పశ్చిమగోదావరి

పడవ ప్రమాదాల నివారణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 16: ఇటీవల చోటుచేసుకుంటున్న లాంచీ(నాటుపడవల) ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని లాంచీల యజమానులతో సంబంధిత డిఎస్సీ, సిఐ, ఎస్సైలు చర్చించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తారన్నారు. స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన జిల్లా నలుమూలల నుండి వచ్చినవారి నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని లాంచీలలో ప్రమాదం జరిగినప్పుడు అందుబాటులో ఉండాల్సిన భద్రతా సామాన్లు ఉన్నాయా, లేదా, అలాగే లాంచీలు కండిషన్‌లో ఉన్నాయా లేదా అన్న విషయాలపై సంబంధిత పోలీసు అధికారులు పూర్తిస్దాయి పర్యవేక్షణ జరుపుతారన, వారు ఇచ్చిన నివేదికలను సంబంధిత అధికారులకు పంపుతామన్నారు. మత్స్యశాఖ అధికారుల సహకారంతో భవిష్యత్‌లో ఎక్కడా పడవ ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మారుమూల ప్రాంతాల నుండి కూడా ప్రజలు జిల్లా కేంద్రానికి వస్తున్నారని, అయితే ముందుగా తమ పరిధిలోని పోలీసుస్టేషన్లకు వెళ్లి తమ సమస్యలు వివరించాలని, ఒకవేళ అక్కడ న్యాయం జరగని పక్షంలో జిల్లా కేంద్రానికి రావాలని ఎస్పీ రవిప్రకాష్ సూచించారు. ఈసందర్భంగా పలువురు ఆయనకు వినతులు సమర్పించి వాటిని పరిష్కరించాలని కోరారు. తణుకు నుండి వచ్చిన ఒక వ్యక్తి తాను గతంలో ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసేవాడినని, అయితే తనను తొలగించిన దానిపై యాజమాన్యాన్ని అడిగినందుకు తనను కులం పేరుతో దూషించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈవిధంగా వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసుస్టేషన్ల అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఏలూరు డిఎస్పీ కె ఈశ్వరరావు, మహిళా పోలీసుస్టేషన్ డిఎస్పీ పైడేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జనంలోకి ‘పసుపుదళం’
భీమవరం నుంచి ప్రారంభమైన నగరదర్శిని-నగరవికాసం
భీమవరం, జూలై 16: రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేసిన నగరదర్శిని-నగర వికాసంను రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న జిల్లాలోని భీమవరం నుంచి ప్రారంభించింది. సోమవారం జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి స్థానిక ఆరో వార్డులోని బొక్కావారి పాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ మెంటే పార్థసారథి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదిరాజు సత్యనారాయణరాజు, పార్టీ మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ బర్రె నెహ్రు, పోలిశెట్టి సత్యనారాయణ (దాసు), సీనియర్ నేతలు ఇందుకూరి రామలింగరాజు, వేండ్ర శ్రీనివాస్ తదితరులతో ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. 6వ వార్డులో అంతా పర్యటించి అనేక కుటుంబాల నుంచి వారికి అందుతున్న ఫలాలు గురించి ఆమె తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ కుటుంబాన్ని కలిసి సంక్షేమ ఫలాల అమల తీరును తెలుసుకుంటున్నారని ఎంపీ తోట పేర్కొన్నారు. అటు గ్రామాల్లో గ్రామదర్శిని-గ్రామ వికాసం, పట్టణాల్లో నగర దర్శిని-నగర వికాసం పేరుతో జిల్లా అంతటా ఈ కార్యక్రమాన్ని 120 రోజులు కొనసాగిస్తామని చెప్పారు.

బీజేపీని నిలదీస్తాం
విభజన హామీల అమలుకు పోరు: ఎంపీ తోట
భీమవరం, జూలై 16: మరి కొద్ది రోజుల్లో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో బీజేపీని నిలదీస్తామని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయకపోవడం దారుణమన్నారు. సోమవారం ఆమె స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. పార్లమెంటును స్తంభింపజేయటానికి పార్టీ వ్యూహరచన చేస్తోందని, అన్ని రాజకీయ పక్షాలతో తమ ఎంపీలు చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. గతంలో అవిశ్వాసం పెట్టామని గుర్తు చేశారు. దాన్ని తప్పుదోవ పట్టించారని, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఇస్తానన్న అంశాలపై లేవనెత్తి పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాలను చేస్తామని చెప్పారు. విభజన హామీలు 19 వరకు ఉన్నాయని, వాటి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారన్నారు. ఇటీవల కడపలో ఉక్కు కర్మాగారం కోసం ఆందోళన చేశామని, అలాగే రైల్వే జోన్ కోసం అక్కడ ఎంపీలు ఆందోళన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా ధర్మపోరాట దీక్షలను చేపడుతున్నామని, స్టీల్ ప్లాంట్ తదితర అంశాల గురించి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై చాలా వ్యతిరేకత ఉందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏ పని చేసినా అది ఫలప్రదం కాలేదని ఎంపీ తోట తేల్చిచెప్పారు. మరెన్నో విషయాల్లో తెలుగు ప్రజలను మోసంచేసిన బీజేపీని పార్లమెంట్‌లో నిలదీస్తామని ఎంపీ సీతారామలక్ష్మి చెప్పారు.
అధికారులు అప్రమత్తం
కొవ్వూరు, జూలై 16: గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గోదావరి నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి హెడ్‌వర్క్స్ అధికారులు అందించిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం ధవళేశ్వరం వద్ద 8.30 అడుగుల వరద నీటిమట్టం నమోదు కాగా భద్రాచలం వద్ద 27.10 అడుగుల నీటిమట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజీ నుండి 3 లక్షల 48 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు తెలిపారు. ఇలావుండగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని స్నాన ఘట్టాల్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో క్షేత్రంలో ఉన్న శివలింగం వరద నీటిలో మునిగింది.
బీభత్సం సృష్టించిన ఆబోతు
ఉండి, జూలై 16: మండలంలో మహాదేవపట్నంలో ఆంబోతును పిచ్చికుక్క కరవటంతో ఆంబోతు గ్రామంలో సోమవారం బీభత్సం సృష్టించింది. ఎట్టకేలకు సర్పంచ్ జుత్తిగ శ్రీనివాస్ యువకులను పురమాయించి పగ్గాలతో ఆంబోతును అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే పశువైద్యులు వచ్చి ఆబోతుకు చికిత్స చేయటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సోమవారం ఉదయం గ్రామంలో రోడ్ల వెంబడి తిరుగుతున్న ఆబోతును పిచ్చి కుక్క కరిసింది. దీంతో అబోతు రంకెలు వేస్తు గ్రామంలో జనం మీద దాడి చేసి, వాహనాలను చిందర వందర చేస్తూ గ్రామంలో భయబ్రాంతులు సృష్టించింది. దీనితో సర్పంచ్ శ్రీనివాస్ చొరవతో యువకులు దానిని వెంబడించి సాయంత్రం సమయంలో దానిని బంధించారు. వెంటనే వైద్యులు చికిత్స చేయడంతో అది శాంతించింది.
కేబుల్ ఆపరేటర్ల ధర్నా
ఏలూరు, జూలై 16: కేబుల్ ఆపరేటర్లకు తీరని భారంగా పరిణమించిన పోల్‌పన్ను, జిఎస్‌టి పన్నులను మినహాయించాలని కోరుతూ సోమవారం జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు స్ధానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని యూనియన్ నాయకులు జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్‌కు అందజేశారు. కేబుల్ ఆపరేటర్ల ధర్నాకు వైకాపా పూర్తి మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా కేబుల్ ఆపరేటర్ల యూనియన్ నాయకులు శిరిపురపు వెంకటేశ్వరరావు, వడ్లమూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొంతకాలంగా నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉంటూ కేబుల్ వ్యవస్ధను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. అయితే ఇటీవల రాష్ట్రప్రభుత్వం పోల్ పన్ను విధిస్తూ జివో విడుదల చేసిందని, దీనిప్రకారం పట్టణ ప్రాంతాల్లో పోల్‌కు 50 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో పోల్‌కు 35 రూపాయల చొప్పున చెల్లించాలని అధికారుల ఒత్తిడి పెరిగిందన్నారు. ఈవిధానాన్ని తక్షణం రద్దు చేసి కేబుల్ ఆపరేటర్లను ఆదుకోవాలన్నారు. 25సంవత్సరాలుగా సేవలందిస్తున్నామని, ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా డిజిటల్ వ్యవస్ధను కూడా రూపొందించేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. పోల్ పన్ను, జిఎస్‌టి పన్ను కారణంగా వినియోగదారులపై అదనపు భారం పడుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం పునరాలోచించి పోల్, జిఎస్‌టి పన్నులను పూర్తిగా తొలగించాలని డిమాండ్ ఛేశారు. మారుమూల ప్రాంతాలకు కూడా కేబుల్ వ్యవస్ధ ద్వారా అధునిక సేవలందిస్తున్నామని, ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేబుల్ ఆపరేటర్లకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మాకినేని వెంకటేశ్వరరావు, సంబంగి జగదీష్, నల్లా కాశీవిశే్వశ్వరరావు, కోటినాడ విజయ్, తూము సత్యనారాయణ, ఇల్లా వరప్రసాద్, కోడి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి కేబుల్ ఆపరేటర్లు పెద్దసంఖ్యలో హాజరై కలెక్టరేట్ వద్ద పెద్దపెట్టున్న నినాదాలు చేశారు. తొలుత స్ధానిక ఎఎస్‌ఆర్ స్టేడియం నుంచి నిరసన ప్రదర్శనగా పాతబస్టాండ్, జూట్‌మిల్లు సెంటర్, ఫైర్‌స్టేషన్ సెంటరుమీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా చేశారు. ఫైర్‌స్టేషన్ సెంటరులో కొద్దిసేపు మానవహారం నిర్వహించారు.

జోరుగా ఇసుక విక్రయాలు
తాళ్లపూడి, జూలై 16: ఉచిత ఇసుక విషయంలో యూనిట్ ఇసుక రూ.800 ధర, ట్రాక్టర్‌కు ఒక యూనిట్ ఇసుక పరిమితి నిర్ణయిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో మండలంలో ప్రక్కిలంక రీచ్‌లో ట్రాక్టర్ల హడావుడి ఎక్కువైంది. మండలం మొత్తం మీద ఒక ప్రక్కిలంక రీచ్‌లో మాత్రమే ఇసుక లభ్యమవుతోంది. ఇసుక రీచ్‌లో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణలో సరఫరా జరగడంతో ప్రజలకు ఇసుక అందుబాటులోకి వచ్చిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు.