పశ్చిమగోదావరి

పోలవరంపై కాగ్ అక్షింతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 19: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికే జీవనాడి అని, అంతకుమించి రికార్డుస్ధాయిలో పూర్తి చేస్తున్నామంటూ స్వయంగా అధినేతలే వచ్చి ఇక్కడ ప్రకటించి వెళ్లి రోజులు గడవకుండానే కాగ్ రూపంలో పోలవరం నిర్మాణం తీరుపై అక్షింతల వర్షం తప్పలేదు. ఈసంస్ధ పోలవరం ప్రాజెక్టు, నిర్మాణంతోపాటు పలు అంశాలను తన అధ్యయనంలో సమీక్షించింది. ఈసందర్భంగా పలు పరిశీలనలను తన నివేదికలో పొందుపర్చింది. ప్రధానంగా డిపిఆర్‌ను సమర్పించకముందే అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతులు వంటి చట్టబద్దమైన అనుమతులు పొందటంలో జలవనరుల శాఖ విఫలమైందని స్పష్టంగా పేర్కొంది. డిజైన్ అంశాలతోపాటు వివిధ లోపాలను సరిచేయటంలో జాప్యం ప్రాజెక్టు నిర్మాణంలోను, ఆశించిన ప్రయోజనాలను పొందటంలోనూ జరిగిన ఆలస్యానికి కారణమైందని పేర్కొంది. కాగా 2009లో కేంద్ర జలసంఘానికి సమర్పించి అమోదం పొందిన డిపిఆర్ కూడా సమగ్రంగా లేదని, పలు లోపాలను గుర్తించినట్లు నివేదికలో పేర్కొంది. ప్రధానంగా సర్వే చేసినప్పుడు సమాచార సేకరణకు ఆధునిక పద్దతులైన రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ చిత్రాలు మొదలైనవి వినియోగించాలని కేంద్ర జలసంఘం మార్గదర్శకాలు సూచిస్తున్నాయని, అలాగే ప్రాజెక్టు స్ధలంపై సరైన అవగాహన కోసం అవసరమైతే ఆకాశయాన సర్వేక్షణ చేయాలని అయితే సంబంధిత శాఖ ఈవిధానాలను అవలంభించలేదని దానిలో పేర్కొంది. శాఖ కేవలం సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని స్ధలాకృతి పటాలు, స్వయంగా నిర్వహించిన క్షేత్ర సర్వేక్షణపై మాత్రమే ఆధారపడిందని నివేదికలో పేర్కొంది. జలవనరులశాఖ ఆధునిక పద్దతులను, ఆకాశయాన సర్వేక్షణను ఉపయోగించలేదని ప్రభుత్వమే అంగీకరించిందని కాగ్ పేర్కొంది. అలాగే ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం నిధుల విడుదలకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాల విషయంలో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉందని, అయితే జాతీయప్రాజెక్టుగా ప్రకటించిన నాటినుంచి మూడేళ్లు గడిచినా ఇరుపక్షాలు ఇంతవరకు అవగాహన పత్రంమేది సంతకం చేయలేదని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు ఆధార్టీ(పిపిఎ)కు క్లైయిమ్‌లు సమర్పించడానికి, వాటిని తనిఖీ చేసి తిరిగి చెల్లించే పద్దతిపై ఇరుపక్షాలు కార్యసరళిని తయారుచేసుకోలేదని కాగ్ పేర్కొంది. వ్యయాన్ని తిరిగి చెల్లించే విధానంపై ఇరువర్గాలు ఇంకా పూర్తిగా క్రమబద్దీకరించుకోలేదని పేర్కొంది. అసలు ఈ అవగాహన పత్రాన్ని కుదుర్చుకోకపోవడానికి గల కారణాలను కూడా చెప్పలేకపోయారని పేర్కొంది. వీటితోపాటు కాగ్ తన నివేదికలో పలు అంశాలకు సంబంధించి అనుసరించిన విధివిధానాలపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అలాగే ప్యాకేజీల వారీగా కుడి, ఎడమ కాల్వల ధరల నిర్ణయం, డిజైన్ల మార్పు వంటి విషయాల్లో కూడా పలు లోపాలు చోటుచేసుకున్నాయని, వాటిని సరిచేసే విషయంలో జరిగిన జాప్యమే మొత్తం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమైందని అభిప్రాయపడింది. అలాగే భూసేకరణ విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాలపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కుడి ప్రధాన కాల్వ, ఎడమ ప్రధాన కాల్వ అలాగే అనుసంధాన పనులకు భూమి ఏమేరకు అవసరమనే పూర్తి సమాచారాన్ని డిపిఆర్‌లో పొందుపర్చలేదని పేర్కొంది. భూమిని గుర్తించకుండానే, సేకరించకుండానే జలవనరులశాఖ ప్రాజెక్టు పనులను అప్పగించిందని పేర్కొంది. అంతేకాకుండా సర్వేక్షణ, పరిశోధన కూడా గుత్తేదార్లే చేయాలని నిబంధనతో కూడిన ఇపిసి ఒప్పందాలను కుదుర్చుకుందని పేర్కొంది. ఇపిసి గుత్తేదార్లు ప్రతిపాదిత అలైన్‌మెంట్ డిపార్టుమెంట్ ఆమోదానికి సమర్పించాల్సి ఉంది. ఆమోదం లభించిన తర్వాతే గుత్తేదార్లు అవసరమైన భూమిని గుర్తించి ల్యాండ్ ప్లాన్ షెడ్యూళ్లను శాఖకు సమర్పిస్తారు. ఈ షెడ్యూళ్లు అందిన తర్వాతే డిపార్టుమెంట్ గుత్తేదార్లతోను, భూసేకరణ అధికారులతోనూ కలిసి సంయుక్త సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. ఆతర్వాత భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టేందుకు శాఖ అధికారులకు ఇండేట్లు పంపించాల్సి ఉంటుంది. సేకరించిన భూమి పనులు చేసేందుకు శాఖ గుత్తేదార్లకు అప్పగిస్తుంది. ఈపద్దతి పాటించటం వల్ల భూమిని పలువిడతలుగా సేకరించినట్లు గమనించామని కాగ్ పేర్కొంది. కాగా ఒప్పందాల ప్రకారం కాల్వ ఆలైన్‌మెంట్లు ఆరునెలల్లోగా ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టులో ఇది మొదటి ప్రాధాన్యత అంశం. అయితే అలైన్‌మెంట్లు ఖరారు చేయటంలో కూడా అసాధారణమైన జాప్యం జరిగిందని కాగ్ పేర్కొంది. మిగిలిన పనులు పూర్తి చేయటం కోసం శాఖ అనేకసార్లు ఒప్పంద కాలపరిమితిని పొడిగించాల్సి వచ్చిందని పేర్కొంది. అటవీ అనుతులు పొందటంలో జాప్యం, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌లో జాప్యం, కోర్టు కేసుల వల్ల శాఖ ఒప్పందపు గడువులను పొడిగిస్తూ రావటం ఈవిధానాల వల్ల పనుల అమలులో జాప్యం జరిగి వ్యయం పెరుగుదలకు కారణమైందని కూడా కాగ్ పేర్కొంది. వీటితోపాటు మరికొన్ని అంశాలను కూడా స్పష్టంగా పేర్కొంటూ జాప్యం కావడానికి, ప్రాజెక్టు వ్యయం పెరగడానికి జలవనరులశాఖ అమలుచేసిన విధానాలే కారణమంటూ నివేదికలో పేర్కొంది.

వృథాగా పోతున్న తాగునీరు: పారిశుధ్యానికి భంగం
బుట్టాయగూడెం, సెప్టెంబర్ 19: ఒక పనితో రెండు ప్రయోజనాలు కలిగితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటారు... కానీ ఇక్కడ ఒక నిరుపయోగ పని కారణంగా రెండు నష్టాలు కలుగుతున్నాయి. మండలంలోని కంసాలికుంటలో కన్నాపురంబుట్టాయగూడెం ప్రధాన రహదారి పక్కన ఉన్న పశువుల నీటి తొట్టెకు వాటర్ ట్యాంకు నుండి కుళాయి కనెక్షన్ ఏర్పాటుచేశారు. ప్లాస్టిక్ పైపుతో ఏర్పాటుచేసిన ఈ కుళాయి కనెక్షన్ పగిలిపోవడం వలన కుళాయి నుండి తాగునీరు వృథాగా రహదారి మీదకు చేరుతోంది. దీని కారణంగా తాగునీరు వృథాగా పోవడమే కాకుండా, రహదారి మీదకు నీరు చేరి, రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని ప్రయాణీకులు వాపోతున్నారు. రోడ్డు మార్జిన్ నీటి ప్రవాహం కారణంగా బలహీనమై, ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం పశువుల తొట్టెలో నీరు పట్టాల్సిన అవసరం ఉండదు. వేసవికాలంలో పశువులకు తాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఈ తొట్టెల్లో నీరు పడుతుంటారు. ఇప్పుడు పశువులకు తాగునీరు ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా దొరుకుతుంది. వెంటనే కుళాయికి మరమ్మతులు చేపట్టి, పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.