పశ్చిమగోదావరి

ఇలా అయితే ఎలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 25: జిల్లాలో 20 నుంచి 30 శాతం మంది ఉద్యోగులు కనీసం ఆఫీసులకు కూడా రాకపోతే పనులు ఎలా జరుగుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ప్రశ్నించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగుల హాజరును పరిశీలిస్తున్నామని, అయితే మూడు నెలలు కావస్తున్నా నేటికీ చాలా కార్యాలయాల్లో 20 నుంచి 30 శాతం ఉద్యోగులు బయెమెట్రిక్ హాజరు వేయడం లేదని, దీన్ని బట్టి వారు కార్యాలయాలకే రావడం లేదని తెలుస్తోందన్నారు. బయోమెట్రిక్ హాజరు వేయని ఉద్యోగులకు వెంటనే జీతాలు నిలుపుదల చేయాలని జిల్లా ఖజానా శాఖ డిడి మోహనరావును ఆదేశించారు. అదే విధంగా ప్రతీ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విధానం ఏ విధంగా అమలు జరుగుతుందో కలెక్టరేట్ అధికారులు తనిఖీలు చేసి నివేదిక సమర్పిస్తారని, నిర్ధేశించిన లక్ష్యాలను నెరవేర్చని అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విధానం అమలులో ఎస్‌సి కార్పొరేషన్ ఇడి, డి ఎంహెచ్ ఓ, ఐసిడి ఎస్, ఇరిగేషన్ శాఖ అధికారులు నత్తనడకగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా వారు బాధ్యతాయుతంగా ఇ- ఆఫీస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. మీ-కోసం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించని దేవాదాయ, ఇరిగేషన్, ఆర్‌టిసి అధికారులకు పది రూపాయలు చొప్పున ఒక్కొక్క అర్జీకి పెనాల్టీ వేస్తున్నట్లు ఆయన చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఇ- ఔషధ కార్యక్రమంలో వెనుకబడి వుండటాన్ని ఆయన తప్పుపట్టారు. కార్యక్రమంలో జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీఫ్, డి ఆర్‌వో ప్రభాకరరావు, ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్ ఇ అమరేశ్వరరావు, డిపివో ఆర్‌వి సూర్యనారాయణ, ట్రాన్స్‌కో ఎస్ ఇ సత్యనారాయణరెడ్డి, జడ్పీ సి ఇవో డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల వేధింపుల నుండి రక్షించాలని
సెల్ టవర్ ఎక్కిన మహిళ!
తణుకు, ఏప్రిల్ 25: పోలీసుల వేధింపుల నుండి రక్షించాలని కోరుతూ స్థానిక 27వ వార్డుకు చెందిన ఒక మహిళ సోమవారం ఉదయం సెల్ టవర్ ఎక్కి హడావుడి చేసింది. తన సోదరుడు ప్రేమించిన యువతితో కలిసి పరారైన సంఘటనలో సంబంధం ఉందని తనను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆ మహిళ టవరు ఎక్కింది. ఈ విషయంలో తనను గంటల తరబడి పోలీసు స్టేషనులో ఉంచినట్టు ఆమె ఆరోపించింది. తనను వేధించబోమని పోలీసులు హామీయిస్తే కిందకు దిగుతానని ఆమె స్పష్టం చేసింది. తణుకు రూరల్ ఎస్సై కాళీచరణ్ సిబ్బందితో వచ్చి ఆమెకు నచ్చచెప్పి, సెల్‌టవర్ నుండి కిందకు దింపారు.

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయించాలి
జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 25: రాష్ట్రంలో పంచ వృత్తులు చేసుకుని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణులు 45 లక్షల మంది ఉన్నారని, వీరికోసం జిఒ నెంబర్ 85 ద్వారా ఏర్పాటు చేసిన విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఐదు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక బయనేరు వద్ద శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి హాజరైన ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బిసిల్లో ఏక వృత్తి కులాలకు ఇస్తున్న ప్రాధాన్యత స్వర్ణకార, కార్పెంటర్, కంచరం, కమ్మరం, శిల్పం అనే పంచ వృత్తుల్లో ఉన్న విశ్వబ్రాహ్మణులకు ఇవ్వడం లేదన్నారు. ఈ వృత్తుల్లో ఉన్న విశ్వబ్రాహ్మణులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కు నేటివరకు నిధుల కేటాయింపు జరగలేదన్నారు. తక్షణమే నిధులు కేటాయించాలన్నారు.
వడదెబ్బకు యువకుడు బలి!
మద్యం సేవించాడనే అపోహతో పట్టించుకోని స్థానికులు - చికిత్స ఆలస్యమై మృతి
భీమడోలు, ఏప్రిల్ 25: వడదెబ్బ తగిలి స్పృహతప్పి రోడ్డు పక్కన పడిపోయిన యువకుడిని మద్యం సేవించి పడిపోయాడనే అపోహతో పాదచారులు, దుకాణ యజమానులు పట్టించుకోకపోవడంతో మృతిచెందిన విషాద సంఘటన సోమవారం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ద్వారకాతిరుమల గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో కనికిచర్ల మణికంఠ (20) అనే యువకుడు ఫ్యాన్సీ షాపును నిర్వహిస్తూ కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. అతని తండ్రి మృతిచెందడంతో కుటుంమ బాధ్యత మణికంఠపైనే పడింది. అతని తమ్ముడిని భీమడోలులోని గీతాంజలి కళాశాలలో చదివిస్తున్నాడు. ఇంటర్మీడియట్‌లో తమ్ముడు ఫెయిల్ కావడంతో తిరిగి పరీక్ష రాయించేందుకు ఫీజు కట్టే ఉద్దేశంతో బస్సులో మణికంఠ భీమడోలు బయలుదేరాడు. భీమడోలు బస్టాండులో బస్సు దిగి ఎండ తీవ్రతకు జ్యూస్ తాగుదామని బస్టాండు పక్కనున్న దుకాణంలో జ్యూస్ తాగి, కొద్ది దూరం వెళ్లిన వెంటనే కళ్లు తిరిగి పడిపోయాడు. పాదచారులు, పక్కనే వున్న దుకాణదారులు పట్టపగలే మద్యం సేవించి పడిపోయాడనుకుని ఎవరూ పట్టించుకోలేదు. అరగంట తరువాత అతనిలో కదలిక రావడంతో పాదచారులు ఏ ఊరు అంటూ వివరాలు సేకరించారు. గీతాంజలి కళాశాలకు వచ్చానని సమాధానం చెప్పడంతో పక్కనే వున్న కళాశాల సిబ్బందికి తెలిపారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న కళాశాల సిబ్బంది మణికంఠను గుర్తించి, చికిత్సకై భీమడోలు గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన చికిత్సకై ఏలూరు తీసుకువెళ్లాలని చెప్పడంతో అతని బంధువులు, గీతాంజలి కళాశాల సిబ్బంది ఏలూరు తరలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కొంతసేపు చికిత్స చేసిన తరువాత ప్రైవేటు ఆసుపత్రికి అతడిని తరలిస్తుండగా బిపి పెరిగి అస్వస్థతకు లోనయ్యాడు. ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రికి చేర్చిన తరువాత చికిత్స చేస్తుండగా మణికంఠ మృతిచెందాడు. దీంతో అతనిపై ఆధారపడిన తల్లి, తమ్ముడు రోదనలకు అంతులేకుండా పోయింది. మృతదేహాన్ని స్వస్థలమైన ద్వారకాతిరుమలకు తరలించారు.