పశ్చిమగోదావరి

ఇక వేటు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 22: జిల్లాలో ప్రతి పేదకుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాల్సిందేనని, ఈవిషయంలో నిర్లక్ష్యం వహించే గృహనిర్మాణశాఖ అధికారులను సస్పెండ్ చేస్తామని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గృహనిర్మాణ పనుల ప్రగతిపై క్షేత్రస్ధాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 86వేల మంది తనకు ఇళ్లు కావాలని దరఖాస్తు చేసారని, వారిలో 62వేలమందికి పక్కాగృహాలు నిర్మించాలని అనుమతులు మంజూరు చేసినప్పటికీ పనుల ప్రగతిలో తీవ్రజాప్యం కన్పిస్తోందని, సకారంలో స్పందించి పేదలకు ఇళ్లు నిర్మించలేని ఎఇలు, డిఇలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో 17మంది ఎఇలు, డిఇలకు నోటీసులు ఇవ్వాలని గృహనిర్మాణసంస్ధ పిడి ఇ శ్రీనివాసరావును కలెక్టరు ఆదేశించారు. ఇప్పటికైనా 2014కు మంజూరు చేసిన ఇళ్లు అన్నీ మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని కలెక్టరు హెచ్చరించారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పధకం కింద 2016-17, 2017-18 ఆర్ధికసంవత్సరాల్లో మంజూరు చేసిన గృహాలన్నీ యుద్దప్రాతిపదికపై పూర్తి చేయాలని, వచ్చే ఏడాది కూడా పేదలకు పెద్దఎత్తున ఇళ్లు మంజూరు చేయనున్న దృష్ట్యా నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలంటే క్షేత్రస్ధాయిలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎనిమిది మండలాల్లో మంజూరు చేసిన ఇళ్లల్లో ఒక్క ఇంటిని కూడా నిర్మించకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని అటువంటివారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని కలెక్టరు హెచ్చరించారు. జిల్లాలో మంజూరు చేసిన ప్రతి ఇల్లు శంకుస్ధాపన చేయడమే కాకుండా నిర్ణీత కాలవ్యవధిలో పేదల ఇళ్లు పూర్తికావాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో గృహనిర్మాణసంస్ధ పిడి ఇ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

లారీ ఢీకొని ఇద్దరు మృతి
నిడదవోలు, ఫిబ్రవరి 22: క్వారీ లారీ ఢీకొని ఇద్దరు మృతిచెందిన సంఘటన మండలంలోని డి ముప్పవరం గ్రామంలో గురువారం మధ్యాహ్నం 1గంట సమయంలో చోటుచేసుకుంది. సమిశ్రగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చాగల్లు మండలం దారవరం గ్రామానికి చెందిన పాలకుర్తి శ్రీనివాస్, బొడ్డు దుర్గారావు, నీరుకొండ శ్రీనివాస్‌లు ఉండ్రాజవరం మండలం తాటిపర్రు గ్రామంలో ఒక కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై నిడదవోలువైపు వస్తుండగా డి ముప్పవరం వద్ద ఎదురుగా వస్తున్న క్వారీ లారీ ఢీక్కొంది. సంఘటనా స్థలంలోనే పాలకుర్తి శ్రీనివాస్ (43) మృతిచెందాడు. తీవ్ర గాయాలైన బొడ్డు దుర్గారావు, నీరుకొండ శ్రీనివాసులను 108లో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ నీరుకొండ శ్రీనివాసు (45) మృతిచెందాడు. బొడ్డు దుర్గారావు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. మృతిచెందిన పాలకుర్తి, నీరుకొండలు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటుండగా, వీరికి ఇద్దరు చొప్పున కుమార్తెలు ఉన్నారని సమిశ్రగూడెం ఎస్సై రవికుమార్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుజేసి సమిశ్రగూడెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మాతృభాషను మరువనప్పుడే అభివృద్ధి సాధ్యం
నన్నయ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ముత్యాలనాయుడు
వీరవాసరం, ఫిబ్రవరి 22: విద్యార్థులతోపాటు ప్రజలంతా మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషను మరువకుండా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ఎం ముత్యాలనాయుడు పేర్కొన్నారు. గురువారం వీరవాసరం డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాన్ని వైస్ ఛాన్సలర్ ముత్యాలనాయుడు ప్రారంభించారు. అనంతరం కళాశాల కరస్పాండెంట్ వర్ధినీడి సత్యనారాయణ (బాబ్జి) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్వీ రంగారావు అధ్యక్షతన జరిగిన సభలో వైస్ ఛాన్సలర్ ముత్యాల నాయుడు మాట్లాడుతూ నన్నయ యూనివర్సిటీ ఏర్పడిన తరువాత విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి తనతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న కళాశాలల ఉపాధ్యాయులు కూడా పనిచేస్తున్నారన్నారు. ప్రతిఒక్కరూ తల్లిదండ్రులతోపాటు గురువులను కూడా గౌరవించినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందన్నారు. తాను చిన్నతనంలో వీరవాసరంలో బంధువులు ఉండటం వల్ల తరచూ వచ్చేవాడినని పేర్కొన్నారు. వీరవాసరం డిగ్రీ కళాశాలతోపాటు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు తన యావదాస్తిని వితరణగా ఇచ్చిన విద్యాదాత, అపర కర్ణుడు మద్దాల రామకృష్ణమనాయుడుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం సుమారు యాభై నుంచి 70 కోట్ల విలువ ఉండే ఆస్తులను విద్యాభివృద్ధికి వితరణగా ఇవ్వడం మరువలేనిదన్నారు. అలాగే ఫౌండర్ సెక్రటరీగా మాజీ ఎమ్మెల్యే, దివంగత వర్ధినీడి సత్యనారాయణ చేసిన కృషిని కూడా కొనియాడారు. ఈ కళాశాలలో అత్యధికంగా మహిళలు చదువుకుంటున్నారని, తన దృష్టికి ఉపాధ్యాయులతోపాటు ఇక్కడ ఉన్న అనేక మంది తెలియజేయడంతో తాను ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్‌ను ఇవ్వడం జరిగిందన్నారు. నేడు ఇంతమంది విద్యార్థినులను చూసిన తరువాత ఈ కళాశాల కోసం తాను ఇంకా అభివృద్ధి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. కళాశాల ఏర్పడి 30 ఏళ్లు దాటినప్పటికీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్వీ రంగారావుకు సెనేట్ మెంబర్‌గా ఇవ్వడం తనకు ఆనందంగా ఉందన్నారు. కళాశాల కరస్పాండెంట్ వర్ధినీడి బాబ్జి మాట్లాడుతూ నన్నయ యూనివర్సిటీ ఏర్పడిన తరువాత నిధుల కొరతతో యూనివర్సిటీ రూపురేఖలు ఉండేవికాదని, ప్రస్తుత వీసీ ముత్యాలనాయుడు పదవి చేపట్టిన తరువాత తనకున్న పరిచయాలతో యూనివర్సిటీకి రూపురేఖలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అనంతరం వైస్ ఛాన్సలర్ ముత్యాలనాయుడును సన్మానించారు. అలాగే విద్యార్థులకు వైస్‌ఛాన్సలర్ తీసుకువచ్చిన పుస్తకాలను పంపిణీ చేసి పలు విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు.

ప్రత్యేక హోదా, రైల్వేజోన్ కోసం నిరంతర పోరాటం
- రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్
దేవరపల్లి, ఫిబ్రవరి 22: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ కోసం తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యులు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ పేర్కొన్నారు. దేవరపల్లి మండలం గాంధీనగరంలో టీడీపీ నాయకుడు పిన్నమనేని శ్రీమన్నారాయణమూర్తి స్వగృహంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడతామని, ఈ విషయంలో మిత్రపక్షమైన బీజేపీతో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. పార్లమెంటు సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు అనేక విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పోరాటం చేస్తున్నారని మురళీమోహన్ అన్నారు. కొవ్వూరు-గుండుగొలను స్టేట్ హైవేపై ట్రాఫిక్‌ను నియంత్రించడం జరుగుతుందని, ఉదయం 8గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8గంటల వరకు ట్రాఫిక్‌ను నియంత్రించడం జరుగుతుందని తెలిపారు. నిడదవోలులో రైల్వేలైన్‌పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 200 కోట్ల రూపాయల అంచనాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపినట్టు ఎంపీ మురళీమోహన్ వెల్లడించారు. రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడం జరుగుతుందని మురళీమోహన్ పేర్కొన్నారు. అంతకుముందు పిన్నమనేని శ్రీమన్నారాయణమూర్తి సోదరి మారిన శేషుకుమారి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. శేషుకుమారి ఇటీవలే మృతిచెందారు.

జిల్లా పరిషత్ వైస్‌ఛైర్మన్ పదవికి చింతల రాజీనామా
ఏలూరు, ఫిబ్రవరి 22: జిల్లా పరిషత్ వైస్‌ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ చింతల వెంకటరమణ గురువారం కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్‌కు రాజీనామా లేఖను అందజేశారు. స్దానిక కలెక్టరేట్‌లో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సమక్షంలో ఈలేఖను అందజేశారు. నిబంధనల మేరకు జడ్పీ వైస్‌ఛైర్మన్ ఎన్నికల తేదీని ప్రకటిస్తామని కలెక్టరు తెలిపారు. 2014 జూలై 5వ తేదీన జడ్పీ వైస్‌ఛైర్మన్‌గా ఎన్నికైన కొయ్యలగూడెం జడ్పీటీసీ చింతల వెంకటరమణ తన వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు గంటా సుధీర్‌బాబు, చలపతిరావు, కాసరనేని విద్యాసాగర్, మట్టా రాజేశ్వరి, కూరపాటి మార్తమ్మ, జిల్లా జడ్పీటీసీల ఛాంబరు అధ్యక్షులు చింతల వాసు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు జడ్పీ ఛైర్మన్ ఛాంబరులో జరిగిన విలేఖరుల సమావేశంలో చింతల వెంకటరమణ మాట్లాడుతూ పార్టీ నిర్ణయం మేరకు, ముందస్తు ఒప్పందం ప్రకారమే తాను పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇంతకాలం ఛైర్మన్ బాపిరాజు, సభ్యులు తనకు ఎంతగానో సహకరించారని పేర్కొన్నారు. నూతనంగా జడ్పీ వైస్‌ఛైర్మన్‌గా ఎన్నిక కానున్న లలితాదేవి మాట్లాడుతూ ఛైర్మన్ బాపిరాజు మార్గదర్శకాల మేరకు పార్టీ ఆదేశాల ప్రకారం జిల్లా అభివృద్ధికి పనిచేస్తానని చెప్పారు.

అట్టుడుకుతున్న వేలేరుపాడు
వేలేరుపాడు, ఫిబ్రవరి 22: పోలవరం నిర్వాసితులకు సంపూర్ణ న్యాయం జరగాలని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న సావిలి సత్యనారాయణను బుధవారం అర్ధరాత్రి పోలీసులు అడ్డుకోవడంతో నిర్వాసితులు రెండు గంటలపాటు ఆందోళనకు పూనుకున్నారు. అయినప్పటికీ ఎస్సై మధు వెంకటరాజా భారీ బందోబస్తు మధ్య సత్యనారాయణను బలవంతంగా లేపి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆందోళనకారులు రెండు గంటలపాటు అడ్డుకున్నప్పటికీ పోలీసులు తమదైన శైలిలో సత్యనారాయణను ఆసుపత్రిలోని గదిలో నిర్బంధించి ఆందోళనకారులను అటువైపు రాకుండా కట్టడి చేశారు. దీక్షాపరుడైన సావిలి సత్యనారాయణ ఆరోగ్య కేంద్రంలో సైతం ఏవిధమైన వైద్యసేవలను తిరస్కరించి దీక్షను కొనసాగించారు. ఇదిలావుండగా గురువారం ఉదయం వేలేరుపాడు యువజన నాయకుడు యర్రా మధు అదే శిబిరంలో దీక్షను కొనసాగించారు. సాయంత్రం వరకు ఆసుపత్రిలో సావిలి, శిబిరంలో మధు దీక్షలను కొనసాగిస్తుండగా తహసీల్దార్ రవికుమార్, కుకునూరు సీఐ చిరంజీవి, ఎస్సై మధు వెంకటరాజా సిబ్బందితో వెళ్లి ఇరువురు దీక్షా పరులను బలవంతంగా విరమింపజేశారు. సత్యనారాయణ పరిస్థితి నీరించడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు దగ్గరుండి సెలైన్‌ను సైతం ఎక్కించి మీ సమస్యలేమైనా ఉంటే తాము ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నివేదించి పరష్కారం మార్గాలను చూడగలమని, దీక్ష చేసేందుకు అనుమతి లేదని, బలవంతంగానే ఇరువురిని విరమింపజేశారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా అఖిలపక్ష నేతలంతా అక్కడకు చేరుకుని సంపూర్ణ నిర్వాసితులుగా మారే మా సమస్యలను సామరస్య పూర్వకంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలంటే పోలీసులు అడ్డుకోవడం సబబుకాదన్నారు. ఏంచేసినా ఆందోళనను శుక్రవారం నుంచి భారీ ఎత్తున కొనసాగించనున్నట్టు, అప్పటికీ ప్రభుత్వాలు దిగి రాకుంటే అధికారులు అడ్డుకోలేనంత ఉద్ధృతంగా చేయగలమని హెచ్చరించారు.

27న ఎన్జీవో భవనం ప్రారంభం
ఏలూరు, ఫిబ్రవరి 22: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 27న స్ధానిక పవరుపేటలోని ఎన్‌జిఓ భవనాన్ని ప్రారంభిస్తారని జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్‌ఎస్ హరినాధ్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు ఆహ్వానపత్రాన్ని ఆయన అందజేశారు. ఈ భవనానికి ఉద్యోగ సంఘ నేత స్వర్గీయ అమ్మనగంటి శ్రీరాములు భవనంగా నామకరణం చేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చోడగిరి శ్రీనివాసరావు, జడ్పీటీసీలు గంటా సుధీర్‌బాబు, చలపతిరావు, కాసరనేని విద్యాసాగర్ పాల్గొన్నారు.

బయోమెట్రిక్‌తో బట్టబయలు
రూ. 11కోట్లకు శఠగోపానికి సిద్ధం
ఎనే్నళ్లనుంచి సాగుతోందో
ఫీజురీఎంబర్స్‌మెంట్ బాగోతంపై కలెక్టరు
చర్యలకు ఆదేశం
ఏలూరు, ఫిబ్రవరి 22: బయోమెట్రిక్ అంశం కొన్నిరంగాల్లో తీవ్ర అసంతృప్తిని మిగులుస్తుంటే మరికొన్ని రంగాల్లో అక్రమార్కుల నిగ్గు తేల్చే దిశగా దూసుకుపోతోంది. తాజాగా ఈ బయోమెట్రిక్ విధానంతో కొన్ని కళాశాలల బాగోతం బట్టబయలుకావటంతో జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏకంగా 11కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వ సొమ్ముకు శఠగోపం పెట్టేందుకు సిద్ధమయ్యారని, దీనికి అడ్డుకట్ట వేసి ఇలా ఎనే్నళ్లనుంచి జరుగుతోందో అంటూ అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై చర్యలకు ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జ్ఞానభూమి సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయంలో 5400 మంది విద్యార్ధులు బయోమెట్రిక్ హాజరుకు రాకపోవటం వెనుక పరిశీలిస్తే 11కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును కాజేసేందుకు పలు కళాశాలలు పధకం పన్నాయని, బయోమెట్రిక్ విధానంతో ఈ బండారం బట్టబయలైందని చెప్పారు. విద్యార్ధులు లేకుండా ఉన్నట్లు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసి ఇప్పుడు బయోమెట్రిక్‌లో విద్యార్ధులను చూపించలేని కళాశాలలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నో సంవత్సరాల నుండి ఇలాంటి వ్యవహారాలు సాగుతున్నాయని, ఇప్పుడు విద్యార్ధులు కూడా బయోమెట్రిక్ హాజరు వేయాలనే నిబంధన పెట్టడంతో 5400 మంది విద్యార్ధులు మధ్యలో చదువుమానివేశారని వంకలు చూపుతున్నారని, ప్రభుత్వాన్ని మోసం చేసి ఫీజులు కాజేసే అలోచన మంచిది కాదన్నారు. ఈ మార్చి 1వ తేదీ నుంచి ఖచ్చితంగా కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచేసి వాస్తవంగా చదువుకోవడానికి వచ్చేవారికి మాత్రమే ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు వేలిముద్రల ద్వారా పడటం లేదని కొంతమంది చెప్పడంపై కలెక్టరు స్పందిస్తూ హాజరును వేలిముద్రల ద్వారాగాని ఐరీస్ ద్వారా గాని వేయవచ్చునని, అంతేతప్ప బయోమెట్రిక్ హాజరు రావటం లేదనే కారణం చూపి మాన్యువల్‌గా విద్యార్ధుల నమోదు చేయడానికి వీలులేదని కలెక్టరు స్పష్టం చేశారు. బయోమెట్రిక్ హాజరు వల్ల లేని విద్యార్ధులను ఉన్నట్లుగా చూపించి స్కాలర్‌షిప్‌ల సొమ్మును దుర్వియోగం చేసే అవకాశం ఉండదన్నారు. అలా దుర్వినియోగం అవుతున్నట్లు రుజువైతే సంబంధిత అధికారులపై అవసరమైతే క్రిమినల్ చర్యలు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు.
ఆందోళన ఉద్ధృతం
కలెక్టరేట్ వద్ద వంటావార్పుతో విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన *ఎంపీ మురళీమోహన్, జడ్పీ ఛైర్మన్‌లకు వినతిపత్రాలు
ఏలూరు, ఫిబ్రవరి 22: తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. రోజుకొక ఆందోళనతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలుపుతూ వస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం స్ధానిక కలెక్టరేట్ వద్ద వంటావార్పు నిర్వహించి తమ నిరసనను తెలిపారు. ఈసందర్భంగా జడ్పీ అతిధిగృహనికి వచ్చిన రాజమండ్రి ఎంపి మురళీమోహన్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేసి వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆందోళనా శిబిరం వద్దకు చేరుకుని వారినుద్దేశించి మాట్లాడారు. సిఎం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈనెల 20వ తేదీ నుంచి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. దీనిలోభాగంగా కలెక్టరేట్ వద్ద వరుస ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున చేరుకున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించి అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. ఈసందర్భంగా యూనియన్ నాయకులు హరికృష్ణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలుచేసి సమానపనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్‌శాఖలో కాంట్రాక్టు వ్యవస్ధను రద్దు చేసి, నేరుగా వేతనాలు చెల్లించాలన్నారు. పీస్ రేటు రద్దు చేసి వేతనాలు చెల్లించాలన్నారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికులకు 20లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం జడ్పీ అతిధిగృహానికి వచ్చిన రాజమండ్రి ఎంపి మురళీమోహన్ ఎదుట కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న ఆందోళన సమర్ధనీయంగా ఉందని, వారి సేవల వల్లే విద్యుత్ సంస్ధ పురోగతిలో కొనసాగుతోందని, ఈదృష్ట్యా వారి సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆందోళనా శిబిరం వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్నవారినుద్దేశించి మాట్లాడారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని, జడ్పీ సమావేశంలో కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని హామీ ఇచ్చారు.