పశ్చిమగోదావరి

ఎస్సీల ప్రగతికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లజర్ల, మే 12: బడ్జెట్‌లో రూ. 1090 కోట్లు కేటాయించడంతో ఎస్సీల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తోందని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. నల్లజర్లలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వ శిక్షణ కార్యక్రమానికి గురువారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష మంది నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం బహుళజాతి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామన్నారు. నైపుణ్య శిక్షణ, ఉద్యోగం కొరకు ఒక్కొక్కరిపై ప్రభుత్వం రూ. 2 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. ఎస్సీలకు ఆదాయం కూడబెట్టే ఆస్తులను కల్పించేందుకు ఆర్థిక సాయంచేయడం, స్వయం, వేతనోపాధికి దోహదపడే నైపుణ్యం పెంపుదల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, ఎస్సీ కార్పొరేషన్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. 2015-16 సంవత్సరంలో ఎస్సీ వర్గాల్లో వివిధ వృత్తులు నిర్వహిస్తున్న వారికి భౌతిక, ఆర్థిక ప్రగతిలో 7278 మంది లబ్దిదారులకు 89.63 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. అట్టడుగు వర్గాల వారికి వెట్టిచాకిరి, కూలీలు, జోగినిలు, అత్యాచార బాధితులకు వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణసహాయం అందిస్తున్నామన్నారు. చిన్నతరహా తాగునీటి పథకాల ఏర్పాటుకు బోరుబావులు, గొట్టపు బావుల తవ్వకం, సబ్‌మెర్సిబుల్ పంపుసెట్లు సమకూర్చుకునేందుకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. అతిముఖ్యంగా షెడ్యూల్డు కులాల వారికి విలువైన ఆస్తులు సమకూర్చేందుకు భూమి కొనుగోలు పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. భూమిలేని నిరుపేదలకు ముఖ్యంగా మహిళల పేరుమీద రూ.5లక్షలు మంజూరుచేస్తామన్నారు. ఇందులో రూ. 2 లక్షలు సబ్సిడీగా ఉంటుందన్నారు. విలేఖర్ల సమావేశంలో శిబిర సంచాలకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, శిబిరం కో- ఆర్డినేటర్ మద్దిపాటి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.

మూడు నాలుగు రోజుల్లో చెల్లింపులు
రైతుల ఖాతాలకే నేరుగా సొమ్ము జమ:్ధన్యం కొనుగోళ్లపై జెసి కోటేశ్వరరావు
తాళ్లపూడి, మే 12: రైతుల నుండి ధాన్యం తీసుకున్న మూడు లేదా నాలుగు రోజుల్లో రైతు ఖాతాకు డబ్బు జమచేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. 1424 ఫసలీ జమాబందీ కార్యక్రమానికి ఆయన గురువారం తాళ్లపూడి విచ్చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించిన విఆర్వోలకు పనితనం మెరుగుపరుచుకోవాలని పలు సూచనలు చేశారు.
అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిది లక్షల 18వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రాష్ట్రంలోనే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాగా గుర్తింపు పొందామన్నారు. 29వేల 791 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేశామని, వారికి 862 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కమీషన్ చెల్లించలేదనే ఆరోపణలు వస్తున్నాయని జెసి దృష్టికి తీసుకువెళ్లగా, దశలవారీగా కమీషన్లు వారికి చెల్లిస్తామని జెసి చెప్పారు. రేషన్ సరుకుల పంపిణీలో తూర్పుగోదావరి జిల్లా కంటే పశ్చిమ గోదావరి జిల్లా ముందంజలో ఉందన్నారు. వృద్ధాప్యంలో కదల్లేని స్థితిలో ఉన్న రేషన్‌కార్డుదారులకు తమశాఖ విఆర్వోల ద్వారా రేషన్‌ను ఇంటికి పంపిస్తున్నామన్నారు. ప్రజలకు అన్నివిధాలా సేవలందించడానికి చర్యలు తీసుకుంటున్నామని జాయంట్ కలెక్టర్ తెలిపారు.

మాతా శిశు మరణాలను నివారించాలి
వైద్యాధికార్లకు కలెక్టర్ భాస్కర్ సూచన
ఏలూరు, మే 12 : జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. గురువారం స్థానిక కలెక్టరు కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మాతాశిశు మరణాలు ఎక్కడైనా సంభవించినట్లు రికార్డు నమోదైతే సంబంధిత వైద్యాధికారి, అంగన్‌వాడీ వర్కర్, ఆశావర్కర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో గర్భిణీ మహిళలు అనారోగ్యంతో ఉన్న కేసులు మారుమూల ప్రాంతంలో ఎవరైనా ఉన్నట్లు గుర్తించినట్లయితే సంబంధిత ప్రాంతంలో ఆశావర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు వెంటనే సమీపంలోని వైద్యాధికారుల వద్ద వైద్య సేవలు అందించేందుకు తీసుకుని వెళ్లాలని కలెక్టరు చెప్పారు. బయోమెట్రిక్ విధానం తప్పనిసరిగా వైద్య సిబ్బంది వినియోగించుకోవాలని, బయోమెట్రిక్ ద్వారా హాజరు విధానం అవలంభించకపోతే వారి జీతాలు ఆలస్యంగా వస్తాయని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో వైద్యాధికారులందరూ తప్పనిసరిగా ప్రతీ రోజూ వారి విధి విధానాలను టూరు డైరీ తప్పనిసరిగా తయారు చేయాలని డ్రైవరు మొదలు అధికారి వరకూ ఏ రోజు ఎక్కడ పనిచేసారు, ఏ సమయంలో ఏ గ్రామంలో విధులు నిర్వహించారు అనే వివరాలను టూరు డైరీలో తప్పక నమోదు చేయాలన్నారు. జిల్లాలో పిహెచ్‌సిలలో రోగులకు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని బయటనుండి తెచ్చుకోవాల్సిందిగా డాక్టర్లు రోగులకు మందుల చీటీ రాస్తున్నారని, సాధ్యమైనంత వరకూ ప్రభుత్వం గుర్తించిన మందుల షాపుల్లోనే మందులు రోగులకు అందించాలన్నారు. సమావేశంలో డి ఎంహెచ్‌ఓ ఎస్ విజయగౌరి, డిసిహెచ్‌ఎస్ శంకరరావు, అడిషనల్ డిఎంహెచ్‌ఓ ఎస్ ఉమాదేవి, డెమో కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజూ కొనసాగిన విచారణ
నకిలీ పాస్ బుక్‌లతో రుణాల వ్యవహారం
మొగల్తూరు, మే 12: గుడివాడ ఆంధ్రాబ్యాంకులో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన రైతులు కొందరు నకిలీ పట్టదారు పాస్ పుస్తకాలతో రూ. 10 కోట్ల విలువ గల వ్యవసాయ రుణాలు తీసుకున్న వ్యవహారంపై గురువారం రెండోరోజు కూడా మండలంలో విచారణ కొనసాగింది. నకిలీ దస్తావేజులు, నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకు అధికారుల కళ్లుగప్పి సుమారు రూ. 10 కోట్ల వ్యవసాయ రుణాలు బాపట్లలో కొందరు ముఠాదారులు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై గుడివాడ డిఎస్పీ షేక్ హుసేన్ ఆధ్వర్యంలో మూడు బృందాలు గురువారం మండలంలో రైతులను, స్థానిక విఆర్వో దాసరి ప్రభాకరరావును వెంటబెట్టుకొని రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. రుణాలు తీసుకున్న వ్యక్తులు, వారి వివరాలను గుడివాడ ఎస్సై రఘు సేకరించారు. శేరేపాలెం, మొగల్తూరు గ్రామాల్లో రుణాలకు సంబంధించిన రైతులును పిలిచి వారి అభిప్రాయాలు సేకరించారు. నకిలీ పాస్ పుస్తకాల ద్వారా రుణాలు తీసుకున్న వ్యక్తుల పేర్లను విచారణాధికారులు వెల్లడించడానికి ఇష్టపడలేదు. విచారణ పూర్తయిన తరువాత గానీ వ్యక్తుల పేర్లు ప్రకటించలేమని వారు విలేఖరులకు తెలిపారు. గుంటూరు జిల్లా నుండి కృష్ణా జిల్లా మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాకు ఈ రాకెట్ వ్యవహారం పాకడంతో మూడు జిల్లాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు జిల్లాల మధ్య జరిగిన ఈ వ్యవహారంలో ఎంతమంది బాధ్యులున్నారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు తీసుకున్న వ్యక్తుల వ్యవహారంపై వెంటనే పోలీసులు ఛేదించాలని, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరుగకుండా ఉన్నతాధికారులు చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యలు
కౌలు రైతుల గుర్తింపు కార్డుల అవగాహన సదస్సులో సబ్-కలెక్టర్ దినేష్‌కుమార్
పాలకొల్లు, మే 12: కౌలు రైతుల గుర్తింపు కార్డులపై నిర్వహించిన సదస్సులో రైతులు, పెద్దలు ఇచ్చిన సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నర్సాపురం సబ్ కలెక్టర్ ఎఎస్ దినేష్‌కుమార్ అన్నారు. గురువారం పాలకొల్లులో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతుల ఆరోపణల్లో వాస్తవాలున్నాయని, ధాన్యం అమ్మిన తరువాత వాటి సొమ్ము చెల్లించడానికి కొంత ఆలస్యం జరిగిందన్నారు. త్వరలో రైతులకు సొమ్ము చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సదస్సుకు పాలకొల్లు తహసీల్దార్ దాసి రాజు సంచాలకులుగా వ్యవహరించారు. డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పొత్తూరి రామరాజు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. జిల్లా రైతుసంఘ నాయకులు వలవల శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ బ్యాంకులు అందరికీ రుణాలు ఇస్తున్నారని, కానీ కౌలు రైతులకు రుణాలు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం భరోసా ఇచ్చినా రుణాలు ఇవ్వటంలో ఎందుకు అడ్డు చెబుతున్నారో తెలుసుకోవాలన్నారు. తహసీల్దార్ దాసి రాజు మాట్లాడుతూ రికవరీ బాధ్యత రెవెన్యూ శాఖ తీసుకుంటుందని, బ్యాంకర్లు నిరభ్యంతరంగా రుణం ఇవ్వవచ్చన్నారు.
శివదేవుని చిక్కాల సర్పంచ్ సోమచంద్రశేఖర్ మాట్లాడుతూ సిండికేట్ బ్యాంకు పరిధిలో ఉన్న చిక్కాల, తిల్లపూడి, బల్లిపాడు, పాలమూరు గ్రామాల్లో కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని, రికవరీకి సర్పంచ్‌గా తాను సహకరిస్తానని అన్నారు. మాజీ మండల అధ్యక్షుడు పెనె్మత్స రామభద్రిరాజు డ్వాక్రా మహిళలకు, రైతు మిత్రకు, వ్యాపారులకు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్న బ్యాంకు అధికారులు కౌలు రైతులకు ఇవ్వకపోవటం అన్యాయమన్నారు. పోడూరు మండల రైతు పితాని సూర్యనారాయణ మాట్లాడుతూ సొంత భూములు ఉన్నవారు పంటలు పండించలేక కౌలు రైతులకు ఇస్తున్నారన్నారు. తాను రెండున్నర ఎకరాలు కౌలులేకుండా రైతులకు ఇచ్చానని చెప్పారు. రైతు వరహాలరెడ్డి మాట్లాడుతూ అమ్మిన ధాన్యానికి కొన్న వెంటనే సొమ్ము చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ ఎ.డి. మురళీకృష్ణ, ఆచంట, పోడూరు, యలమంచిలి, పాలకొల్లు మండలకాలకు చెందిన తహశీల్దార్లు పాల్గొన్నారు.

జనరిక్ మందులపై అపోహ తగదు:డిఆర్‌డిఎ పిడి
కొవ్వూరు, మే 12: ప్రజలకు చౌకధరలకే మందులు అందజేయడానికి అన్న సంజీవని మందుల దుకాణాలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటుచేయనున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు. గురువారం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో అన్న సంజీవని మందుల దుకాణాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమందిలో జనరిక్ మందులు సరిగా పనిచేయవని అపోహ ఉందని, దాన్ని విడనాడాలన్నారు. ఎమ్మెల్యే కెఎస్ జవహర్ మాట్లాడుతూ వైద్యులు పేదలకు రాసే మందుల చీటీల్లో జనరిక్ మందులు రాయాలని సూచించారు. ఆర్డీవో బి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనరిక్ మందులపై అవగాహన కోసం త్వరలో ఆర్‌ఎంపిలు, మెడికల్ దుకాణాల వ్యాపారస్థులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో అభివృద్ధి కమిటీ సభ్యులు పి శ్రీనివాసరావు, పి ఉమామహేశ్వరరావు, వైద్యులు పాల్గొన్నారు.

టిడిపి నేత లక్ష్మీనరసింహరాజు కన్నుమూత
ఉండి, మే 12: రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్సపొందుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, లయన్స్ జోనల్ మాజీ ఛైర్మన్ కలిదిండి లక్ష్మీనర్సింహరాజు (68) గురువారం ఉదయం కన్నుమూశారు. గత నెల 21న కాళ్ళ మండలం సీసలి వద్ద బైక్‌పై వెళుతున్న ఆయనను ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన లక్ష్మీనర్సింహరాజు అప్పటి నుండి భీమవరంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయన మరణ వార్త తెలిసిన వెంటనే నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు వచ్చి నివాళులర్పించారు. గతంలో జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన భీమవరం భూమి తనఖా బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన మృతితో టిడిపి గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు పేర్కొన్నారు. లయన్స్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లు ఈపూరి సత్యనారాయణ, డా. ఎంవిఎస్ రాజు, రుద్రరాజు నరసరాజు, లయన్స్ జోనల్ ఛైర్‌పర్సన్ కనె్నగంటి రూత్‌కళ, డిఎన్నార్ కళాశాల ఉపాధ్యక్షుడు కూనపరాజు రామకృష్ణంరాజు, కూనపరాజు రామరాజు, ఉండి తహసీల్దార్ వై.దుర్గాకిషోర్ తదితరులు లక్ష్మీనర్సింహరాజు పార్ధివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు.