పశ్చిమగోదావరి

మూడు రోజుల్లో పింఛన్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 19: జిల్లాలో ఫిబ్రవరి నెల నుండి ప్రతీ నెల ప్రారంభ తొలి మూడు రోజుల్లోనే ఎన్‌టిఆర్ భరోసా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని సంబంధితాధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుండి మంగళవారం సాయంత్రం మండల తహశీల్దార్లు, ఎంపిడివోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పెన్షన్లు, రేషన్ కార్డులు, దీపం గ్యాస్ కనెక్షన్లు, గృహ నిర్మాణం, జన్మభూమి వినతులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్‌టి ఆర్ భరోసా కింద 3.45 లక్షల మంది పెన్షన్లు పొందుతుండగా ఇంత వరకూ 20 మండలాల నుండి 86 వేల మందికి సంబంధించి బ్యాంకు ఖాతాలు వివరాలందాయని మిగిలిన వారు వారం లోపు వివరాలను పంపాలన్నారు. ఇకపై నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు పింఛను సొమ్ము జమ చేస్తారని వారి దగ్గరున్న ఎటిఎం కార్డుల ద్వారా ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. జిల్లాలో ఎన్‌టిఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వారు ప్రతీ మాసం మొదటి మూడు రోజుల్లోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో దీపం పధకం కింద ఇం తరకూ 80 వేల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారని, మిగిలిన 50 వేల కనెక్షన్లను మార్చి నెల లోపు పంపిణీ పూర్తిచేయాలని సంబంధిత గ్యాస్ ఏజెన్సీ, ఎంపిడివోలను కలెక్టర్ ఆదేశించారు. గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి పరికరాలన్నీ సిద్ధంగా ఉండి లబ్ధిదారులకు ఇంకా చేరవేయని పక్షంలో సంబంధితాధికారులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాలో 18 వేల ఇళ్లు మంజూరుకు గాను ఇంత వరకూ 15,356 ఇళ్లకు సంబంధించి పరిపాలనామోదాన్ని రెండు రోజుల్లో తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావును ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరు పత్రాలను వెంటనే లబ్ధిదారులకు అందించి వారిలో విశ్వాసం కలిగించాలన్నారు. మార్చి నెలాఖరులోపు ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో అందిన వినతులు, వాటికి సంబంధించిన ధృవపత్రాలు ఆన్‌లైన్ కార్యక్రమం సంపూర్ణంగా చేయాలన్నారు. ఈ విషయంలో నరసాపురం, నిడదవోలు మున్సిపాల్టీలు వెనుకబడి ఉన్నాయని వీటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 ఎంహెచ్ షరీఫ్, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, డి ఎస్‌వో డి శివశంకర్‌రెడ్డి, డ్వామా పిడి వెంకటరమణారెడ్డి, డి ఆర్‌డి ఎ పిడి కె శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఆర్టీసీకి ‘సంక్రాంతి’ - రూ.10.3 కోట్ల ఆదాయం
గతేడాది కంటే రూ.1.3 కోట్లు అదనం: ఆర్‌ఎం ధనుంజయరావు
ఏలూరు, జనవరి 19: ఎపిఎస్ ఆర్టీసీ ఏలూరు రీజియన్ ద్వారా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని గత ఏడాది కంటే కోటీ 30 లక్షల రూపాయలు అదనపు ఆదాయం లభించిందని ఎస్ ధనుంజయరావు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో కార్యాలయ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. బుధవారం నుంచి నిర్వహించే రోడ్డు భద్రతా వారోత్సవాలు, ఈ నెల 16వ తేదీ నుంచి జరుగుతున్న ఇంధన పొదుపు పక్షోత్సవాలు అంశాలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ గత ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో 9 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, కాగా ఈ ఏడాది 10.30 కోట్లు ఆదాయం లభించినట్లు వివరించారు. ఆర్‌టిసిలో వివిధ కారణాల వల్ల మృతిచెందిన కార్మికుల కుటుంబాల్లోని 52 మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కారుణ్య నియామకాల్లో భాగంగా మృతిచెందిన ఆర్‌టిసి కార్మికుల పిల్లలకు 52 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా వున్నాయని అభ్యర్ధులు అంగీకార పత్రాలు తెలియజేస్తే వారిని నియమిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు అభ్యర్ధులకు సమాచారం అందించగా వారిలో కొంతమంది అంగీకార పత్రాన్ని అందజేశారని వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌కు రాకపోకలు సాగించేందుకు ప్రయాణీకులు ఆర్‌టిసి సంస్థకు చేయూతనిచ్చారని, తద్వారానే కోటీ 30 లక్షల రూపాయల ఆదాయం అదనంగా లభించిందని, ఈ మేరకు సిబ్బందికి, ప్రయాణీకులకు కృతజ్ఞతలను తెలిపారు. సంస్థ ద్వారా ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రోత్సాహం ఎంతైనా అవసరమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏవో వెంకటలక్ష్మి తదితర సిబ్బంది వున్నారు.

కోడి పందాలపై ఉన్న శ్రద్ధ
అభివృద్ధిపై వద్దా!
*కృష్ణా, గుంటూరు జిల్లాలకే ప్రాధాన్యం
*కృష్ణా జిల్లా ప్రయోజనాలకే ‘పట్టిసీమ’
*వెయ్యి కోట్ల మంచినీటి పథకాన్నీ మార్చేశారు
*జిల్లా ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలి
*బహిరంగ లేఖలో జోగయ్య ధ్వజం
పాలకొల్లు, జనవరి 19: కోడి పందాలపై కోర్టులు ఆంక్షలు విధించినా వాటిని ప్రోత్సహించేందుకు చేసిన కృషి జిల్లాను అభివృద్ధి చేయటంలో లేదని మాజీ మంత్రి, మాజీ ఎంపి చేగొండి వెంకట హరిరామ జోగయ్య మంగళవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో ధ్వజమెత్తారు. కోడి పందాలు ఆడించబోమని చెప్పిన పోలీసులు తెరచాటు వ్యవహారం చేశారని, ‘చినబాబు’ ప్రమేయంతో లక్షలాది రూపాయలు చేతులు మారాయన్నారు. జిల్లా అభివృద్ధి పథకాల కన్నా కోడి పందాలు ఆడించటమే ఘనత అనుకునే ఎంపిలు, ఎమ్మెల్యేలు ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలని ఆయన హెచ్చరించారు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పట్టుబట్టి జిల్లాకు నిట్ కళాశాల తేగలిగారన్నారు. చంద్రబాబు అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఇచ్చే ప్రాధాన్యత ఇతర జిల్లాలకు ఇవ్వటం లేదని జోగయ్య విమర్శించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా కృష్ణా జిల్లా ప్రయోజనాన్ని కాపాడిందని, ఈ జిల్లా వాసులకు నష్టం కలిగించిందన్నారు. రైతు నాయకులమని చెప్పుకునే ఒక్క ఎమ్మెల్యే కూడ రైతుల తరఫున మాట్లాడకపోవటం దురదృష్టకరమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పట్టిసీమ నుండి జిల్లాలోని అన్ని గ్రామాలకు, పట్టణాలకు కాలుష్యరహిత నీరు ఇవ్వవచ్చని వెయ్యి కోట్లతో ఒక పథకం రూపొందించామని, ఈ పథకాన్ని ఈ జిల్లాకు కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రయోజనం కలిగించేలా మార్చారని ఆయన ఆరోపించారు. రూ. 200 కోట్లు వెచ్చిస్తే జిల్లాలో నిమ్స్ తరహా ఆసుపత్రికి నెలకొల్పవచ్చని, సూపర్‌స్పెషాల్టీ ఆసుపత్రి ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జురుగుతుందని జోగయ్య సూచించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలను ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
రాష్ట్ర రాజధానిగా కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపి ప్రకటించటం వల్ల ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ చేయమని కోరినట్లుగానే ఈ రెండు జిల్లాలను ఫ్రీజోన్‌గా ప్రకటించి 13 జిల్లాల నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థలలో ప్రవేశం రాష్ట్రం అంతా వర్తింపచేయాలని ఆయన డిమాండ్‌చేశారు. కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్ కూడా గుంటూరు జిల్లాలోనే నెలకొల్పారని, ఇది ఈ జిల్లాలో చేతకాని ప్రజాప్రతినిధుల పుణ్యమేనని ఆయన ఎద్దేవా చేశారు.
జిల్లా అభివృద్ధికి ఆలోచన మాని కోడిపందాలు కావాలని కోరుకోవటం జిల్లా రాజకీయ నాయకులకు సిగ్గుగా లేదా అని ఆయన ప్రశ్నించారు. గోదావరి పుష్కరాలకు రూ.1500 కోట్లు, రాజధాని శంకుస్థానకు రూ. 400 కోట్లు, ముఖ్యమంత్రి విమాన ప్రయాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఈ జిల్లాలో ఒక మంచి ఆసుపత్రికి అయ్యే ఖర్చు వీటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులంతా ఒకేతాటిపై నిలిచి జిల్లా అభివృద్ధికి ఇప్పటికైనా ముందడుగు వేయాలని, అప్పుడే తిరిగి ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో గెలవగలరని జోగయ్య హితవు పలికారు.

సమిష్టి కృషితో ‘్ఫలితం’ రాబడదాం
పదో తరగతి పరీక్షలపై ఉపాధ్యాయులతో డిఇఒ మధుసూదనరావు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జనవరి 19: ‘విద్యావిధానంలో అనివార్యంగా మార్పులు వస్తున్నాయి.. ప్రభుత్వ పాఠశాలలు యథాలాపంగా నడిచిపోతున్నాయి.. లోపం ఎక్కడుందో గుర్తించి వాటిని సరిదిద్దుతాను’ అని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి డి మధుసూదనరావు హామీయిచ్చారు. ప్రభుత్వ, పురపాలక సంఘం, జిల్లా పరిషత్ తదితర ప్రభుత్వ అనుబంధంగా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. మరో 50 రోజుల్లో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సమిష్టిగా పనిచేసి విజయం సాధిద్దామని పేర్కొన్నారు. మంగళవారం భీమవరంలోని రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌లో భాగంగా ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఇఒ ఉపాధ్యాయులను ఆకట్టుకునేలా ప్రసంగించి, వారిలో ఉత్తేజాన్ని నింపారు. ప్రతీ ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని దత్తత తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ నిద్రావస్థలో ఉందని, బాధ్యత కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థికి న్యాయం చేయాలని సూచించారు. యాంత్రీకంగా వెళ్లిపోతున్నామని, విద్యార్థులకు పార్లమెంట్ అంశాన్ని బోధించే సమయంలో మాక్ పార్లమెంట్‌ను ఏర్పాటుచేయాలని, అలాగే కోర్టుల గురించి చెప్పేటప్పుడు ప్రత్యక్షంగా చేసి చూపిస్తే ప్రజాస్వామ్యం గురించి తెలుస్తుందన్నారు. జీవితంలో చదువుకోవడం, ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం కాకుండా భిన్నంగా ఆలోచన చేయాలన్నారు. రానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ ఉపాధ్యాయుడు కార్గిల్ యుద్ధంలోని సైనికుడిలా పనిచేయాలని ఆయన సూచించారు. అష్టమార్గాల గురించి వివరించారు. యాక్షన్ ప్లాన్ అమలుచేయాలన్నారు. బేస్‌మెంట్, కమిట్‌మెంట్‌తో విజయం సాధించడమే తరువాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా పదవతరగతి పరీక్షా ఫలితాల్లో నూరుశాతం ఫలితాలు సాధించడమే ఇప్పుడు అందరి ముందున్న లక్ష్యమన్నారు. భీమవరం డివైఇఒ మద్దూరి సూర్యనారాయణమూర్తి, టి సత్యనారాయణమూర్తి, ఎస్టీయు, యుటిఎఫ్, ఎపిటిఎఫ్ తదితర సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చేపల చేరువులో భారీ పండుగప్ప
మొగల్తూరు, జనవరి 19: మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ గ్రామ పంచాయతీ పరిధిలో రైతు తిరుమాని శ్రీనుకు చెందిన చేపల చెరువులో భారీ పండుగప్ప మంగళవారం బయట పడింది. ఈ చెరువులో 5 కేజీల బరువుగల భారీ పండుగప్ప పెరగటంతో రైతు ఆనందపరవశుడయ్యాడు. ఈ చేప వెయ్యి రూపాయలు ధర పలుకుతుందని రైతు శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ చేపను సమీప చెరువుల యజమానులు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు.

నెలాఖరుకు పునరావాస కాలనీలు పూర్తి
30, 31 తేదీల్లో తరలింపు:జెసి కోటేశ్వరరావు
జంగారెడ్డిగూడెం, జనవరి 19: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్సు జరుగుతున్న ఎనిమిది నిర్వాసిత గ్రామాల ప్రజలకు పునరావాస కాలనీల నిర్మాణం ఈ నెలాఖరుకు పూర్తిచేయనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు తెలిపారు. స్థానిక వైఎస్సార్ నగర్, పేరంపేట రోడ్డులోని పునరావాస కాలనీలను మంగళవారం జెసి పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాస ప్యాకేజీ పనులపై మంగళవారం జెసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ కోసం పైడిపాక, రామయ్యపేట గ్రామాలు ఖాళీ చేయించేందుకు జంగారెడ్డిగూడెం సమీపంలో రెండు పునరావాస కాలనీల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. పేరంపేట రోడ్డులోని కాలనీలోకి 200 కుటుంబాలను, వైఎస్సార్ నగర్ వద్ద నిర్మించిన పునరావాస కాలనీలోకి 40 కుటుంబాలను ఈ నెల 30, 31న తరలిస్తామన్నారు. ఇంకా సింగన్నపల్లి, తోటగొంది, మామిడిగొంది, దేవరగొంది, రామన్నపాలెం, చేగొండపల్లి గ్రామాలు ఖాళీ చేయించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు నాలుగు గ్రామాలకు పూర్తిస్థాయిలో సహాయ పునరావాస ప్యాకేజీ అమలుచేసి ఖాళీ చేయించామన్నారు. హెడ్‌వర్క్స్ పనులు జరుగుతున్న మామిడిగొంది, తోటగొంది, దేవరగొంది, రామన్నపాలెం గ్రామాల ప్రజలను ఖాళీచేయించినట్టు తెలిపారు. తొలి విడతలో ఖాళీ చేయించాల్సిన ఎనిమిది గ్రామాల నిర్వాసితులకు 1,585 గృహాలు నిర్మించినట్టు తెలిపారు. ఇప్పటివరకు 15 పునరావాస కాలనీలు నిర్మించామన్నారు. కాగా రామయ్యపేట, పైడిపాక నిర్వాసితులకు నిర్మించిన పునరావాస కాలనీలలో పనులు వేగవంతంచేయాలని, పొదలు తొలగించి, శుభ్రంచేయాలని అధికారులను ఆదేశించారు. తొలుత స్థానిక జలవనరుల శాఖ (పిడబ్ల్యుడి)కు చెందిన స్థలాన్ని పాలిటెక్నిక్‌కు కేటాయింపు కోసం జెసి పరిశీలించారు. కళాశాల కోసం గతంలో చేసిన స్థల పరిశీలన పునస్సమీక్షించారు. జెసి వెంట స్థానిక ఆర్డీవో ఎస్ లవన్న తదితరులున్నారు.

మిగిలిపోయిన చంద్రన్న కానుకలు!
వీరవాసరం, జనవరి 19: క్రిస్మస్, సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం చంద్రన్న కానుక పేరుతో ఉచితంగా పంపిణీ చేసిన సరుకులు మిగిలిపోవడంతో మంగళవారం వాటిని గొడౌన్‌కు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని గ్రామాల్లోగల రేషన్‌షాపుల నుండి మిగిలిన సరుకులు, సంచులను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఇక్కడి నుంచి వాటిని ప్రభుత్వ గొడౌన్లకు తరలిస్తున్నారు. మండలంలోని 219 మంది లబ్ధిదారులు చంద్రన్న కానుకలు తీసుకోలేదు.

అక్రమంగా తరలిపోతున్న ఇసుక
యలమంచిలి, జనవరి 19: యలమంచిలి లంక గ్రామంలో ఇసుక ర్యాంపు నుండి అక్రమంగా తరలిస్తున్నారని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, తదితర వైసిపి నేతలు మంగళవారం సాయంత్రం ర్యాంపులో ధర్నా నిర్వహించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఇసుకను ఆక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను వడ్డిలంక గ్రామానికి చెందిన శీలం రాముడు అడ్డుకోవడంతో అతనిని గెంటివేసి ట్రాక్టర్‌ను తీసుకుపోయారని, ఈ విషయమై ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నరసాపురం సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్, తహసీల్దార్ గురుప్రసాద్ తదితర అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి రెవెన్యూ అధికారులు వెళ్లి పరిశీలించారు. ఈ ప్రాంతం నుండి ఇసుక అక్రమంగా అధికార పార్టీ నేతలు కొందరు తరలిస్తున్నారని ఎమ్మెల్సీ మేకా ఆరోపించారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఇసుక దొంగలను అరెస్టుచేయాలంటూ ఈ సందర్భంగా వైసిపి నేతలు నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు వెంట పాలకొల్లు మున్సిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, వైసిపి నాయకులు కల్యాణం గంగాధర్, గూడూరి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

ఇసుక ర్యాంపు వద్దంటూ రైతుల ఆందోళన!
కుకునూరు, జనవరి 19: ముంపు మండలమైన కుకునూరు పరిధిలో గల దాసవరం గ్రామ సమీపంలో గుండేటి వాగులో నిర్వహించ తలపెట్టిన ఇసుక ర్యాంపు వద్దంటూ దాసవరం గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. గత రెండురోజులుగా ఇసుక ర్యాంపు కొరకు ఇటువైపు రోడ్డు పోయించడానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడ రోడ్డు పోయడానికి వీలు లేదని, దీని వల్ల తమ పొలాలు పోతున్నాయని, ఎకరాకు 30 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇస్తేనే రోడ్డును పోయనిస్తామని ఆందోళనకు దిగారు. దీంతో మంగళవారం ఆ ర్యాంపు స్థలానికి సబ్ కలెక్టర్ షాన్‌మోహన్ చేరుకుని రైతులకు సర్ధిచెప్పే ప్రయత్నం కొనసాగించినప్పటికీ అక్కడకు వందల సంఖ్యలో స్థానికులు సైతం చేరుకుని ఇక్కడ ఇసుక ర్యాంపు వద్దంటూ, ఈ ఇరుకు రోడ్లలో ర్యాంపు నిర్వహిస్తే వందలాది లారీలు ఈ రోడ్డులో నిత్యం తిరుగుతుంటాయని, దీనితో ఎప్పుడూ రోడ్డు మీద ఆటలాడుకునేవారు సైతం ప్రమాదాల బారిన పడే దుస్థితి నెలకొంటుందని, ఈ ప్రాంతంలో ఇసుక ర్యాంపు నిర్వహించడానికి వీలు లేదని సబ్ కలెక్టర్ షాన్‌మోహన్ ముందు వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు పోలవరం ముంచుకొస్తుంటే భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్నామని, ఇప్పుడు ఇసుక ర్యాంపు పేరుతో చిన్న పిల్లల విషయంలో సైతం భయభ్రాంతులకు గురికావాల్సిన దుస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో పనులు సైతం నిలిపివేశారు.

పాఠశాల ఆకస్మిక తనిఖీ
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జనవరి 19: జిల్లా విద్యాశాఖాధికారి డి మధుసూదనరావు మంగళవారం జిల్లాలోని పలుపాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. శ్రీపర్రులోని జిల్లా పరిషత్ హైస్కూల్, మండల కేంద్రం కాళ్ళలోని జడ్పీ హైస్కూలు, ఆకివీడు మండలంలోని అయిభీమవరం గ్రామంలోగల జిల్లా పరిషత్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలల్లో బేస్‌మెంట్, కమిట్‌మెంట్ కార్యక్రమాలు కార్యరూపం దాల్చడంలో విఫలం కావడం, దీంతో పాటు లోపాలు ఉండటంతో డిఇఒ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు.

మొగల్తూరులో శ్మశాన వివాదం
మృతదేహంతో ఆందోళన
మొగల్తూరు, జనవరి 19: మొగల్తూరులో శ్మశాన సమస్యపై ఇరు కులాల మధ్య వివాదం తలెత్తడంతో, ఒక కులానికి చెందిన వారు మృతదేహంతో మంగళవారం జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. దీంతో రహదారి పొడవునా వాహనాలు నిలిచి పోయాయి. వివరాలిలా ఉన్నాయి. మొగల్తూరు గ్రామం పాతకాలువ సెంటర్ వద్ద నివసిస్తున్న బుడగ జంగ కులస్థుల్లో కుల పెద్ద ఇంగూవ చల్లాలు (60) అనే వృద్ధుడు మంగళవారం మృతిచెందాడు. మృతదేహాన్ని సమీపంలోని శ్మశానభూమికి తీసుకువెళుతుండగా, మార్గమధ్యంలో శెట్టిబలిజ కులస్థులు తమ కులస్థులకు చెందిన భూమిలో శవాన్ని ఖననం చేయరాదని అడ్డుతగలటంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో బుడగ జంగ కులస్థులు తమ సమస్య పరిష్కరించాలని అధికారులను కోరుతూ రహదారిపై మంగళవారం సాయంత్రం నాలుగు గంటలపాటు మృతదేహంతో ధర్నా నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. దీంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నిలిచిపోవటంతో, సమస్యను తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ శ్రీపాద హరినాధ్, స్టేషన్ ఎస్సై రత్నంలు తన సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించారు. శ్మశానభూమిలో తమకు కూడా హక్కు ఉందని బుడగ జంగ కులస్థులు, హక్కులేదని శెట్టిబలిజ కులస్థులు అధికారుల ఎదుట ఆరోపించారు. అయితే సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు ఇరువర్గాల పెద్దలను అధికారులు ఒప్పించారు. దీంతో ఆందోళన విరమించారు.

సబ్-రిజిస్ట్రార్ బంధువుల ఇళ్లల్లో ఎసిబి సోదాలు
ఏలూరు, జనవరి 19: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగం నేపధ్యంలో విజయవాడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజి కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న వీరవెంకట దుర్గాప్రసాద్‌కు సంబంధించిన బంధువుల ఇళ్లలో ఏలూరులో మంగళవారం ఎసిబి అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో వుంటున్న దుర్గాప్రసాద్ భావమరిది రాంప్రసాద్ ఇంటిలోనూ, స్థానిక గూడ్స్‌షెడ్ రోడ్డులో నివాసముంటున్న రాంప్రసాద్ సోదరి అన్నపూర్ణ ఇంటిలోనూ ఈ తనిఖీలను నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడున్నర కోట్ల రూపాయల మేరకు దుర్గాప్రసాద్ ఆస్తులను కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎసిబి సిఐలు యుజె విల్సన్, కె వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

కాపులను బిసిల్లో చేర్చేందుకు చంద్రబాబు కృషి
కాపు కార్పోరేషన్ ఛైర్మన్ రామానుజయ్య
కొవ్వూరు, జనవరి 19: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా కాపులను బిసిల్లో చేర్చేందుకు కృషిచేస్తున్నట్టు కాపు కార్పోరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళుతూ మంగళవారం ఆయన కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామానుజయ్య మాట్లాడుతూ కాపులను బిసిల్లో చేర్చేందుకు గాను మంజునాధ్ కమిటీ వేయడంతోపాటు వంద కోట్లతో కార్పోరేషన్ ఏర్పాటుచేసి ఆర్థికంగా వెనుకబడిన కాపులకు న్యాయం చేయడానికి కృషిచేస్తున్నట్టు తెలిపారు. టిడిపి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటోందన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ముద్రగడ పద్మనాభం వంటి నాయకులు కాపు సామాజిక సమస్యలు తెరపైకి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. రాజకీయ పార్టీలు మంజునాధ్ కమిటీకి సలహాలు, సూచనలు అందజేయాలన్నారు.