పశ్చిమగోదావరి

అరుదైన పంచలోహ విగ్రహాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 11 : దేవాలయాల్లో నిత్యపూజలందుకుంటున్న పంచలోహ విగ్రహాలు చోరీకి గురికావడం, కొద్దికాలం వ్యవధిలోనే కోట్ల రూపాయల విలువైన ఈ విగ్రహాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపుగా వంద నుంచి 200 సంవత్సరాల పాతదైన సీతారామ విగ్రహంతోపాటు దశాబ్ధాల క్రితం రూపొందిన సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ పంచలోహ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువను అంచనా వేసేందుకు పురావస్తు శాఖ సహకారాన్ని తీసుకుంటున్నారు. ప్రాధమిక అంచనా ప్రకారం కోట్ల రూపాయల్లోనే వుంటుందని అంచనా. వీటితోపాటు 30 లక్షల రూపాయలు విలువచేసే చోరీ సొత్తును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి భాస్కర్‌భూషణ్ ఈ వివరాలను తెలిపారు. పాలకొల్లు రూరల్ సర్కిల్ పరిధిలో చోటు చేసుకున్న పలు దొంగతనాలకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పాలకొల్లు రూరల్ సర్కిల్ పరిధిలో వేర్వేరు దొంగతనాలకు పాల్పడిన మామిడిశెట్టి సురేష్, కఠారి సాయి కిరణ్‌రాజు తోటకూర రామకృష్ణంరాజు, సద్దుల కుమార్ రాజులను పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి ఆరుకాసుల బంగారు ఆభరణాలు, ఒకటిన్నర కేజీల వెండి ఆభరణాలు, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఈ నలుగురు లక్ష్మీపాలెం గ్రామంలోని సీతారామ దేవాలయం, మట్లపాలెంలోని కోదండ రామాలయంలలో పంచలోహ విగ్రహాల చోరీకి కూడా పాల్పడ్డారు. వీరివద్ద నుంచి సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ, సీతారామ పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. సీతారాముల విగ్రహం వందల ఏళ్లనాటిదని భావిస్తున్నారు. ఆ విధంగా చూస్తే ఈ ఒక్క విగ్రహం విలువే కోట్లలో వుండవచ్చునని అంచనా వేస్తున్నారు. అదే విధంగా మరో పరిణామంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన పతివాడ గణేష్ కొద్దిరోజుల క్రితం సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. అతన్ని విచారించిన నేపధ్యంలో పాలకొల్లు రూరల్, నర్సాపురం పరిధుల్లో చేసిన దొంగతనాలు బయటపడ్డాయి. దీంతో అతన్ని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 92 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీనితోపాటు తొమ్మిది లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఈ రెండు కేసుల్లో 30 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులను చేధించడంలో సమర్ధంగా వ్యవహరించిన పాలకొల్లు రూరల్ సి ఐ చంద్రశేఖర్, ఎస్ ఐ అప్పారావులతోపాటు సిబ్బందిని జిల్లా ఎస్‌పి అభినందించారు.
మెరుగైన సేవలందించాలి
ఆర్టీసీ ఆర్‌ఎంకు మంత్రి సుజాత ఆదేశం
ఏలూరు, ఫిబ్రవరి 11: జిల్లాలో ప్రయాణీకుల సౌకర్యార్ధం పాడైన బస్సుల స్ధానే కొత్త బస్సులు ఏర్పాటుచేసి మెరుగైన సేవలందించాలని రాష్ట్ర గనులు, స్ర్తి,శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత ఆర్టీసీ ఆర్‌ఎం ధనంజయ్‌ను ఆదేశించారు. స్ధానిక శ్రీరామ్‌నగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆర్టీసీ అధికారులతో ఆమె సమీక్షించారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో సౌకర్యాలు లేకపోవటం వల్ల ప్రయాణీకులు నరకయాతన అనుభవిస్తున్నారని, వీటిపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటి బస్సులను తొలగించి తక్షణమే కొత్త బస్సులను ఏర్పాటుచేయాలన్నారు. హైదరాబాద్, తిరుపతి, బెంగుళూరు, శ్రీకాకుళం, కర్నూలు తదితర సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు సాధ్యమైనంత మేరకు పూర్తిస్ధాయి కండిషన్‌లో ఉండాలని, కొన్ని బస్సుల్లో ప్రయాణీకులు రేకుల సౌండ్‌తో ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని అటువంటి బస్సులను మార్చాలన్నారు. జిల్లాలోని శివారు గ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. పదిరోజుల్లో ఆరు కొత్త బస్సులు రానున్నాయని, వాటిలో రెండు జంగారెడ్డిగూడెం నుండి హైదరాబాద్‌కు, మిగిలినవి తాడేపల్లిగూడెం, ఇతర ప్రాంతాలకు కేటాయిస్తామని ఆర్టీసీ ఆర్‌ఎం ధనంజయ్ చెప్పారు. ఆర్టీసీ 48 కొత్త అద్దెబస్సులను జిల్లాలో అనుమతించిందని, 20 రోజుల్లో ఈబస్సులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు.
గిరిజన కళాశాల వసతిగృహం ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 11: స్థానిక 12వ వార్డులోని కోటా రామచంద్రపురంలో ఉన్న సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ రూ.కోటితో గిరిజన కళాశాల బాలుర వసతిగృహాన్ని నిర్మించింది. దీన్ని గురువారం ప్రాజెక్టు ఆఫీసర్ ఎస్. షాన్‌మోహన్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థినీ విద్యార్థులు చదువుకోవడానికి దీన్ని నిర్మించామని పిఒ షాన్‌మోహన్ చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ విద్యాకేంద్రంగా భాసిల్లుతున్న భీమవరం వంటి ప్రాంతంలో అన్నివర్గాలకు చెందిన వారికి వసతి గృహాలున్నాయని, కానీ గిరిజనులకు వసతిగృహం లేకపోయిందన్నారు. రూ.కోటితో దీన్ని నిర్మించడంతో ఈ కొరత కూడా తీరిందన్నారు. పట్టణానికి శివారున ఉన్నప్పటికీ ఇక్కడి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వార్డు కౌన్సిలర్ యర్రంశెట్టి కొండ అధ్యక్షతన ఈ సభ జరిగింది. టిడిపి జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు కొండేటి సాంబశివరావు, కౌన్సిలర్లు వేలూరి సుబ్రహ్మణ్యశర్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మైండ్ గేమ్ ఆడుతున్న బాబు

వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, ఫిబ్రవరి 11 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో మైండ్ గేమ్ ఆడుతున్నారని వై ఎస్ ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ జిహెచ్ ఎంసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిందన్నారు. దీని నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దానిలో భాగంగానే వై ఎస్ ఆర్ సిపికి చెందిన ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల నుంచి టిడిపిలో చేరేందుకు సిద్ధంగా వున్నారంటూ ప్రకటనలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. వాస్తవానికి అక్కడ జరిగిన పరాభవాన్ని కప్పి పుచ్చుకునేందుకే చంద్రబాబు ఈ విధంగా మైండ్‌గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో జిహెచ్ ఎంసి ఎన్నికల్లో టిడిపికి ఎదురైన ఘోర పరాజయమే రాష్ట్రంలోనూ ఎదురవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎస్‌సిల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యానాలు చేయడం చంద్రబాబుకు తగదన్నారు. ఎస్‌సి కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. తక్షణం ఈ విషయంలో అంబేద్కర్ విగ్రహానికి కాళ్లు కడిగి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా దెందులూరు కానిస్టేబుల్‌పై దౌర్జన్యం జరిగిందన్న అంశంపై ఆయన స్పందిస్తూ అధికార పార్టీ నేతలకు అసహనం పెరిగిపోయిందని, కానిస్టేబుల్‌పై జరిగిన దౌర్జన్యాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, దిరిశాల వరప్రసాద్, లంకలపల్లి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

పునరావాస కాలనీల్లో వౌలిక సౌకర్యాలు పూర్తికాక పోవడం పట్ల
అధికారులపై జెసి ఆగ్రహం
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 11: పునరావాస కాలనీల నిర్మాణంలో వౌళిక సదుపాయాలు పూర్తికాకపోవడం పట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు గృహనిర్మాణ, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు నిర్వాసితులను తరలిస్తుంటే మరో పక్క పునరావాస కాలనీలలో వౌళిక వసతులు కల్పించకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనమని జెసి అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్థానిక పంగిడిగూడెం రోడ్డులోని పునరావాస కాలనీ, వైఎస్సార్ నగర్ వద్ద పునరావాస కాలనీలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కొంతమంది నిర్వాసితులతో చర్చించారు. కాలనీలలో కల్పించిన సౌకర్యాలు, ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. పంగిడిగూడెం రోడ్డులో గురవాయిగూడెం పంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ పునరావాస కాలనీ రామయ్యపేట, పైడిపాక నిర్వాసితులకు నిర్మించారు. ఈ కాలనీలో 250 ఇళ్లకు 130 ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగిందని, మిగిలిన ఇళ్లకు విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్ల వంటి వసతులు పెండింగ్‌లో ఉన్నాయని నిర్వాసితులు చెప్పడంతో జెసి ఆయా శాఖల అధికారులను నిలదీశారు. మూడు రోజులలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేస్తామని, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని, తాగునీటి వసతి ఏర్పాటుచేసేందుకు ఆయా శాఖల అధికారులు సమాధానం చెప్పడంతో శాంతించిన జెసి మరో 15 రోజులలో మిగిలిన గృహాల నిర్మాణం, వౌళిక వసతుల కల్పన పూర్తిచేయాలని ఆదేశించారు. వైఎస్సార్ నగర్ వద్ద నిర్మించనున్న పునరావాస కాలనీ పైడిపాక నిర్వాసితులకు నిర్ధేశించిందని, దీనిలో 69 ఇళ్లకు స్థలాలు కేటాయించగా 49 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటిని కూడా పరిశీలించిన జెసి సత్వరమే పూర్తిచేసి నిర్వాసితులు ఉండేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కాలనీలు, గృహాలకు ఎటువంటి ప్రారంభోత్సవాలు, గృహప్రవేశాలు ఉండవని, నిర్వాసితులకు అనువైన రోజున వచ్చి వారికి కేటాయించిన ఇళ్లల్లో కాపురం ఏర్పాటు చేసుకునే వీలు కల్పించాలన్నారు. ఆయన వెంట స్థానిక ఆర్డీవో ఎస్ లవన్న, తహసీల్దార్ జివివి సత్యనారాయణ, డిప్యుటీ తహసీల్దార్ డి సత్యనారాయణ తదితరులున్నారు.
వాడిగా వేడిగా కౌన్సిల్ సమావేశం
*అరుపులు, కేకలతో దద్దరిల్లిన మందిరం*అనవసరపు చర్చలతో కాలయాపన
ఏలూరు, ఫిబ్రవరి 11 : వేసవి కాలం రాకపోయినప్పటికీ గురువారం జరిగిన ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మాత్రం వాడిగా వేడిగా కొనసాగింది. అనవసరమైన రాద్ధాంతాలతో, అరుపులు, కేకలతో సమావేశం దద్దరిల్లింది. అసలే ఉదయం 10.45 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సిల్ సమావేశం 11.40 గంటలకు ప్రారంభించారు. అంశాలపై చర్చలు జరపకముందే ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆర్ సూర్యారావు ( ఆర్ ఎస్ ఆర్) కార్పొరేటర్లు కూర్చునే కుర్చీల్లోనే కూర్చున్నారు. సమావేశం ప్రారంభానికి ముందుగానే ప్రతిపక్ష వైసిపి ఫ్లోర్ లీడర్ బండారు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీకి సముచిత స్థానం ఇవ్వాలని, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధికి వేదికపై స్థానం ఇవ్వాలంటూ, మేయర్ ప్రక్కనే ప్రత్యేక కుర్చీ వేయించాలంటూ కోరారు. ఈ నేపధ్యంలో కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు తదితర ప్రతినిధులు ఈ విషయంపై ఫోన్ ద్వారానే ఎమ్మెల్యేను సంప్రదించారు. అనంతరం మేయర్ ఎదురుగా ఎమ్మెల్యే కూర్చునే కుర్చీ వేయించి ఎమ్మెల్సీకి స్థానం కల్పించారు. అనంతరం వివిధ అంశాలపై మేయర్ షేక్ నూర్జహాన్ సమావేశాన్ని ప్రారంభించారు. అంశాలను నగర పాలక సంస్థ ప్రతినిధి ఒక్కొక్కటి ప్రవేశపెట్టారు. సమస్యలపై అనవసరంగా కాలయాపన చేస్తుండటంతో కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేస్తున్న నందివాడ చంద్రశేఖర్ మృతిచెందిన నేపధ్యంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు నిబంధనల ప్రకారం బార్ అసోసియేషన్ సమర్పించిన 17 మంది పేర్లను ప్రవేశపెట్టారు. ఆ పేర్లలో కారంశెట్టి రమేష్‌బాబును తాము ఎంపిక చేస్తున్నట్లు కార్పొరేటర్లు ప్రవేశపెట్టడం, ప్రతిపాదించడం, ఆమోదించడం క్షణాల్లో జరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే ఫ్లోర్ లీడర్ బండారు కిరణ్‌కుమార్ కలుగచేసుకుని కారంశెట్టి రమేష్‌బాబును తీసుకోవడంలో వున్న అర్హత ఏమిటంటూ, కారంశెట్టి రమేష్‌బాబు పేరు ఒక్కటే ప్రవేశపెట్టవచ్చుకదా, మిగిలిన పేర్లను కూడా ప్రవేశపెట్టడమేమిటంటూ ఎద్దేవా చేశారు. మిగిలిన వారికి లేని అర్హత ఏమిటంటూ ప్రశ్నించారు. ప్రజలు కార్పొరేషన్ కార్యాలయంలో లంచాలు లేకుండా పనులు జరుగుతాయా అని ప్రశ్నిస్తున్నారని, ఏమి చెప్పాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఎస్ ఎం ఆర్ పెదబాబు మాట్లాడుతూ నిజం చెప్పాలంటే రమేష్‌బాబు తమ పార్టీ జెండాలను మోసి ప్రచారాలు చేసి తాము ఈ స్థానాల్లో కూర్చోవడానికి కారకుడు కాబట్టే ఎంపిక చేశామన్నారు. లంచాల విషయంలో తీసుకోవడం ఎంత తప్పో ఇవ్వడం కూడా అంతే తప్పని, అవసరాలకొద్దీ క్షణాల్లో తమ పనులు అవ్వాలని ఇస్తుంటారని అన్నారు. తానే అనేక సార్లు ద్విచక్ర వాహనాలపై వెళుతూ పోలీసులు, రవాణా శాఖాధికారులు నిలుపుదల చేసినప్పుడు వంద రూపాయలు చొప్పున ఇచ్చి తప్పించుకున్న సంఘటనలు అనేకం వున్నాయని పేర్కొన్నారు. చోడే వెంకటరత్నం మాట్లాడుతూ అనాధిగా కౌన్సిల్‌లో ఇదే విధంగా బార్ అసోసియేషన్ సమర్పించిన లిస్టునే నిబంధనల ప్రకారం ప్రవేశపెట్టాలని సభ్యులు వారిలో ఎంపిక చేసుకోవడం జరుగుతుందని వివరించారు. మృతిచెందిన చంద్రశేఖర్‌ను కూడా అదే విధంగా తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. కార్పొరేషన్‌కు ఆదాయం లభించే బోర్డింగులు, హోర్డింగ్‌లు, ప్రచారాలకు సంబంధించిన వివరాలపై వివరణ ఇవ్వాలని బండారు కిరణ్‌కుమార్ ప్రశ్నించగా పెదబాబు కలుగచేసుకుని సంబంధిత అధికారి అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్ వెళ్లారని, తదుపరి సమావేశంలో చర్చిద్దామంటూ చెప్పారు. ఈ నేపధ్యంలోనే కార్పొరేటర్లు మారం హనుమంతరావు, కప్పా ఉమామహేశ్వరరావు, గుడివాడ రామచంద్రకిషోర్, కర్రి శ్రీను, చోడే వెంకటరత్నం, బండారు కిరణ్‌కుమార్‌లు వాగ్వివాదాలకు దిగారు. పెదబాబు కలుగచేసుకుని అధికారి హాజరుకాలేదని వివరణ ఇచ్చినప్పటికీ కాలాన్ని ఎందుకు వృధా చేస్తారంటూ పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే ఎమ్మెల్సీ ఆర్ సూర్యారావు మాట్లాడుతూ అధికారి రాకపోవడానికి గల కారణాలను సవివరంగా తెలియజేసినప్పటికీ అనవసరమైన చర్చలు జరుపుతున్నారంటూ, ఇంతటితో ముగించాలంటూ హితవు పలికారు. కొద్దిసేపు తర్జన భర్జన అనంతరం సమావేశంలో ఆ అంశాన్ని కూడా ముగించారు. ఈ సందర్భంగా నగర మేయర్ షేక్ నూర్జహాన్ సమావేశాన్ని ముగించినట్లు ప్రకటిస్తూ డిప్యూటీ మేయర్ పదవికి చోడే వెంకటరత్నం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. జీరో అవర్ సమయంలో కూడా అసలైన చర్చలు జరగకుండా కాలయాపన చేశారు. పెదబాబు, చోడే వెంకటరత్నం, కిషోర్‌లు మాట్లాడుతూ అనవసరమైన విషయాలతో కాలయాపన చేస్తున్నారు గానీ, జీరో అవర్ అంటే దాని ప్రాధాన్యతను తెలుసుకోవడం లేదని, డివిజన్లలో నెలకొన్న సమస్యలను తెలియజేయవలసిన బాధ్యత ఎంతైనా వుందని పేర్కొన్నారు. జీరో అవర్‌లో ఇక నుంచైనా ప్రతీ శాఖకు చెందిన ఉద్యోగి, అధికారి ప్రగతి నివేదికలతో హాజరుకావాలని గౌరవ సభ్యుల సందేహాలను తీర్చే విధంగా సంసిద్ధమై రావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఉద్యోగులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి: ఎమ్మెల్సీ సూర్యారావు హితవు
ఏలూరు నగరాభివృద్ధికి కార్పొరేటర్లు, ఉద్యోగులు, అధికారులు సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, అభివృద్ధే లక్ష్యంగా వ్యవహరించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆర్ సూర్యారావు హితవు పలికారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీలు ఏర్పాటు
కలెక్టరు భాస్కర్
ఏలూరు, ఫిబ్రవరి 11: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీలు ఏర్పాటుచేసి వనసేవకులు ద్వారా వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖాధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నర్సరీలు ఏర్పాటుచేసి వాటిని సంరక్షించడంతోపాటు పాఠశాల మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు వనసేవకులను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. స్ధలం ఉన్న పాఠశాలల్లో 25వేల మొక్కలు నాటాలని, ఒకవేళ స్ధలం అందుబాటులో లేకపోతే దానికనుగుణంగా మొక్కలు నాటి నర్సరీలు పెంచాలన్నారు. జిల్లాలో 400 నర్సరీలు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో ప్రహారీగోడలు లేని 1575 పాఠశాలల్లో 2లక్షల 43వేల మీటర్ల బయోఫెన్సింగ్ ఏర్పాటుచేయాలన్నారు. జిల్లాలో ఏఏ పాఠశాలలో గార్డెన్లు, నర్సరీలు, మరుగుదొడ్లు అవసరమో మండలాల వారీగా వివరాలు అందించాలన్నారు. పాఠశాలల్లో వంటశాలల నిర్మాణంపై సమీక్షిస్తూ భీమవరం, నరసాపురం, పాలకొల్లు మున్సిపాల్టీల పరిధిలో వంటశాలలు ఇంకా పూర్తికాకపోవటంపై సంబంధిత మున్సిపల్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేవారంనాటికి పనులన్నీ పూర్తి చేయాలని లేకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో డిఇఓ డి మధుసూధనరావు, సర్వశిక్షా అభియాన్ పిఓ డాక్టరు వి బ్రహ్మనందరెడ్డి, డిప్యూటీ డిఇఓలు, ఎంఇఓలు, మున్సిపల్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
