ స్పష్టంగా తెలిసిందే. కాగా 2014 తర్వాత దక్షిణమధ్య రైల్వే జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యులుగా భీమవరం ప్రాంతం నుంచి వేగేశ్న వరప్రసాద మూర్తిరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఆకివీడుకు చెందిన నేరెళ్ల పెదబాబు నియమితులయ్యారు. వీరు ప్రత్యేకంగా హైద్రాబాద్‌లో జరిగిన ప్రతీ సమావేశంలో భీమవరం రైల్వే గేటు అంశాన్ని జీఎం నుంచి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత కాలంలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కొత్తగా వచ్చిన జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో కూడా చర్చించారు. ఇక రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన తోట సీతారామలక్ష్మి గేటు ఏర్పాటు విషయమై రైల్వే అధికారులకు ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ గేటు ఏర్పాటు ఘనత తమదంటే తమదని చెప్పుకుంటుండటం విశేషం.

అనుమతి లేకుండా పండించవద్దు
-పొగాకు బోర్డు ఆర్‌ఎం చంద్రశేఖర్
బుట్టాయగూడెం, డిసెంబర్ 12: బ్యారన్ లైసెన్స్, ఎటువంటి అనుమతులు లేకుండా వర్జీనియా పొగాకును పండించవద్దని పొగాకు బోర్డు ప్రాంతీయ అధికారి కె.చంద్రశేఖర్ రైతులకు సూచించారు. మండలంలోని సూరపవారిగూడెంలో పొగాకు బోర్డు ఆధ్వర్యంలో వేలం నిర్వహణాధికారి కెఎస్ రాజ్‌ప్రకాష్ అధ్యక్షతన మంగళవారం జరిగిన వర్జీనియా పొగాకు రైతుల శిక్షణా కార్యక్రమంలో ఆర్‌ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ అనుమతి లేని పొగాకు ఉత్పత్తిని ఎట్టి పరిస్థితుల్లోను ప్రోత్సహించేది లేదని స్పష్టంచేశారు. నిర్దేశించిన మేరకే పొగాకు ఉత్పత్తి చేయాలన్నారు. నాణ్యమైన, పరిశుభ్రమైన పొగాకు ఉత్పత్తి చేసి, మంచి ధరలను పొందాలని రైతులకు తెలిపారు. బిందు సేద్యం ద్వారా పొగాకు పంటకు తడులు ఇచ్చి, ఉత్తమ యాజయాన్య పద్ధతులను పాటించాలన్నారు. ఈ నెల 8వ తేదీ వరకు దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం-1, జంగారెడ్డిగూడెం-2 పొగాకువేలం కేంద్రాల పరిధిలో 12,076 మంది పొగాకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 13,656 బ్యారన్లు లైసెన్స్‌లు రెన్యువల్స్ అయ్యాయని తెలిపారు. ఈ ఏడాది రైతులు 20,484 హెక్టార్లలో వర్జీనియా పంట సాగు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వేలం కేంద్రాల్లో కలిపి 45.06 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తికి అనుమతించినట్లు పేర్కొన్నారు. దేవరపల్లిలో అత్యల్పంగా 7.70 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం2 వేలం కేంద్రంలో అత్యధికంగా 10.32 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జివో ఎస్‌వి మధుసూదనరావు, జిపిఐ జి.గౌరీశంకరరావు, ఫీల్డ్ ఆఫీసర్ ఎం.శంకరరావు, ఐటిసి ప్రతినిధి ప్రశాంత్‌జోషి, ఎన్.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
వెదురు అక్రమాలపై విచారణ
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 12: అటవీ శాఖ రాజమండ్రి సర్కిల్‌లోని మూడు లాగింగ్ డివిజన్ల ద్వారా ఈ ఏడాది రూ.15 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ. 12 కోట్లు వచ్చినట్టు అటవీ శాఖ సర్కిల్ చీఫ్ కన్సర్వేటర్ జెఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. ఎర్రకాల్వ భూముల్లో వెదురు అక్రమ నరికివేత, తరలింపుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతామని చెప్పారు. ప్రైవేటు భూముల్లోనైనా వెదురు నరకాలంటే అటవీ శాఖ అనుమతులు అవసరమని చెప్పారు. వెదురుతో తయారుచేసిన తడికలు అటవీ ప్రాంతం నుండి వస్తుంటే సీజ్ చేసే అధికారం ఉందని, లేకుంటే సీజ్ చేసేది లేదన్నారు. స్థానిక లాగింగ్ డివిజన్‌లోని ప్రభుత్వ వెదురు, టింబర్ డిపోలో మంగళవారం ఆయన వెదురు, టింబర్ వేలం నిర్వహించారు. వేలం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 1954 టేకు ప్లాంటేషన్స్‌లో చెట్లను నరికించి డిపోలకు తరలించి వేలం నిర్వహిస్తున్నామన్నారు. ప్లాంటేషన్లతో పాటు అక్రమ రవాణా దారుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న కలప కూడా వేలం జరుగుతోందన్నారు. సర్కిల్‌లో నాలుగు టేకు ప్లాంటేషన్స్‌లో టేకు నరికివేత పనులు జరుగుతున్నాయని, తరువాత అదే ప్లాంటేషన్స్‌లో మరల టేకు పెంచుతామని చెప్పారు. సర్కిల్‌లోని జంగారెడ్డిగూడెం డివిజన్‌లో వెదురు, రాజమండ్రి డివిజన్‌లో వెదురు, చింతూరు డివిజన్‌లోని రేఖపల్లి, చింతూరు, మోతుగూడెం డిపోల్లో వెదురుతో పాటు టేకు వేలం జరుగుతోందని తెలిపారు. సర్కిల్‌లో సుమారు 17 లక్షల వెదుర్లు ఈ ఏడాది వేలం వేయనున్నట్టు తెలిపారు. జంగారెడ్డిగూడెం డిపోలో ఐదు లక్షలు, రాజమండ్రి డిపోలో ఆరు లక్షలు, చింతూరు డిపోలో ఆరు లక్షలు వెదుర్లు విక్రయాలు చేపట్టినట్టు వివరించారు. వెదురు ఎక్కువగా సహజ సిద్ధమైన అటవీ ప్రాంతాలలోని కూపుల నుండి సేకరిస్తున్నట్టు తెలిపారు. టేకు ప్లాంటేషన్లతో పాటు అటవీ శాఖ మారుజాతి కలప అయిన రోజ్‌వుడ్, వేగిస, బండారు, నల్లమద్ది, సింధుగ జాతుల వనాలు పెంచుతున్నట్టు తెలిపారు. సర్కిల్‌లో ఐదు లక్షల హెక్టార్లలో సహజ సిద్ధమైన అడవులు ఉన్నాయని తెలిపారు. అడవుల్లో పెరిగి చెట్లను నరకాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా డివిజన్‌కు డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ నియామకం త్వరలో జరుగుతుందన్నారు. ఈ డివిజన్‌కు ఐఎఫ్‌ఎస్ అధికారిని డిఎఫ్‌ఒగా నియమించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.
వెదురు, టింబర్ వేలం ద్వారా రూ. 31.72 లక్షలు
జంగారెడ్డిగూడెం లాగింగ్ డివిజన్‌లోని డిపోలో మంగళవారం నిర్వహించిన వెదురు, టింబర్ ద్వారా 31.72 లక్షల రూపాయల ఆదాయం లభించినట్టు అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ జెఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. వెదురు వేలం ద్వారా 31.16 లక్షల రూపాయలు, టింబర్ వేలం ద్వారా 59,500 రూపాయలు వచ్చినట్టు లాగింగ్ డివిజన్ డిఎఫ్‌ఒ శివశంకర్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది డివిజన్ ఆదాయం రూ. 3.92 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 3.24 కోట్ల రూపాయలు సాధించినట్టు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో లక్ష్యాలు చేరుకోగలమని వివరించారు. ఈ వేలం ప్రక్రియలో లాగింగ్ డివిజన్ డిపో రేంజ్ ఆఫీసర్ డి.లలితకుమారి, డిప్యుటి రేంజ్ ఆఫీసర్ కృష్ణకుమారి పాల్గొన్నారు.
సెల్‌ఫోను లైట్ల వెలుగులో మండల సమావేశం
యలమంచిలి, డిసెంబర్ 12: పోడూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం సాయంత్రం జరుగుతుండగా కరెంటు పోవడంతో సెల్‌ఫోన్ల లైట్ల వెలుగులో నిర్వహించారు. ఎంపీపీ గుంటూరు వాణి, జడ్పీడీసీ బొక్కా నాగేశ్వరరావు, ఎంపీడీవో ప్రసన్న, తహసీల్దారు ప్రియమణి తదితరులు చీకట్లోనే ప్రసంగాలు కొనసాగించారు. అనంతరం అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు పొందిన వ్యవసాయాధికారి సత్యానంద్ చీకట్లోనే సన్మానించారు.
పోలవరం సందర్శించిన కృష్ణాజిల్లా తెలుగుయువత
పోలవరం, డిసెంబర్ 12: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను కృష్ణా జిల్లా తెలుగుయువత కార్యవర్గ సభ్యులు మంగళవారం సందర్శించారు. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నాలుగు బస్సుల్లో 250మంది తెలుగు యువత కమిటీ సభ్యులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలు సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకుని కృష్ణా జిల్లాలో రైతులకు ప్రాజెక్టు గూర్చి వివరాలు, లాభాలు తెలియజేస్తామని చంద్రశేఖర్ తెలిపారు. వారు స్పిల్‌వే, డయాఫ్రం వాల్, కాపర్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించగా ఇరిగేషన్ డీఈ పేరయ్య ప్రాజెక్టు నిర్మాణాలను గూర్చి వివరించారు. ఉదయం విజయవాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుంచి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ నాలుగు బస్సులకు జెండా ఊపి ప్రాజెక్టు యాత్ర ప్రారంభించినట్టు చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత కార్యదర్శి పూల రామచంద్రరావు, ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి రామాంజనేయులు, అట్లూరి శివ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజుల సమ్మెలో బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు

భీమవరం, డిసెంబర్ 12: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. రెండు రోజుల పాటు జిల్లాలోని బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు ఈ సమ్మె చేస్తున్నారు. దీంతో ఆ కార్యాలయాల్లో బిల్లుల చెల్లింపులు, సెల్‌ఫోన్ రీచార్జీలు, ఇంటర్‌నెట్ సాంకేతిక లోపాలు వంటివి జరగవు. జిల్లా అంతటా సమ్మెలో కూర్చున్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్ చేస్తున్న సమ్మెలో ఉద్యోగుల సంఘాలుగా ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ ఇయు, ఎస్‌ఎన్‌ఇఎ, ఎఫ్‌టిఇ, బిఎస్‌ఎన్‌ఎల్‌ఒ ఎ వంటి 13 సంఘాలకు చెందిన ఉద్యోగులు ప్రత్యక్షంగా పాల్గొనడం విశేషం. 2017 జనవరి 1వ తేదీ నుంచి ఫిట్‌మెంట్‌లో వేతన సవరణ చేయాలని, అలవెన్సులు రివైజ్ చేయాలని, 2వ పిఆర్‌సిలో నిలిచిపోయిన సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బిఎస్‌ఎన్‌ఎల్ సబ్సిడిరీ టవర్ కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. టి.గణేష్‌బాబు, జి.శ్రీనివాసు, కెఎస్‌విఎస్ రమణకృష్ణ, చైతన్యవర్మ, ఐ.వెంకటేశ్వర్లు, దేవేంద్రుడు తదితరులు నాయకత్వం వహించారు.
ఏలూరులో...
ఏలూరు: బిఎస్‌ఎన్‌ఎల్ ఆల్ యూనియన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమ్మెలో భాగంగా మంగళవారం స్థానిక బిఎస్‌ఎన్ ఎల్ భవనం వద్ద ఉద్యోగులు విధులకు గైర్హాజరై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కె వెంకటేశ్వరరావు, జి లక్ష్మణరావు, కెఎస్‌ఆర్ మూర్తి, సిహెచ్‌వి చింతా ప్రసాద్, కె సాంబశివరావు, మోహన్‌రాజులు మాట్లాడుతూ బిఎస్‌ఎన్ ఎల్ ఉద్యోగులకు 15 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేయాలని, అనుబంధ టవర్ కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఉద్యోగుల సంఖ్య తగ్గించవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమ్మెకు సి ఐటియు నాయకులు కె రాజారామ్మోహన్‌రాయ్, డిఎన్‌విడి ప్రసాద్, జివి ఎల్ నరసింహారావులు శిబిరానికి విచ్చేసి మద్దతును ప్రకటించారు.