పశ్చిమగోదావరి

కాంటూరు తగ్గిస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 17: కొల్లేరు అభయారణ్యం కాంటూరు పరిధిని తగ్గించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని, జివో 120ని యధాతధంగా అమలుచేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. సరస్సు పరిరక్షణ కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా 308 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న కొల్లేరును అయిదో కాంటూరు నుంచి 3వ కాంటూరుకు తగ్గిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం గుర్తించిన కొల్లేరు అభయారణ్య పరిరక్షణ కోసం సిపిఐ ఎటువంటి ఉద్యమాలు, పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పారు. స్ధానిక స్ఫూర్త్భివన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2001 జూలై 31న అప్పటి టిడిపి ప్రభుత్వం జారీ చేసిన కొల్లేరు అభయారణ్యం జివో 120ని యధాతధంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరులో ఓట్ల కోసం కాకుండా జీవకోటికి మేలు చేసే పర్యావరణ పరిరక్షణ కోసం రాజకీయపార్టీలు పనిచేయాలన్నారు. చెన్నైలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం పెరిగి వరదనీరు సముద్రంలోకి వెళ్లే దారిలేక అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అలాగే కొల్లేరు కాంటూరు పరిధిని తగ్గిస్తే ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని హెచ్చరించారు. కొల్లేరులో ఏటా రెండువేల కోట్ల రూపాయల చేపల వ్యాపారం జరుగుతోందని, ఈలెక్కలు చూస్తే కృష్ణాజిల్లాలో రెండుమండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు మండలాల్లోనూ ఉన్న 46 కొల్లేరు నడిబొడ్డు గ్రామాలు, 76 సరస్సు తీరం వెంబడి ఉన్న గ్రామాలు కలిపి కొల్లేటిలో ఉన్న 122 గ్రామాల ప్రజలు ఈపాటికి కోటీశ్వరులు కావాల్సి ఉందన్నారు. కానీ కొందరు బడాబాబులు మాత్రమే కోట్లు ఆర్జిస్తున్నారని, పేదలు మాత్రం ఇంకా పేదరికంలోకి వెళ్లిపోతున్నారని, మరికొందరు వలస పోతున్నారని చెప్పారు. 1977-78లో అప్పటి పరిస్దితులను బట్టి ప్రభుత్వం కొల్లేరులో వ్యవసాయానికి అనుమతి ఇచ్చిందన్నారు. ఇది ఆక్రమణలకు దారితీసిందన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు కొల్లేరులో బడాబాబులు రెచ్చిపోయి ఆక్వాకల్చర్‌ను ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లిందని చెప్పారు. కొల్లేరు గ్రామాల్లో తాగునీరు కూడా లభ్యం కానీ పరిస్దితి నెలకొందన్నారు. అలాంటి పరిస్దితుల్లో ఇప్పుడు కొల్లేరును మూడవ కాంటూరుకు కుదిస్తే చేపల మాఫియాకు ప్రభుత్వమే పచ్చజెండా ఊపినట్లు అవుతుందన్నారు. కాంటూరు పరిధిని ఎట్టిపరిస్దితుల్లోనూ తగ్గించకూడదని ఆయన డిమాండ్ చేశారు. ఎందుకంటే కొల్లేరు సరస్సు కృష్ణా, గోదావరి నదుల మధ్య సారవంతమైన డెల్టా భూమిలో ఉందని చెప్పారు. 1,10,000 క్యూసెక్కుల వరదనీటిని నిలిపి ఉంచే సామర్ధ్యం ఈసరస్సుకు ఉందన్నారు. కొల్లేరు అభయారణ్యం పదవ కాంటూరు వరకు 901 చదరపు కిలోమీటర్ల పరిధిలోనూ, 5వ కాంటూరు వరకు 308 చదరపు కిలోమీటర్ల పరిధిలోనూ విస్తరించి ఉందని చెప్పారు. రామిలేరు, బుడమేరు, తమ్మిలేరుతోపాటు మొత్తం 68 రకాల ఇరిగేషన్ కాల్వలు, డ్రైన్లు, ఛానల్స్ నుంచి వచ్చే వరదనీటిని నిలుపుకునే సామర్ధ్యం ఈ సరస్సుకు ఉందన్నారు. ప్రధానంగా పెలికాన్ వంటి పక్షులు, 20మిలియన్ రకాల మొక్కలు, వలస పక్షులు, చేపలు, ఇతర జీవరాశులకు కొల్లేరు సరస్సు ఆవాసంగా ఉందన్నారు. కొల్లేరు సహజమైన అందాలతో ప్రకృతి ప్రేమికులకు పర్యాటక కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. ఆటపాక, గుడివాకలంక పక్షుల సంరక్షణ కేంద్రాలకు ఏటా పెద్దసంఖ్యలో పర్యాటకులు దేశం నలుమూలల నుంచి వస్తూ ఉంటారని, సరస్సులో ఏడాదికి ఏడువేల మెట్రిక్ టన్నుల చేపలు సహజసిద్ధంగా పెరుగుతాయని చెప్పారు. భారత వన్యప్రాణి సంరక్షణా చట్టం-1972 ప్రకారం 1999 నవంబర్‌లో కొల్లేరు సరస్సును కేంద్రం అభయారణ్యంగా ప్రకటించిందని చెప్పారు. అలాగే కొల్లేరు సరస్సును అంతర్జాతీయ చిత్తడి నేలల సంరక్షణ యాజమాన్యం పరిధిలోకి తీసుకువస్తూ 2002 నవంబర్‌లో రాంసార్‌లో అంతర్జాతీయ సదస్సులో తీర్మానం చేశారని చెప్పారు. 2010 డిసెంబర్ 21న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ కూడా కొల్లేరు అభయారణ్యాన్ని చిత్తడినేలల పరిరక్షణ, యాజమాన్య పరిధిలోకి తీసుకువస్తూ జివో జారీ చేసిందన్నారు. 1995 సెప్టెంబర్ 25న సెక్షన్ 18 కొల్లేరు అభయారణ్య చట్టం-1972 ప్రకారం కొల్లేరులో 78100 ఎకరాలను 5వ కాంటూరు పరిధిలోకి తీసుకువస్తూ జివోలను అటవీశాఖ విడుదల చేసిందన్నారు. కొల్లేరు అభయారణ్య చట్టాన్ని ఆక్రమణదారులు సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయటంతో రాష్ట్రప్రభుత్వం 2001 జూలై 30న 120 జివోను విడుదల చేసిందన్నారు. 2005లో వచ్చిన వరదలకు కొల్లేరు నీరు ప్రవహించే మార్గాలు మూసుకుపోవటంతో లక్షలాది ఎకరాల వరిపంట నీటిపాలైందని చెప్పారు. ఏలూరు సహా జిల్లాలో అనేక కొల్లేరు పరివాహక గ్రామాలు వరదప్రవాహన్ని చవిచూశాయన్నారు. అప్పటి ప్రభుత్వం ఈకారణంగానే ఆపరేషన్ కొల్లేరు చేపట్టిందని చెప్పారు. అంతకుముందు 2004లో సుప్రీం సాధికారిత కమిటీ కూడా కొల్లేరులో ఆక్రమణలు తొలగించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. దీంతో 2006 మే 31 నాటికి కొల్లేరు ఆపరేషన్‌ను పూర్తి చేశారని చెప్పారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 44.700 ఎకరాల్లో 5వ కాంటూరు లోపల ఉన్న 1776 ఆక్రమణల్లో ఉన్న చేపల చెర్వులను 40కోట్ల రూపాయల ఖర్చుతో ధ్వంసం చేశారని చెప్పారు. మళ్లీ ఇప్పుడు కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య ప్రాంతం నుంచి 20600 ఎకరాల జిరాయితీ, డిఫారం పట్టా భూములను మినహాయించే అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని చెప్పారు. కాగా ప్రస్తుతం ఆధ్వాన్నస్ధితిలో ఉన్న కొల్లేరును కాపాడేందుకు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాంసార్ భూములుగా ఎపిలో గుర్తించిన కొల్లేరు సరస్సులో అన్నిరకాల ఆక్రమణలను తొలగించాలని కోరారు. వరదనీటి ప్రవాహనికి మార్గం సుగమం చేయాలని, కొల్లేరు నుంచి సముద్రంలోకి వరదనీరు చేరుకోవడానికి వీలుగా ఉప్పుటేరు వెడల్పు, లోతు పెంచాలని డిమాండ్ చేశారు. కొల్లేరును పర్యాటకకేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నేతలు బండి వెంకటేశ్వరరావు, పుప్పాల కన్నబాబు, ఉప్పులూరి హేమశంకర్, కె కృష్ణమాచార్యులు, కె కన్నయ్య, రెడ్డి శ్రీనివాసడాంగే, అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.