చట్టసభల్లో బిసిలకు ప్రాతినిధ్యం పెంచాలి
జిల్లా కాపునాడు అధ్యక్షుడు చినిమిల్లి
ఆచంట, ఫిబ్రవరి 11: స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు గడుస్తున్నప్పటికీ వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని, ప్రభుత్వం ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచించాలని జిల్లా కాపునాడు అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు అన్నారు. గురువారం ఆచంటలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఇప్పటికీ రెండు కులాల వారే అధికారాన్ని అనుభవిస్తున్నారన్న విషయాన్ని మిగిలిన కులాలవారు గుర్తించాలని కోరారు. కాపులలో పేదలుగా ఉన్నవారిని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు. తాము బిసిలకు వ్యతిరేకం కాదని, ప్రభుత్వం సమగ్ర సర్వేచేసి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఏఫ్రిల్ 24 నుండి కులాలవారీగా ప్రభుత్వం సర్వే చేపట్టడం మంచి నిర్ణయమని అన్నారు. అలాగే కాపులకు బడ్జెట్టులో వేయి కోట్లు, కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయించడం పట్ల చినిమిల్లి వెంకట్రాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మండల కాపునాడు అధ్యక్షుడు తోలేటి రాంబాబు, ఆచంట పట్టణ కాపునాడు అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్, బొలిశెట్టి రాంబాబు, మండెల శ్రీను, మానేపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ కాని ప్రైవేట్ రక్తపరీక్షా కేంద్రాలు మూసివేయాలి:కలెక్టర్
ఏలూరు, ఫిబ్రవరి 11: జిల్లాలో అర్హత లేని, రిజిస్ట్రేషన్ కాని ప్రైవేట్ రక్తపరీక్షా కేంద్రాలను వెంటనే మూసివేయాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం ఆయన వైద్యాధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గర్భిణీలకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుని మరణాల కేసులు తగ్గించాలన్నారు. జికా వైరస్ సోకకుండా జిల్లాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వౌలిక వసతులు కల్పించి పేషెంట్లు ప్రభుత్వాసుపత్రుల్లోనే వైద్యసేవలు పొందేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 3233 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ హైస్కూల్ పాఠశాలల్లోని విద్యార్ధినీవిద్యార్ధులకు హెల్త్ ప్రోగ్రాం నిర్వహించి పిల్లల ఆరోగ్యరక్షణకు పరీక్షలు నిర్వహించాలన్నారు. తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1180మందిని ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ఇంటికి చేరవేయటం జరిగిందన్నారు. సమావేశంలో ఇన్‌ఛార్జి డిఎంహెచ్‌ఓ డాక్టరు శంకరరావు, అదనపు డిఎంహెచ్‌ఓ డాక్టరు ఉమాదేవి, 108,102 ఎగ్జిక్యూటివ్ ప్రకాష్‌బాబు, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టరు శైలజ, డిస్ట్రిక్ట్ నర్సింగ్ అఫీసరు డాక్టరు నాగమణి తదితరులు పాల్గొన్నారు.

ధనలక్ష్మి అలంకరణలో మావుళ్లమ్మ అమ్మవారి దర్శనం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 11: భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ 52వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు.