పశ్చిమగోదావరి

సక్రమ మద్యం దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 12: మద్యం పంపిణిలో చోటుచేసుకుంటున్న అవకతవకలకు, పక్కదారి పడుతున్న వైనాలకు బ్రేక్ వేసేందుకు ఎక్సైజ్ విభాగం కొత్త హైటెక్ విధానంతోనే ముందుకొచ్చింది. ఇకనుంచి ఏ బ్రాండ్ మద్యం ఏ మోతాదులో ఎక్కడకు వెళుతోంది, ఏ షాపులో ఉంది ఇలా అన్ని అంశాలపైనా నేరుగా పర్యవేక్షణ చేసేలా ఈవిధానాన్ని రూపొందించింది. అంతేకాకుండా మద్యం దుకాణాలు నిబంధనలు ఉల్లంఘించి రాత్రి,పగలు తేడా లేకుండా విక్రయాలు జరిపే విధానానికి కూడా దీంతో బ్రేక్ పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తంమీద ఆధునిక పరిజ్ఞానాన్ని మిళితం చేయటం ద్వారా అక్రమ మద్యం పరుగులకు పూర్తిస్దాయిలో అడ్డుకట్ట వేయటమే కాకుండా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కూడా రాబట్టుకోవటం లక్ష్యంగా ఈ విధానం రూపొందింది. బార్ కోడింగ్ విధానాన్ని జిల్లాలో కూడా తాజాగా అమలుచేయటం ప్రారంభించారు. తొలిదశలో రెండు డిపోల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి 1నుంచి జిల్లాలోని 458 మద్యం దుకాణాల్లో కూడా ఈ విధానాన్ని అమలుచేసేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పరికరాలను అయా షాపుల్లో ఏర్పాటుచేశారు. నూతన విధానం ద్వారా అయా డిపోలకు వస్తున్న సరుకు మోతాదు, తిరిగి ఆయా దుకాణాలకు వెళ్తున్న మోతాదు ఇలా అన్ని అంశాలు బార్ కోడింగ్ ద్వారా ట్రాకింగ్ ట్రేసింగ్ విధానంలో నమోదవుతాయి. అవిధంగా ఫలానా డిపో నుంచి దూరంలో ఉన్న ఒక మద్యం దుకాణం కొంత మొత్తంలో మద్యం కొనుగోలు చేస్తే ఆమేరకు డిపో నుంచి ఫలానా బ్యాచ్, ఫలానా బార్ కోడింగ్ ఉన్న మద్యం ఫలానా దుకాణానికి తరలివెళ్లినట్లు కూడా దీనిలో నమోదవుతుంది. అవిధంగా ఆ దుకాణానికి ఏ మోతాదులో ఏఏ బ్రాండులు సరఫరా అవుతున్నాయి, అక్కడ విక్రయమయ్యే మోతాదు ఎంత వంటి అంశాలు ఈవిధానంలో నమోదవుతాయి. దీంతో ఎక్కడనుంచైనా, ఏసమయంలోనైనా ఆ డిపో నుంచి ఎంత సరుకు వెళ్లింది, ఎక్కడకు వెళ్లింది, అది విక్రయం అయిందా, లేదా అన్న అంశాలు స్పష్టంగా తేటతెల్లమవుతాయి. వాస్తవానికి ఈ బార్‌కోడింగ్ విధానానికి గతంలోనే ప్రభుత్వం సూత్రప్రాయంగా శ్రీకారం చుట్టింది. అయితే తాజాగా విజయవాడలో జరిగిన దుర్ఘటన నేపధ్యంలో ఈవిధానాన్ని మరింత వేగవంతంగా అమలులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. దీనివల్ల వినియోగదారులకు కంపెనీల మద్యం నేరుగా లభించే అవకాశం ఉండటంతో పాటు పన్ను చెల్లించని మద్యం(ఎన్‌డిపి)కి పూర్తిస్దాయిలో బ్రేక్ పడే అవకాశాలున్నాయి. వీటితోపాటు ఈవిధానంలో మరికొన్ని సౌలభ్యాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం పెద్దఎత్తున విన్పిస్తున్న విమర్శల్లో అధికభాగం మద్యం విక్రయాలకు వేళాపాళా లేకుండా పోయిందన్నదే. ఈ అవకతవకలకు కూడా దీనిలో బ్రేక్ పడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. డిపో నుంచి ఏవిధంగా అయితే బార్ కోడింగ్ ద్వారా నమోదు అయి ఫలానా దుకాణానికి చేరుకున్న మద్యం ఏ సమయంలో విక్రయం అయిందన్న అంశం కూడా దీనిలో నమోదవుతుంది. అవిధంగా ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘించి ఎడాపెడా జరిగే విక్రయాలు ఈవిధానంలో అధికారులకు కూడా పూర్తిగా తెల్సిపోతాయి. అవిధంగా తెల్సిన అంశాలపై వెనువెంటనే చర్యలు కూడా ప్రారంభమవుతాయి. ఏవిధంగా చూసినా మందుబాబులకు నిఖార్సు అయిన మద్యం లభించటంతోపాటు ప్రభుత్వానికి కూడా ఏ బ్యాచ్ మద్యం ఎక్కడ ఉంది, ఎంత విక్రయం అయింది అన్న అంశాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇదే సమయంలో విక్రయం అవుతున్న మద్యానికి సంబంధించి పన్ను అదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.